Homeఆంధ్ర ప్రదేశ్కాపు నేతల మధ్య లేఖాస్త్రాలు .. రచ్చ చేస్తున్నాయి..

కాపు నేతల మధ్య లేఖాస్త్రాలు .. రచ్చ చేస్తున్నాయి..

  • ఏపీలో కాపు నేతల మధ్య లేఖాస్త్రాలు .. రచ్చ చేస్తున్నాయి.
  • మరీ ముఖ్యంగా వీరి లేఖలు .. పవన్ కళ్యాణ్ టార్గెట్ గా సాగుతుండడం మరింత హీట్ ను రగుల్చుతున్నాయి.
  • దీంతో లేఖల నెక్ట్స్ ఏమిటన్నదే ఆసక్తికరంగా మారింది.

ఏపీలో ఎన్నికలు వచ్చిన ప్రతీసారి రాజకీయ పక్షాలకు గుర్తొచ్చేది కాపులు. నయానో.. భయానో దారికి తెచ్చుకోవడం వారికి అలవాటు అయ్యింది. ఎదురుదిరిగితే వారి మధ్య చిచ్చు రగిల్చి చలిమంట కాచుకోవడం పరిపాటిగా మారింది. ఉమ్మడి ఏపీలోనైనా.. విభజిత ఆంధ్రప్రదేశ్ లోనైనా జరిగింది అదే. దాని ఫలితమే కాపులు రాజ్యాధికారానికి దూరం కావడం, అయితే ఈసారి కాపులు జెండా, అజెండాలు విడిచిపెట్టి ఒకేతాటి పైకి వస్తున్నారు. దశాబ్దాలుగా జరుగుతున్న రాజకీయ క్రీనీడను గుర్తుచేసుకుంటున్నారు. పవన్ రూపంలో ఒక అరుదైన అవకాశం వచ్చిందని భావిస్తున్నారు.

ఇప్పుడు కాకుంటే ఎప్పుడు అన్న నినాదాన్ని తెరపైకి తెస్తున్నారు. పవన్ ను తమ భావి నాయకుడిగా.. తమ కలలను సాకారం చేసే నేతగా భావిస్తున్నారు. ఎద్దరో రాజకీయ ఉద్ధండులు సైతం అండగా నిలుస్తున్నారు. అటువంటి వారిలో చేగొండి హరిరామజోగయ్య ఒకరు. కాపు సంక్షేమ సంఘ నాయకుడిగా ఉన్న ఈ కురు వృద్ధుడు జనసేనలో చేరకపోయినా.. పవన్ నాయకత్వానికి మాత్రం బలపరుస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ సర్కారుకు కాపులు దూరంగా జరుగుతున్నారు.

పవన్ కు మరింత దగ్గరవుతున్నారు. ఇది జగన్ సర్కారుకు మింగుడు పడడం లేదు. సహజంగా ఒంటరి పోరుతో అధికార వైసీపీకి లాభిస్తుందని తెలిసి
పవన్ పొత్తుల కోసం పావులు కదుపుతున్నారు. కలిసి వచ్చే పార్టీలతో ముందుకెళ్లాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ పొత్తులుంటాయని సంకేతాలిచ్చారు. ఈ క్రమంలో వైసీపీలోని కాపు మంత్రులు, నాయకులు పవన్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు.

కాపుల ఓట్లను చంద్రబాబు కు హోల్ సేల్ గా అమ్మే ప్రయత్నంలో పవన్ ఉన్నారని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను కాపు సంఘాల ప్రతినిధులు తిప్పికొడుతున్నారు. కాపుల్లో ఐక్యత చాటే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న చేగొండి హరిరామజోగయ్య పవన్ కు అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఎనిమిది పదుల వయసులో కాపు రిజర్వేషన్ కోసం దీక్షకు దిగిన ఆయన వైసీపీలోని కాపు మంత్రులు, నేతలకు లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా మంత్రి గుడివాడ అమర్నాథ్ కు ఘాటైన లేఖ రాశారు. పవన్ పై అమర్నాథ్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో హరిరామజోగయ్య లేఖ రాశారు.

  • డీయర్ అమర్‌నాథ్.. నువ్వు రాజకీయాల్లో బచ్చావి.. పైకి రావాల్సిన వాడివి.. సాధారణ మంత్రి పదవికి అమ్ముడు పోయి కాపుల భవిష్యత్తుని పాడు చేయకు..

అనవసరంగా పవన్ కళ్యాణ్‌పై బురద చల్లడానికి ప్రయత్నం చేయకు. నీ భవిష్యత్ కోరి చెబుతున్నా అంటూ లేఖలో పేర్కొన్నారు. దీనికి అదే స్థాయిలో మంత్రి అమర్నాథ్ రిప్లయ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కి చెప్పాల్సినవి నాకు చెబుతున్నారు. కాపుల విషయంలో చంద్రబాబుతో జతకడుతున్న పవన్ కళ్యాణ్ కు రాయవలసిన, చెప్పవలసిన విషయాలు పొరపాటున నాకు రాశారు. మీకు ఆయురారోగ్యాలతో పాటు మీరు మానసికంగా దృఢంగా ఉండాలనికోరుకుంటున్నాను అని అమర్నాథ్ తన లేఖలో పేర్కొన్నారు.

ఇప్పుడు ఈ రెండు లేఖలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ రెండు లేఖలు ఇప్పుడు కాపు సామాజికవర్గంలో చర్చనీయాంశంగా మారాయి. హరిరామజోగయ్య ఇప్పుడు ఏ పార్టీలో లేరు. కానీ ఆయన సుదీర్ఘ రాజకీయ చరిత్ర చూసుకుంటే చేయని పదవి లేదు. ఒక్క సీఎం తప్ప. సమితి ప్రెసిడెంట్ నుంచి రాష్ట్ర హోం మంత్రి వరకూ వివిధ పదవులు అలంకరించారు. జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఎంపీగా కూడా గెలుపొందారు. అటువంటి నాయకుడు ఇప్పుడు పవన్ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. కాపుల ఆకాంక్ష, గొంతుక పవన్ అని నమ్ముతున్నారు.

అటువంటి రాజకీయ కురువృద్ధుడ్ని చులకన చేస్తూ మంత్రి అమర్నాథ్ లేఖలో అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని కాపు సామాజికవర్గ ప్రజలు ఖండిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గుడివాడ అమర్నాథ్ తో పాటు వైసీపీలో ఉన్న కాపు నేతలను ఓడించి తీరుతామని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఏపీలో ఇప్పుడు అందరి దృష్టి కాపులపైనే ఉంది. వారంతా జనసేన వైపు చూస్తుండడంతో నియంత్రించేందుకు అధికార పార్టీ పడరాని పాట్లు పడుతోంది.

అందుకే పవన్ ను టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే కాపు సంఘాల నాయకులు ఏకతాటిపైకి వచ్చారు. పవన్ కు మద్దతు తెలుపుతున్నారు. సహజంగా ఈ చర్యలు అధికార పార్టీకి రుచించడం లేదు. అందుకే ఏదో ఒక వివాదం చేసి కాపులు జనసేన వైపు వెళ్లకుండా కట్టడి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొన్న ఆ మధ్య కాపు రిజర్వేషన్ల కోసం నిరసన దీక్షకు దిగిన సీనియర్ నాయకుడు హరిరామజోగయ్య విషయంలో ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించింది. రాజకీయ స్థిరత్వం లేని హరిరామజోగయ్య మనసు పవన్ పై మళ్లిందని వైసీపీ మంత్రులు ఎద్దేవా చేశారు. ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి చెందిన మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు.

  • పవన్ పై విరుచుకుపడడంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ ముందుంటారు..

ఈ క్రమంలో అమర్నాథ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆయన్ను నవ్వులపాలుచేశాయి. పవన్ తో దిగిన ఫొటో చూపించి.. తనతోనే పవన్ ఫొటో దిగారని చెప్పి అడ్డంగా బుక్కయ్యారు. అటు తన సొంత శాఖల ప్రగతి చెప్పే సమయంలో కూడా ఆయన చెప్పే మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అటు చంద్రబాబు, లోకేష్ లపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటారు. చంద్రబాబుకు కాపులను అమ్మేస్తున్నాడంటూ పవన్ పై వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో హరిరామజోగయ్య తెరపైకి వచ్చారు. అమర్నాథ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఏపీలో కాపు రాజకీయం వేడెక్కింది.

ఆ పార్టీలోని కాపులు, ఈ పార్టీలోని కాపులు గొడవపడుతూ.. మధ్యలో పార్టీలతో సంబంధంలేని వారికి కూడా చురకలంటిస్తున్నారు. తాజాగా హరిరామ జోగయ్యకు మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి లేఖాస్త్రం సంధించారు. అయితే ఈ లేఖల వ్యవహారం జోగయ్యతోనే మొదలైంది. పవన కల్యాణ్ ని సమర్థించే క్రమంలో ఆయన.. మంత్రిని అవమానించారు. నువ్వు బచ్చావి, మంత్రి పదవికి అమ్ముడుపోయావంటూ ఘాటుగా వ్యాఖ్యానిస్తూ లేఖ రాశారు.

దీంతో అమర్నాథ్ కూడా అంతే ఘాటుగా బదులిచ్చారు. అయితే ఎక్కడా జోగయ్యపై కామెంట్లు వేయకుండా జాగ్రత్తపడ్డారు. పవన్ కల్యాణ్ కి రాయాల్సిన లేఖను తనకు రాశారంటూ సెటైర్లు పేల్చారు. మీరు మానసికంగా దృఢంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానంటూ వ్యంగోక్తులు విసిరారు. అక్కడితో ఆ వివాదం సమసిపోలేదు. జోగయ్య లేఖ గుడివాడకు బాగానే మంట పెట్టినట్టుంది. అందుకే తొలి లేఖకు జవాబు రాకపోయే సరికి మలి లేఖ సంధించారు.

ఈసారి వంగవీటి రంగా హత్యతో లింకు పెడుతూ జోగయ్యను ఇరుకున పెట్టాలని చూశారు అమర్నాథ్. వంగవీటి రంగాని చంపించింది చంద్రబాబు నాయుడు అని మీరే పలు సందర్భాల్లో చెప్పారు. అలాంటి చంద్రబాబుతో పొత్తులకు సిద్ధమైన పవన్ కల్యాణ్ ని మీరు సమర్థిస్తారా..?. స్పష్టం చేయగలరు.. అంటూ
రెండో లెటర్ ని ట్విట్టర్లో విడుదల చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. పవన్ కల్యాణ్ విషయంలో వైసీపీలోని కాపు నేతలు కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు.

అయితే కాపు సామాజికవర్గంలోని ఇతర నేతలకు ఈ విమర్శలు రుచించడంలేదు. కాపులకోసం పెట్టిన పార్టీ జనసేన అనేది వారి ప్రగాఢ నమ్మకం. కానీ జనసేనను ఆయన తీసుకెళ్లి కమ్మ సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబుకి తాకట్టుపెడుతున్నారనేది వైసీపీ నేతల ఆరోపణ. వైసీపీలో జగన్ నాయకత్వంలోనే కాపులకు అధికారాలు దక్కాయని, న్యాయం జరిగిందనేది వారి వాదన. ఈ వాద ప్రతివాదాలు ఎలా ఉన్నా.. పవన్ కల్యాణ్ విషయంలో కాపు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

మరి ఈ లేఖాస్త్రాలపై జనసైనికులు .. ఏం చేస్తారన్నదే చర్చనీయాంశంగా మారింది..

Must Read

spot_img