Homeఅంతర్జాతీయంప్రస్తుతం ఉన్న పరిస్తితులను బట్టి చూస్తే జపాన్ ఓ డయింగ్ కంట్రీ..

ప్రస్తుతం ఉన్న పరిస్తితులను బట్టి చూస్తే జపాన్ ఓ డయింగ్ కంట్రీ..

ప్రస్తుతం ఉన్న పరిస్తితులను బట్టి చూస్తే జపాన్ ఓ డయింగ్ కంట్రీ అంటుంటారు నిపుణులు.. ఎందుకంటే అక్కడ వ్రుద్దుల జనాభా నానాటికీ పెరిగిపోతోంది. కుటుంబ నియంత్రణ చాలా ఎక్కువ స్థాయిలో జరుగుతోంది. అయితే మరో విషయం..జపాన్‌లో తెలివైన, విద్యావంతులైన మహిళలకు కొదవ లేదు. ప్రస్తుతం కరోనా కారణంగా కుంటుపడిన వారి ఆర్థికవ్యవస్థను మళ్లీ అభివృద్ధి పథంవైపు నడిపించేందుకు వీరి పాత్ర ఎంతో ఉంది. అయితే జపాన్ పురుషాధిక్య దేశం. పురుషుల పోకడల కారణంగా మహిళలు తమ సామర్థ్యానికి తగిన ఉద్యోగాలు పొందేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నియామకాల్లో ఉన్న కఠినమైన నిబంధనలు, నాయకత్వ స్థానాల్లో పురుషులే ఎక్కువగా ఉండడం మొదలైనవన్నీ మహిళలకు అడ్డంకులుగా మారుతున్నాయి. బాగా చదువుకుని, యూనివర్సిటీల్లో డిగ్రీలు సంపాదించినా చాలా మంది మహిళలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు.

ఇలా ఐడిల్ గా ఉన్న మహిళల సంఖ్య నానాటికీ పెరగడం దేశానికేమంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే దివంగత నేత షింజో అబే ప్రధానిగా ఉన్న కాలంలో 2020 నాటికల్లా కార్యాలయాల్లో, సంస్థల్లో నాయకత్వ స్థానాల్లో మహిళల సంఖ్య పెంచాలని తీవ్రంగా ప్రయత్నించారు. జపాన్..ఓ వెలుగులు విరజిమ్మే మహిళలుండే దేశం” అంటూ ఆ దేశ మాజీ ప్రధాని షింజో అబే అప్పట్లో అనేవారు. ఆయన చాలా గొప్పగా ఆర్భాటంగా ప్రారంభించిన ‘వుమెనామిక్స్’ అనే వినూత్న పథకం విఫలమైంది. అయితే, అది కోవిడ్ 19 వల్ల మాత్రమే అనుకుంటే పొరపాటే.నేడు, జపాన్ పార్లమెంటులో ప్రతి 10 మంది పురుషులకు కేవలం ఒక మహిళ మాత్రమే ఉన్నారు. ప్రైవేటు సెక్టార్‌లో ఉన్నత స్థానాల్లో 15 శాతం కన్నా తక్కువ మంది మహిళలు మాత్రమే ఉన్నారు. ఇది 2020 లక్ష్యాలలో సగం మాత్రమే. అయితే గతంలో కన్నా ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్న మహిళల సంఖ్య కాస్త పెరిగింది.

అది నిజమే కానీ ఉన్నత విద్యావంతులైన ఈ మహిళలు చేస్తున్న ఉద్యోగాలేమిటి?

వారి చదువులకు, స్థాయిలకు తగ్గ ఉద్యోగాలే చేస్తున్నారా? అంటే కాస్త అనుమానంగా ఉంటుంది. మాజీ ప్రధాని షింజో అబే ప్రవేశపెట్టిన పథకం.. సాంఘిక సంస్కరణలకు దోహదపడదని విమర్శకులు అభిప్రాయంగా ఉండేది. పని స్థలాల్లో మహిళల వికాసానికి తోడ్పడే విధంగా దానిని రూపొందించలేదనే వాదన ఉంది. కేవలం ఉద్యోగస్తుల సంఖ్య పెంచడానికి మాత్రమే వుమెనామిక్స్ ఉపయోగపడిందనే అభిప్రాయం ఉంది. జపాన్‌లో 1990ల నుంచి పని చేసే జనాభా వనరులు వేగంగా తగ్గిపోతున్నాయి.

అబే ప్రవేశపెట్టిన ‘వుమెనామిక్స్ పథకం’ ద్వారా ఉద్యోగాలు భర్తీ అయ్యాయే తప్ప మహిళల సామర్థ్యాలకు, నైపుణ్యాలకు తగిన ఉద్యోగాలు లభించలేదు. గత కొన్ని దశాబ్దాలుగా పరిశీలిస్తే, జపాన్‌లో సుమారు 60 శాతం మంది మహిళలు తమకు మొదటి బిడ్డ పుట్టగానే ఉద్యోగం మానేసి పూర్తి స్థాయి గృహిణులుగా మారిపోవడం జరిగింది. భర్త సంపాదన కుటుంబ పోషణకు సరిపోవడం, భార్య పూర్తిగా పిల్లల పెంపకంపై దృష్టి పెట్టగలగడాన్ని అక్కడ గొప్ప అద్రుష్టంగా భావిస్తారు. కానీ, వుమెనామిక్స్ పథకం ప్రవేశపెట్టినప్పటికే, చాలామంది మహిళలు ఉద్యోగాలకు వెళ్లడం ప్రారంభించారు. అప్పటికే కుటుంబ పోషణ భారంగా మారుతున్న పరిస్థితులు ఉండడంతో చదువుకున్న గృహిణులు మళ్లీ ఉద్యోగాల బాట పట్టారు.

ఫలితంగా, 2019లో కేవలం 42.1 శాతం మహిళలు మాత్రమే ఉద్యోగాలు విడిచిపెట్టారు. దాంతో, లేబర్ మార్కెట్‌లో 15 నుంచి 64 వయసు మధ్యగల మహిళా ఉద్యోగుల సంఖ్య 70.9 శాతానికి పెరిగింది. 25 నుంచి 44 సంవత్సరాల కేటగిరీ 77.7 శాతానికి పెరిగిందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ మార్పుకు మద్దతుగా పిల్లల డే కేర్‌లలో వెయిటింగ్ లిస్ట్ ఉండకూడదంటూ జపాన్ ప్రభుత్వం ఆదేశించింది.

అలాగే, పెద్ద పెద్ద కంపెనీల్లో కనీసం ఒక మహిళా ఎగ్జిక్యూటివ్ అయినా ఉండాలనే ఒత్తిడి తీసుకొచ్చింది.

కానీ, ఆ దిశలో చర్యలు తీసుకునేందుకు కంపెనీలకు ఎలాంటి ప్రోత్సాహకాలను గానీ, విఫలమైతే జరిమానాలు గానీ ప్రకటించలేదు. ఫలితంగా, అనేకమంది మహిళలు ఎదుగుబొదుగు లేని ఉద్యోగాలతో, లేదా పార్ట్ టైం ఉద్యోగాలతో సర్దుకోవాల్సి వచ్చింది. సగటున, ఒక జపాన్ మహిళ ఆదాయం, పురుషుడి కంటే 40 శాతం కన్నా తక్కువగా ఉంటోందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెబుతోంది. అయితే పెళ్లి, పిల్లలు తర్వాత మళ్లీ కెరీర్ ప్రారంభించడం జపాన్ మహిళలకు గగనంగా మారింది. ఎందుకంటే మళ్లీ కెరీర్ ప్రారంభించడం అంత సులువైన విషయం కాదు..సగం కన్నా ఎక్కువమంది జపనీస్ మహిళలు కనీసం డిగ్రీ పూర్తి చేసిన తరువాతే ఉద్యోగంలో చేరతారు. ఉద్యోగాల్లో చేరే పురుషుల విద్యార్హతతో ఇది దాదాపు సమానమని అంటున్నారు విశ్లేషకులు.

కానీ, ఒకసారి ఉద్యోగం మానేసి, కొన్నేళ్ల తరువాత మళ్లీ చేరాలనుకుంటే మునుపటి ఉద్యోగాలు రావడం కష్టమే, అలాంటి స్థానాలు, పదవులు దొరకటమూ కష్టమే. మళ్లీ ఉద్యోగం చేయాలంటే ఏదైనా సూపర్‌మార్కెట్లో పనిలోకి చేరడమొక్కటే అవకాశంగా మారింది. సాధారణంగా విద్యార్థి దశలో చదువుకునే రోజుల్లో ఇలాంటి పార్ట్-టైం జాబులు చేస్తుంటారు. పెళ్లి అవగానే పిల్లలు పుట్టగానే మహిళలు ఇంటిలోనే ఉండిపోతారు. ఈమధ్యకాలంలో ఇలాంటి పరిస్థితి వస్తే పిల్లల్ని కన్న తరువాత కూడా మహిళా ఉద్యోగులు తక్కువ గంటలు లేదా సౌకర్యవంతమైన పని వేళలను ఎంచుకునే అవకాశాన్ని కొన్ని సంస్థలు కల్పిస్తున్నాయి. కానీ 2006లో ప్రముఖ కార్ల తయారీ సంస్త సుజుకీ ఈ పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు అలాంటి అవకాశాలేవీ లేవు. ఉద్యోగం వదిలిపెట్టడం ఒక్కటే మార్గం. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత దేశ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడానికి జపాన్‌లో జీవితకాల ఉపాధి వ్యవస్థను ప్రవేశపెట్టారు.

పెద్ద పెద్ద కంపెనీలన్నీ ప్రతీ సంవత్సరం కొత్త గ్రాడ్యుయేట్లను నియమించుకుంటూ వారికి జీవితకాల ఉద్యోగ పథకాన్ని అందిస్తున్నాయి.

ఒకవేళ, ఈ అవకాశం కోల్పోతే, మళ్లీ ఏడాది మరొక ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకోవడం చాలా కష్టం అయిపోతుంది. కెరీర్‌లో ఖాళీ కనిపిస్తే ఈ కంపెనీలకు రుచించదు. ఇక్కడంతా సీనియారిటీ ప్రధానంగా నడుస్తుంది. వయసు పెరుగుతున్నకొద్దీ సంస్థల్లో పదవులు పెరుగుతాయి. సామర్థ్యం ఉన్నా లేకపోయినా అనుభవం ఉంటే చాలు ముందుకెళ్లొచ్చు. “దేశంలో ప్రతిభకు ఎంతగానో కొరత ఉంది. కారణం, జపాన్ లో అనుభవానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. సమీప భవిష్యత్తులో ఉద్యోగ నియామకాల ప్రక్రియలో మార్పులు వచ్చే అవకాశాలున్నాయని జపాన్ మహిళలు భావిస్తున్నారు. ఇప్పుడు యువత చాలా చురుకుగా ఆలోచిస్తున్నారు. ముప్పై ఏళ్ల వరకూ మేనేజర్ పదవి ఇవ్వని కంపెనీల్లో ఉద్యోగాలను వదలేస్తున్నారు. అనుభవం ప్రాధన్యంగా కాకుండా ప్రతిభకు అద్దం పట్టే సంస్థల కోసం వారు చూస్తున్నారు. కొత్త సంస్థలన్నీ ఉద్యోగులలో ప్రతిభను వెలికితీసే ప్రయత్నాలు చేస్తున్నాయి.

మహిళల్లోనే కాకుండా, వయసు మీరినవారిలో కూడా ప్రతిభ ఉంటే ఉద్యోగాలు ఇస్తున్నాయి. నిజానికి 50, 60 ఏళ్ల వయసులో ఉన్న పురుషుల నైపుణ్యాలను పెంచడానికి ప్రభుత్వం చాలా ఖర్చు పెడుతూ ఉంటుంది. అంతే డబ్బును మహిళల మీద కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇన్నాళ్లూ గృహిణిలుగా ఉండిపోయినవారికి, తిరిగి ఉద్యోగాలు చేయాలనుకుంటున్న వారికి ప్రభుత్వం నుంచి సహాయం అందాలి. వుమెనామిక్స్ అంటే దేశం మొత్తం ఆర్థికంగా ఎదగడం. అది చాలామందికి అర్థం కావడం లేదు. ఇదేదో మహిళా హక్కులు, సమానత్వం అని మాత్రమే అనుకుంటున్నారు. జపనీస్ సంస్థలు ఇప్పటివరకు తమ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగుల సంఖ్యను పెంచే దిశగా బహిరంగ ప్రకటనలు చేయడానికి ఇష్టపడటం లేదు. అయితే, చురుకుగా పనిచేసే బహుళజాతి సంస్థల నుంచి మార్పు మొదలయ్యే అవకాశం ఉంది. సాధారణంగా ఈ సంస్థలు స్త్రీ పురుష సమానత్వం, వారి వేతనాలలో సమానత్వం వంటి విషయాలకు కట్టుబడి ఉంటాయని నిపుణులు అంటున్నారు.

Must Read

spot_img