HomePoliticsటీఆర్ఎస్ కు అండగా నిలిచిన ఎంఐఎం..బీఆర్ఎస్ కు దూరమవుతోందా..?

టీఆర్ఎస్ కు అండగా నిలిచిన ఎంఐఎం..బీఆర్ఎస్ కు దూరమవుతోందా..?

  • తెలంగాణలో టీఆర్ఎస్ కు అండగా నిలిచిన ఎంఐఎం .. బీఆర్ఎస్ కు దూరమవుతోందా..?
  • దీనివెనుక కేసీఆర్ వ్యూహాత్మక ఎత్తుగడ ఉందా..?
  • ఎంఐఎంతో దూరం వెనుక కథేంటి..?

దోస్త్‌.. అంటే సుఖాలతోపాటు కష్టాల్లోనూ తోడుండేవాడు. స్నేహానికి ప్రపంచంతో ఎంతో విలువ ఉంది. కానీ రాజకీయాల్లో స్నేహితులు, శత్రువులు శాశ్వతంగా ఉండరు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అంత్యంత ఆప్తమిత్రుడు అసదుద్దీన్‌ ఒవైసీ. అయితే ఆయన సుఖాల్లో మాత్రమే తోడు ఉంటారన్న అపవాదు ఉంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పంచన చేరడం ఎంఐఎంకు అలవాటే.

ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ మిత్రపక్షంగా ఎంఐఎం, కేసీఆర్‌కు ప్రాణమిత్రుడుగా అసదుద్దీన్‌ కొనసాగుతున్నారు. ఎవరు అడిగినా సీఎం కాదంటారేమో కానీ, అసదుద్దీన్‌ అడిగితే మాత్రం కాదనరు. అయితే ఆయన రీసెంట్ గా జరిగిన బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ బహిరంగ సభకు దూరంగా ఉన్నారు. కేసీఆర్‌ తాజాగా కష్టాల్లో ఉన్నారు. కష్టసమయంలో తప్పుకునే అసదుద్దీన్‌ ఇప్పుడు కూడా దూరం జరిగారా లేక కేసీఆర్‌ ఆహ్వానం పంపలేదా అన్న అన్నదే చర్చనీయాంశంగా మారింది.

జాతీయ రాజకీయాల కోసం టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చిన గులాబీ బాస్‌ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఖమ్మంలో పార్టీ ఆవిర్భావ సభ అట్టహాసంగా నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ భేరీసభ ధాంధూంగా జరిగింది. తెలంగాణలో అధికార పార్టీ సభనా, మజాకా? సీఎం కేసీఆర్‌ తలచుకుంటే విజయవంతం కాకుండా ఎలా వుంటుంది? అన్నది అందరికీ తెలిసిందే.

టీఆర్‌ఎస్‌ కాస్త బీఆర్‌ఎస్‌గా అవతరించిన తర్వాత జాతీయ స్థాయి నాయకుల్ని ఆహ్వానించి మరీ సభ నిర్వహించడం విశేషం. తద్వారా తన పార్టీకి జాతీయ స్థాయి అటెన్షన్‌ తీసుకొచ్చేందుకు కేసీఆర్‌ ప్రయత్నించారు. దీంతో ఖమ్మం బీఆర్‌ఎస్‌ సభకు ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్‌ కేజ్రీవాల్, భగవంత్‌ మాన్, పినరయి విజయన్, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.

రాజా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా హాజరు కావాల్సి వుండింది. అయితే స్థానికంగా ముఖ్యమైన కార్యక్రమాలు ఉండడంతో రాలేకపోయినట్టు కేసీఆర్‌కు సమాచారం అందించారు. అయితే ఈ సభలో కేసీఆర్‌ ఆప్తుడైన నాయకుడు లేకపోవడం కొరతే అని చెప్పక తప్పదు. తెలంగాణలో కేసీఆర్ తో చెట్టపట్టాలేసుకుని తిరిగే ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ సభకు రాకపోవడం గమనార్హం.

అసదుద్దీన్‌ బ్రదర్స్‌ భుజాలపై గన్‌ పెట్టి తనను రాజకీయంగా కాల్చుతారనే భయం కేసీఆర్‌లో బాగా ఉన్నట్టుంది. కేసీఆర్‌ ఆహ్వానించలేదా? లేక ఇరుపార్టీల రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని అసదుద్దీన్‌ దూరంగా ఉన్నారా? అనే అంశంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  • తెలంగాణ ఆవిర్భావం తర్వాత టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చింది.

అప్పటి నుంచి ఎంఐఎం అధికార పార్టీతో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతోంది. తమ పనులు చేసుకుంటోంది. తాజాగా బీఆర్‌ఎస్‌కు అన్ని విధాలా అసదుద్దీన్‌ అండగా నిలిచే సంగతి తెలిసిందే. ఇప్పటికే జీహెచ్‌ఎంసీలో ఎంఐఎం మద్దతుతోనే బీఆర్‌ఎస్‌ అధికారాన్ని సొంతం చేసుకుందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నికల సమయంలో మాత్రం నువ్వు కొట్టినట్టుండాలి, నేను ఏడ్చినట్టు కనిపించాలి అనే రీతిలో బీఆర్‌ఎస్, ఎంఐఎం రాజకీయాలు
చేస్తుంటాయి. ఏది ఏమైనా వ్యూహంలో భాగంగానే ఖమ్మం సభలో అసదుద్దీన్‌ కనిపించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కేసీఆర్.. అసదుద్దీన్.. పాలు నీళ్లలో కలిసిపోయే నేతలు..ఇద్దరి టార్గెట్ ఒక్కటే మోడీని గద్దెదించడం.. బీజేపీని ఓడించడం.. అన్నది అందరికీ తెలిసిందే. పక్కా మతతత్వ పార్టీ గా ముద్రపడి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇప్పటికే దేశంలోని ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో తన పార్టీని విస్తరించారు. హైదరాబాద్ కే పరిమితమైన అసద్ ఈ దేశవ్యాప్త విస్తరణ వెనుక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హస్తముందని.. ఆయనే ఫండింగ్ చేస్తున్నారని ఒక రూమర్ రాజకీయాల్లో ఉంది. బీజేపీ ఇదే ఆరోపిస్తుంటుంది. ఇక అసద్ నేరుగా ప్రగతి భవన్ లోకి వెళ్లి చాలా సందర్భాల్లో కేసీఆర్ తో అంతరంగిక చర్చలు సాగించారు.

కానీ ఖమ్మంలో కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన బీఆర్ఎస్ సభలో మాత్రం అసద్ కనిపించడం లేదు. తెలంగాణలో అధికార పార్టీ సభ లక్షల మందితో నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని దేశంలోని ముగ్గురు సీఎంలు ఇతర ప్రతిపక్ష నేతలను ఖమ్మం సభకు రప్పించారు. కానీ కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన ఎంఐఎం అధినేత అసద్ మాత్రం కనిపించలేదు.

బీఆర్ఎస్ కు జాతీయస్థాయి అటెన్షన్ తీసుకొచ్చిన కేసీఆర్ తన మిత్రుడైన అసద్ ను మాత్రం పిలవకపోవడం హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం తొలి సమావేశం ఖమ్మంలో జరిగింది.. ఈ సభకు ఐదు లక్షల మందిని తరలించింది. ఇది జాతీయ స్థాయిలో కేసీఆర్ బల నిరూపణ చేసుకుంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కేరళ సీఎం పినరయి విజయన్తో పాటు సీపీఐ పార్టీ ప్రధాన కార్యదర్శి డి రాజా యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్లను ఆహ్వానించారు.

పొరుగునే ఉన్న ఎంఐఎం అసద్ కు కేసీఆర్ ఆహ్వానం లేకపోవడం గమనార్హం. అయితే అసద్ తో కలిస్తే మతతత్వ ముద్రను తన పార్టీపై వేస్తారని కేసీఆర్ కు తెలుసు. దీనిపై మత పార్టీ ముద్ర వేసి ఒక వర్గం ఓట్లను దూరం చేస్తుంది. ఈ ప్లాన్ తెలుసు కనకనే కేసీఆర్ తన మిత్రుడిని ప్రస్తుతానికి పక్కనపెట్టినట్టు తెలుస్తోంది.

  • దేశంలో హంగ్ వస్తే మొదట ఎంఐఎం మద్దతు కేసీఆర్ కే దక్కుతుంది..

ఇప్పటికే హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీలో ఇలానే రహస్య అవగాహన చేసుకొని బీజేపీని పీఠం ఎక్కకుండా బీఆర్ఎస్ ఎంఐఎం కలిసి ప్లాన్ చేశాయి. ప్రస్తుతానికి ఎంఐఎంతో విభేదాలు.. దూరం పాటిస్తున్నా.. ఎన్నికలు ముగిశాక అవసరార్థం వీరిద్దరూ కలిసి సాగడం ఖాయంగా కనిపిస్తోంది. అంతేగాక టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా మారిన తర్వాత.. సీఎం కేసీఆర్ కూడా తన స్ట్రాటజీని మార్చినట్లు స్పష్టమవుతోంది.

తెలంగాణలో మరోసారి అధికారం సాధించడంతో పాటు జాతీయ రాజకీయాల్లోనూ కీలక భూమిక పోషంచాలన్న లక్ష్యంతో ఆయన ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో కొత్త మిత్రులకు దగ్గరవుతూ.. పాత మిత్రులకు దూరమవుతున్నట్లు కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో సమాజ్‌వాదీ పార్టీ, జనతాదళ్ పార్టీలకు మరింత దగ్గరయ్యారు. ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి అఖిలేష్ యాదవ్, కుమారస్వామి హాజరయ్యారు.

ఐతే కేసీఆర్ పాత మిత్రుడు అసదుద్దీన్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల మధ్య చాలా కాలంగా దోస్తీ ఉంది. కానీ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా ఆవిర్భవించాక.. అసదుద్దీన్ ఓవైసీ, కేసీఆర్ మధ్య గ్యాప్ పెరిగినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్‌కు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం .. ఆ పార్టీ బీఆర్ఎస్‌గా అవతరించాక మాత్రం.. శుభాకాంక్షలు చెప్పలేదు. ఈ నేపథ్యంలో కేసీఆర్, ఓవైసీల మధ్య గ్యాప్ గురించి రకరకాల ప్రచారం జరుగుతోంది.

సీఎం కేసీఆర్ కావాలనే ఆయన్ను దూరం పెట్టినట్లు సమాచారం. జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని భావిస్తున్న గులాబీ అధినేత.. ఎంఐఎంతో దోస్తీ కొనసాగిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో హిందూ ఓటర్లకు దూరమవుతామనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎంఐఎం పార్టీకి దూరంగా ఉంటున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం దోస్తీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2014 నుంచీ ఈ రెండు పార్టీల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ సీట్లుంటే.. టీఆర్ఎస్ గెలవాలనుకునేది 16 మాత్రమే. హైదరాబాద్ సీటును మాత్రం మజ్లిస్‌కు వదిలేసింది. ఇక తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం పార్టీకి ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. టీఆర్ఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. వారు మద్దతు తెలుపుతారు.

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను అసదుద్దీన్‌తో పాటు అక్బరుద్దీన్ కూడా సమర్థిస్తుంటారు. ఎంఐఎం బలంగా ఉన్న పాతబస్తీలో టీఆర్ఎస్ కావాలనే డమ్మీ అభ్యర్థులను నిలబెడుతుందన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది.

మరి ఈ దూరం ఎంతవరకు సాగుతుందన్నదే చర్చనీయాంశంగా మారింది..

Must Read

spot_img