- గుంటూరు రాజకీయాల్లో ఆ ఎమ్మెల్యే వ్యవహారం హాట్ టాపిక్ గా మారిందా..?
- సీఎం వెంటే ఉంటానంటూనే టిడిపికి జోలపాట పాడుతున్నారా..?
- ముందు హాయ్ అని, వెనుక బాయ్ అని చెప్పే సంకేతాలు కనిపిస్తున్నాయా..?
- ఇప్పటికే సీఎం జగన్ తోనే నా పయనం అనే ఆ ఎమ్మెల్యే వచ్చే ఎన్నికల నాటికి ఆ మాట మీదే నిలబడతారా..? లేదా
- రాజకీయ లబ్ధికోసం పార్టీ మారడం ఖాయమంటారా..?
ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా కొద్దీ.. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇక ముఖ్యంగా పార్టీ ఫిరాయింపులే ఈ ఎన్నికల్లో కీలక పాత్రను పోషించబోతున్నాయనడంలో ఏమాత్రం సందేహపడాల్సిన అవసరం లేదు. ఎన్నికల నగారా మోగే వరకు ఎవరు.. ఏ పార్టీలోకి జంప్ అవుతారో ఎవరికి తెలియదు. మేకతోటి సుచరిత. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

గతంలో వైఎస్ వెంట, వైఎస్ మరణాంతరం జగన్ తో కలిసి అడుగులు వేస్తున్నారు. అందుకు ప్రతిఫలంగా జగన్ అధికారంలోకి వచ్చాక సుచరితకు హోంశాఖ కూడా అప్పగించారు. ఐతే మంత్రి వర్గ మార్పుల తర్వాత పార్టీలో పరిణామాలు మారాయి. ఇటు సుచరిత వ్యవహారంలోనూ అనే మార్పులు చోటుచేసుకున్నాయి. అందుకు తగ్గట్టు తాజాగా సుచరిత చేసి కామెంట్స్ ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
పార్టీ మారడంపై ఏపీ మాజీ హోంమంత్రి, ప్రత్తిపాడు వైసీపీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత సంచలన వ్యాఖ్యలు చేశారు. నా భర్త పార్టీ మారితే నేను కూడా మారాల్సి వస్తుందని, నా భర్త ఓ పార్టీలోను, నేను మరో పార్టీలోను ఉండమని.. అంటూనే బహుశా నా భర్త పార్టీ మారితే నేను కూడా మారాల్సి వస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ఎప్పుడూ జగన్ తోనే ఉంటామని తాను చెప్పిన దానికి నా భర్త దయాసాగర్ కూడా కట్టుబడి ఉంటారని అన్నారు.
ఒకవేళ తన భర్త పార్టీ మారతాను, నీవు కూడా నాతో రా అని నా భర్త పిలిస్తే ఒక భార్యగా తాను కచ్చితంగా తన భర్త అడుగుజాడల్లోనే నడుస్తానని చెప్పారు. తన భర్త ఒక పార్టీలో, తాను మరో పార్టీలో, తన పిల్లలు ఇంకో పార్టీలో ఉండమని తెలిపారు. తామంతా వైసీపీ కుటుంబ సభ్యులమని, జగన్ పార్టీలో తాము ఉండగలిగినంత కాలం ఉంటామని అన్నారు.
అంటే ఉన్నంత కాలం ఉంటాం అంటే ఆమె పార్టీ మారటం అనేది జరుగుతుందనేనా అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మేకతోటి సుచరిత హోం మినిష్టర్ అయ్యారు. రెండున్నర సంవత్సరాల తరువాత ఆమె మంత్రి పదవినుంచి తొలగించారు సీఎం జగన్. దీంతో ఆమె అలకబూనారు. అదే సమయంలో ఆమె ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని, పార్టీ కూడా మారతారనే వార్తలు తీవ్రంగా వచ్చాయి.
ఆ స్థాయికి ఆమెకూడా వెళ్లారు. రాజీనామా పత్రం కూడా సిద్ధం చేసుకున్నారని ఆమె కుటుంబ సభ్యులే తెలిపారు. కానీ తరువాత జగన్ పిలిచి ఏం మాట్లాడారో గానీ బహుశా బుజ్జగించారో లేదా బెదిరించారో తెలీదుగానీ ఆమె పార్టీ మారేది లేదు .. నన్ను హోంమంత్రి చేసిన జగన్ తోనే కలిసి నడుస్తాను అంటూ స్పష్టంచేశారు.
ఏపీలో ఎన్నికలు ఆయా పార్టీల్లో ఉండే నేతలు మరో పార్టీల్లోకి దూకటానికి కూడా మార్గాలు సిద్ధం..!
ఐతే ఇప్పుడు ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు దాదాపు ఎన్నికల ప్రచారం చేస్తున్నట్లుగా సభలు, సమావేశాలు
నిర్వహిస్తున్నాయి. పర్యటనలు చేస్తున్నాయి. ఎన్నికల రథాలను సమాయత్తం చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో ఆయా పార్టీల్లో ఉండే నేతలు మరో పార్టీల్లోకి దూకటానికి కూడా మార్గాలు సిద్ధం చేసుకుంటున్నారు.
దీంట్లో భాగంగానే అప్పటి వరకు తాము ఉన్న పార్టీయే గొప్పది అక్కడే తమ రాజకీయ జీవితాలను కొనసాగిస్తాం అంటూ పార్టీ అధినేతలకు పొగడ్తలతో ముంచెత్తే నేతలు సడెన్ గా పార్టీలో తమకు తగిన గౌరవం దక్కటంలేదని పాట అందుకుంటుంటారు. బహుశా పార్టీ మార్పు గురించి మేకతోటి సుచరిత వ్యాఖ్యలు కూడా అందుకు సంకేతాలేనని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
మరోపక్క ఎన్నికల దగ్గర పడుతుంటే జంప్ జిలానీలు షురూ అవుతుంటాయి. ఇది సర్వసాధారణ విషయాలే. తమకు టికెట్ దక్కుతుందో లేదో అనే అనుమానం ఉన్న నేతలు పక్క పార్టీల వంక చూస్తు ఎక్కటి టికెట్ లభిస్తే ఆ పార్టీలోకి జంప్ అయిపోతుంటారు. దీంట్లో భాగంగానే వైసీపీ నుంచి కూడా పలువురు నేతలు ఇతర పార్టీల్లోకి దూకటానికి సిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం. కాగా సుచరిత కూడా వైసీపీ మరోసారి టికెట్ ఇస్తే పార్టీలోనే ఉంటారు.
లేదంటే మరోపార్టీకి జంప్ అవుతారని గతంలోనే టాక్ వినిపించింది. దీనికి ఆమె భర్త ఓ కారణంగా చెప్పుకోవటానికి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. అందుకే నా భర్త పార్టీ మారదాం అంటే మారుతాను అంటూ హింట్ ఇచ్చారు మాజీ హోమ్ మంత్రివర్యులు సుచరిత. ఇదిలా ఉంటే, బాపట్ల ఎంపీ టికెట్ ను సుచరిత భర్త ఆశిస్తున్నట్లు, టిడిపిలో చేసేందుకు బాపట్ల టికెట్ కోరినట్లు ఇప్పటికే గుంటూరు రాజకీయాల్లో నలుగుతోంది.
ఇదే అంశాన్ని సుచరిత వర్గాన్ని ప్రశ్నిస్తే ఇదంతా ట్రాష్ అంటూ కొట్టిపారేస్తున్నారు. సుచరిత సైతం అది అబద్దంగానే చెప్తున్నారు. కానీ సంకేతాలు మాత్రం వేరేలా కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇందులో ఏది వాస్తవం, ఏది అబద్దం అనేది కొద్ది రోజుల్లో బయటపడే అవకాశం ఉంది.
సుచరిత వ్యూహం ఏమిటన్నదే చర్చనీయాంశంగా మారింది..!

ఇదిలా ఉంటే సుచరిత.. ఏ నిమిషంలోనైనా తాను పార్టీ మారే అవకాశం ఉందని వైసీపీ కార్యకర్తలకే చెప్పేశారు. రెండ్రోజుల కిందట తన నియోజకవర్గం పరిధిలోని కాకుమానులో జరిగిన పార్టీ కార్యకర్తల అంతర్గత సమావేశంలో ఆమె మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌లు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. కాగా ఇన్‌కంటాక్స్ కమిషనర్‌గా పనిచేసిన సుచరిత భర్త దయాసాగర్ వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
అది కూడా టీడీపీ తరఫునే బరిలోకి దిగాలని ఆయన ఆకాంక్షిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉద్యోగరీత్యా జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్య నేతలతో కూడా ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. వైఎస్ కుటుంబానికి ఎంతో విశ్వసనీయురాలైన సీనియర్ ఎమ్మెల్యే సుచరిత పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారన్న టాక్ వైసీపీలో పెద్ద కలకలమే రేపింది. అయితే ఆమె ఎంతో ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
అకారణంగా హోం మంత్రి పదవి నుంచి తప్పించడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారని.. అంతేగాక ఇచ్చినట్లే ఇచ్చి మూణ్ణాళ్లకే గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవిని కూడా లాగేసుకోవడం ఆమెకు మనోవేదన కలిగించినట్లు తెలిసింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తనకు హోం మంత్రి పదవి.. పేరు కోసమే ఇచ్చారే తప్ప ఎటువంటి అధికారం ఇవ్వలేదని అప్పట్లోనే ఆమె వాపోయిన సందర్భాలున్నాయి.
సొంత శాఖలో కానిస్టేబుల్‌ను సైతం బదిలీ చేయించుకోలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు. మంత్రివర్గ విస్తరణలో తన సామాజికవర్గానికి చెందిన అందరినీ కొనసాగించి.. తనకు మాత్రమూ ఉద్వాసన పలకడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. శాఖాపరంగా కూడా తనపై ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకపోయినా నిర్దాక్షిణ్యంగా తొలగించారని ఆవేదనతో ఉన్నారు. ఇక వైసీపీలో భవిష్యత్ లేదని నిర్ణయానికి వచ్చారు.
అందుకే టీడీపీ వైపు చూస్తున్న భర్తతోపాటే అడుగులు వేయాలని నిశ్చయించుకున్నారని సమాచారం. ఇప్పుడు సుచరిత చేసిన కామెంట్స్ పార్టీలో చర్చకు దారితీస్తున్నాయి. పార్టీ మార్పు వ్యవహారాలపై నేతల ముందే ఇలాంటి కామెంట్స్ చేయటంపై రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న నేతలంతా .. తమకే అవకాశం ఇవ్వాలంటూ సిగ్నల్స్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే సుచరిత ఈ వ్యాఖ్యలని టాక్ వెల్లువెత్తుతోంది.