- తెలంగాణలో ఓ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రధాని మోడీ .. తెలంగాణ నుంచి బరిలోకి ఉంటారన్నదే ఆ టాపిక్ ..
- ఇంతకీ మోడీ గనుక తెలంగాణ నుంచి బరిలోకి దిగితే, ఏ నియోజకవర్గం నుంచి అన్నదే చర్చనీయాంశంగా మారిందట.
దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ గట్టిగానే ఫోకస్ పెట్టింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే కర్నాటకలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. తెలంగాణలో గత ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలిచింది. ఈసారి మరిన్ని ఎక్కువ స్థానాల్లో విజయం సాధించాలని భావిస్తోంది. ఏపీ, తమిళనాడులోనూ ప్రభావం చూపాలని వ్యూహాలు రచిస్తోంది.
ఇందుకోసం ప్రధాని నరేంద్ర మోదీనే రంగంలోకి దింపాలని.. తెలంగాణ నుంచి పోటీ చేయించాలని కాషాయ దళం ప్లాన్ చేస్తోందట. తద్వారా దక్షిణాదిన బలపడాలని భావిస్తోందట. ఒకవేళ ప్రధాని మోదీ తెలంగాణ నుంచి పోటీ చేయాల్సి వస్తే.. మహబూబ్ నగర్ లోక్‌సభ స్థానాన్ని బీజేపీ హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ తమకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు అంచనాకు వచ్చారట.
ఇప్పటికే ఓసారి మహూబూబ్ నగర్‌పై హోంమంత్రి అమిత్ షా సీక్రెట్‌గా సర్వే చేయించారట. మహబూబ్ నగర్‌లో ప్రధాని మోదీ పోటీ చేస్తే.. ప్రభావం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, రాష్ట్రం మీద ఏ స్థాయిలో ఉంటుందన్న దానిపై మొదటి విడత సర్వేను నిర్వహించినట్లు తెలుస్తోంది. త్వరలో రెండో విడత సర్వే కూడా చేయనున్నట్లు సమాచారం. మహబూబ్‌నగర్ జిల్లాలో బీజేపీకి బాగానే పట్టుంది. నేతలే కాదు.. కేడర్ కూడా ఎక్కువగానే ఉంది.
వాజ్‌పేయీ హయాంలో జితేందర్ రెడ్డి బీజేపీ టికెట్ మీదే మహబూబ్ నగర్ నుంచి గెలిచారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి యెన్నం శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించారు. జనతా పార్టీ ఉన్న సమయంలో జైపాల్ రెడ్డి కూడా రెండు సార్లు మహబూబ్ నగర్ స్థానం నుంచి గెలుపొందారు. అంతేకాదు ఉమ్మడి జిల్లాకు చెందిన బలమైన నేతలు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. డీకే అరుణ బీజేపీకి జాతీయ స్థాయి నాయకురాలిగా ఉన్నారు.
2014 లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి గెలిచిన జితేందర్ రెడ్డి.. ఇప్పుడు కాషాయ దళంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్‌లో బీజేపీకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని.. అక్కడి నుంచి ప్రధాని మోదీని ఎన్నికల బరిలోకి దింపితే.. ఆ ప్రభావం తెలంగాణ అంతటా ఉంటుందని కాషాయ నేతలు భావిస్తున్నారు. అంతేకాదు ఏపీ, తమిళనాడులోనూ పార్టీ బలోపేతానికి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ తెలంగాణ నుంచి కాకుంటే… తమిళనాడును ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారట బీజేపీ పెద్దలు.
- ప్రధాని మోదీ పోటీ చేసే అవకాశం..!
పాలమూరు నుంచి పోటీ చేసే పరిస్థితులు లేకుంటే.. తమిళనాడులోని రామనాథపురం నుంచి ప్రధాని మోదీ పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. ఎక్కడి నుంచి పోటీ చేస్తే.. ఉంటుందన్న దానిపై పూర్తి స్థాయిలో నివేదిక వచ్చిన తర్వాత.. తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో దక్షిణాది నుంచి పోటీ చేయాలని ప్రధాని డిసైడ్ అయ్యారని సమాచారం. అందులో భాగంగా తెలంగాణ నుంచి రెండు లోక్ సభ స్థానాల పైన సర్వేలు జరుగుతున్నాయి.
ప్రధాని మోదీ స్వయంగా తెలంగాణ నుంచి ఎంపీగా బరిలోకి దిగటం ద్వారా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను పూర్తిగా తమకు అనుకూలగా హైజాక్ చేయవచ్చని బీజేపీ అధినాయకత్వం వ్యూహంగా తెలుస్తోంది. అందులో భాగంగా ప్రధాని పోటీ చేసే నియోజకవర్గం పై తుది నిర్ణయం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇది రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు కారణం అవుతోంది.
రానున్న ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి కేంద్రంలో వరుసగా మూడో సారి ప్రభుత్వం ఏర్పాటు చేసి హ్యాట్రిక్ సాధించాలనేది బీజేపీ లక్ష్యం. అదే సమయంలో ఈసారి దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ చేసింది. ఈ ఏడాది దక్షిణాదిలో కర్ణాటక..తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో ఎలాగైనా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించి అధికారం దక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.
అందులో భాగంగా ప్రధాని వచ్చే ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేస్తారని చెప్పటం ద్వారా పాజిటివ్ వేవ్ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. తెలంగాణ లో ముందుగా అసెంబ్లీ ఎన్నికలు.. ఆ తరువాత 2024లో దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ముందే ప్రధాని మోదీ తెలంగాణలో పోటీ చేసే అంశంపై అధికారికంగా ప్రకటనకు బీజేపీ సిద్దం అవుతోంది.
దీని ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీకి ఖచ్చితంగా సానుకూలత పెరుగుతోందని అంచనా వేస్తోంది. ప్రధాని మోదీ దక్షిణాదిన తమిళనాడు నుంచి పోటీ చేస్తారని ఇప్పటి వరకు ప్రచారం సాగింది. ఇప్పుడు కొత్తగా తెలంగాణలోని రెండు లోక్ సభ స్థానాలపై కసరత్తు జరుగుతున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అందులో అతి పెద్ది లోక్ సభ నియోజకవర్గం.. మినీ ఇండియాగా చెప్పుకొనే మల్కాజ్ గిరి ఒకటి. రెండోది వెనుకబడిన మహబూబ్ నగర్ లోక్ సభ స్థానం.
ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీజేపీకి చెప్పుకొనే స్థాయిలో ఆదరణ ఉంది. సికింద్రాబాద్ బీజేపీకి అనుకూలంగా కనిపిస్తోంది. మల్కాజ్ గిరి నుంచి పోటీ చేయటం ద్వారా దాదాపుగా నగరంతో పాటుగా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలపై ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక, మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయటం ద్వారా ఆ ప్రాంతంలో టీఆర్ఎస్ అనుకూలత తగ్గి..బీజేపీకి లాభిస్తుందని అంచనా వేస్తున్నారు.
- ప్రధాని మోదీ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు..?
2009లో కేసీఆర్ మహబూబ్ నగర్ నుంచే ఎంపీగా గెలుపొందారు. జైపాల్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. ఇప్పుడు ప్రధాని ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. ప్రధాని మోదీ తెలంగాణ పైన పూర్తిగా ఫోకస్ చేసారని బీజేపీ ముఖ్య నేతలు చెబుతున్నారు. తెలంగాణలో ప్రధాని పోటీ పైన తుది నిర్ణయం జరగకపోయినా..ఆ దిశగా ఆలోచనలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు.
అయితే, ముందుగా అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఆ సమయంలోనే ఒక ప్రకటన చేసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ప్రధాని తెలంగాణ నుంచి పోటీ చేయాలని డిసైడ్ అయితే, అసెంబ్లీ ఎన్నికల్లోనే అద అనుకూలంగా మారుతుందని లెక్కలు వేస్తున్నారు. వారణాశి నుంచి ఎంపీగా ఉన్న ప్రధాని అక్కడ ఏ విధంగా డెవలప్ చేసారో అదే మంత్రం ఇక్కడ ప్రచారం చేస్తే వర్కవుట్ అవుతుందని చెబుతున్నారు.
ప్రధాని తెలంగాణ నుంచి పోటీ చేసే అంశంపై బీజేపీ ఎంపీలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రధాని పోటీ ఖాయమైతే వచ్చే అసెంబ్లీ..పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు మరింత ఆసక్తి కరంగా మారే అవకాశం ఉంది. మహబూబ్ నగర్ లోక్‌సభ స్థానం నుంచి మోదీ పోటీ చేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ప్రజలు, నేతలు, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
దీనిని సమర్థించేలా దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తన అధికారిక యూబ్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ పెట్టారు. మహబూబ్ నగర్ నుంచి మోదీ పోటీ చేసే అవకాశం ఉందంటూ ఓ న్యూస్ పేపర్ క్లిప్‌ను షేర్ చేశారు. ఆయన పోస్ట్ ఈ వార్తలకు మరింత బలాన్ని ఇస్తోంది. తెలంగాణ నుంచి పోటీకి ప్రధాని గ్రీన్ సిగ్నల్ ఇస్తే,ఆయన విజయానికి రంగం సిద్ధం చేసేందుకు బీజేపీ కార్యాచరణలోకి దిగుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఈ ఏడాది చివర్లో జరగనున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నందున, మోడీకి సురక్షితమైన సీట్లు మాత్రమే కాకుండా, దక్షిణాదిలో పార్టీ అవకాశాలను కూడా పెంచే రెండు పార్లమెంటరీ నియోజకవర్గాలను గుర్తించేందుకు పార్టీ రహస్య సర్వే నిర్వహిస్తోందని నివేదికలు చెబుతున్నాయి.
ఇక్కడ బీజేపీకి ఉన్న బలం దృష్ట్యా ప్రధాని మోదీ పోటీ చేస్తారని ముందే ప్రకటించడం ద్వారా అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పార్టీకి లాభం చేకూరుతుందని కాషాయదళం భావిస్తోంది. తెలంగాణలో పరిస్థితి బిజెపికి అనుకూలంగా ఉంది కాబట్టి, మోడీ ఈ రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వవచ్చు అని టాక్ వినిపిస్తోంది.
మరి ఈ వార్తలు ఎంతవరకు నిజమో వేచి చూడాలి.