మయన్మార్ అంటే చాలు సైన్యాధికారులు నియంతలుగా మారడం సొంత ప్రజలను అష్ట కష్టాలలోకి నెట్టడం గుర్తుకు వస్తుంది. లక్షలాది మంది రోహింగ్యాలను దేశం బయటకు తరిమేయడం, వీధుల్లో రక్తాలు ఏరులై పారడం, ఆంగ్ సాన్ సూక్యీని పర్మనెంటుగా జైలు పాల్జేయడం గుర్తుకు వస్తుంది. జుంటాలని పిలవబడే ఈ అధికారులు ఇప్పుడు కొత్తగా ఆయుధాలు తయారుచేసే పనిలో పడ్డారు..ఇంతకీ వీరికి ఆయుధాలతో పనేమిటన్నది అంతర్జాతీయంగా చర్చకు దారి తీసింది..
మయన్మార్ ఇప్పుడు భారీగా ఆయుధాలు తయారు చేస్తోంది. ఈవిషయం చెప్పింది మరెవరో కాదు..ఐక్యరాజ్యసమితి స్వయంగా ప్రకటించింది. యూఎన్ విడుదల చేసిన ఈ నివేదికలో పలు షాకింగ్ విషయాలు వెలుగు చూసాయి. మయన్మార్‌లో ఆయుధాల తయారీ పట్ల యూఎన్ ఆందోళన చెందుతోంది. చైనా, భారత్,అమెరికా, జపాన్ సహా 13 కంపెనీలు ఇందుకు సాయపడుతున్నాయని యూఎన్ నివేదిక బాంబు పేల్చింది. నిజానికి మయన్మార్ సైన్యం ప్రస్తుతం ఎలాంటి యుద్ధంచేయడం లేదు. ఏ దేశం నుంచి యుధ్ద బయం అస్సలే లేదు. పైగా సైన్యం వల్లనే ఆ దేశ ప్రజలకు భయం ఉంది. సైన్యం మాటే అక్కడ నడుస్తోంది. అలాంటప్పుడు సైన్యానికి కొత్తగా ఆయుధాల అవసరం దేనికన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
నిజంగానే మయన్మార్ లో పెద్ద ఎత్తున ఆయుధాలు తయారవుతున్నాయి. ఈ విషయాలను ఐక్యరాజ్య సమితి నివేదిక ఒకటి వెల్లడించింది. ప్రజాస్వామ్య అనుకూల మయన్మార్ తన దేశవాసులను చంపేందుకు ఆయుధాల నిల్వలను వేగంగా పెంచుకుంటున్నదని ఆ నివేదికలో పేర్కొన్నది. ఈ నివేదికను సోమవారం యూఎన్ విడుదల చేసింది. మయన్మార్‌పై ప్రస్తుతం పలు దేశాల ఆంక్షలు ఉన్నాయి. ఆయుధాలను కొనుగోలు చేసుకునే వీలు లేకుండా పోవడంతో తయారీపై ఆ దేశం దృష్టి సారించింది. ఆయుధాల తయారీ పనిలో భారత్, అమెరికా, జపాన్ సహా 13 దేశాలకు చెందిన కంపెనీలు మయన్మార్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. మయన్మార్‌కు ఆయుధాలు విక్రయించకుండా చాలా ఏండ్లుగా ఆంక్షలు అమలులో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో కొత్త ఆయుధాలను ఆ దేశం కొనుగోలు చేయలేదు. దాంతో ఆయుధాల తయారీకి పూనుకున్నట్లు తెలుస్తున్నది. ముందే చెప్పినట్టుగా ప్రస్తుతం మయన్మార్‌పై మరో దేశం దాడి చేయడం లేదని, ఇదే సమయంలో మయన్మార్ సైన్యం కూడా ఏ దేశంపై దాడికెళ్లడం లేదని.. అయినా అక్కడ ఆయుధాలను వేగంగా తయారు చేస్తున్నారని ఐక్యరాజ్య సమితి మాజీ మానవ హక్కుల అధికారి యెంగీ లి తెలిపారు. లీకైన సైనిక పత్రాలు, మాజీ సైనికుల ఇంటర్వ్యూలలో ఈ విషయాలన్నీ వెల్లడయ్యాయి. యూఎన్ నివేదిక ప్రకారం, ఓ ఆస్ట్రియా కంపెనీ నుంచి ఆయుధాల తయారీలో మయన్మార్ కు అత్యధికంగా సాయం అందుతోంది. దీనిపై వివరణ కోరగా ఆస్ట్రియన్ కంపెనీ నిరాకరించింది.
![](https://inewslive.net/wp-content/uploads/2023/01/An-UN-report-says-Myanmar-p-1024x576.jpg)
చైనా, సింగపూర్ నుంచి ఆయుధాల తయారీకి ముడిపదార్థాలు వస్తున్నాయి. రా మెటీరియల్ కొనుగోలు చేసేందుకు ఆ దేశాలకు మయన్మార్ సైన్యం డాలర్లలో చెల్లిస్తోంది. అంతే కాదు భారత్, రష్యా దేశాలకు చెందిన కంపెనీలు కూడా ఇందులో భాగం పంచుకుంటున్నాయి. ఈ రెండు దేశాల నుంచి ప్యూజులు, ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు అందుతున్నాయి. ఇక ప్రపంచానికి సుద్దులు చెప్పే అమెరికా, జర్మనీ, జపాన్, కూడా యంత్రాల సరఫరా చేస్తున్నాయి. రష్యాతో యుద్దంలో శిధిలావస్థకు చేరుకున్న ఉక్రెయిన్ నుంచి కూడా మయన్మార్ కు యంత్రాలు వస్తున్నాయి. ఇలా పలు కంపెనీలు మయన్మార్‌కు సాయం చేయడం కోసం తన వంతు భాధ్యతగా సింగపూర్ ఏజెంట్లు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు.
తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా మయన్మార్ చేస్తున్న అక్రుత్యాలకు ఈ దేశాలు పరోక్షంగా మద్దతిస్తున్నట్టుగా అనుకోవచ్చని అంటున్నారు విశ్లేషకులు. నిజానికి ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే మయన్మార్ దేశం అనేక అక్రుత్యాలకు నిలయంగా మారింది. సైన్యం అరాచకాలకు అంతే లేదు. అటువంటిది ఇప్పుడున్న పాత ఆయుధాలకు తోడు కొత్త ఆయుధాలు వచ్చిచేరితే పరిస్థితి మరింత దారుణంగా మారే అవకావం ఉంది. ఇప్పటికే అక్కడి రాజకీయనేతలందరూ వేల సంఖ్యలో జైళ్లలో మగ్గుతున్నారు. జుంటా చెప్పిందే వేదంగా మయన్మార్ ప్రజలు నడచుకుంటున్నారు. లేదంటే ప్రాణాలు పోతాయి లేదా దేశం వీడి వలసలు పోవాల్సి ఉంటుంది. ఈ పరిస్థితులు మారాలని అంటున్నారు అక్కడి ప్రజలు..