Homeజాతీయంఆ నాయకుడి సీటుకి ఎసరు రానుందా ? ఆయన నోటి దురుసే అందుకు కారణమా ?

ఆ నాయకుడి సీటుకి ఎసరు రానుందా ? ఆయన నోటి దురుసే అందుకు కారణమా ?

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి .. రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు.. తెలంగాణ పాలిటిక్స్ లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న ఈయన కాంగ్రెస్ పార్టీతోనే రాజకీయ జీవితాన్నిఆరంభించిన కోమటిరెడ్డి వెంకట రెడ్డి …25 ఏళ్లుగా ఆ పార్టీలోనే తిరుగులేని నేతగా కొనసాగుతున్నారు. నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి వీర విధేయుడిగా పేరున్న కోమటిరెడ్డి .. ఆయన హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు.

2018 లో తొలిసారి ఓటమి రుచి చూసిన వెంకట్ రెడ్డి ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి స్థానం నుంచి విజయం సాధించారు. ఇక ఈయన సోదరుడు రాజ్ గోపాల్ రెడ్డి తాజాగా కమలదండులోకి చేరడం ..వెంకట్ రెడ్డి పొలిటికల్ కెరీర్ ను ప్రశ్నార్ధకంలో పడేసింది. ఒకప్పుడు పార్టీలో తిరుగు లేని హవా సాగించిన కోమటిరెడ్డిని ఇప్పుడు హై కమాండ్ పెద్దగా పట్టించు కోవడం లేదట.ఆయన నోటి దురుసే అందుకు కారణమని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

పార్టీ స్టాండ్ దాటడం కూడా హై కమాండ్ కు ఆగ్రహం తెప్పించిందనేది పార్టీలో ఓపెన్ సీక్రెట్. మునుగోడు బైపోల్ టైం లో చెప్పా పెట్టకుండా విదేశాలకు చెక్కేశారు కోమటిరెడ్డి. అంతటితో ఆగారా అంటే అదీ లేదు .. హద్దు మీరి మరీ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు..ఆ కామెంట్స్ పార్టీలో పెద్ద దుమారాన్ని రేపాయి. కోమటిరెడ్డి ప్రత్యర్థులకయితే ఆ కామెంట్స్ అస్త్రాలు కాగా .. హై కమాండ్ వద్ద ఆయన్ని చులకన చేసేశాయి.. ఎన్నికల సమయంలో తమ్ముడు రాజ్ గోపాల్ రెడ్డి కి సపోర్ట్ గా ఉండాలని ఓ కార్యకర్తతో మాట్లాడిన ఫోన్ కాల్ లీక్, విదేశాలకు వెళ్ళాక మునుగోడులో కాంగ్రెస్ పార్టీ గెలిచే సీన్ లేదని వ్యాఖ్యానించిన వీడియో వైరల్ అయ్యి, ఏకంగా హైకమాండ్ కే దూరమయ్యేలా చేశాయి.

దీనిపై హైకమాండ్ పెద్దల్ని కలిసి, కబుర్లు చెప్పినా, దీని ఎఫెక్ట్ మాత్రం .. పీసీసీ కమిటీల్లో కనపడిందని సొంత కేడర్ లోనే కామెంట్స్ వినిపించాయి. ఇటీవల వేసిన ఈ పీసీసీ కమిటీల్లో భూతద్దం పెట్టి చూసినా .. కోమటిరెడ్డి పేరు గానీ, ఆయన అనుచరులపేర్లు కానీ కనపడకుండా చేసేశాయి. గుండుగుత్తగా మొత్తం రేవంత్ అనుచరుల పేర్లే హల్చల్ చేశాయి. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో తిరుగులేని ఆధిపత్యం సాగించిన కోమటిరెడ్డికి చుక్కెదురు అన్న టాక్ సర్వత్రా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎక్కడైతే, తనకు బలం ఉందని ఇప్పటివరకు కోమటిరెడ్డి విర్రవీగారో .. అక్కడే పట్టు కోల్పోయే పరిస్థితికి దిగజారిపోయారన్న టాక్ …స్థానిక రాజకీయ వర్గాల్లో వెల్లువెత్తుతోంది.

అంతేకాక రానున్న ఎన్నికల్లో కూడా ఆయన టికెట్ కు ఎసరు అన్న టాక్ కూడా చర్చ నీయాంశంగా మారుతోంది. ప్రస్తుతం నల్గొండలో ఏ నలుగురు కనబడ్డా దీనిపైనే చర్చ సాగుతోంది. ఎన్నికల నాటికి వెంకట్ రెడ్డి కూడా తమ్ముడి దారే పడతారనే ప్రచారం ఊపందుకుంది. ఆ మేరకు దగ్గరి అనుచరులకు ఆయన లీకులివ్వడంతో, కోమటిరెడ్డి కాంగ్రెస్పార్టీని వీడడం పక్కా అనే లెక్కలేసుకుంటున్నారు ఆశావహులు. అందుకే ఇప్పటినుంచే సెగ్మెంట్ లో కర్చీఫ్ వేసుకునే ప్రయత్నాలు చాప కింద నీరులా ..

శరవేగంగా సాగిపోతున్నాయట. కాగా ఈ వార్తలు చక్కర్లు కొడుతుండడంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. తాను నల్గొండ సెగ్మెంట్ ను వీడిది లేదని, ఇక్కడి నుంచే పోటీ చేస్తానని కార్యకర్తలకు చెప్పారు కానీ .. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననేది మాత్రం క్లారిటీ ఇవ్వకపోవడం మరో చర్చకు దారి తీసిందట. అయితే ఆయన నల్గొండను వీడకపోయినా, కాంగ్రెస్ ను వీడతారన్న అంచనాలతో ఆశావాహుల్లో ఆశలు చిగురించాయని సమాచారం. అంతేగాక ఆయన కొన్నిసార్లు తాను రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నాననడం.. కూడా కేడర్ ను గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. దీంతో కోమటిరెడ్డి దారెటో తెలియక, పార్టీ శ్రేణులు సైతం తికమక పడుతున్నాయట.

దీంతో సందట్లో సడేమియా అన్నట్టుగా ఆశావహులంతా వారి ప్రయత్నాల్లో వారున్నారట. ఆ క్రమంలోనే సీనియర్ నాయకులు దుబ్బాక నర్సింహ రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి పున్న కైలాష్ కూడా ఆశావహుల లిస్ట్ లో చేరి పోయారని సమాచారం. అవకాశం వేస్తే తొడ గొట్టడానికి రెడీ అవుతున్నారని టాక్. 2018 ఎన్నికల వేళ బీఅర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు దుబ్బాక నర్సింహరెడ్డి. పార్టీ అధికారంలోకి వస్తే, మంచి పోస్ట్ ఇస్తామని ఆఫరిచ్చారు. ఇక ఆ తర్వాత పార్టీ పరిస్థితి తెలిసిందే కదా. ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గోడమీది పిల్లి వాటం ప్రదర్శిస్తుండడంతో, దుబ్బాక మళ్ళీ సీన్ లోకి వచ్చేశారు.

రేవంత్ కోటరీలోకి వెళ్ళిన దుబ్బాక .. నల్గొండ టికెట్ కోసం ప్రతిపాదన పెట్టారని సమాచారం. దీనికి రేవంత్ కూడా సానుకూలంగా ఉన్నారన్న సమాచారంతో దుబ్బాక దూకుడు పెంచారని తెలుస్తోంది. సెగ్మెంట్లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడమే కాక .. పట్టు నిలుపుకునే ప్రయత్నాలు షురూ చేస్తున్నారట. ఇక బీసీ ఈక్వేషన్స్ తో పున్న కైలాష్ కూడా ఈ దఫా బరిలోకి దిగాలని యోచిస్తున్నారని టాక్ వెల్లువెత్తుతోంది. మొన్నటి మునుగోడు ఉప ఎన్నికల్లోనే టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు పున్న.

కానీ రాజకీయ పరిణామాల నేపథ్యంలో టికెట్ పాల్వాయి స్రవంతికి దక్కడంతో సైలెంట్ అయ్యారు. ఒకవేళ ఓడిన సానుభూతితో టికెట్ మళ్ళీ స్రవంతికే వరిస్తే, రెండో ఆప్షన్ నల్గొండ సెగ్మెంట్ పెట్టుకున్నారని తెలుస్తోంది. అందుకే ఆయన కూడా సెగ్మెంట్ లో పని చేసుకుంటూ వెళ్తున్నారట. మరోవైపు నల్గొండ పార్లమెంట్ స్థానం కూడా ఖాళీ అయ్యే అవకాశం ఉండడం తో ఏదైనా అవకాశం రాక పోదా అని గంపెడాశలు పెట్టుకున్నారట ఆశావహులు.

మొత్తానికీ కోమటిరెడ్డి చూపు సైడ్ ట్రాక్ వైపు వెళ్తుండడంతో ఆశావహుల చూపు మాత్రం నల్గొండ టికెట్ పై పడింది. వచ్చిన అవకాశాన్ని వదులు కోకుండా ఇప్పటి నుంచే ఢిల్లీ స్థాయి పైరవీలు మొదలెట్టారని టాక్. దీంతో కోమటిరెడ్డికి కాంగ్రెస్ లో చుక్కెదురు తప్పకపోవచ్చన్న అంచనాలు సెగ్మెంట్లో రాజకీయ వేడిని పెంచేస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయమున్నా, టిక్కెట్ రేస్ .. హీట్ టాపిక్ గా మారిపోయింది. ఇప్పటివరకు నల్గొండలో తిరుగులేని కోమటిరెడ్డి .. చేజేతులారా .. చెక్ పెట్టుకున్నట్లు అయిందన్న టాక్ సర్వత్రా వెల్లువెత్తుతోంది.

ఇదేసమయంలో జిల్లా రాజకీయాలపై రేవంత్ పట్టు బిగించడం సైతం చర్చనీయాంశంగా మారింది. తనను .. నల్గొండ విషయంలో జోక్యం చేసుకోవద్దన్న కోమటిరెడ్డికి .. రేవంత్ మార్క్ మంత్రాంగం .. మొత్తానికే జీరోను చేసేసిందన్న టాక్ సొంత పార్టీలోనే వెల్లువెత్తుతోంది. దీంతో ఇక నల్గొండ కోమటిరెడ్డి చేజారినట్లేనన్న వాదనలు సైతం వినిపిస్తున్నాయి. తాజా పరిణామాలతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏమిటన్న చర్చ .. జిల్లావ్యాప్తంగా సాగుతోంది. అంచనాలు తగ్గట్టుగా పార్టీని వీడతారో.. తలకిందులు చేసి సర్దుకు పోతారో నన్నదే ఆసక్తికరంగా మారింది. వచ్చే ఎన్నికల ముందు .. ఏ పార్టీ అన్నది చెబుతానన్న కోమటిరెడ్డికి .. ఇక హస్తం చేయిచ్చినట్లేనన్న టాక్ వెల్లువెత్తుతుండడంతో, ఇక జంప్ తప్పదని .. అదీ కూడా తమ్ముడి
పార్టీలోకేనని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

దీంతో వచ్చే ఎన్నికల నాటికి నల్గొండ కాంగ్రెస్ రాజకీయాలు .. కాక రేపక మానవని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. అదేసమయంలో .. ఆశావహులు సైతం కోమటిరెడ్డికి వ్యతిరేకంగా ఏమాత్రం పట్టు బిగిస్తారన్న చర్చ కూడా సర్వత్రా వినిపిస్తోంది. దీంతో కోమటిరెడ్డి .. రాజకీయ ప్రస్థానంపై జిల్లాలో చర్చోపచర్చలు సాగుతున్నాయి.

మరి కోమటిరెడ్డి నెక్ట్స్ స్టెప్ ఏమిటన్నదే ఆసక్తికరంగా మారింది.

Must Read

spot_img