- ఆ ఎమ్మెల్యే పై ఉద్యమ కారులంతా తిరుగుబాటుకు సిద్దమవుతున్నారా ?
- ఆయన వైఖరే అందుకు కారణమా ?
- బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో విస్తరిస్తున్న వేళ .. సొంత పార్టీ నేతల లొల్లి హై కమాండ్ కు తలనొప్పిగా మారిందా ?
- మరి ఉద్యమ కారుల నుంచి నిరసన సెగ రుచి చూస్తున్న ఆ ఎమ్మెల్యే ఎవరో చూద్దామా ?
నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి రోజు రోజుకూ వివాదాల్లో ఇరుక్కోవడం కామన్ అయిపోయింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ నల్గొండ జిల్లాలో ఆయన కాంట్రవర్సీ కి కేరాఫ్ అడ్రస్ గా మారారని సెగ్మెంట్ లో లేటెస్ట్ టాక్. సిట్టింగ్ లకే సీట్లన్న ధీమానో గానీ, లేదంటే, తనకు సెగ్మెంట్ లో ఎదురులేదన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తోనో గానీ.. ఈ మధ్య నోటి దురుసుతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు భూపాల్ రెడ్డి.
ఉద్యమ పార్టీగా పుట్టిన బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా ఉంటూ ఉద్యమకారులను కరివేపాకులా తీసేస్తున్నారని వారంతా తెగ ఫీలవుతున్నారట. పార్టీలో ప్రాధాన్యత ఇవ్వక పోగా .. తమను పురుగుల్లా చూస్తున్నారని వాపోతున్నారట. దాంతో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ, ఉద్యమ కారులంతా తిరుగుబాటుకు దిగడం నల్గొండ జిల్లా రాజకీయాల్లో కాక రేపుతోందట.
అంతేకాదు ఈ నిరసన సెగలు.. నల్గొండ నుంచి హైద్రాబాద్ బీఆర్ఎస్ భవన్ కు తాకడంతో, గులాబీ బాస్ నల్గొండ సెగ్మెంట్ పై సీరియస్ గా ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. గ్రౌండ్ రియాల్టీ తెలుసుకునే పనిని అధిష్టాన దూతలకు అప్పజెప్పారని టాక్. సెగ్మెంట్ లో ఏం జరుగుతుందనే దానిపై ఆరా తీస్తున్నారని సమాచారం.
అయితే ఉద్యమ కారుల తిరుగుబాటుకు అనేక కారణాలున్నాయని తెలుస్తోంది. వారి ఆవేదన ఇప్పటిది కాదనీ, ఎప్పటి నుంచో ఉద్యమ కారులంతా సమయం కోసం ఎదురు చూస్తున్నారని పార్టీ శ్రేణుల మాట. వారి అలకకు కారణం .. నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి టిడిపిలో చాలా కాలం పనిచేశారు.
2018 ఎన్నికలకు ముందు గులాబీ బాస్ పిలుపుతో సైకిల్ దిగి కారెక్కారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతే అసలు కథ షురూ అయ్యింది. టిడిపి బ్యాచ్ మొత్తం గంపగుత్తగా గులాబీ గూటికి చేరింది. ఇక్కడే మొదలైంది అసలు పంచాయితీ. పాత కొత్త నాయకత్వాల మధ్య పోరు కాస్తా .. ప్రస్తుతం ఉద్యమ కారులు వర్సెస్ ఎమ్మెల్యే అన్నట్టుగా మారిపోయాయి.
దీంతో నల్గొండలో హాట్ హాట్ పాలిటిక్స్ సాగుతున్నాయని విశ్లేషకుల అంచనా. ఈ పోరు .. ఇంతింతై, వటుడింతై అన్నట్లు .. ముందస్తు టాక్ వేళ ముంచేసే స్థాయికి చేరాయన్నది వీరి వాదన. ఈ నేపథ్యంలో కంచర్ల వ్యవహార శైలి .. దీనికి మరింత ఆజ్యం పోసిందన్నది స్థానికంగా వినిపిస్తోన్న మరో టాక్.
- నల్గొండ లో మాజీ ఎంపి చకిలం శ్రీనివాస్ రావు తనయుడు అనీల్ కుమార్ కు, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి అస్సలు పొసగడం లేదట..
మొదటి నుంచి పార్టీలో ఉంటూ, ఉద్యమ నేత గా పేరున్న తనకు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని చకిలం వాదన. ఈ మధ్య పార్టీ కార్యక్రమాలకు కూడా ఆహ్వానం అందడం లేదని ఆయన ఆవేదన కూడా. దాంతో ఉద్యమకారులనంతా ఏకం చేసి సమావేశం నిర్వహించడం హాట్ టాపిక్ గా మారింది. చకిలం అనీల్ కుమార్ నేతృత్వంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం పేరుతో నల్గొండలో సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి ఉద్యమ కారులతో పాటు ఉద్యమ కళాకారులు, మేథావులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఉద్యమ కారుల ఆత్మగౌరవం దెబ్బ తీస్తున్నారని, ఈసారి ఉద్యమ కారులంతా ఏకమై ఎమ్మెల్యే పై తిరుగుబాటు చేయాలనేది ఆ కార్యక్రమం సారాంశంగా తెలుస్తోంది. వాస్తవానికి చకిలం అనీల్ కుమార్ 2001 నాటి నుంచి పార్టీని అంటి పెట్టుకొని ఉన్నారు.
ఉద్యమ సమయంలో ఆస్తులు పోగొట్టుకుని పార్టీ కోసం పనిచేశారన్నది అందరికీ తెలిసిన విషయమే. అయినా కష్టానికి తగ్గ ఫలితం రాలేదని చకిలం మథనపడుతున్నారట. గత ఎన్నికల్లో భూపాల్ రెడ్డికి టికెట్ త్యాగం చేసినందుకు గాను .. ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చారని, ఇప్పటికీ ఏ పదవి లేకపోగా, అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయని చకిలం చాలా ఫీలవుతున్నారు.
ఇక మరో ఉద్యమ కారుడు పంకజ్ యాదవ్ ది కూడా ఇదే పరిస్థితని టాక్ వినిపిస్తోంది. ఆయనకు నుడా ఛైర్మన్ పదవి ఇస్తామని చెప్పి బిగ్ హ్యాండిచ్చారట భూపాల్ రెడ్డి. ఈ ఇష్యూలో కేటీఆర్ జోక్యం చేసుకుని, భూపాల్ రెడ్డికి ఫోన్ చేసి మరీ చెప్పారట. అయినా తనను పక్కన పెట్టి, టిడిపి నుంచి వచ్చిన తన వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారని పంకజ్ యాదవ్ భాద పడుతున్నారట.
ఇలా ఉద్యమ కారులనందర్ని తొక్కేస్తూ, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నారని తిరుగుబాటుకు కారణంగా తెలుస్తోంది. తాజాగా ఉద్యమ కారుల తిరుగుబాటు నల్గొండ జిల్లాలోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద చర్చకు తెరలేపింది. దీంతో ఈ పరిణామం ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కి డ్యామేజ్ గా మారే అవకాశం ఉందని టాక్ వెల్లువెత్తుతోంది.
అయితే అంతేగాక ఈ ఇష్యూ జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలనే బాస్ భావన కు అడ్డుపుల్లగా మారిందని రాజకీయ విశ్లేషకుల అంచనా. నల్గొండ సెగ్మెంట్ లో
మొదలైన ఈ ఉద్యమం… ఎక్కడ తమ నియోజకవర్గాల్లో కూడా అంటుకుంటుందోనని పక్క సెగ్మెంట్ ల ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారని సమాచారం.
- అందుకే ఆదిలోనే ఈ ఇష్యుకు చెక్ పెట్టాలని పలువురు ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డిని సూచిస్తున్నారని సమాచారం..
బీఆర్ఎస్ రెండో సారి అధికారంలోకి వచ్చాకనైనా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారులకు ప్రభుత్వంలో తగిన గౌరవం, పదవులు దక్కుతాయన్న ఆశలు అడియాశలవుతుండటంపై ఉద్యమకారుల్లో తీవ్ర అసహనం రగులుతోంది. కనీసం తమను ప్రభుత్వ పథకాల్లో, అభివృద్ధి పనుల కేటాయింపుల్లో సైతం పరిగణనలోకి తీసుకోవడం లేదంటూ పార్టీ సీనియర్ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు.
ఈ నేపథ్యంలో చకిలం వారందరినీ ఒక్క తాటిపై తీసుకొచ్చేందుకు తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం బీఆర్ఎస్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. 2018 ఎన్నికల్లో టీడీపీ నుంచి వచ్చిన కంచర్ల భూపాల్ రెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని గట్టిగా ప్రశ్నించి రెబల్‌గా రంగంలోకి దిగేందుకు చకిలం ఓ దశలో సిద్ధ పడ్డారు.
ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట రెడ్డిని ఓడించాలంటే చకిలం అనిల్ సహా టికెట్ ఆశించిన చాడ కిషన్ రెడ్డి, బండా నరేందర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి మద్దతు అనివార్యమని తెలుసుకున్న సీఎం కేసీఆర్ వారందరినీ బుజ్జగించి అసమ్మతిని సద్దుమణిగేలా చేసి కంచర్ల విజయానికి అంతా కలిసి పనిచేసేలా ఒప్పించారు. ఈ సందర్భంగా చకిలం అనిల్ కుమార్‌కు కేసీఆర్ భవిష్యత్తులో ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారు.
దీంతో చకిలం గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి గెలుపు కోసం తనవంతు ప్రచారం సాగించారు. బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచినప్పటికీ చకిలంకు ఇస్తానన్న ఎమ్మెల్సీ పదవి విషయాన్ని సీఎం కేసీఆర్ పక్కన పెట్టేశారు. సీఎం కేసీఆర్‌పై నమ్మకంతో ఇంతకాలం ఓపిక పట్టిన చకిలం బీఆర్ఎస్ ప్రభుత్వం రెండో దఫా టర్మ్ పూర్తి కావస్తున్న వేళ దూకుడు రాజకీయాలకు సిద్ధమయ్యారు.
కనీసం త్వరలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాల్లోనైనా తనకు అవకాశం కల్పించాలని, లేదంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ టికెట్‌ను కేటాయించాలని చకిలం అనిల్ కుమార్ కోరుకుంటున్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్లకు పోటీగా.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తూ ఆయన అనుచరుడు పిల్లి రామరాజు, గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి, చాడ కిషన్ రెడ్డిలు నియోజకవర్గంలో రకరకాల కార్యక్రమాలతో ప్రజల్లో హడావుడి చేస్తు టీఆర్‌ఎస్ నాయకత్వానికి, ఎమ్మెల్యే కంచర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు.
ఇదే సమయంలో గోరుచుట్టుపై రోకలిపోటు అన్న చందాన చకిలం సైతం తిరిగి యాక్టివ్ అయి మళ్లీ అసంతృప్తులను, అశావాహులను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముందస్తు టాక్ వేళ ఈ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం .. కారుపార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
మరి దీన్ని గులాబీ బాస్ ఎలా డీల్ చేస్తారనేదే ఆసక్తికరంగా మారింది..