ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం .. టీడీపీలో జోష్ పెంచింది. ఇప్పుడు మరో టాక్ కూడా పసుపుదళంలో జోష్ నింపుతోందట. అదే జూనియర్ ఎన్టీఆర్ రీ ఎంట్రీ .. తాజాగా సినీ హీరో, నారా రోహిత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయట. మరి అవేంటో.. వాటి కథేంటో .. చూద్దామా.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తరువాత తెలుగుదేశంలో నయా జోష్ కనిపిస్తోంది. అన్నీ మాంచి శకునములే అన్నట్లుగా ఆ పార్టీ శ్రేణులు సంబరపడిపోతున్నాయి. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర అశేష ప్రజాదరణతో 50 రోజులుగా సాగుతోంది. అడుగడుగునా జననీరాజనంతో ఆయన పాదయాత్ర సాగుతున్న తరుణంలోనే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో సంపూర్ణ విజయం, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో అధికార వైసీపీకి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే స్ధాయిలో దక్కిన విజయం పార్టీలో సహజంగానే ఉత్సాహాన్ని ద్విగుణీకృతం చేసింది.
నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న నారా వారి కుటుంబానికి చెందిన హీరో నారా రోహిత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాక రేపుతున్నాయట. అన్ని వర్గాల ప్రజలూ తెలుగుదేశంకే మద్దతు పలుకుతున్నారన్న ఆయన .. నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా త్వరలో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా రంగంలోకి దిగనున్నారని వెల్లడించారు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా జూనియర్ ఎన్టీఆర్ 2009లోనే విస్తృతంగా ప్రచారం చేశారు.
అప్పట్లో ఆయన ప్రచారానికి బ్రహ్మాండమైన ప్రజా మద్దతు లభించింది. పాతికేళ్ల వయస్సులోనే ఆయన ప్రచారం ఎంతో పరిణితితో ఉందని పరిశీలకులు సైతం ప్రశంసలు కురిపించారు. 2009 తరువాత జూనియర్ ఎన్టీఆర్ పెద్దగా రాజకీయాల్లో క్రియాశీలంగా లేరు. పూర్తిగా సినీ కెరీర్ మీదే దృష్టి పెట్టారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పీక్స్ లో ఉంది. పాన్ ఇండియా స్టార్ గా అంతర్జాతీయ గుర్తింపు పొందారు. ఆస్కార్ సాధించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఆయన హీరోగా నటించారు.
ఈ నేపథ్యంలో ఆయన రాజకీయాల్లో క్రియాశీలంగా పాల్గొంటారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నప్పటికీ.. ఇటీవలి కాలంలో ఆయన తెలుగుదేశంకు మద్దతుగా వచ్చే అవకాశాలే మెండుగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి రావాలని, టిడిపి పగ్గాలు చేపట్టాలని ఎప్పటినుంచో డిమాండ్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. టిడిపిలో ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏకంగా పార్టీ పగ్గాలు ఎన్టీఆర్ కే అప్పగించాలని కోరుతున్నారు. అలాగే టిడిపి సభలో సిఎం ఎన్టీఆర్ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. అయితే చంద్రబాబు గాని, లోకేష్ గాని ఎన్టీఆర్ ఊసు తీయడం లేదు. అటు ఎన్టీఆర్‌కు సైతం ఇప్పటిలో రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అయినప్పటికీ ఆయన రాజకీయ ఎంట్రీపై వార్తలు మాత్రం .. హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి
అయినా సరే ఎన్టీఆర్ రాజకీయ రీ ఎంట్రీపై చర్చ ఆగడం లేదు. ఇటీవల కూడా విద్యార్ధులతో ముఖాముఖీ మాట్లాడుతున్న లోకేష్‌కు ఎన్టీఆర్‌ని రాజకీయాల్లోకి ఆహ్వానిస్తారా? అనే ప్రశ్న ఎదురైంది. దానికి లోకేష్ తప్పకుండా ఆహ్వానిస్తానని, ప్రజలకు మంచి చేసేవారు రాజకీయాల్లోకి రావాలని, పవన్, ఎన్టీఆర్ లాంటి వారు రాజకీయాల్లో ఉండాలని కోరారు. ఇప్పుడు నారా రోహిత్ .. ఎన్టీఆర్ రాజకీయాల్లో ఎంట్రీపై కామెంట్ చేశారు. చంద్రబాబు సోదరుడి కుమారుడుగా సినీ రంగంలో ఉన్న రోహిత్ .. టిడిపికి మద్ధతుగా ఎప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు. అయితే అవసరమైనప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సైతం రాజకీయాల్లోకి వస్తారని, తెలుగుదేశం పార్టీకి మద్ధతుగా ఉంటారన్నట్లు చెప్పుకొచ్చారు. దివంగత హరికృష్ణ కూడా నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం రోజున సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశంకు మద్దతుగా రంగంలోకి దిగుతారని చెప్పిన సంగతిని తెలుగుదేశం శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. అలాగే పాదయాత్రలో భాగంగా లోకేష్ కూడా జూనియర్ ఎన్టీఆర్ కచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా రంగంలోకి దిగుతారనీ, సమయం వచ్చినప్పుడు ఆయన తన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తారని చెప్పారు.
ఇప్పుడు తాజాగా నారా రోహిత్ కూడా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం గురించి చెప్పడంతో ఆయన పార్టీకి మద్దతుగా రంగంలోకి దిగే సమయం దగ్గరకు వచ్చేసిందనే తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. దీంతో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ రీ ఎంట్రీకి సిద్దం అవుతున్నారా.. అన్న చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ మళ్లీ మొదలైంది. నారా లోకేష్ .. జూ ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించడంపై పెద్ద ఎత్తున చర్చ సాగింది. వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ , మంత్రి రోజా ఈ వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు.
జూ ఎన్టీఆర్ పార్టీలోకి లోకేష్ ఆహ్వానించటం ఏంటని ప్రశ్నించారు. అటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో కొద్ది నెలల క్రితం జూ ఎన్టీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అటు టీడీపీ జనసేనతో పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. ఈ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారంటూ నారా రోహిత్ చేసిన వ్యాఖ్యలతో మరోసారి తారక్ పొలిటికల్ ఎంట్రీ హాట్ టాపిక్ గా మారింది. అయితే రోహిత్ వ్యాఖ్యల వెనుక .. టీడీపీ పెద్దల వ్యూహం ఏదైనా ఉందా అన్న చర్చ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. కేడర్ లో జోష్ పెంచేందుకే ఈ వ్యాఖ్యలు చేశారా అన్న చర్చ కూడా వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి నాలుగు ఎమ్మెల్సీ సీట్లలో విజయం దక్కింది. దాంతో పార్టీ ఫుల్ స్వింగ్ లో ఉంది. అది కూడా తెలుగుదేశం యువ నాయకుడు నారా లోకేష్ పాదయాత్ర ఒక వైపు సాగుతున్న వేళ పార్టీకి సానుకూల ఫలితాలు రావ్డం అంటే క్రెడిట్ చాలా వరకూ యువ నేత తన ఖాతాలో వేస్తున్నారు. పాదయాత్ర వల్లనే యూత్ అంతా టర్న్ అయి మూడు పట్టభద్రుల సీట్లలో టీడీపీని గెలిపించారని లోకేష్ బ్యాచ్ చెప్పుకుంటోంది. సరిగ్గా ఈ టైం లోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా టీడీపీకి మద్దతు ఇస్తారని నారా రోహిత్ అన్నారు. అవసరం అయినపుడు జూనియర్ రాజకీయాల్లోకి వస్తారని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఇప్పుడీ కామెంట్స్ వైరల్ గా మారాయి.
అయితే 2009లో తన కెరీర్ ని ఫణంగా పెట్టి మరీ రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్ వచ్చారు. ఆ తరువాత జూనియర్ మళ్లీ పాలిటిక్స్ వైపు తొంగి చూడలేదు. అటూ ఇటూ వారధిగా ఉన్న ఆయన తండ్రి నందమూరి హరికృష్ణ కూడా చనిపోవడంతో జూనియర్ పూర్తిగా సినిమాలకే పరిమితం అయ్యారు. అయితే ఇటీవల దివంగతులు అయిన తారకరత్న సైతం తమ్ముడు జూనియర్ రాజకీయాల్లోకి వస్తారని చెబుతూ వచ్చారు. ఇపుడు నారా రోహిత్ కూడా అదే మాట అంటున్నారు. దీనికంటే ముందు లోకేష్ కూడా జూనియర్ రాజకీయాల్లోకి రావాలని కోరుకున్నారు. టీడీపీకి విజయాలు దక్కుతున్నా ఇంకా కొన్ని డౌట్లు అయితే వచ్చే ఎన్నికల్లో విజయం మీద ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. దాంతో ఈసారి గట్టిగా పట్టుపట్టాలీ అంటే ఫ్యామిలీ టోటల్ గా దిగిపోవాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. ఒక వైపు జనసేనాని పవన్ కళ్యాణ్ తో పొత్తులో ఉంటూనే జూనియర్ ని కూడా తమ వెంట రప్పిస్తే ఇక తమ విజయానికి తిరుగు ఉండదని భావిస్తున్నట్లు కేడర్ లో చర్చలు సాగుతున్నాయి.
గతంలో ఎవరైతే పిలిచి బొట్టు పెట్టి రమ్మనాలా అని ఎకసెక్కమాడారో ఇపుడు వారంతా కూడా జూనియర్ రావాలి అంటున్నారు. ఇది తెలుగుదేశంలో అధినాయకత్వం స్థాయిలో మార్పుగా అంతా చూస్తున్నారు. అయితే ఇటు వైపు నుంచి పిలుపులు ఉన్నా జూనియర్ మాత్రం రాజకీయాల పట్ల ప్రస్తుతానికి ఆసక్తిని చూపించరనే అంటున్నారు. ఆయన కనీసం ప్రచారం కాదు కదా సానుకూలంగా ప్రకటనలు కూడా ఇచ్చే సీన్ అయితే లేదని సన్నిహిత వర్గాల నుంచి టాక్. కానీ టీడీపీ నేతలు, మద్దతుదారులు మాత్రం జూనియర్ ఈ టైం లో వస్తేనే బెటర్ అంటున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ వ్యూహం ఏమిటన్నదే ఆసక్తికరంగా మారింది.