Homeఅంతర్జాతీయంమార్స్ పై నుంచి నాసాకు చివరి సందేశం

మార్స్ పై నుంచి నాసాకు చివరి సందేశం

నా అత్యంత ప్రియమైన నాసా కమాండ్ సెంటర్..నా జీవితం ముగిసిపోతోంది.. బహుషా ఇదే నా చివరి ఫొటో అవుతుందేమో..!?అన్న విషాద సందేశం పంపింది మార్స్ పై నాలుగేళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఇన్ సైట్ ల్యాండర్. అంగారకుడిపై వాతావరణ పరిస్తితులను అధ్యయనం చేసేందుకు నాసా ప్రయోగించిన ఈ మానవ నిర్మిత ల్యాండర్ జీవితం అంత్యదశకు చేరుకుంది.

అవును..ఈ సందేశం వచ్చినప్పటి నుంచి ఇన్ సైట్ రోవర్ కమాండ్ టీమ్ విషాధంలో మునిగిపోయింది. నాలుగేండ్ల పాటు విజయవంతంగా విధులు నిర్వహించిన తర్వాత శక్తి కోల్పోయిందంటూ పంపిన ఫొటోనే నాసా తన ట్విట్టర్‌ హ్యాండిల్‌పై పోస్ట్‌ చేసింది. అంగారక గ్రహంపై పరిశోధనలకు ప్రయోగించిన నాసా ఇన్‌సైడర్ రోవర్‌ చివరకు తన కార్యకలాపాలను ముగించేందుకు సిద్ధమైంది.

2018 నుంచి మార్స్‌ అంతర్గత నిర్మాణంపై కీలకమైన సమాచారాన్ని శాస్త్రవేత్తలకు అందించింది. అంగారకుడిపై భూకంపాలను గుర్తించి వాటిపై అధ్యయనం చేసేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 2018 లో మార్స్ పైకి ఇన్‌సైట్‌ ల్యాండర్‌ను పంపింది. అయితే మార్స్ గ్రహంపై వచ్చే దుమ్ము తుఫాన్ల కారణంగా సోలార్‌ ప్లేట్లపై దుమ్ము, ధూళి చేరడంతో దాని శక్తి మెల్లమెల్లగా క్షీణిస్తోంది.

గత నవంబర్ 26న రోవర్ ట్వీట్ చేస్తూ ‘‘నేను రెండు గ్రహాలపై జీవించే అదృష్టం పొందాను… నాలుగు సంవత్సరాల కిందట రెండో గ్రహానికి సురక్షితంగా చేరుకున్నాను.. మొదటిసారి నేను పంపిన సమాచారం నా కుటుంబ సభ్యులకు ఆనందం కలిగించింది.. నన్ను ఇక్కడకు పంపినందుకు నా బృందానికి ధన్యవాదాలు.. నేను ఈ ఆవిష్కరణ ప్రయాణంలో ఉన్నాను.

నేను గర్వంగా చెప్పుకునేలా చేశానని ఆశిస్తున్నాను’’ అని తెలిపింది. ‘‘నా శక్తి తగ్గిపోయింది. అందుకని ఇదే నా చివరి ఫొటో కావచ్చు. మిషన్‌ బృందంతో సాధ్యమైతే మాట్లాడుతూ ఉంటాను. త్వరలో సైన్‌ ఆఫ్‌ చేస్తాను. నాతో ఇన్నాళ్లు ఉన్నందుకు ధన్యవాదాలు’ అని ఇన్‌సైట్‌ రోవర్‌ పంపిన ఎమోషన్ తో కూడిన సందేశాన్ని నాసా ట్విట్టర్‌లో నేరుగా షేర్‌ చేసింది.

నాసా పోస్ట్‌ చేసిన ఈ ట్వీట్‌ను ఇప్పటివరకు 6.5 లక్షకు పైగా లైక్‌ చేశారు. ‘సోలార్‌ ప్యానెల్స్‌ దుమ్ము, ధూళితో కప్పుకపోవడంతో శక్తిని ఉత్పత్తి చేసుకోవడం కష్టతరంగా ఉంటుంది. తన కార్యకలాపాలు ముగించే సమయం దగ్గర పడింది’ అని ముందే హెచ్చరించింది ఇన్ సైట్ రోవర్..ఈ ట్వీట్‌ కూడా ఇన్‌సైట్‌ ల్యాండర్‌ కార్యకలాపాలు త్వరలో ముగుస్తాయనే వాస్తవాలను సూచిస్తుండటం ఆసక్తికరం అంటున్నారు నిపుణులు. అయితే రోవర్ మూగబోనుందనే వార్త తెలిసినప్పటి నుంచి సోలార్ ప్లేట్ల పైనుంచి దుమ్ము తొలగించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి.

సో ఎలాగైనా ఇది పనిచేసే కొన్ని రోజుల్లో మరింత డేటా సేకరించేందుకు నాసా ఇంజనీర్లు ప్రయత్నించారు. అయితే పనిలో పనిగా ఇన్ సైట్ కు వీడ్కోలు చెప్పేందుకు కూడా సన్నాహాలు ప్రారంభించారు.

ఒకసారి దాని కంట్రోల్ బటన్ ఆఫ్ చేస్తే ఇన్ సైట్ ల్యాండర్ మిసన్ ముగిసిపోయినట్టవుతుంది. ఇన్ సైట్ ల్యాండర్ అంగారకుడి అంతర్గత పొరలు, దాని లిక్విడ్ కోర్ గురించిన విలువైన వివరాలను శాస్త్రవేత్తలకు అందించింది. అంగారకుడిపై అయస్కాంత క్షేత్రం ఎలా అంతరించుకుపోయిందనే వివరాలను, మరెన్నో ఆసక్తికరమైన విషయాలను అన్వేషించి భూమికి పంపించింది. ఇప్పటివరకు అనేక మార్స్ క్వేక్ లను కనుక్కుంది.

అతిపెద్దదిగా చెబుతున్న 5 తీవ్రతను నమోదు చేసింది. ఇటీవల మార్స్ రికనైసెన్స్ ఆర్బిటర్ సాయంతో అంగారక గ్రహంపై ఉల్కాపాతం సంభవించిన ప్రదేశాన్ని గుర్తించింది. ల్యాండర్ వేగంగా శక్తిని కోల్పోతుండటంతో ఇతర సైన్స్ పరికరాలను నిలిపివేసి కేవలం సీస్మో మీటర్ మాత్రమే పనిచేసేలా చూసారు.

మార్స్ కక్షలో తిరుగుతున్న స్పేస్ క్రాఫ్ట్ లతో వరుసగా రెండు కమ్యూనికేషన్ సెషన్స్ కోల్పోతే ల్యాండర్ మిషన్ అయిపోయినట్టు నాసా ప్రకటిస్తుంది. భూమిని పోలి ఉన్న అంగాకర గ్రహంపై జీవరాశి ఉనికి ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చాలా కాలం నుంచి శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్స్‌పై అధ్యయనానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పంపిన ఇన్‌సైట్ రోవర్ నాలుగేళ్లుగా సేవలు అందిస్తోంది. ఇప్పుడు రోవర్ శక్తి తగ్గి, పనితీరు క్రమంగా నెమ్మదించినట్టు సందేశం పంపింది.

ఇన్‌సైట్ రోవర్‌ ఐదు నెలల ప్రయాణం అనంతరం అంగారక ఉపరితలంపై దిగింది. అప్పటి నుంచి అక్కడ వాతావరణానికి సంబంధించిన సమాచారం, ఫోటోలను పంపింది.

Must Read

spot_img