Homeఆంధ్ర ప్రదేశ్వైసీపీ నేతల సెటైర్లకు...లోకేష్ రియాక్షన్ !!!

వైసీపీ నేతల సెటైర్లకు…లోకేష్ రియాక్షన్ !!!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరిట తలపెట్టిన పాదయాత్రను ప్రారంభించారు. అయితే అనేక ఆంక్షల మధ్య లోకేష్ పాదయాత్ర ప్రారంభమవడంతో ఈ ఆంక్షల్లో సడలింపులు దొరుకుతాయా? లేక అవేమీ పట్టించుకోకుండా పాదయాత్ర ముందుకెళుతుందా? అనేది చర్చనీయాంశంగా మారింది. అంతేగాక పాదయాత్ర ద్వారా టీడీపీని అధికారంలోకి తీసుకు రాగలరా లేదా? అనేది ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది.

గత ఎన్నికల్లో దారుణంగా ఓడి ప్రతిపక్షానికి పరిమితమైన పార్టీని కొంతమేర చంద్రబాబు పికప్ అయ్యేలా చేశారు. తనకు సాధ్యమైన మేర పార్టీ బలం పెంచారు. అయితే ఇంకా వైసీపీకి చెక్ పెట్టాలంటే టీడీపీ బలం ఇంకా పెరగాలి. అందుకే ఇప్పుడు అందరి చూపు లోకేష్ పాదయాత్రపై ఉంది. పాదయాత్ర ద్వారా టి‌డి‌పిని ఎంతవరకు అధికారంలోకి తీసుకువస్తారనేది ప్రశ్నగా ఉంది.

అయితే లోకేష్ పాదయాత్రపై టి‌డి‌పి శ్రేణులు చాలా అంచనాలు పెట్టుకున్నాయి. ఖచ్చితంగా లోకేష్ పాదయాత్ర టి‌డి‌పికి ప్లస్ అవుతుందని, పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి సాయపడుతుందని అంటున్నారు. అదే సమయంలో ఓ పర్ఫెక్ట్ నాయకుడుగా ఎదగడానికి పాదయాత్ర..లోకేష్‌కు హెల్ప్ అవుతుందని అంటున్నారు. గత ఎన్నికల్లో తొలిసారి బరిలో దిగి ఓటమి పాలైన లోకేష్‌ని వైసీపీ ఏ స్థాయిలో ఎగతాళి చేస్తూ వచ్చిందో తెలిసిందే. అయితే ఎగతాళి చేసిన వారి నోరు మూయించి..లోకేష్ ఓ మంచి నాయకుడు అవుతాడని టి‌డి‌పి శ్రేణులు భావిస్తున్నాయి.

అంటే ఇప్పుడు పాదయాత్ర పార్టీతో పాటు లోకేష్ రాజకీయ జీవితానికి హెల్ప్ అవుతుందని అంటున్నారు. అయితే పాదయాత్రని వైసీపీ సజావుగా సాగనివ్వదనే అనుమానాలు ఉన్నాయని టి‌డి‌పి కార్యకర్తలు అంటున్నారు. ఏదో రకంగా పాదయాత్రకు బ్రేకులు వేయడానికే చూస్తారని, అవన్నీ దాటుకుని లోకేష్ సక్సెస్ అవుతారని అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలా సందర్భాల్లో టీడీపీ కార్యక్రమాలని ఏదో రకంగా అడ్డుకుంటూ వచ్చారు. అలాగే మాచర్ల, గుడివాడ లాంటి చోట్ల టీడీపీకి పోటీగా వైసీపీ వాళ్ళు వచ్చి అడ్డుకునే ప్రయత్నాలు చేయడంతో గొడవలు కూడా జరిగాయి. ఇదే సమయంలో తాజాగా మంత్రి మేరుగు నాగార్జున సైతం లోకేష్ పాదయాత్రని అడ్డుకుంటామని, దళితులకు టీడీపీ ఏం చేసిందో చెప్పి పాదయాత్ర చేయాలని అంటున్నారు.

అసలు లోకేష్ పాదయాత్ర కాదు కదా..పాకుడు యాత్ర చేసిన ప్రజలు నమ్మరని అంటున్నారు. జగన్‌కే జనం మద్ధతు ఉందని చెబుతున్నారు. అయితే గతంలో టీడీపీ అధికారంలో ఉండగా, జగన్ పాదయాత్రకు ఎలాంటి ఇబ్బందులు రాలేదు. ఈ యాత్రను లైట్ తీసుకుంటున్నామని చెప్పినా యాత్రపై ఆసక్తి మాత్రం వైసిపీ నాయకుల్లో ఉంది. అయితే లోకేష్ యాత్ర టీడీపీకంటే వైసీపీకే ఎక్కువ ఉపయోగం అంటున్నారు మంత్రి కాకాణి వంటి నేతలు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర వల్ల టీడీపీకి మేలు జరగకపోగా కీడు జరుగుతుందని, రాగా పోగా వైసీపీకే ఎక్కువ మేలు జరుగుతుందని లాజిక్ చెప్పారు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి.

జయంతికి, వర్థంతికి తేడా తెలియని వ్యక్తి ఏం మాట్లాడతారోనని టీడీపీ శ్రేణులు భయపడుతున్నాయని అన్నారు. టీడీపీ నాయకులకు చెమటలు పడుతున్నాయన్నారు. లోకేష్ యాత్రపై వైసీపీ ఆలోచించే పరిస్థితిలో లేదని, అసలా యాత్ర వల్ల ఫలితం ఉండదని అన్నారు. దొడ్డిదారిన మంత్రి అయిన లోకేష్.. సీఎం కొడుకు హోదాలో పోటీ చేసి ఓడిపోయారని, ఇప్పుడాయన యాత్రల పేరుతో జనంలోకి వచ్చి ఏం చేస్తారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబుకి పూర్తిగా మతి భ్రమించిందని, అందుకే ఆయన మెడకి మైక్ పెట్టుకున్నారని, చేతిలో పేపర్లు పట్టుకోడానికి వీలుగా మైక్ మెడకు వేసుకున్నారని, పేపర్లు చూసి ప్రసంగం చెబుతున్నారని అన్నారు కాకాణి. నారా లోకేష్ పాదయాత్ర, అదో పెద్ద జోక్.. అంటూనే యాత్రపై సెటైర్లు పేల్చారు మంత్రి కాకాణి. లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన గళం ఎందుకు విప్పలేదని ప్రశ్నించారు. ఈరోజు విప్పని గళం ఈరోజు ఎందుకు తెరుచుకుంటోందన్నారు. సీఎం కొడుకుగా ఓడిపోయారని, 175 నియోజకవర్గాల్లో సర్వేలు చేపట్టి మరీ మంగళగిరిలో పోటీ చేసి 2019 ఎన్నికల్లో లోకేష్ ఓడిపోయారని ఎద్దేవా చేశారు. ఆయన గళం విప్పేదేంది, ఆయన ఆకర్షించేది ఎవర్ని అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

చంద్రబాబు వయసైపోయిందని, ఆయన నడవలేరు, మాట్లాడలేరు, పూర్తిగా మతిమరుపు వ్యాధి వచ్చేసిందన్నారు కాకాణి గోవర్దన్ రెడ్డి. ఏపీలో టీడీపీ భూస్థాపితం అయిపోయిందని, టీడీపీదంతా గత చరిత్రేనన్నారు కాకాణి. ఆ పార్టీని బంగాళాఖాతంలో కలిపేశామన్నారు. టికెట్ల కోసం ఆశ పడేవారు ఆయన పాదయాత్ర గురించి విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నారని చెప్పారు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి.

పరోక్షంగా నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డిపై కాకాణి సెటైర్లు వేశారు. టీడీపీ టికెట్ దొరికితే కొంతమందికి పండగ అని, ఆ పేరు చెప్పి ఎన్నికల కోసం డబ్బులు దండుతారని అన్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా వైసీపీ గెలుపుని ఆపలేరన్నారు కాకాణి. 2024లోనూ జగనే సీఎం, 2034లో కూడా జగనే సీఎం అని జోస్యం చెప్పారు కాకాణి గోవర్దన్ రెడ్డి.

లోకేష్ యాత్రపై వైసీపీ నేతలు ట్విట్టర్ వేదికగా కూడా కౌంటర్లు ఇస్తున్నారు. మరో మంత్రి అంబటి రాంబాబు కూడా లోకేష్ యాత్రపై సెటైర్లు పేల్చారు. ఎలుక తోక తెచ్చి 400 రోజులు ఉతికినా అంటూ ఆయన లోకేష్ పాదయాత్రని ఎద్దేవా చేశారు. లోకేష్ ఎన్నిరోజులు యాత్ర చేసినా నాయకుడు కాలేడన్నారు మంత్రి అంబటి. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం వైసీపీ నేత‌లు కుళ్లుకునేలా.. కుప్పం కిట‌కిట‌లాడింది. ఇటీవ‌ల వైసీపీ మంత్రి, అదే ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాకు చెందిన రోజా.. టీడీపీ యువ‌నాయ‌కుడు నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర‌పై ఒక కామెంట్ చేశారు.


ఆయ‌న పాద‌యాత్ర‌లో ఆయ‌నొక్క‌డే ఉంటాడని ఎద్దేవా చేశారు. కానీ, వైసీపీ నాయ‌కుల క‌ళ్లు తెరిపిస్తూ.. యువ‌గ‌ళం పాద‌యాత్ర ప్రారంభం రోజే..కుప్పం కిట‌కిట‌లాడిపోయింది. కార్యకర్తలు యువనేతపై పూలవర్షం కురిపిస్తూ, బాణాసంచా కాలుస్తూ హోరెత్తించారు. పాదయాత్ర ప్రారంభమయ్యాక దారిపొడవునా మహిళలు హారతులిస్తూ లోకేష్‌కు ఘనస్వాగతం పలికారు.

గత 40 ఏళ్లుగా చంద్రబాబుపై అంతులేని అభిమానాన్ని కురిపిస్తున్న కుప్పం ప్రజలు యువనేత చేపట్టిన పాదయాత్రకు ఆశీస్సులు అందజేస్తూ సంఘీభావం తెలిపారు. మార్గమధ్యంలో భారీ గజమాలను యువనేతకు అలంకరింపజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. యువనేతతో కరచాలనం చేసేందుకు యువతీయువకులు పోటీపడ్డారు. పాద‌యాత్రకు ముందు లక్ష్మీపురం మసీదును లోకేష్‌ సందర్శించారు. మసీదులో ప్రార్థనల్లో పాల్గొన్న లోకేష్‌కు.. ముస్లిం మత పెద్దలు ఆశీర్వచనం అందించారు. అనంతరం కుప్పంలోని బాబూనగర్‌లోని చర్చిలో ప్రత్యేక ప్రార్థన చేశారు.

సంఘీభావంగా రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దఎత్తున నాయకులు,కార్యకర్తలు తరలిరావడంతో కుప్పం వీధులన్నీ కిటకిటలాడాయి. యువనేత వెంట భారీగా కదిలిన పసుపుదండుతోపాటు స్థానికులను అదుపుచేయడం భద్రతాసిబ్బందికి కష్టంగా మారింది. డప్పు వాయిద్యాలు, తీన్మార్ దరువుల మధ్య డాన్సులు చేస్తూ యువతీ యువకులు..యువ‌గ‌ళం పాదయాత్రకు సంఘీభావం తెలిపారు.

కుప్పం బస్టాండ్‌ సమీపంలో అంబేద్కర్, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు లోకేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇవ‌న్నీ లైవ్‌లో చూస్తున్న వైసీపీ నాయ‌కుల‌కు ఏం మాట్లాడాలో గొంతు పెగ‌ల‌డం లేద‌ని టీడీపీ నేత‌లు వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. ఈ నేపథ్యంలో యాత్ర ఆరంభమే ఈవిధంగా ఉండడంతో, వైసీపీ నేతలు ఏం చేస్తారన్న చర్చ సర్వత్రా వెల్లువెత్తింది.

Must Read

spot_img