Homeతెలంగాణఎంఐఎం పార్టీ సవాలు..?

ఎంఐఎం పార్టీ సవాలు..?

  • రాజధాని వరకే పరిమితమైన ఆ పార్టీ జిల్లాలో పాగా వేసేందుకు అడుగులు వేస్తో్ందా..
  • ఏడు సీట్లకే పరిమితమైన ఆ పార్టీ వచ్చే ఎన్నికల నాటికి 15 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో కాలు పెడతామని సవాలు విసిరేలా చేసింది ఎవరు…
  • ఇన్నేళ్లుగా అధికార పక్షానికి మద్దతు తెలిపిన పార్టీ .. ఎన్నికల సమయంలో బిఆర్ఎస్ ను ఢీకొనేందుకు సమాయాత్తం అవుతోందా…?
  • ఇంతకీ ఏమిటా పార్టీ ..

ఎంఐఎం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కచ్చితంగా ఐదు నుంచి పది లోపు ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకుంటూ వస్తూ ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీ వచ్చినా దానికి తమ అవసరరీత్యా మద్దతు ప్రకటిస్తూ వస్తోంది.. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో పలు నియోజకవర్గాల్లో తమ సత్తా చాటుతూ నిర్విరామంగా తమ అభ్యర్థులను గెలిపించుకుంటూ ఉంది ఎంఐఎం పార్టీ.. ఆ పార్టీకి జాతీయ, రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కొనసాగుతుండగా ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ .. ఎంఐఎం పార్టీకి శాసనసభ పక్ష నేతగా కొనసాగుతున్నారు..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ 8 స్థానాలు పోటీ చేయగా 7 అసెంబ్లీ సీట్లను గెలుచుకొని హైదరాబాద్ దక్షిణ ప్రాంతంలోని పలు నియోజకవర్గాల్లో తమ సత్తాను చాటుకుంది. ఆ ప్రాంత ప్రజలు కూడా ఏ పార్టీకి మద్దతు తెలుపకుండా సంవత్సరాలుగా ఎంఐఎం పార్టీ అభ్యర్థులకే పట్టం కడుతున్నారు.. ఇలా హైదరాబాద్ పాత నగరం ఎంఐఎంకు కంచుకోటగా మారింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఎంఐఎం 7 సీట్లను గెలుచుకొని అసెంబ్లీలో తమ సత్తా చాటుతోంది.. ఈ క్రమంలో బిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తూ ఆ పార్టీ మిత్రపక్షంగా కూడా కొనసాగుతోంది.

అప్పుడప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేసిన లోపాయికారిగా ఆ పార్టీకి విధేయంగానే ఉన్నట్లు పలు సందర్భాల్లో కనిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బడ్జెట్ కు ముందు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రభుత్వ తీరుపై ఘాటుగా ప్రశ్నలు సంధించారు. దీనికి రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటీఆర్ సైతం అదే రీతిలో అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందించారు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. కేవలం ఏడుగురు మాత్రమే ఉన్న ఎమ్మెల్యేలకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నా వారు ప్రభుత్వం పై ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం సరికాదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

దీంతో కేవలం ఏడుగురు అన్న పదానికి అక్బరుద్దీన్ ఓవైసీ తీవ్రంగా ఆగ్రహానికి గురయ్యారు. ఇదే అసెంబ్లీ సాక్షిగా చెబుతున్నామని.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేస్తామని, కచ్చితంగా వచ్చే అసెంబ్లీ కి 15 మంది ఎమ్మెల్యేలతో వస్తామని అక్బరుద్దీన్ ఓవైసీ సవాలు విసిరారు.

ఈ సవాల్ అటు బిఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు సృష్టించింది. ఇన్నేళ్లు మిత్రపక్షంగా కొనసాగిన ఎంఐఎం ను అనవసరంగా కేటీఆర్రెచ్చగొట్టారా అన్న వ్యాఖ్యలు సైతం వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఎంఐఎం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా దిశగా పావులు కదుపుతోందన్న వార్తలు .. హాట్ టాపిక్ గా మారాయి. దీంతో అసలు మహబూబ్ నగర్ జిల్లానే ఎంఐఎం టార్గెట్గా ఎందుకు ఎంచుకుందన్న ప్రశ్నలు .. సర్వత్రా వినిపించాయి. అయితే ఈ జిల్లాలో ముస్లిం మైనార్టీ వర్గాలకు చెందిన 35వేల నుంచి 38 వేల వరకు ఓట్లు ఉండడమే కారణంగా తెలుస్తోంది.

దాంతోపాటు ఇతర వర్గాల ఓట్లు కూడా రాబట్టుకునే ప్రయత్నంలో వ్యూహాలు రచిస్తున్నారట. ముస్లిం నాయకుడినే ఎంఐఎం తరఫున పోటీ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారట.. కాంగ్రెస్ లేదా టిఆర్ఎస్ పార్టీలో ఉన్న అగ్రశ్రేణి మైనార్టీ నాయకులు లేదా గతంలో ఇతర పార్టీల నుంచి బరిలో ఉన్న నాయకులతో మంతనాలు కూడా చేస్తున్నట్లు సమాచారం.. లేదంటే ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు హాది సైతం బరిలోదించే అవకాశాలు ఉన్నట్టు ఎంఐఎం నేతలు చెబుతున్నారు.

మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు గెలిచిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ .. మరోసారి హ్యాట్రిక్ సాధించేందుకు కృషి చేస్తున్నారు.. కానీ ఎంఐఎం బరిలో ఉంటే మాత్రం కచ్చితంగా బిఆర్ఎస్ పార్టీకి చాలా నష్టం చేకూరే అవకాశం స్పష్టంగా ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే, కమలం మాత్రం మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి ఎంఐఎం పార్టీ కచ్చితంగా పోటీ చేయాలని భావిస్తోందట.

గతంలో టిఆర్ఎస్ పార్టీ నుంచి సయ్యద్ ఇబ్రహీం పోటీ చేయగా, అదే స్థానం నుంచి పోటీకి దిగిన బిజెపి పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి అనూహ్యంగా విజయం సాధించారు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంఐఎం బరిలో ఉంటే బిజెపి కచ్చితంగా పాలమూరు ఖిల్లా ఫై జెండా ఎగరవేస్తుందని ఆ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాలమూరు జిల్లాలో ఎంఐఎం పోటీ చేస్తే బిఆర్ఎస్ కు నష్టం తప్పదన్న అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. మతతత్వ పార్టీగా పేరొందిన ఆ పార్టీ పోటీలో ఉంటే బిజెపికి లాభిస్తుందన్న వాదనలు సైతం వినిపిస్తన్నాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో త్రిముఖ పోటీ ఉంటుందనుకున్న పార్టీలకు ఎంఐఎం రాకతో చతుర్ముఖ పోటీ తప్పదని విశ్లేషకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు.

  • అసెంబ్లీలో శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ సవాలు చేయడంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మైనార్టీల్లో సంతోషం పెల్లుబికుతోందట..

ఇన్నేళ్లుగా ఆ పార్టీకి ఈ పార్టీకి తమ మద్దతు తెలిపిన ఎంఐఎం పార్టీ కార్యకర్తలు, మైనార్టీ ప్రజలు కూడా వచ్చే ఎన్నికల్లో మహబూబ్నగర్ జిల్లాలో ఎంఐఎం పార్టీ కచ్చితంగా పోటీ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మహబూబ్ నగర్, గద్వాల నియోజకవర్గాల్లో మైనార్టీ ఓట్ల సంఖ్య ఎక్కువగానే ఉంది. మహబూబ్ నగర్ నియోజకవర్గం మొత్తం రెండు లక్షల 41 వేల మంది జనాభా.. ఇందులో మైనార్టీల ఓట్లే 35వేల నుంచి 38 వేల ఓట్లు ఉంటాయి… ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోటముల్లో ముస్లింల ఓట్లు కీలకంగా ఉంటున్నాయి.

దీనికి తోడు 2014 మున్సిపాలిటీలో కూడా 6 మంది ఎంఐఎం పార్టీ చెందిన అభ్యర్థులే కౌన్సిలరులుగా గెలుపొందారు. అదేవిధంగా 2018 మున్సిపల్ ఎన్నికల్లో సైతం ఐదు కౌన్సిలర్ల స్థానాలలో గెలుపొంది మున్సిపల్ లో రెండో స్థానంలో నిలిచారు. దీంతో పాటు మైనార్టీ కి చెందిన ఒబేదుల్లా కొత్వాల్ మున్సిపల్ చైర్ పర్సన్ గా కూడా చేశారు.. దీనికి తోడు 2012 ఎన్నికల్లో మైనార్టీ వర్గానికి చెందినకి సయ్యద్ ఇబ్రహీం టిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి కేవలం 18 వందల ఓట్లతో ఓటమి చెందారు.. ఆ తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్రహీం ఇండిపెండెంట్ గా పోటీ చేసి 24 వేల ఓట్లు సాధించుకున్నారు..

2018 ఎన్నికల్లో అదే ఇబ్రహీం బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేసి 19500 ఓట్లు సాధించుకున్నారు.. ఇలా మైనార్టీ కి మైనార్టీ వర్గానికి చెందిన ఎవరు పోటీ చేసినా కచ్చితంగా 20 వేల నుంచి 25 వేల ఓట్లు సాధించుకుంటూ వస్తున్నారు.. మైనార్టీలు టిఆర్ఎస్ కే మద్దతు తెలుపుతారని ప్రచారం జరుగుతున్న వేళ .. మైనార్టీకి చెందిన నేత పోటీకి దిగితే, పార్టీలకతీతంగా ఓట్లు పడుతుండడం గమనార్హం.

గత ఎన్నికల్లోనూ శ్రీనివాస్ గౌడ్ కు మైనార్టీల ఓట్లు కేవలం 12వేలు మాత్రమే లభించాయి. దీంతో మైనార్టీలు తమ పార్టీ వైపే ఉన్నారని ఇప్పటివరకు ధీమాగా ఉన్న బీఆర్ఎస్ నేతలు.. అక్బరుద్దీన్ ప్రకటనతో టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తోన్న బీఆర్ఎస్ కు .. ఎంఐఎం పోటీ మింగుడుపడడం లేదని తెలుస్తోంది. మరోవైపు బీజేపీ మాత్రం .. ఎంఐఎం పోటీచేస్తే తమకు ఎదురు ఉండదని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

మరి భవిష్యత్తులో ఎంఐఎం అడుగులు ఎలా ఉండనున్నాయన్నదే ఆసక్తికరంగా మారింది..

Must Read

spot_img