Homeఆంధ్ర ప్రదేశ్టీడీపీ భావి నాయకుడిగా నిలిచిన లోకేష్ ...తన స్థాయి పెంచుకుంటున్నారా..?

టీడీపీ భావి నాయకుడిగా నిలిచిన లోకేష్ …తన స్థాయి పెంచుకుంటున్నారా..?

తెలుగుదేశం పార్టీలో లోకేష్ స్థాయి పెరిగింది.. ఇది ఎవరో రాజకీయ ప్రత్యర్థులో, విశ్లేషకులో అన్నమాట కాదు. సాక్షాత్ ఆ పార్టీ నాయకులే ఒప్పుకుంటున్నారు. లోకేష్ ను సొంత పార్టీ నాయకులే తక్కువ చేసిన సందర్భాలున్నాయి. ఆయనపై నమ్మకం కంటే అప నమ్మకం వ్యక్తం చేసిన వారే అధికం. అంతర్గత సమావేశాల్లో అయితే అధినేత కుమారుడు అని చూడకుండా లోకేష్ పై సటైర్లు పడుతుండేవి. పార్టీలో సీనియర్లు సైతం లోకేష్ ను దృష్టిలో పెట్టుకొని అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. పార్టీ మెజార్టీ శ్రేణులు, చంద్రబాబును అభిమానించే వారు సైతం లోకేష్ విషయానికి వచ్చేసరికి ఒక నిర్లిప్తత, నిరాసక్తత, అసహనం ప్రదర్శించారు.

లోకేష్ పనితీరు భేరీజు వేసుకునే జూనియర్ ఎన్టీఆర్ పేరును ప్రస్తావించే వారు. చివరకు చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో సైతం జూనియర్ ను తేవాలని పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్లు లోకేష్ తో వర్కవుట్ అయ్యేలా లేదు జూనియర్ ఎన్టీఆర్ ను పిలిపించాలని అధినేతకు అల్టిమేటం ఇచ్చే స్థాయికి వచ్చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్న అయితే మరో ముందడుగు వేసి పార్టీ లేదు బొక్కా లేదు అంటూ లోకేష్ పనితీరును తేలిగ్గా మాట్లాడేసినట్టు కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

తిరుపతిలో ఓ హోటల్ లో అంతర్గత సమావేశంలో మాట్లాడిన అచ్చెన్న ఆయన బాగుంటే అంటూ తెలుగుదేశం పార్టీ భవిష్యత్ పై చేసిన కామెంట్స్ ప్రత్యర్థులకు వరంగా మారాయి. చివరకు తాను ఆ మాటలు అనలేదని అచ్చెన్నాయుడు వివరణ ఇచ్చుకునే దాకా పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడుయువగళం పేరిట లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టేసరికి టీడీపీ సీనియర్లు ఆయనపై అపార నమ్మకం పెట్టుకున్నారు. మంచి భవిష్యత్ ఉన్న నాయకుడిగా కీర్తించడం మొదలుపెట్టారు.

చంద్రబాబు కంటే మెరుగైన నాయకుడిగా పేర్కొనడం విశేషం. అచ్చెన్నాయుడు అయితే ఓ రేంజ్ లో లోకేష్ ను ఆకాశానికి ఎత్తేశారు. మంత్రిగా మంచి ఫెర్మారెన్స్ చూపారని, రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి రాలేదని..తనకున్న తెలివితేలతో వచ్చారని కీర్తించారు. చంద్రబాబు లాంటి మెతక వైఖరి లోకేష్ ది కాదని.. అధికారంలోకి వస్తే ఇంతకింత బదులు ఉంటుందని వైసీపీ నేతలకు హెచ్చరించారు. భావి నాయకుడు లోకేషే అన్నంత రీతిలో అచ్చెన్నచూపించేసరికి సొంత పార్టీ శ్రేణుల్లో సైతం ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. నాడు పార్టీ లేదు బొక్కా లేదు అన్న నోటితోనే లోకేష్ ను కీర్తిస్తుండడంతో యువ నాయకుడిపై అప నమ్మకం అన్న అపవాదు పోయి నమ్మకం అనే మాట వస్తోందని టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

అయితే దీనిపై రాజకీయ ప్రత్యర్థులు, ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా విభాగం చాలా వేగంగా స్పందించింది. నాడు తిరుపతి హోటల్ లో అచ్చెన్న చేసిన కామెంట్స్.. నిన్న యువగళంలో చేసిన ప్రసంగాన్ని చూపి రెండేళ్లకే లోకేష్ లో అచ్చెన్నకు ఏం మార్పు కనిపించిందబ్బా అంటూ ప్రశ్నలు వేయడం ప్రారంభించారు. అప్పటికీ.. ఇప్పటికీ ఏంటి తేడా అన్న సినిమా డైలాగులు గుర్తుచేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇవి తెగ ట్రోల్ అవుతున్నాయి. నెటిజెన్లు కూడా చాలా రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.

మరోవైపు టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర కుప్పం నుంచి ప్రారంభమైంది. తొలిరోజు 8.5 కిలోమీటర్ల పాటు నడిచారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు వెంటరాగా తొలిరోజు పాదయాత్ర పూర్తిచేశారు. అయితే లోకేష్ రాజకీయ విమర్శలు కంటే రాష్ట్రంలో నెలకొన్న ప్రధాన సమస్యలనే టార్గెట్ చేశారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు బహిరంగ సభలో ప్రజలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. తాను చేస్తున్న యాత్ర తన కోసం కాదని.. ప్రజల కోసమేనని చెప్పే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలోని సమస్యలను ప్రస్తావిస్తూ అందులోనూ తన మార్కును చూపించగలిగారు.

మంత్రులకు కౌంటర్లు ఇచ్చారు. ఎక్కడా గందరగోళానికి తావులేకుండా.. తత్తరపాటుకు గురికాకుండా లోకేష్ ప్రసంగం సాగింది. తాను యువత భవిత కోసమే పాదయాత్ర చేస్తున్నానని.. అందుకే యువత కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టో విడుదల చేస్తామని ప్రకటించారు. తనకు చీర, గాజులు పంపిస్తానని ఒక డైమండ్ అన్నారని.. వాటిని మా అక్క చెల్లెళ్లకు ఇచ్చి వారి కాళ్లు మొక్కుతానని దీటైన కౌంటర్ ఇచ్చారు. జే ట్యాక్స్‌ ఫుల్లు.. పెట్టుబడులు నిల్లు. పరిశ్రమలన్నీ బై.. బై.. ఏపీ అంటూ వెళ్లిపోతున్నాయంటూ లోకేష్ కొత్త స్లోగన్ ఇచ్చారు. మొత్తానికైతే లోకేష్ తొలిరోజు యాత్ర సజావుగా సాగిపోయింది. ఆయన స్పీచ్ ద్వారా యువతే టార్గెట్ అన్నది తేలిపోయింది.

ప్రజా సమస్యలను తెలుసుకోవడం కోసం సుధీర్ఘపాదయాత్రను తలపెట్టిన టిడిపి ప్రధానకార్యదర్శి నారా లోకేష్‌ అందుకు అనుగుణంగానే అడుగులు వేస్తున్నారు. పాదయాత్రలో ప్రతి ఒక్కరినీ ఆయన పలకరిస్తూ వారి సమస్యలను వింటూ, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాటిని పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నారు. వ్యక్తిగత సమస్యలతో కలిసేవారితో కూడా ఆయన మాట్లాడుతూ భరోసా ఇస్తున్నారు. ఈ సందర్భంలో సెక్యూరిటీని పక్కకు పెట్టి ప్రతి ఒక్కరి దగ్గరకు వెళుతూ వారిని ఆప్యాయంగా పలకరిస్తున్నారు. కొన్నిచోట్ల ప్రజలు పొలాల్లో ఉంటే నేరుగా వారి వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుంటూ, అదే సమయంలో వారిని చైతన్యం చేస్తున్నారు.

వివిధ వర్గాల సమస్యలపై తన వైఖరిని వెల్లడిస్తున్నారు. అధికారంలోకి వస్తే తమపార్టీ ఏమి చేస్తుందో వారికి వివరిస్తున్నారు. ఆయనను చూడడానికి వచ్చిన మహిళలను పేరు పేరునా పలకరిస్తూ, అక్కా అంటూ వారితో కలిసిపోతున్నారు. పక్కఇంటి కుర్రాడిలా వారిలో కలిసిపోతున్నారు. అక్కా, అమ్మా, పిన్నీ, పెద్దమ్మా అంటూ వారిని వరసలు పెట్టి పలకరిస్తున్నారు. తొలి రోజు కన్నా మలిరోజు ఆయన ప్రజలతో మమేకం కావడానికి, తాను వారిలో ఒక్కడిని అని చెప్పడానికి ప్రయత్నం చేశారు.

తన తల్లిని అవమానించిన వారిని వదిలేది లేదని, మహిళలకు తాము ఎంత గౌరవాన్ని ఇస్తామో..వారిని ఎలా కాపాడుకుంటామో చెప్పడానికి ఆయన ప్రయత్నాలు చేశారు. మొత్తం మీద ఆయన ప్రజల్లో కలవడానికి, వారితో మాట్లాడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్నది .. లోకేష్ ఇమేజ్ ను మార్చుతోందని విశ్లేషకులు అంటున్నారు. టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర ఎలా సాగుతుందన్న విషయంపై ప్రజల్లోనే కాదు.. టీడీపీ శ్రేణుల్లోనూ ఉన్న అనుమానాలు పటాపంచులు అవుతున్నాయి. ఎన్టీఆర్ మనవడు.. చంద్రబాబు కుమారుడు.. . స్టాన్ ఫర్డ్ చదువులు ఉన్న యువకుడు… సాధారణ ప్రజలతో మమేకం కాగలడా అన్నది ఎక్కువ మందికి ఉన్న సందేహం.

ఎందుకంటే ఆయన పెరిగిన కంఫర్ట్ జోన్ అలాంటిది. కానీ లోకేష్ మాత్రం తొలి రోజే ఈ అనుమానాలను పటాపంచలు చేసే ప్రయత్నం చేశారు. రెండో రోజు పూర్తిగా ప్రజలతో మమేకం అయ్యారు. లోకేష్ పాదయాత్రలో ప్రజలతో మమేకం అవుతున్న విధానం అందర్నీ ఆకట్టుకుంటోంది. ప్రజలు చెప్పే సమస్యలను సావధానంగా వింటున్నారు. ఆ కష్టాలకు ప్రభుత్వ విధానాలు ఎలా కారణం అయ్యాయి.. గతంలో ఎలా ఉండేది.. తాము వస్తే ఏం చేస్తామో విడమర్చి చెబుతున్నారు. వారిలో భరోసా నింపుతున్నారు. మొత్తంగా లోకేష్ ..

ప్రజలతో మమేకం విషయంలో ఎవరికైనా అనుమానాలుంటే.. పటాపంచలు అయినట్లేనని టాక్ వెల్లువెత్తుతోంది. దీంతో టీడీపీ భావినేతగా లోకేష్ .. యాత్ర రెండోరోజే నిరూపించుకోగలిగారన్న వాదనలు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు లోకేష్ ను తీసిపడేసిన వైసీపీ .. ఏం చేస్తుందన్న చర్చ సైతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. లోకేష్ .. భావి నేతగా మారారో లేదో తేలాలంటే మాత్రం వేచి చూడాల్సిందే.

Must Read

spot_img