ఈ మధ్య గమనించారా స్మార్ట్ మొబైల్ లో కానీ, కంప్యూటర్ లో గూగుల్ లో ఏదైనా సెర్చ్ చేయడం మొదలుపెట్టగానే ‘నేను రూ. లక్ష సంపాదించాను.. కారు కొన్నాను. అందుకు కారణం రమ్మీ ఆడడమే’ అంటూ ఆకర్షణీయమైన ప్రకటనలు కనిపించడం ఎక్కువైంది. ‘ఆన్‌లైన్ రమ్మీ ఆడండి.. ఒక్క ఆటతో లక్షాధికారి కండి’ అంటూ ఊకదంపుడు ప్రకటనలు కొందరిని నష్టపోయేలా చేస్తున్నాయి.
డబ్బులున్నాయి కదా..ఓసారి ఆడి చూద్దాం అంటూ ఎంట్రీ ఇచ్చి చేతులు కాల్చుకునేవారు ఎక్కువయ్యారు. కొంత నష్టపోగానే వారు పక్కకు తప్పుకుంటున్నారు. కానీ దేశంలోని 140 కోట్ల జనాభాలో ఇలా ఆలోచించేవారి సంఖ్య కారణంగా ఆన్ లైన్ మోసగాళ్ల పంట పండుతోంది. వారు ఇంటర్నెట్ కంపెనీలకు డబ్బులు కట్టడం వల్లనే ప్రకటనలు మనకు దర్శనమిస్తున్నాయి.
ఇటీవల ఓ మెట్రో నగరానికి చెందిన ముఖేష్ అనే వ్యక్తి ఓ బ్యాంకులో పనిచేస్తూ.. ఈ జూదం కోసం తాను పని చేస్తున్న బ్యాంకును కోటి రూపాయల వరకు మోసం చేశాడు.. అంత డబ్బులు అతను ఏం చేశాడా? అని ఆరా తీస్తే ఆన్‌లైన్ రమ్మీ ఆడి అంతా పోగొట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు విస్తుపోయారు. ఇంకో వ్యాపారి పెద్ద ఎత్తున రుణాలు చేసి పరారయ్యాడు. ఆయన షాపు, ఇళ్లు అమ్మినా అప్పులు తీరలేదు.
ఆ వ్యాపారి అప్పులన్నీ కూడా ఆన్‌లైన్ రమ్మీ కోసమే తీసుకున్నట్లు విచారణలో గుర్తించారు. మొన్నటికి మొన్న తెలంగాణాలో తండ్రికి తెలియకుండా ఓ కొడుకు బ్యాంకులో నిరక్షరాస్యడైన తండ్రి సంతకాలు పెట్టి డబ్బులు డ్రా చేస్తూ మొబైల్ జూదం ఆడటం చేసాడు. ఎప్పుడు చూసినా మొబైల్ లో తలదూర్చడం చూసి తన కుమారుడు ఆన్ లైన్ క్లాసులు చదువుకుంటున్నాడని తల్లిదండ్రులు అనుకున్నారు.
తీరా చూస్తే తండ్రికి సంబంధించిన 70 లక్షల దాకా జూదంలో పొగొట్టుకున్నాడు. దాంతో ఇళ్లమ్మగా వచ్చిన ఆ సొమ్ము పోవడంతో తండ్రి లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసాడు.
కానీ అప్పటికే సమయం మించిపోయింది. అవి ఎన్నటికీ తిరిగి వచ్చే అవకాశం లేదు. అసలే ఆన్ లైన్ లో హ్యాకర్లు దొరికిన చోటల్లా మోసాలు చేస్తూ బ్యాంకు అకౌంట్లలోకి దూరిపోతూ డబ్బులు మాయం చేస్తున్నారు. ఇప్పుడు ఈ మాయా జూదగాళ్లు వారికి తోడయ్యారు. ప్రస్తుతం మనదేశంలో ఈ మాయా జూదం వల్ల కోట్ల సంఖ్యలో బాధితులు తయారవుతున్నారు.
ఆన్‌లైన్‌లో డబ్బులు నష్టపోతున్న వారు మిస్ అవుతున్న లాజిక్ ఏమిటంటే.. గేమ్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్ మొత్తం కంపెనీ చేతిలో ఉన్నప్పుడు డబ్బులు ఊరికే ఇవ్వరు కదా? మోసం చెయ్యాలనే చూస్తారు. వచ్చినట్లే అనిపిస్తుంది. కానీ రావు..ఎన్నటికీ మనకు రాకుండా వారు ప్రొగ్రాం చేసిపెడతారు. ఇదంతా డిజిటల్ మాయాజాలం..వీటి కోసం నెలంతా కష్టపడి సంపాదించిన జీతాలను పణంగా పెండుతున్నారు.
ఇకపై మీ స్మార్ట్ ఫోన్, ల్యాప్‌టాప్ ఓపెన్ చేయగానే కనిపించే ‘నేను రూ. లక్ష సంపాదించాను.. కారు కొన్నాను. అందుకు కారణం రమ్మీ ఆడడమే అంటూ కనిపించే ప్రకటనల జోలికి వెళ్లకపోవడమే బెటర్ అంటున్నారు సైబర్ నిపుణులు. వారు చెప్పేవిధంగా ‘ఆన్‌లైన్ రమ్మీ ఆడటం, ఒక్క ఆటతో లక్షాధికారి కావడం అసాధ్యం అని గుర్తించండి. మరో డేంజర్ విషయాన్ని ఇక్కడ వీరు మరచిపోతున్నారు.
ఈ ఆటలు ఆడాలంటే బ్యాంకు అకౌంట్, ఇతర వివరాలు ముందే ఇవ్వాల్సి ఉంటుంది. మొదట కొన్ని ఆటలు గెలిచినట్టే అనిపిస్తుంది. అకౌంట్లో అప్పటికప్పుడు డబ్బులు జమవుతుంటాయి. కానీ, ఆ తర్వాత వరుసగా ఓడిపోవడం జరుగుతుంది. పైగా మన అకౌంటు వారి చేతిలో ఉన్నప్పుడు ఏ క్షణమైనా ప్రమాదం పొంచి ఉంటుంది. అసలు ఈ 13ముక్కల వ్యసనం ఆన్ లైన్ లోనే కాదు..బయట కూడా జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. ప్రత్యక్షంగా ఆడే రమ్మీ ఆటలో ఒకరు అవుట్ అయిపోతే మళ్లీ పందెం కాసి ఆటలో కలవచ్చు. అలా ఎవరు కలుస్తారో ఆడేవాళ్లకు తెలుస్తుంది.
కానీ ఆన్‌లైన్ రమ్మీలో ఒకరో ఇద్దరో త్వరగా అవుట్ అయిపోయి మళ్లీ కలుస్తారు. చివరికి ఆలా కలిసిన వారే ఆట గెలుస్తారు. అదే సాఫ్ట్‌వేర్ టెక్నిక్. అది అర్థం చేసుకోలేని అమాయకులు అనివార్యంగా బలైపోతూ ఉంటారు. అలా బలైపోయే వారి వల్లే ఈ ఆన్ లైన్ కంపెనీల ఆటలు సాగుతున్నాయి. ఆడేవాళ్లేమైన నిరక్షరాస్యులా అంటే అదీ లేదు..బాగా చదువుకున్నవాళ్లే ఈ ప్రమాదకరమైన జూదం ఆడుతున్నారు. వీరి మాయలో ఎక్కువగా పడుతున్నారు.
అసలు అటువైపు మనుషులే ఉండరని, కంప్యూటర్లే మనతో ఆడతాయని.. అంతా ఆన్‌లైన్‌లో మాయాజాలంతో బురిడీ కొటిస్తారని సైబర్ నిపుణులు చెబుతుంటే.. అన్నీ తెలిసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు సైతం వీరి మాయలో పడడం విశేషం అని చెప్పుకోవచ్చు. నిజానికి ‘గేమ్ ఆఫ్ స్కిల్స్’ పేరిట ఆన్‌లైన్ రమ్మీకి సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడం జరిగింది.
దాంతో ముంబయి, బెంగళూరు కేంద్రాలుగా ఆన్‌లైన్ రమ్మీ సంస్థలు జోరుగా వ్యాపారాలు చేసుకుంటున్నాయి. సాంకేతికంగా సంక్లిష్టమైన వ్యవహారం కావడంతో మోసాలను పోలీసులు నిరూపించడం కూడా కష్టసాధ్యం అవుతుంది. తెలంగాణతో పాటు కొన్ని రాష్ట్రాలు ఈ రమ్మీ ఆన్‌లైన్ గేమ్‌లను నిషేధించాయి. ఏటా ఈ మాయలో 7వేల 500కోట్లు నష్టపోతున్నారంటే భారత్‌లో ఎంత మంది అమాయకులు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
నిజానికి ఇది కరోనా వల్ల వచ్చిన జాడ్యమేనని చెప్పుకోవాలి. ఆమధ్య లాక్డౌన్ సమయంలో ఇంట్లో సరదాగా ఆన్ లైన్ గేమ్స్ జోరుగా నడిచాయి. ఇంట్లో రోజుల తరబడి ఒంటరిగా జీవించిన వేతన జీవులకు ఇదో తేలికపాటి టైం పాస్ వ్యవహారంగా నడిచింది.
అసలు లాక్‌డౌన్ కాలంలో ఈ ఆన్‌లైన్ రమ్మీ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుని ఆడేవారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇంట్లోనే ఎక్కువగా ఉండడం వల్లో, సామాజిక మాధ్యమాల్లో కనిపించే బోగస్ యాడ్స్ వల్లో ఈ టైమ్‌లో చాలా ఎక్కువగా రమ్మీ యాప్‌లను డౌన్‌లోడ్ చేశారు. డబ్బులు పోగొట్టుకున్నారు.
సాధారణంగా ఆన్‌లైన్ గేమింగ్ 3 రకాలు. ఒకటి – 1990లలో వీడియో పార్లర్లలోని ఆటల్లాగా ఇప్పుడు ఆన్‌లైన్‌లో వ్యవస్థీకృతంగా ఆడే ‘ఇ-స్పోర్ట్స్’. రెండోది – వేర్వేరు జట్లలోని నిజజీవిత ఆటగాళ్ళను ఒక జట్టుగా ఎంచుకొని, పాయింట్ల కోసం ఆన్‌లైన్‌లో ఆడే ‘ఫ్యాంటసీ గేమ్స్’. మూడోది – మానసిక, శారీరక నైపుణ్యంపై, లేదంటే పాచికలాట లాంటి సంభావ్యతపై ఆధారపడ్డ ఆన్‌లైన్ సరదా ఆటలుగా చూస్తారు. సంభావ్యతపై ఆధారపడ్డ ఆటల్ని డబ్బులతో ఆడితే అది జూదం.
ఇదీ స్థూలమైన లెక్క. తాజా ప్రతిపాదనల్లో ‘ఆన్‌లైన్ ఆట’ను నిర్వచించడమే కాక, ఆపరేటర్లు నియమ నిబంధనలన్నీ వాడకందారుకు ముందే చెప్పాలంటూ నిబంధన పెట్టింది ప్రభుత్వం. అయితే సమయం దాటి ఆడుతుంటే, అది ఓ వ్యసనంగా మారకుండా హెచ్చరిక సందేశాలు పంపడం కూడా చేయాల్సి ఉంటుంది. కానీ వాటిని పట్టించుకునే వారు కరువైతే..అది జనానికి నష్టమే కలుగజేస్తుంది.
ఆన్‌లైన్ గేమర్స్ కంపెనీలు ఆటల రూపకల్పనకు ముందు వినియోగదారుల ఆసక్తిని అర్థం చేసుకుని, రమ్మీ వంటి కార్డ్ గేమ్స్‌ను మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నాయి. ఆన్‌లైన్ రమ్మీ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు రమ్మీని వివిధ రకాల బహుమతులతో ఆడే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో ఆడేవారి సంఖ్యను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఆన్‌లైన్ గేమింగ్ ఫెడరేషన్ వివరాల ప్రకారం దేశంలో 20కి పైగా సంస్థలు ఆన్‌లైన్ రమ్మీ యాప్‌లు నిర్వహిస్తున్నాయి. అధికారికి లెక్కల మేరకు 2020 జనవరి నాటికి దేశంలో దాదాపు 30 కోట్ల మంది ఆన్‌లైన్ రమ్మీ ఆడుతున్నారు. రమ్మీ సంస్థలు అధికారికంగా దాదాపు 2వేల 500 కోట్లుగా తమ ఆదాయంగా చూపించారు.