2011లొ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ అదిష్టానాన్ని ధిక్కరించి సొంత కుంపటి పెట్టుకుని పాదయాత్ర పేరుతొ రాష్ట్రంలొ పర్యటిస్తే.. నెల్లూరు జిల్లా నుండి మేకపాటి కుటుంబం జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచింది. ఇదే కారణంతొ నేటికి ఆ కుటుంబం పట్లా జగన్మోహన్ రెడ్డికి అత్యంత అభిమానం.. నాటి ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి అంటె అత్యంత గౌరవమని పార్టీలొ చెప్పుకుంటుంటారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పది నియోజకవర్గాల ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరిపైనా లేని విశ్వాసం, నమ్మకం మేకపాటి కుటుంబం పై ఉందట జగన్మోహన్ రెడ్డికి. మాజీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అకాల మరణం చెందితే కుటుంబ సమేతంగా అంత్యక్రియలకు హౌజరై మీకు నేనున్నాన్న భరోసా కల్పించారట. అయితె ఇప్పుడు మేకపాటి కుటుంబంలొని రాజమోహన్ రెడ్డి సోదరుడు ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అంటె అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారట జగన్మోహన్ రెడ్డి.
ఈ మద్య కాలంలొ ఒక్కొక్కటిగా బయట పడుతున్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వ్యవహారాలు చూసి మేకపాటి కుటుంబం మీద ఉన్న గౌరవం జగన్మోహన్ రెడ్డికి మసకబారుతుందట. ఇటీవల క్రితం నాన్న నేనెవరంటు విడుదలైన కరపత్రం నెల్లూరు జిల్లాలోని మేకపాటి కుటుంబాన్ని కుదిపేసింది. ఒకటి రెండు కాదు.. శాటిలైట్, సోషల్ మీడియా, పత్రికల్లో వారం రోజులుగా వరుస కథనాలు వెలువడటంతొ తనకు ఇధ్దరు భార్యలు, ఇద్దరు ఆడపిల్లలంటూ చంద్రశేఖ రెడ్డి వీడియో రికార్డ్ చేసి విడుదల చేయడంతొ.. మరి నేనెవరినంటు మరో స్త్రీ వీడియో విడుదల చేయడం పెద్ద దుమారం లేపింది.
ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఇంటి పోరు చర్చనీయాంశంగా మారింది. శివ చరణ్ అనే వ్యక్తి ..తాను నీ కొడుకునే అంటూ తెరపైకి రావడం ఇటు జిల్లాలోనూ, అటు రాష్ట్రంలోనూ సంచలనంగా మారింది. గతంలొ నేను ఎవరన్నది ప్రశ్నగా మిగిలి పోకూడదూ, నా పోరాటం నా బిడ్డకు న్యాయంజరగాలనే అంటూ శాంతమ్మ అనే మహిళ వెలుగులోకి వచ్చింది. మేకపాటి చంద్రశేఖరరెడ్డితో 29 సంవత్సరాల అనుబంధం అంటూ వేదికపై ఆమె ప్రశ్నించింది. ఆ సమయంలొ అక్కడే ఉన్నమేకపాటి చంద్రశేఖరరెడ్డి ఆమె మాటలకు ఏమి కామెంట్ చేయకుండా మౌనమే సమాధానం అన్నట్లు వ్యవహరించారు.
ఇప్పుడు శివ చరణ్ అనే వ్యక్తి తానూ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి కుమారుడిని అంటు వెలుగులోకి వచ్చారు. ఈ దెబ్బతో స్పందించిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.. శాంతమ్మ అప్పుడు వేసిన ప్రశ్నకు.. శాంతమ్మ ఎవరోకాదు నా రెండో భార్య అంటూ కుండబద్దలు కొట్టారు. అంతేనా మా యిద్దరికీ పుట్టిన సంతానం సాయి ప్రేమిత రెడ్డి అని ప్రకటించారు. ఇలా ప్రశ్నగా వచ్చిన శాంతమ్మకు, బిడ్డ కోసం ఆమె చేసిన పోరాటానికి సమాధానం దొరికింది. అయితే నాన్న.. నేనెవరిని అంటూ తాజాగా శివ చరణ్ అనే వ్యక్తి ప్రశ్న వేశారు. నాకు ఇద్దరు భార్యలు, ఇద్దరు కుమార్తెలే అంటూ మేకపాటి కుండబద్దలు కొడుతున్నారు. మూడో భార్యగా లక్ష్మీదేవి, కుమారుడిగా శివచరణ్ ప్రశ్నను తిరస్కరించారు.
దీంతో న్యాయపోరాటంతో సమాధానం దక్కించుకుంటానని శివచరణ్ తెగేసి చెబుతున్నారు. అవసరమైతె చంద్రశేఖరెడ్డి తన తండ్రి అని నిరూపించుకునేందుకు డిఎన్ ఏ టెస్టుకు నేను సిద్దమంటు మరో వీడియో విడుదల చేసారు. పిల్లలు ఒకరుంటె ముద్దు ఇద్దరుంటె హద్దు అంటు ప్రసార మాద్యమాల్లో ప్రచారం చేస్తుంటె.. నాకు ఒకరు కాదు ఇద్దరు భార్యలంటు మీడియా ప్రెస్ మీట్లు పెట్టి మరీ తన కెపాసిటీని గొప్పగా చెప్పుకుంటున్నారు ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. చాలదన్నట్టు నా పరిస్థితి ఏంటని మరొకరు తెరమీదకు రావడంతొ చంద్రశేఖర్ రెడ్డి మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. ద్వంద వివాహాలు, మేమెవరమంటు పిల్లలు, మహిళల వ్యవహారం బయటకు రావడంతొ అది కేవలం ఒక్క చంద్రశేఖర్ రెడ్డి మీద మాత్రమే కాదు..
అటు మాజీ ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఇటు ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రంరెడ్డి, నెల్లూరు ఎంపిగా ఉన్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వియ్యంకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డిల పై ప్రత్యేక్షంగాను పరోక్షంగా మరెంతొ మంది కుటుంబ సభ్యుల మీద ప్రభావం చూపుతోందట. ఇప్పటికే కుటుంబ సభ్యులు మేకపాటి వ్యవహారం పై పెదవి విరుస్తున్నారట. ఇప్పటికే ఆర్దిక ఇబ్బందులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని వేధిస్తున్నాయట. మరో ప్రక్క ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. మరో ప్రక్క ప్రదానంగా ఉదయగిరిలొ తాను పెంచిపోషించిన వర్గపోరు మేడమీద కత్తిలా మారిందట. ఇప్పటి వరకు బయటకు రాకుండా చంద్రశెఖర్ రెడ్డి గుట్టుగా చేసుకుంటున్న వ్యవహారం బయటకు రావడంతొ ఒక ఉదయగిరి మాత్రమే కాదు ఇటు ప్రక్కనే ఉన్న అన్న కొడుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు నియోజకవర్గంలొ కూడా ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారట.
పెద్దతనంగా వ్యవహరించే మేకపాటి కుటుంబం వెనకున్న వాస్తవ రూపం ఇదా అంటు ముక్కున వేలేసుకుంటున్నారట. చంద్రశేఖర్ రెడ్డి వ్యవహార శైలితొ కుటుంబంలొ ఇప్పటికే ఉన్న కలహాలు కట్టలు తెంచుకుంటున్నాయట. ఇటు సొంత పార్టీలోని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వ్యతిరేక వర్గీయులు మాత్రం చంద్రశేఖ రెడ్డి తవ్వుకున్న గుంటలొ చంద్రశేఖర్ రెడ్డి పడ్డారంటూ దుయ్యబడుతున్నారు. మొన్నటి వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ.. వైసీపీ అధినేత సీఎం జగన్ మోహన్ రెడ్డి .. మంత్రులు.. ఇతర నేతలు సైతం పవన్ మూడుపెళ్లిళ్లపై నిత్యం కామెంట్లు చేసేవారు.. కానీ ఇప్పుడు అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి చుట్టూ మూడు పెళ్లిళ్ల వివాదం ముసురుకుంది.
అదే సమయంలో ఆయనకు పార్టీలోనూ వ్యతిరేకత పెరుగుతుండడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి చంద్రశేఖర్ రెడ్డికి జనాల్లో మంచి పేరుంది, అయితే ఇటీవల ఆయనకు, తన సొదరుడైన మేకపాటి రాజమోహన్ రెడ్డికి దూరంగా ఉంటున్నారు. దీనికి కారణం చంద్రశేఖర్ రెడ్డి సన్నిహితురాలు అనే ప్రచారం నియోజకవర్గంలో జోరుగా ఉంది. ఆయన తరపున అంతా ఆమే వ్యవహారాలు చక్కబెడుతోందని, పార్టీని ఆమె తన చెప్పుచేతల్లోకి తీసుకుందని అపవాదు ఉంది. దీంతో చాలామంది నాయకులు చంద్రశేఖర్ రెడ్డికి దూరమయ్యారు.
గౌతమ్ రెడ్డి మరణం తర్వాత మేకపాటి రాజమోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి మధ్య విభేదాలు మరింత పెరిగాయే కానీ తగ్గలేదు. కనీసం విక్రమ్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి కూడా చంద్రశేఖర్ రెడ్డి రాలేదు. ఇటీవల పలు మీటింగులలో విక్రమ్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి పక్కపక్కనే కూర్చున్నా పలకరించుకోవడంలేదు. దీంతో మేకపాటి రాజమోహన్ రెడ్డిని అభిమానించేవారంతా చంద్రశేఖర్ రెడ్డికి దూరమయ్యారు. దీంతో 2024లో చంద్రశేఖర్ రెడ్డికి ఉదయగిరి సీటు ఇవ్వరనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. మరోవైపు ప్రస్తుత ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి 2024లో ఉదయగిరినుంచి వైసీపీ తరపున బరిలో దిగుతారనే ప్రచారం కూడా ఉంది. దీంతో చంద్రశేఖర్ రెడ్డి సీటుపై పీటముడి పడుతోంది. మొత్తమ్మీద నెల్లూరు రాజకీయాలు మాత్రం ప్రస్తుతం హాట్ హాట్ గా సాగుతున్నాయి. ముఖ్యంగా ఉదయగరి సీటు గురించి విపరీతమైన చర్చ నడుస్తోంది.