Homeతెలంగాణనల్లగొండలో మళ్లీ కోమటిరెడ్డి రచ్చ షురూ..

నల్లగొండలో మళ్లీ కోమటిరెడ్డి రచ్చ షురూ..

  • నల్లగొండలో మళ్లీ కోమటిరెడ్డి రచ్చ షురూ అయిందా…?
  • ఈ రచ్చ కు తాజాగా ఆయనపై వెలిసిన పోస్టర్లే కారణమా..?
  • ఇంతకీ ఈ పోస్టర్ల కథేంటి..? దీనివెనుక ఉన్నదెవరు..?
  • మళ్లీ తెలంగాణ కాంగ్రెస్ లో మరో పంచాయితీ మొదలైందా..?

నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఒక్కసారిగా వెలిసిన ఈ వాల్ పోస్టర్లు.. నల్గొండ జిల్లా రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నాయి. ఈ పోస్టర్లను ఎవరు ఏర్పాటు చేశారనేది తెలియడం లేదు. పార్టీలోని శత్రువులు ఏర్పాట్లు చేశారా..? లేదా ప్రత్యర్ధి పార్టీల హస్తం ఉందా? అనేది జిల్లా రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ప్రస్తుతం రాజకీయంగా ఆయన అంత యాక్టివ్‌గా కనిపించడం లేదు. దీంతో కోమటిరెడ్డి టార్గెట్‌గా పోస్టర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందనేది చర్చకు దారితీస్తోంది.

‘కోవర్ట్ వెంకట్ రెడ్డి.. నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్తల ఆవేదన’ అంటూ పోస్టర్లలో ఉంది. నకిరేకల్ మండలంలోని చందన పెళ్లి గ్రామంలో జాతీయ రహదారిపై ఈ పోస్టర్లను అతికించారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీకి ద్రోహం చేస్తున్నా.. అధిష్టానం పట్టించుకోవడం లేదని, మునుగోడు ఉపఎన్నికలో తన తమ్ముడి గెలుపు కోసం బీజేపీకి సపోర్ట్ చేశారని పోస్టర్లలో పేర్కొన్నారు. బీసీ నాయకులను ఎదగనీయకుండా తొక్కిపెట్టారని, ఇలాంటి వారిని పార్టీ నుండి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సొంత తమ్ముడు రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతుంటే ఆపలేకపోయారని, కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి ఆయన టికెట్ ఇప్పించిన చిరుమర్తి లింగయ్య పార్టీ మారుతుంటే ఆపలేకపోయారని విమర్శించారు.

స్వంత కుటుంబసభ్యులను కూడా గెలిపించుకోలేని నువ్వు స్టార్ క్యాంపెయినర్ ఎలా అవుతావు? అంటూ నిలదీశారు. గతంలో బీసీ వర్గానికి చెందిన స్వామిగౌడ్, మల్లేష్‌గౌడ్, బిక్షమయ్యగౌడ్‌లను అనేక ఇబ్బందులకు గురిచేసి పార్టీ నుంచి వెళ్లిపోయేలా చేసింది నువ్వు కాదా? అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పోస్టర్లలో ప్రశ్నించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎందుకు లేదు..? స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని ఎందుకు నిలబెట్టలేదు.? అని ప్రశ్నించారు.

‘స్వంత సోదరుల్ని జడ్పీటీసీగా గెలిపించుకోలేని అసమర్థుడివి నువ్వు.. సొంత గ్రామమైన బ్రహ్మణవెల్లంలో సర్పంచ్, ఎంపీటీసీలను గెలిపించుకోలేని అసమర్థుడు.. కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ కడుదుల నగేష్ ఎమ్మెల్సీగా ఉంటానంటే ఎందుకు మద్దతు ఇవ్వలేదు.. నకిరేకల్ నియోజకవర్గంలోని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వాలు ఎన్ని చేయించారు..? మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్ధి తరపున ప్రచారం చేసిననకిరేకల్ నియోజకవర్గంలోని నువ్వు నియమించిన మండల పార్టీ అధ్యక్షులపై చర్యలు ఎందుకు తీసుకోలేదు..? వీటన్నింటికీ కారణం ఎవరు..? 2022లో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ మెంబర్‌షిప్‌లో నీకు సభ్యత్వం ఉందా?’ అని పోస్టర్లలో కనిపిస్తోంది.

మునుగోడు ఉప ఎన్నికల వేళ నల్లగొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజకీయాలపై కోవర్టు ఆరోపణలు విస్తృతంగా ప్రాచుర్యం పొందాయి. బీజేపీ తరఫున పోటీ చేసిన ఆయన సోదరుడు రాజగోపాల్‌రెడ్డి ఓడిపోవడానికి పరోక్షంగా దోహదపడ్డాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమైన మంత్రి, సీఎం కేసీఆర్‌ తనయుడు కల్వకుంట్ల తారక రామారావు ఈ ఆరోపణలు మునుగోడు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు.

ఈ ఆరోపణలు కాంగ్రెస్‌ కంటే.. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి గెలుపుపై ప్రభావం చూపాయి. గెలుపు అంచుల వరకు వచ్చి ఓడిపోవడానికి కొంత కారణమయ్యాయి. తాజాగా ఇవే ఆరోపణలు నల్లగొండ పొలిటికల్‌ తెరపైకి వచ్చాయి. కోవర్ట్‌ వెంకట్‌రెడ్డి అంటూ నల్లగొండ జిల్లాలో ఎంపీ కోమటిరెడ్డికి వ్యతిరేకంగా నిఖార్సైన కాంగ్రెస్‌ కార్యకర్తల పేరుతో వాల్‌ పోస్టర్లు వెలిశాయి. ఇందులో ఎంపీకి 13 ప్రశ్నలను సంధించారు.

ఇవి ఇప్పుడు కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్నాయి. నల్లగొండ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. హైదరాబాద్‌ –విజయవాడ 65వ జాతీయ రహదారిపై నకిరేకల్‌ మండలం చందంపల్లి దగ్గర ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు ఈ పోస్టర్లు అంటించారు. కాంగ్రెస్‌ పార్టీ చేసిన డిజిటల్‌ సభ్యత్వం ఉందా అని ప్రశ్నిస్తూ సొంత గ్రామంలో సర్పంచ్, ఎంపీటీసీలను గెలిపించుకోలేని అసమర్థుడు అని పేర్కొన్నారు. సొంత సొదరున్ని నార్కట్‌పల్లిలో జెడ్పీటీసీగా ఎందుకు గెలిపించుకోలేదని, నకిరేకల్‌ మున్సిపాలిటీలో రెండు కౌన్సిలర్లను కూడా గెలిపించలేక్‌ పోయాడని విమర్శించారు.

నల్లగొండలో తీవ్ర చర్చజరుగుతున్న ఈ పోస్టర్ల వ్యవహారం ఎవరి పని అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ విషయం కాంగ్రెస్‌ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు దూరమైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇటీవలే పార్టీ ఇన్‌చార్జిగా మాణిక్‌రావు ఠాక్రే బాధ్యతలు చేపట్టాక మళ్లీ దగ్గరయ్యారు. గాంధీ భవన్‌కు వచ్చారు. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డితో ముచ్చటించారు. ఇలాంటి తరుణంలో నిఖార్సయిన కాంగ్రెస్‌ కార్యకర్త పేరుతో
పోస్టర్లు వెలువడం కలకలం రేపింది.

నిజంగా ఇది కాంగ్రెస్‌ కార్యకర్త పనా లేక బీఆర్‌ఎస్‌ నేతలు కావాలని ఇలా వేయించారా అన్న అనుమానాలు కాంగ్రెస్‌లో వ్యక్తమవుతున్నాయి. మునుగోడు అభ్యర్థి పాల్వాయి స్రవంతి అనుచరుల పని అయి ఉండొచ్చని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరికొందరు బీఆర్‌ఎస్‌ నేతలు, లేదా మంత్రి జగదీశ్‌రెడ్డి అనుచరులు ఇలా పోస్టర్లు వేయించి ఉంటారని పేర్కొంటున్నారు.

ఏది ఏమైనా మూడు నెలల తర్వాత ఎంపీ వెంకటరెడ్డిపై మళ్లీ కోవర్టు పోస్టర్లు వేయడం ఇటు కాంగ్రెస్‌ను, అటు కోమటిరెడ్డి అనుచరులను కలవరపెడుతోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొత్త ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే వచ్చాక గ్రూపు గొడవలు సద్దుమణిగాయని, నిన్నటిదాకా కొట్టుకున్న పెద్ద నాయకులంతా ఒక్కటయ్యారని కాంగ్రెస్ కార్యకర్తలు సంతోషపడుతున్న సమయంలో కాంగ్రెస్ లో గొడవలు అంత ఈజీగా సమసిపోవన్న నిజం బైటికి వచ్చింది.

ఒక వైపు మొన్నటి వరకు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్న నాయకులు నిన్న చేతిలో చేయివేసుకొని, ఆలింగనాలు చేసుకొని మేమంతా ఒక్కటే అని గాంధీభవన్ లో ప్రదర్శించిన దృశ్యాలు…మరో వైపు నాయకుల మీద ఆరోపణలతో వీధుల్లో గోడలకెక్కిన పోస్టర్లు… చర్చనీయాంశంగా మారాయి. ఈ 13 ప్రశ్నల పోస్టర్లు ఇప్పుడు కాంగ్రెస్ లో ఆరిపోతుందనుకున్న ముఠాల కుంపటిని మళ్ళీ రాజేశాయి.

ఈ పోస్టర్లు వేసింది ఎవరు ? వేయించింది ఎవరు ? ఆ ప్రశ్నల రూపకర్తలెవరు ? అనే ప్రశ్నలు మళ్ళీ రాజుకుంటాయి. మళ్ళీ ఒకరిపై ఒకరు బురద జల్లుకునే రోజు ఎంతో దూరంలేదేమో ? అన్న చర్చ హాట్ టాపిక్ గా మారింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 6వ తేదీ నుంచి తెలంగాణలో పాద యాత్ర ప్రారంభించనున్న తరుణంలో, కోమటి రెడ్డితో సహా, సీనియర్లందరినీ కలుపుకపోవడానికి ఆయన తీవ్రంగా శ్రమిస్తున్న తరుణంలో ఈ పోస్టర్లు కోమటి రెడ్డికే కాదు, రేవంత్ కు కూడా ఇబ్బందులు తేనున్నాయని కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

మరోవైపు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత కొంతకాలంగా పార్టీ శ్రేణుల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. అధిష్టానం జారీ చేసిన షోకాజ్ నోటీసులను చెత్తబుట్టలో వేసిన నువ్వు అధిష్టానాన్ని అగౌరవపరచలేదా అంటూ ప్రశ్నించారు. నల్గొండ జిల్లాలో పార్టీ నాశనం కావడానికి కారణం ఎవరు నువ్వు కాదా? అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని టార్గెట్ చేశారు. ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై నల్గొండలో వెలసిన ఈ పోస్టర్లు స్థానికంగా ఆసక్తికర చర్చకు కారణంగా మారాయి. ఈ పోస్టర్లు వేసిన వారు ఎవరు అన్నదానిపై ప్రస్తుతం స్థానికంగా చర్చ జరుగుతుంది.

మరి ఈ పోస్టర్ల రచ్చ కథేంటో.. దీని వెనుక ఎవరు ఉన్నారో వేచి చూడాల్సిందే.


Must Read

spot_img