HomePoliticsకొండా సురేఖ రాజీనామాతో మరో రచ్చ.....

కొండా సురేఖ రాజీనామాతో మరో రచ్చ…..

అసలే నానాటికీ తీసికట్టుగా మారుతోన్న తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త కమిటీలు కల్లోలం రేపాయి. తాజాగా కొండా సురేఖ రాజీనామాతో మరో రచ్చ
తప్పదన్న టాక్ వెల్లువెత్తుతోంది. దీంతో రాజీనామా బాటలో ఇంకెంతమంది నడుస్తారోనన్న చర్చ హాట్ టాపిక్ గా మారింది.

తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త కమిటీలు కల్లోలం రేపాయి. AICC రిలీజ్ చేసిన లిస్ట్ లో తన జూనియర్ల కంటే తనకు తక్కువ స్థానం కల్పించారని కొండా సురేఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి కొండా సురేఖ రాజీనామా చేశారు. ఇది తనను అవమానించడమే అని పదవులు ముఖ్యం కాదు ఆత్మభిమానం ముఖ్యం అని, తాను కాంగ్రెస్ కార్యకర్తగానే కొనసాగుతానని ఆమె స్పష్టం చేశారు.

ఈ మేరకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కొత్త కమిటీలో వరంగల్ నేతల పేర్లు లేకపోవడం బాధ కలిగించిందని కొండా సురేఖ అన్నారు. ఈ మేరకు రేవంత్ రెడ్డితో కొండా సురేఖ సమావేశం అయ్యారు. టీపీసీసీ కొత్త కమిటీలను AICC ప్రకటించింది. 40 మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీ, 18 మందితో కూడిన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీని ప్రకటించింది.

26 జిల్లాలకు నూతన అధ్యక్షులకు బాధ్యతలు అప్పగించింది. గ్రేటర్ హైదరాబాద్ ను మూడు విభాగాలుగా విభజించి బాధ్యతలు అప్పగించారు. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్లుగా జగ్గారెడ్డి, అంజన్ కుమార్, అజారుద్దీన్, మహేష్ గౌడ్ ను నియమించింది. కాగా ఈ కొత్త కమిటీల సారథ్యంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, పార్టీ సీనియర్ నేత కొండా సురేఖ రాజీనామా పార్టీలో కలకలం రేపుతుంది. టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ పోస్టుకు ఆమె రాజీనామా చేశారు. కొండా సురేఖ బాటలో మరికొందరు రాజీనామా చేసే యోచనలో ఉన్నారని తెలిసింది. వారు తమ అసంతృప్తిని పార్టీ హైకమాండ్ కు తెలియజేయాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు.

పార్టీలో తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని సీనియర్ నేతలు అసంతృప్తితో పాటు అసహనంతో ఉన్నారు. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీకి సంబంధించి టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ చైర్మన్ గా వ్యవహరించనున్నారు. ఇందులో రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య, హనుమంతరావు, ఉత్తమ్ కుమార్, జానా రెడ్డి, జీవన్ రెడ్డి, గీతా రెడ్డి, షబ్బీర్ అలీ, దామోదర రాజనర్సింహ, రేణుకా చౌధరి బలరాం నాయక్, మధుయాష్కీ, చిన్నారెడ్డి, శ్రీధర్ బాబు, సంపత్ కుమార్, వంశీ చంద్ రెడ్డికి చోటు కల్పించారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వరంగల్ జిల్లాలో చక్రం తిప్పాలని భావించిన కొండా సురేఖకు తాజాగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన కొత్త కమిటీలు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.

తాజాగా ఏఐసిసి రిలీజ్ చేసిన కమిటీల జాబితాలో తన జూనియర్ల కంటే తనకు తక్కువ స్థానం కల్పించారని కొండా సురేఖ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ టిపిసిసి ఎగ్జిక్యూటివ్ కమిటీకి రాజీనామా చేశారు. ఇక ఈ మేరకు తనకు బాధ కలిగించే అంశాలపై టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కి లేఖ రాసిన కొండా సురేఖ పిసిసి ఎగ్జిక్యూటివ్ కమిటీ పదవికి రాజీనామా చేయడం వెనుక అనేక రాజకీయ కారణాలు ఉన్నాయని తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తున్న కొండా సురేఖ, ఈ మేరకు వరంగల్ కేంద్రంగా రాజకీయాలు చేయడం కోసం, వరంగల్ డిసిసి అధ్యక్షుడిగా తమ ప్రధాన అనుచరునికి అవకాశం కల్పించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కోరినట్లు తెలుస్తోంది. కనీసం టిపిసిసి ప్రధాన కార్యదర్శి పదవి అయినా ఇవ్వాలని కోరినట్టు సమాచారం. అయితే వరంగల్ డిసిసి అధ్యక్ష పదవి పై కొండా మురళి దొంతి మాధవ రెడ్డి మధ్య పోటీ నెలకొందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే వరంగల్ తూర్పులో తమకు అనుచరుడిగా ఉన్న ముఖ్య నాయకుడి పేరును కొండా సురేఖ డిసిసి అధ్యక్షుడిగా అవకాశమివ్వాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

ఇక మరోవైపు జనగామ డిసిసి అధ్యక్ష పదవి కోసం జంగా రాఘవరెడ్డికి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి మధ్య పోటీ ఉంది. కొండా వర్గీయుడైన జంగా రాఘవరెడ్డికి డిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలని కొండా సురేఖ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా ప్రకటించిన డీసీసీ అధ్యక్షుల జాబితాలో తాము అడిగిన కొన్ని స్థానాలను పెండింగ్ లో పెట్టటం, అలాగే ప్రధాన కార్యదర్శులు, టీపీసీసీ ఉపాధ్యక్షులుగా తమ వారికి అవకాశం కల్పించకపోవటం కొండా సురేఖను తీవ్ర అసంతృప్తికి గురి చేశాయి.

అయితే కొండా సురేఖ విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానన్న రేవంత్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కూడా మాట్లాడతానని
చెప్పినట్లు సమాచారం. సాధ్యమయినంతమేరకు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సురేఖ పేరు వచ్చేలా చూస్తానని రేవంత్ హామీ ఇచ్చినట్లు టాక్
వినిపిస్తోంది. 3 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్న కొండా సురేఖ గతంలో పరకాల, శాయంపేట, వరంగల్ తూర్పు నియోజకవర్గాల నుంచి
ఎమ్మెల్యేగా గెలిచారు.

కొండా సురేఖ భర్త కొండా మురళీ మాజీ ఎమ్మెల్సీ. కుమార్తె కొండా సుస్మితను రాజకీయాల్లోకి తీసుకురావాలని కొండా దంపతులు యోచిస్తున్నారు. గతంలో మూడు టికెట్లు ఆశించిన కొండా కుటుంబం ప్రస్తుతం రెండు ఎమ్మెల్యే టికెట్లను ఆశిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని చెబుతున్నా కొండా సురేఖ అతి త్వరలో పార్టీ మారే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే, అసలే తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి రోజురోజుకూ తీసికట్టు చందంగా తయారవుతోంది.

ఈ క్రమంలోనే తాజాగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ప్రకటించిన పదవుల జాబితాపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఏఐసీసీ ప్రకటించిన పదవులపై అసంతృప్తి కలిగిందని ఈ లేఖ ద్వారా కొండా సురేఖ పేర్కొన్నారు. తాను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పని చేశానని, తన భర్త కొండా మురళి రెండుసార్లు శాసనమండలి సభ్యులుగా ఎన్నికయ్యారు అని, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తమకు అభిమానులు, కార్యకర్తలు ఉన్నారని కొండా సురేఖ పేర్కొన్నారు. ఇంకా వరంగల్, జనగామ భూపాలపల్లి డీసీసీ అధ్యక్షుల నియామకం పెండింగ్లో పెట్టిన క్రమంలో కొండా సురేఖ తనకు స్థానం కల్పించిన పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి రాజీనామా చేయడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

ఇదివరకు బలం ఉన్న స్థానాల్లో కూడాఇప్పుడు కనీస బలాన్ని నిరూపించుకోలేకపోతోంది.

పార్టీ మొత్తం ముఠా కుమ్ములాటలతో సతమతం అవుతోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీదనిందలు వేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇలాంటి సవాలక్ష చికాకులు ఉండగా.. టీపీసీసీకి కొత్త కమిటీలను వేయడం ద్వారా.. అధిష్ఠానం ముసలం పెట్టిందనే చెప్పాలి.గత ఎన్నికలో గెలవకపోయినప్పటికీ.. పార్టీలో బలమైన నాయకురాలే అయిన కొండా సురేఖ తనకు ఇచ్చిన పదవి పట్ల అసంతృప్తితో రాజీనామా చేశారు. ఇప్పుడు మిగిలిన వారి వంతు కూడా వస్తోంది. పార్టీకి రాజీనామాలు చేసే స్థాయి వరకు ఇంకా రాలేదు గానీ.. ఒక్కరొక్కరుగా బయటపడుతున్నారు.

కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు భట్టి విక్రమార్క.. కమిటీల కూర్పు మీద మెత్తమెత్తగానే నిప్పులు చెరిగారు. అనేకమంది నాయకులు తనను కలిసి ఈ కమిటీలు, పదవుల మీద అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. పార్టీలోఎంతకాలంగా పనిచేస్తున్నా అవకాశం రాలేదని అనేకమంది వాపోతున్నట్లుగా ఆయన చెప్పారు.

ప్రతిసారీ కమిటీల కూర్పులో పీసీసీ చీఫ్ తో పాటు, సీఎల్పీ నాయకుడిని కూడా పిలుస్తారని, ఈసారి తనను ఎందుకు పక్కన పెట్టారో అర్థం కావడం లేదని భట్టి విక్రమార్క తన గోడు వెళ్లబోసుకుంటూ ఉండడం గమనార్హం. అసలే తెలంగాణలో పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. అందరినీ కలుపుకుని పోవాల్సిన సమయంలో.. కమిటీలతో పార్టీలో కొత్త ముసలం పెంచుతున్నారని పలువురు అంటున్నారు.

మరి అధిష్టానం ఏం చేస్తుందన్నదే చర్చనీయాంశంగా మారింది.

Must Read

spot_img