Homeతెలంగాణహైదరాబాద్ చివరి నిజాం రాజు ముకరం జా అంత్యక్రియలు

హైదరాబాద్ చివరి నిజాం రాజు ముకరం జా అంత్యక్రియలు

తెలంగాణా ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగాయి. ప్రపంచంలోనే అ‍త్యంత ధనవంతుడు ప్రపంచాన్ని చుట్టి వచ్చిన రాజకుటుంబీకుడు చివరకు దేశం కాని దేశంలో నివిసించి అక్కడే మరణించారు. హైదరాబాద్‌ సంస్థానం 8వ నిజాం రాజు ‘ముకరం జా’ ఇస్తాంబుల్‌ నగరంలోని ఓ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఫ్లాట్‌లో జనవరి 14న మీర్‌ బర్కత్‌ అలీ ఖాన్‌ ముకరంజా బహదూర్‌ కన్నుమూసినట్లు ఆయన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయన వయసు 89 సంవత్సరాలు. 1967లో కుబేరుడిగా ఉన్న ఆయన తన చివరి రోజుల్లో ఓ సామాన్యుడిలా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. 1971లో భారత ప్రభుత్వ రాజాభరణాలు రద్దు చేసేంత వరకు తాను ‘ప్రిన్స్‌ ఆఫ్‌ హైదరాబాద్‌’గా ఉన్నారు. అత్యంత విలాసాలు, నలుగురు భార్యలు, పిల్లలో ఆస్తి వివాదాలతో ముకరంజా దివాళా తీశారు. ఆస్తులు అమ్మకుండా కోర్టు ఆంక్షలు విధించడంతో చేతిలో డబ్బుల్లేకుండా పోయాయి.

30 ఏళ్ల వయసులోనే 25 వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులకు వారసుడైన ముకరంజా ఆ తర్వాత నిర్లక్ష్యం కారణంగా ఆస్తులన్నీ పోగొట్టుకున్నారు. తన అంతిమ సంస్కారాలను హైదరాబాద్‌ మక్కా మసీదులోని అసఫ్‌జాహీ సమాధుల వద్ద నిర్వహించాలన్న ఆయన కోరిక మేరకు పార్థీవ దేహాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ముకరంజా భౌతికకాయాన్ని ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తీసుకు వచ్చిన అనంతరం చౌమహల్లా ప్యాలెస్‌కు తరలించారు. 18న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు చౌమహాల్లా ప్యాలెస్‌లో ఆయన పార్థివదేహాన్ని సందర్శించడానికి ప్రజలను అనుమతించారు. ఆ సమయంలో ఆయనను చూడటానికి వందలాదిగా పాతబస్తీ పెద్దలు క్యూ కట్టారు. హైదరాబాద్‌ సంస్థానం ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ బహదూర్‌ మనుమడే ముకరంజా.

ముకరం జా 1933 అక్టోబర్‌ 6న ఫ్రాన్స్‌లో జన్మించారు. డెహ్రాడూన్‌లో పాఠశాల విద్య, లండన్‌లో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. భారత యూనియన్‌లో హైదరాబాద్‌ సంస్థానం కూడా చేరిన తర్వాత, ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ జనవరి 26, 1950 నుంచి అక్టోబర్‌ 31, 1956 వరకు రాష్ట్ర రాజ్‌ ప్రముఖ్‌గా పనిచేశారు. ఫిబ్రవరి 1967లో ఆయన మరణానంతరం ఏప్రిల్‌ 6, 1967లో ఎనిమిదవ అసఫ్‌ జాహీగా ముకరంజాకు పట్టాభిషేకం చేశారు. నిజాం చారిటబుల్‌ ట్రస్ట్, ముకరంజా ట్రస్ట్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ లెర్నింగ్‌కు ముకరంజా చైర్మన్‌గా వ్యవహరించారు.

ఏడో నిజాం వారసుడిగా 1967 భారీ సంపదను ముకరంజా వారసత్వంగా పొందారు. ఈయన గురించి చెప్పుకున్నప్పుడు ఈ ప్రాంతాన్ని ఒకనాడు ఏక చత్రాధిపత్యంగా పాలించిన నిజాం వంశం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఎవరికైనా కలుగుతుంది. అసలు నిజాం ఎవరు..తెలంగాణాలో ఈ పేరుతో నగరాలు, ఇస్లాం ప్రాబల్యం గురించి గుర్తుకు వస్తుంది. అసలు నిజాం ఎలా ఇక్కడికి వచ్చారు అన్న విషయానికొస్తే.. నిజామ్ ఔరంగజేబు నియమించిన సామంత రాజు. ఉజ్బెకిస్తాన్ నుంచి మనదేశానికి రప్పించబడినవాడుగా చెబుతారు.

వీరు కులీ కుతుబ్షా వంశస్తులు, బీజాపూర్ రాజధాని గా పాలించిన ఆదిల్ షా చక్రవర్తి..అంటే బహమనీ సుల్తానులు చేత హైదరాబాదు సంస్థానాన్ని పరిపాలించడానికి నియమించ బడ్డ సామంతరాజులు.

వీరు దక్కన్ ను ఔరంగజేబు ఆక్రమించుకునేంతవరకు హైదరాబాదును పరిపాలించారు. మొగల్ చక్రవర్తి ఔరంగజేబు డక్కన్ ప్రాంతాన్ని ఆక్రమించే ఉద్దేశంతో దండెత్తి జయించి, కుతుబ్ షా ను తొలగించి, తన సామంత రాజు గా మొదటి నిజాంను నియమించాడు. టర్కీ భాషలో నిజాం అంటే సామంతరాజు అని అర్థం వస్తుంది. మొదటి నిజాం అసలు పేరు మీర్ కమ్రుద్దీన్ సిద్దికీ బాయఫండీ. ఈయన 1671 నుంచి 1748 వరకు హైదరాబాదు ప్రాంతాన్ని పాలించాడు.

తెలంగాణా ప్రాంతంలో నిజాం పాలనను సమర్థించే వారూ ఉన్నారు..తీవ్రంగా వ్యతిరేకించేవారు కూడా ఉన్నారు. మొదట వారిని ఎందుకు సమర్థిస్తారనే విషయానికొస్తే.. వారి కాలంలోనే 400 సంవత్సరాల హైదరాబాద్ కు ఇన్ని హంగులు అందాలు సమకూరాయి. అంతేకాదు హైదరాబాద్ అన్న నగరం ఐశ్వర్యానికి ప్రసిద్ధి చెందింది, అయితే ఆ వైభవం కుత్బ్ షాహీ రాజవంశం ఉన్నంత కాలం మాత్రమే కొనసాగింది.

మొఘలులు 1685లో హైదరాబాద్‌ను స్వాధీనం చేసుకున్న తరువాత నగరం ఆ అందాలను కోల్పోయింది. మొఘలుల ఆక్రమణ తరువాత దోపిడీ విధ్వంసాలకు పాల్పడ్డారు. 1724లో దక్కన్‌లోని మొఘల్ వైస్రాయ్ అసాఫ్ జా నిజాం అల్-ముల్క్ స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాడు. హైదరాబాద్ రాజధానిగా ఉన్న ఆ దక్కన్ రాజ్యానికి హైదరాబాద్ రాచరిక రాష్ట్రంగా పేరు వచ్చింది. 19వ శతాబ్దంలో ఆషాఫ్ జాహీలు పునర్నిర్మాణం ప్రారంభించారు, మూసీ మీదుగా పాత నగరానికి ఉత్తరంగా విస్తరించారు. ఉత్తరాన, సికింద్రాబాద్ బ్రిటీష్ కంటోన్మెంట్ అంటే..సైనిక సదుపాయంగా పెరిగింది, హుస్సేన్ సాగర్ సరస్సుపై 1 మైలు దూరం వరకు పొడవాటి తీరాన్ని ఏర్పాటు చేసారు. దానినే మనం ఇప్పుడు ట్యాంక్ బండ్ అంటున్నాం..

అది ఇప్పుడు హైదరాబాద్‌ నగరంలో ఓ అంతర్భాగంగా మారిపోయింది. ప్రముఖ టూరిస్ట్ ప్లేస్ గా, విహార స్థలంగా మారిపోయి నగరానికే గర్వకారణంగా నిలుస్తోంది. అంతే కాదు.. హిందూ ముస్లిం శైలులతో మమేకమైన అనేక కొత్త నిర్మాణాలు కూడా నగరానికి జోడించబడ్డాయి. నిజాంల హయాంలో హిందూ ముస్లిం జనాభా సహజీవనం చేసేవారు, అయినప్పటికీ మతాంతర పోరు జరిగిన సందర్భాలు ఉన్నాయి. 1947లో భారత స్వాతంత్య్రం తర్వాత, రజాకార్లు-ఒక ముస్లిం మిలీషియాగా మారిపోయి అరాచకం స్రుష్టించడం జరిగింది. హిందూ సంఘాలపై జరిగిన హింసను తెలంగాణా పల్లెల్లో ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు.

భారత ప్రభుత్వం ఏర్పడిన తరువాత దేశం అంతా ఒక్కటైతే హైదరాబాద్ సంస్థానం ఒక్కటి మాత్రం వేరుగా ఉండటం నచ్చలేదు.

సర్దార్ వల్లభాయి పటేల్ ఆధ్వర్యంలో నిజాంను లొంగదీయాలని తలపెట్టింది. సెప్టెంబరు 1948లో భారత సైన్యం జోక్యం చేసుకుని, హైదరాబాద్‌పై దాడి చేసి నిజాం సైన్యాన్ని సులభంగా మట్టుబెట్టింది. సైనిక ఆపరేషన్ సమయంలో ప్రాణనష్టం స్వల్పమే అయినప్పటికీ, కొన్ని ఘటనలు అనివార్యంగా చోటు చేసుకున్నాయి.

ముస్లింలను దోచుకోవడం ప్రతీకార హత్యలు కూడా జరిగినట్టు చెబుతారు. హైదరాబాదులో జరిగిన సంఘటనలను పరిశోధించడానికి 1951లో భారత ప్రభుత్వం పంపిన బహు విశ్వాస సుందర్‌లాల్ కమిషన్ ఆ అల్లర్లలో కనీసం 27,000 నుండి 40,000 మంది మరణించినట్లు నిర్ధారించింది. 1950లో భారత యూనియన్‌లో రాచరిక రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రంగా మారింది. ఆపై 1956లో రాష్ట్రం విడిపోయింది. భాషా ప్రయుక్త రాష్ట్ర ఏర్పాటులో భాగంగా తెలుగు మాట్లాడే ప్రాంతాలైన తెలంగాణ ప్రాంతం అప్పటి ఆంధ్ర రాష్ట్రంతో కలిపి హైదరాబాద్ రాజధానిగా ఆంధ్ర ప్రదేశ్‌గా ఏర్పడింది.

అయితే ఈ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రం కావాలని పట్టుబట్టిన తెలంగాణ ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. సుదీర్ఘ చర్చల తరువాత-ముఖ్యంగా హైదరాబాద్ స్థానభ్రంశం గురించి-మరియు భారత పార్లమెంట్ నుండి విభజనకు ఆమోదం పొందిన తర్వాత, 2014లో ఇప్పటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆపై 10 సంవత్సరాల వరకు హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు రాజధానిగా అంగీకరించబడింది. ఇదీ ఈ ప్రాంతం గురించిన చరిత్ర. ఇందులో నిజాం పాత్ర మరచిపోరానిదిగా నిలిచింది. అరకొరగా మిగిలిన నిజాం వారసుడు కూడా మరణించడంతో నిజాం చరిత్ర ముగిసినట్టైంది.

Must Read

spot_img