Homeఅంతర్జాతీయంటెక్ కంపెనీలల్లో లే ఆఫ్ ల హవా..

టెక్ కంపెనీలల్లో లే ఆఫ్ ల హవా..

ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలల్లో లే ఆఫ్ ల పర్వం కొనసాగుతోంది.. గతేడాది కొన్ని లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి పలు కంపెనీలు.. ఈ ఏడాది ఇప్పటికే లక్షల సంఖ్యల్లో ఉద్యోగాలకు కోత పడింది.. ఈ ఏడాది ప్రారంభం నుంచే టెక్ కంపెనీలు, యూనికార్న్స్, అంకుర సంస్థలు సుమారు రెండు లక్షల మందిని తొలగించాయి..మెటాతో మొదలైన లే ఆఫ్ ల ట్రెండ్.. ఇప్పుడు అన్ని కంపెనీలకు విస్తరించింది.. ప్రతిరోజు సుమారు మూడు వేల మంది ఉద్యోగాలను కోల్పోతున్నారంటేనే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు..

  • ఒకప్పుడు సురక్షితమైన కంపెనీలుగా పేరుగాంచిన దిగ్గజ సంస్థలు సైతం ఉద్యోగుల తొలగింపుకు ఆర్థిక మాంద్యం పొంచి ఉండటమేనా…?
  • రానున్న రోజుల్లో కూడా లేఆఫ్ లు ఇలాగే కొనసాగనున్నాయా..?

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ముప్పు భయంతో లే ఆఫ్ ల పర్వం కొనసాగుతోంది. ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు అని చెబుతూ.. ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలు అన్నీ ఇప్పటినే.. వేలాది మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయి.. గతేడాదిలోనే అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు.. ఈ ఏడాది జనవరి నుంచే లక్షల సంఖ్యలో ఉద్యోగాలకు కోత పడింది. ద్రవ్యోల్బణ భయంతో దాదాపు బడా కంపెనీలన్నీ లేఆఫ్‌లు మొదలు పెట్టాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచే ఉద్యోగులను ఇంటికి పంపే ప్రక్రియ మొదలైంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం…ఈ ఏడాది జనవరి నుంచే టెక్ కంపెనీలు, యూనికార్న్స్, అంకుర సంస్థలు మొత్తంగా 1.53 లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి. ఈ లెక్కన చూస్తే రోజుకి 2,700 మంది లేఆఫ్‌కు గురవుతున్నారు. ఉద్యోగాలు పోయి కొందరు బాధ పడుతుంటే… మరి కొందరు జీతాల్లేక అవస్థలు పడుతున్నారు. కొన్ని కంపెనీలు తమ ఎంప్లాయీస్‌ కు జీతాలివ్వకుండా ఆపేస్తున్నాయి. మరి కొన్ని కంపెనీలు వేతనాల్లో కోత పెడుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం సహా అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థ కుదేలవడం వల్ల సంస్థలన్నీ ఆందోళన చెందుతున్నాయి.

ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగడం లేదు. అందుకే పెద్ద మొత్తంలో లేఆఫ్‌లు కొనసాగిస్తున్నాయి. కొన్ని సంస్థలైతే రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియను నిలిపివేశాయి. Trueup.io డేటా ప్రకారం…ప్రపంచవ్యాప్తంగా 534 కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. గతేడాదిలో 2.41 లక్షల మంది ఉద్యోగులు లేఆఫ్‌లకు బలి అయ్యారు. రోజుకి 1,535 మంది జాబ్‌లు పోయాయి. ప్రపంచవ్యాప్తంగా టెక్‌ కంపెనీలన్నీ లేఆఫ్‌లు కొనసాగిస్తున్నాయి. కొన్ని సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి.

మెటాతో మొదలైన లే ఆఫ్ ల ట్రెండ్… అన్ని కంపెనీలకు విస్తరించింది. ఇప్పుడు మరోసారి మెటా కంపెనీ లేఆఫ్‌లు చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లోనే భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించనున్నట్టు తెలుస్తోంది. ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీ మెటా పలు టీమ్‌లకు అవసరమైన బడ్జెట్‌ను రిలీజ్ చేయలేదు. అంటే…ఇన్‌డైరెక్ట్‌గా లేఆఫ్‌లు ప్రకటిస్తున్నట్టు సంకేతాలిచ్చింది. ఉద్యోగులను తొలగించిన తరవాతే బడ్డెట్‌లు విడుదల చేయాలని భావిస్తోంది యాజమాన్యం. ఇప్పటికే ఉద్యోగుల్లో లేఆఫ్‌ల భయం మొదలైంది.

ఎప్పుడు ఎవరికి పింక్ స్లిప్ ఇస్తారో అని కంగారు పడిపోతున్నారు. గతేడాది నవంబర్‌ లో ఒకేసారి 11 వేల మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించడం సంచలనమైంది. ఆ కంపెనీలోని మొత్తం ఉద్యోగుల్లో ఇది 13%. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లలో మొత్తంగా కలిపి 11 వేల మందిని ఇంటికి పంపింది మెటా. ఇటీవలే జుకర్‌ బర్గ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది తమకు ఎంతో కీలకమని చెప్పారు. మార్కెట్‌కు అనుగుణంగా నడుచుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని అన్నారు. ఇలా పలు మార్గాల్లో తమ డబ్బును ఆదా చేస్తున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి డిస్నీ కూడా చేరిపోయింది.

ఎంటర్టైన్మెంట్ దిగ్గజంగా వెలుగొందుతున్న డిస్నీ 7,000 మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్లు ప్రకటించింది. ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని సీఈఓ బాబ్ ఐగర్ తీసుకున్నట్టు ఆ కంపెనీ వెల్లడించింది. గతేడాది డిసెంబరులో కంపెనీ పగ్గాలను తీసుకున్న బాబ్ ఐగర్.. ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను అంత తేలిగ్గా తీసుకోలేదని తెలిపారు. వినియోగదారులు ఖర్చులను తగ్గించడంతో గత త్రైమాసికంలో తమ స్ట్రీమింగ్ సబ్‌స్క్రైబర్స్‌ సంఖ్యలో చాలా మార్పు వచ్చిందన్నారు. భారీగా సబ్‌స్క్రైబర్స్ తగ్గిపోయారని కంపెనీ తెలిపింది. అంతకు ముందు కంపెనీ కస్టమర్ల సంఖ్య పెరిగింది.

  • గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి సంస్థలు 2023 లో దాదాపు 10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ కంపెనీ ప్రకటించింది..

గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి సంస్థలు ఒక్కప్పుడు సురక్షితంగా పని చేసుకునే అవకాశం ఉన్న కంపెనీలుగా ఉండేవి. ఇటీవల ఫైనాన్షియర్ ఇయర్ 2023 లో దాదాపు 10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ కంపెనీ ప్రకటించింది. అలాగే గూగుల్, అమెజాన్, ట్విట్టర్, మెటా వంటి టాప్ దిగ్గజ కంపెనీలు దాదాపు 50000 మంది వరకూ తొలగించినట్లు ఓ అంచనా. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లను కలిగి ఉన్న మార్క్ జుకర్‌బర్గ్ మెటా కంపెనీ గత ఏడాది నవంబర్‌లో 11,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ అసందర్భ తొలగింపులు తమను దిగ్భ్రాంతికి గురి చేశాయని
పలువురు ఉద్యోగులు బాహాటంగానే విమర్శిస్తున్నారు.

గూగుల్ ఈ ఏడాది 17 బిలియన్ల నికర లాభాన్ని ఆర్జించినా ఉద్యోగులను ఎందుకు తొలగించారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లే ఆఫ్ లతో కలత
చెందిన మరికొంత మంది ఉద్యోగులు సీఈఓ పదవి నుంచి సుందర్ పిచాయ్ ను తొలగించాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క గూగుల్ నే కాదు మైక్రోసాఫ్ట్, మెటా మాజీఉద్యోగులు కూడా వారి పని చేసిన సంస్థను సోషల్ మీడియా వేదికగా ఏకిపడేస్తున్నారు. ఖర్చులు తగ్గించుకునే సాకుతో ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శిస్తున్నారు. కంపెనీకి నిబద్ధతతో పని చేసిన నేరమే అని ఆగ్రహిస్తున్నారు.

అమెరికా, యూరప్ దేశాలను వణికిస్తున్న ఆర్థిక మాంద్యం భూతం భారత్‌లో కూడా ప్రభావం చూపిస్తోంది. పదేళ్ల క్రితం ఎదురైన అనుభవాల నేపథ్యంలో చిన్న చిన్న స్టార్టప్‌ల నుంచి గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద సంస్థల వరకు లేఆఫ్ ప్రకటించడమో, లేదా ఉద్యోగులను శాశ్వతంగా తొలగించడమో చేస్తున్నాయి. కంపెనీని నష్టాల బాట నుంచి తప్పించేందుకు కఠినమైనా ఈ చర్య తీసుకోక తప్పట్లేదని సదరు సంస్థల నిర్వాహకులు చెబుతున్నారు.

ఓ అనాలిసిస్ ప్రకారం 2022లో వెయ్యికి పైగా కంపెనీలు సుమారు 1.50 లక్షలకు పైగా ఉద్యోగులను తొలగించారు. 2023లో కూడా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ అనేది కొనసాగుతోంది. ప్రముఖ ఎడ్యూ టెక్ స్టార్టప్ సంస్థ అయిన బైజూస్ వెయ్యి మంది ఉద్యోగులను తొలగించింది. ఇంత మందిని ఒకేసారి తొలగించడం గత కొన్ని నెలల వ్యవధిలో రెండోసారి. 2015లో బెంగుళూరు ప్రధాన కేంద్రంగా బైజూస్ ప్రారంభమైంది. 22 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే విలువైన ఎడ్యుటెక్ స్టార్టప్ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది.

కొవిడ్ సమయంలో స్కూల్స్ మూతపడటంతో ఆన్లైన్ ఎడ్యుకేషన్ కి ప్రాధాన్యం పెరిగింది. ఆ టైంలో బైజూస్ భారీగా నియామకాలు చేపట్టింది. గతేడాది స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించినా, అంతర్జాతీయంగా మార్కెట్లు పతనం కావడంతో ఆ ఆలోచన విరమించుకుంది. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను మొదలు పెట్టింది.

ఆర్థిక మాంద్యం భయాందోళనల ప్రభావం అమెరికా మీడియా సంస్థలపై కూడా పడింది. ఈ శీతాకాలంలో పలు సంస్థలు ఉద్యోగుల తొలగింపు ప్రకటించాయి. ఈ జాబితాలో సీఎన్‌ఎన్‌, వాషింగ్టన్‌ పోస్టు వంటి మీడియా సంస్థలు కూడా ఉన్నాయి. 7 శాతం సిబ్బందిని తొలగించనున్నట్టు వోక్స్‌ మీడియా సీఈవో జిమ్‌ బ్యాంకాఫ్‌ ప్రకటించారు. ఆర్థిక ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలిపారు. సీఎన్‌ఎన్‌, ఎన్‌బీసీ, ఎంఎస్‌ఎన్‌బీసీ, బజ్‌ఫీడ్‌ వంటి సంస్థల్లో తొలగింపుల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

ఇటీవలి కాలంలో వందల సంఖ్యలో ఉద్యోగులను సీఎన్‌ఎన్‌ తొలగించినట్టు అమెరికా మీడియా పేర్కొన్నది. సమీప భవిష్యత్తులో ఉద్యోగాల కోత ఉంటుందని వాషింగ్టన్‌ పోస్టు సీఈవో ఫ్రెడ్‌ ర్యాన్‌ గతనెలలో హెచ్చరించారు. స్థిరమైన ఆర్థికాభివృద్ధితో పాటు పెట్టుబడిదారులు, వాటాదారులకు ప్రాధాన్యం ఇవ్వడానికే కంపెనీ ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ప్రపంచదేశాలకు ఆర్థిక మాంద్యం ముప్పు పొంచి ఉందనే భయం టెక్ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.. ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ సంస్థలు సైతం లే ఆఫ్ ల పర్వం కొనసాగిస్తున్నాయి.. ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయం ఉద్యోగుల్లో నెలకొంది.. మరి చూడాలి.. ఈ లే ఆఫ్ లకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడనుందో..

Must Read

spot_img