Homeజాతీయంఢిల్లీలో యువతి కిరాతక హత్యోదంతం ..

ఢిల్లీలో యువతి కిరాతక హత్యోదంతం ..

దేశరాజధానిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢీకొట్టడమే కాక .. యువతిని కారు వెనకాలే లాక్కెళ్లిన ఘటనపై నిరసనలు చెలరేగుతున్నాయి…..

అత్యంత కిరాతకంగా ఓ యువతిని హత్య చేసిన ఘటన .. ఢిల్లీవ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. ఈ ఘటనపై ఆప్ .. ఎల్జీపై విమర్శలు చేస్తుండగా, ఘటనపై విచారణకు అటు కేంద్ర హోం శాఖ, మహిళా కమిషన్ లు సైతం ఆదేశాలు జారీ చేశాయి.

దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన యువతి యాక్సిడెంట్ కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ప్రమాదం జరిగిన సమయంలో స్కూటీపై బాధితురాలితో పాటు మరో యువతి కూడా ఉందని సీసీటీవీ ఫుటేజీ పరిశీలనలో బయటపడింది. ఓ హోటల్ జరిగిన కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొన్న స్నేహితులు ఇద్దరూ అర్ధరాత్రి దాటాక 1:45 గంటలకు స్కూటీపై బయలుదేరడం కనిపించిందని పోలీసులు చెబుతున్నారు. హోటల్ ముందున్న సీసీటీవీ కెమెరాల్లో వాళ్లు స్కూటీపై బయలుదేరడం రికార్డయిందని చెప్పారు. ఆదివారం తెల్లవారుజామున స్కూటీని ఢీ కొట్టిన కారు.. ఓ యువతిని 12 కిలోమీటర్ల మేర లాక్కెళ్లిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో చనిపోయిన యువతిని అంజలి సింగ్ గా పోలీసులు గుర్తించారు.

ప్రమాదం జరిగిన సమయంలో అంజలితో పాటు ఆమె స్నేహితురాలు నిధి కూడా ఉందని, స్వల్ప గాయాలతో బయటపడ్డ నిధి.. భయంతో అక్కడి నుంచి పారిపోయిందని చెప్పారు. స్నేహితురాళ్లు ఇద్దరూ ఓ హోటల్ లో జరిగిన కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొని తిరిగొస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని చెప్పారు. హోటల్ దగ్గర బయలుదేరినపుడు స్కూటీని నిధి నడుపుతోందని.. మధ్యలో వాళ్లిద్దరూ తమ సీట్లు మార్చుకున్నారని వివరించారు. కాగా, నిధి జాడ కనుక్కున్నామని, ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై తనను ప్రశ్నిస్తామని పోలీసులు చెప్పారు. మరోవైపు, ప్రమాదానికి కారణమైన కారులో ఐదుగురు యువకులు ఉన్న విషయం తెలిసిందే. ప్రమాదం జరిగినపుడు తాము మద్యం మత్తులో ఉన్న విషయం నిజమేనని వాళ్లు ఒప్పుకున్నట్లు తెలిసింది. కారు కింద ఏదో చిక్కుకున్నట్లు తనకు అనిపించిందని ప్రమాద సమయంలో డ్రైవింగ్ చేస్తున్న దీపక్ ఖన్నా విచారణలో చెప్పినట్లు సమాచారం.

అయితే, మిగతా నలుగురు తన మాటలను కొట్టిపారేయడంతో కారును ఆపకుండా తీసుకెళ్లినట్లు దీపక్ వివరించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆ సన్నివేశాన్ని ఓ స్థానికుడు గుర్తించి పోలీసులకు సమాచారం అందిచటంతో.. అన్ని చెక్ పోస్టులు అలర్ట్ చేశారు. సీసీకెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా కారును గుర్తించి, ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా.. అప్పటికే ఆ అమ్మాయి శరీరం పూర్తిగా ఛిద్రమైపోయి.. బట్టలేమీ లేకుండా కంజూవాలా రోడ్డుపై జ్యోతి గ్రామం వద్ద పడి ఉండటాన్ని గమనించారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరకున్న పోలీసులు.. ఆమె మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అమ్మాయి మరణ వార్త విని.. కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

అయితే.. ఈ ఘటన బయటికి వచ్చినప్పటి నుంచి ఢిల్లీ అట్టుడికిపోతోంది. సుల్తాన్‌పురి పోలీస్ స్టేషన్ దగ్గరికి పెద్ద ఎత్తున చేరుకున్న యువత.. ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. నిందితులది క్రూరమైన చర్యగా అభివర్ణిస్తూ.. వారిని కఠినంగా శిక్షించాలంటూ.. డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఆప్ కార్యకర్తలు లెఫినెంట్ గవర్నర్ ఇంటిని ముట్టడించారు. ఇది ముమ్మాటికి హత్యేనని ఆరోపిస్తూ.. ఆందోళనకు దిగటంతో.. ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు.. ఈ ఘటనపై పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే.. నిందితులు కారు అద్దాలు పూర్తిగా ఎక్కించి ఉండటం.. లోపల పాటలు పెట్టుకుని ఉండటం వల్లే ప్రమాదాన్ని గుర్తించలేకపోయామని చెప్తున్నారు. మరోవైపు ఈ సన్నివేశాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షి మాత్రం.. ఇది కేవలం ప్రమాదం కాకపోవచ్చని.. కావాలనే చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో.. ఈ కేసులో మరింత తీవ్రత పెరిగింది. కారుకు సంబంధించిన సీసీకెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇక ఇదే ఘటనపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ స్పందిస్తూ.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన జరగటం దురదృష్టకరమన్న కేజ్రివాల్.. నిందితులందరినీ కఠినంగా శిక్షించాలని, ఉరి తీయాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. కాగా.. ఈ ఘటనపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయం విని తలకొట్టిసినట్టైందని ట్వీట్ చేశారు. నిందితుల క్రూరమైన ప్రవర్తనతో ఆందోళనకు గురయ్యాని తెలిపిన సక్సేనా.. ఘటనపై పోలీసులతో మాట్లాడినట్టు వివరించారు. అయితే.. ఐదుగురు నిందితులను మూడు రోజుల కస్టడీకి అనుమతించింది కోర్టు. ఈ ఘటనలో ప్రత్యక్ష సాక్షులు దీపక్ దహియా, ప్రదీప్ .. ఇతరులు చెబుతున్న వివరాలతో .. ఇది కేవలం ప్రమాదం కాదన్న అనుమానాల్ని రేకెత్తిస్తోంది.

బాధితురాలిపై హత్యాచారం జరిగిందని.. దానిని పోలీసులు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని సుల్తాన్పూర్ పోలీస్స్టేషన్ ఎదుట స్థానికులు ఆందోళనకు దిగారు. రహదారులను దిగ్బంధం చేశారు. కేంద్ర హోంశాఖ ఈ ఘటనపై వెంటనే స్పందించింది. ఈ ఘటన మీద పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. ఢిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్వాతి మలివాల్ కూడా బాధితురాలిపై అత్యాచారం జరిగిందనే విషయాన్ని తెలపాలని పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనలో నిందితులైన ఐదుగురిలో.. మనోజ్ మిత్తల్ కూడా ఒకరు అని.. అతను బీజేపీ నేత అని ఆప్ తెలిపింది. ఈ కేసును వేగంగా దర్యాప్తు పూర్తి చేయడానికి ఢిల్లీ పోలీసు విభాగం షాలిని సింగ్ ను ప్రత్యేక కమిషనర్గా నియమించింది. జాతీయ మహిళా కమిషన్‌ మాత్రం ఆ ఆరోపణలను తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసులో దర్యాప్తు నిజాయితీగా, నిర్ణీత కాలవ్యవధిలో పూర్తిచేయాలని మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ పోలీసులకు లేఖ రాశారు.

ఇదిలా ఉంటే, మృతురాలు అంజలికి తల్లి, ఒక అక్క, ఇద్దరు చెల్లెళ్లు, ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. ఆమె తండ్రి ఎనిమిది సంవత్సరాల క్రితమే చనిపోయారు. అక్కకు వివాహం అయింది. తండ్రి చనిపోయిన తర్వాత ఇంటిల్లిపాదికీ అంజలి సంపాదనే ఆధారం. తల్లికి మూత్రపిండాలు దెబ్బతినడంతో తరచుగా ఆమెకు డయాలసిస్‌ చేయించాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెను కోల్పోవడంతో ఇంటిల్లిపాదీ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమకు ఆర్థికంగా అండగా ఉన్న కూతురు ఈవిధంగా మృత్యువాత పడడం తీరని వేదనకు గురిచేస్తోంది. డిసెంబరు 31న సాయంత్రం ఆరు గంటల సమయంలో ఆమె ఒక ఈవెంట్‌ నిర్వహణకు వెళ్లిందని.. రాత్రి 9 గంటల సమయంలో ఫోన్‌ చేసి తాను వచ్చేసరికి ఆలస్యమవుతుందని చెప్పిందని వారు వివరించారు.

పది గంటల సమయంలో తాము ఫోన్‌ చేస్తే స్విచ్‌ ఆఫ్‌ వచ్చిందని.. సోమవారం ఉదయం 8 గంటల సమయంలో పోలీసులు వచ్చి చెప్పేవరకూ ఆమె మరణం గురించి తమకు తెలియదని వాపోయారు. దీనిపై మృతురాలి తల్లి .. రాత్రి 9 గంటలకు నేను తనతో మాట్లాడాను. తెల్లవారు జామున 3-4 గంటల వరకూ వచ్చేస్తాను అని చెప్పింది. పెళ్లిళ్లలో ఈవెంట్ ప్లానర్‌గా పని చేస్తుండేది. ఉదయం పోలీసులు నాకు కాల్ చేసి యాక్సిడెంట్ గురించి చెప్పారు. పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ చాలా సేపు వెయిట్ చేయించారని వివరించారు. ఇది హత్య అని, తన కూతురుని చంపే ముందు ఆ వ్యక్తి లైంగికంగా వేధించాడని ఆరోపిస్తున్నారు మృతురాలి తల్లి. ఇంటి నుంచి నిండు దుస్తులతో వెళ్లిన తన ఒంటి మీద నూలు పోగు కూడా లేదు. ఇది యాక్సిడెంట్ ఎలా అవుతుంది” అని ప్రశ్నించారు. ఢిల్లీలో మహిళల పట్ల జరుగుతున్న నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. కొత్త ఏడాది మొదటి రోజే దారుణం జరిగింది.

కొత్త ఏడాది తొలిరోజే .. దేశ రాజధానిలో యువతి మరణం .. దేశవ్యాప్త చర్చకు దారితీస్తోంది. ఇదీ ఇవాల్టి ఫోకస్ .. రేపటి ఫోకస్ లో మళ్లీ కలుద్దాం..

Must Read

spot_img