సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థంకాదు. ఒక్కోసారీ పెద్ద హీరోల, డైరెక్టర్ ల భారీ బడ్జెట్ సినిమాలు పరాజయ పాలవుతాయి. అప్పుడప్పుడు చిన్న సినిమాలు కూడా ఓ రేంజిలో భారీ విజయాలు సాధిస్తాయి. అసలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఎవ్వరికి తెలీకుండా వచ్చి మరీ భారీ హిట్స్ కొడతాయి. వాటికి పబ్లిసిటీ పెద్దగా ఉండదు. బడ్జెట్ కూడా చాలా తక్కువ. ఇక హీరో, హీరోయిన్ ల విషయంలో కూడా అంతే. ఇలాంటి అద్బుతాలు అన్ని పరిశ్రమలలో జరుగుతుంది. అలాంటి సంచలన విజయం సాధించిన చిత్రాల్లో లవ్ టుడే ఒకటి.
చిన్న సినిమాగా విడుదలైన ఈ కోలీవుడ్ మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ మంచి విజయాన్ని సాధించింది. ఈ మూవీతో దర్శక నటుడు ప్రదీప్ రంగనాథన్ కి మంచి పాపులారిటీ వచ్చింది. నటుడిగా, దర్శకుడిగా ప్రతిభ చాటుతూ.. ఇతర యువ దర్శకులతో పోటీపడుతూ తన ప్రతిభ నిరూపించుకుంటున్నారు. ఆ కోవలోనే ఆయన వరుసగా రెండు హిట్ చిత్రాలు అందించారు. ఈ రెండూ కూడా థియేటర్‌లలో వంద రోజులు పూర్తి చేసుకోవడం గమనార్హం. ప్రదీప్ రంగనాథన్, ఇవానా జంటగా రాధికా, యోగిబాబు ఇంకా అలాగే సత్యరాజ్ ముఖ్య పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది. హీరోగా నటించిన ప్రదీప్ ఈ సినిమాని దర్శకుడిగా కూడా తానే తెరకెక్కించాడు.కేవలం 5 కోట్ల చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన లవ్ టుడే సినిమా మొదట తమిళ్ లో విడుదలయ్యి భారీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ప్రేమించిన అమ్మాయి, అబ్బాయి పెళ్ళి చేసుకోవాలంటే ఒకరి ఫోన్ ఒకరు మార్చుకొని వాడాలి అనే ఓ కొత్త ట్రెండీ కాన్సెప్ట్ తో కామెడీ, ఎమోషన్స్ తో ప్రేక్షకులని ఈ సినిమా ఎంతగానో మెప్పించింది.
ఇక తాజాగా లవ్ టుడే సినిమా ఏకంగా 100 రోజులు పూర్తి చేసుకుంది. 100 రోజులకు కూడా లవ్ టుడే సినిమా తమిళనాడులోని కొన్ని సెంటర్స్ లో ఇంకా విజయవంతంగా ఆడుతుండటం విశేషం. ఈ సినిమాతో దర్శకుడిగా ప్రదీప్ కి చాలా అవకాశాలు వస్తున్నాయి. ఇక హీరోయిన్ ఇవానాకు కూడా వరుసగా ఎన్నో అవకాశాలు వస్తున్నాయి. మొత్తానికి చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టి ఏకంగా 100 రోజుల సెలబ్రేషన్స్ చేసుకుంది లవ్ టుడే.
ఈ చిత్ర శత దినోత్సవ వేడుకలను మంగళవారం రాత్రి చెన్నై చెట్‌పెట్‌లోని లేడీ ఆండాళ్ స్కూల్‌లో ఘనంగా నిర్వహించారు. దీనికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేదికపై చిత్ర దర్శక, కథానాయకుడు ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ.. లవ్ టుడే చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు వసూలు సాధించిందన్నారు. తాను కథానాయకుడిగా నటించిన ఈ సినిమా చతికిలబడితే మళ్లీ పైకి లేవడం కష్టం అని చాలా మంది ఎగతాళి చేశారన్నారు. మరికొందరేమో ఇది ఒక కొండలాంటిదని అన్నారన్నారు. అయితే తాను ఆలోచించింది ఏమిటంటే కొండ ఎక్కడం కష్టమా? అందుకు ఏం చేయాలి? తగిన పరికరాలు, శిక్షణ, శారీరక బలం, ఆక్సిజన్ వంటివి ఉండాలి కదా. అసలు ఎక్కడానికి ఆ కొండ కావాలి కదా.. అదే లవ్ టుడే చిత్రం అన్నారు. తనపై నమ్మకంతో అవకాశాన్ని కల్పించిన చిత్ర నిర్మాతలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని తెలిపారు.