Homeతెలంగాణకోమటిరెడ్డి వెంకటరెడ్డి గోడమీది పిల్లి వాటం ప్రదర్శిస్తున్నారా?

కోమటిరెడ్డి వెంకటరెడ్డి గోడమీది పిల్లి వాటం ప్రదర్శిస్తున్నారా?

కాంగ్రెస్ ను వీడేందుకు రంగం సిద్దం చేసుకుంటూనే.. మరో వైపు తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారా? ఆ ముచ్చట రాకుండా ఉండేందుకే రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని ఒకసారి.. నల్లగొండ నుంచే పోటీ చేస్తానని మరోసారి.. అసలు రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తానని ఇంకోసారి అంటున్నారా?

కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యూహం ఎంటో అంతుచిక్కక క్యాడర్ తో పాటు కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారా..?

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మాట మీద నిలకడ లేని రాజకీయ నేత అనగానే వెంటనే వినిపించే పేరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్ సీనియర్ నేతగా, మాజీ మంత్రిగా గుర్తింపు ఉన్న ప్రస్తుత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉదయం మాట్లాడేదానికి.. సాయంత్రం చెప్పేదానికి పొంతన ఉండదని రాజకీయవర్గాల్లో బలమైన టాక్. అయితే అదే తన మార్కు రాజకీయంగా మాట్లాడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక తాజా పరిణామాలు గమనించినా అదే తీరును సదరు ఎంపీ ప్రదర్శిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

మునుగోడు ఉపఎన్నిక ఫలితం తాను ఆశించినదానికి భిన్నంగా రావడం.. తమ్ముడి కోసం తాను చేసిన ప్రయత్నాలు బహిర్గతం కావడంతో ఇరుకున పడ్డ
వెంకటరెడ్డి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైందని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అందులో నుంచి బయటపడేందుకు.. అదే
సమయంలో బిజెపితో సఖ్యత వీడకుండా ఉండేందుకు వ్యూహాత్మకంగా వ్యహరిస్తున్నారు వెంకటరెడ్డి. దీంతో అసలే మాట నిలకడ లేని నేత
కావడంతో, ఆయన దారెటు .. వ్యూహమేంటి అన్న చర్చ .. జిల్లావ్యాప్తంగానే కాక తెలంగాణ అంతటా ఆసక్తికరంగా మారింది.

మునుగోడు ఉపఎన్నికల్లో బిజెపి తరుపున పోటీ చేసిన తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి విజయం సాధించినట్లయితే ఈ పాటికి అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
కూడా కషాయ కండువా కప్పుకొని ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్లేవారన్న బలమైన వాదన వినిపిస్తోంది. కానీ ఫలితం వేరే విధంగా రావడంతో.. రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయకుండా.. దూరంగా ఉంటున్నానని..

ఇక రిటైర్మెంట్ ప్రకటిస్తాననే మాటలు మాట్టాడుతూ..తనకు తాను కవర్ చేసుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. మునుగోడు ఉపఎన్నికల సమయంలోనే అదే ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ తరుపున ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తూ… పార్టీ చూడకుండా బిజేపి నుంచి పోటీ చేస్తున్న తన తమ్ముడికి మద్దతు ఇవ్వాలంటూ ఓ ఓటరుకు కాల్ చేసి.. అది బయటకు రావడంతో ఇరుకున పడ్డారు వెంకటరెడ్డి. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో దానిని కవర్ చేసుకునేందుకు తాను చాలా పదవులు అనుభవించానని.. ఇక రిటైర్ అవుతానంటూ చెప్పుకొచ్చారు. అయితే కాల్ రికార్డింగ్ బయటపడిన తర్వాత మొన్నటి వరకు తనకు రాజకీయ జన్మనిచ్చిన నల్లగొండ వైపు ముఖం చూపలేదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

ఇటీవల తిరుపతి వెళ్ళిన సమయంలో తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని.. ఎన్నికలకు నెలముందు మాత్రమే తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. ఓ పార్టీలో ఎంపీగా ఉంటూ.. రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పడంపై పెద్దఎత్తున్న విమర్శలు వ్యక్తమయ్యాయి. కడుపునిండా అన్నం తింటూ తాను నిరహారదీక్షలో ఉన్నట్లు చెప్పుకుంటున్నారని ఆయన పార్టీలోనే కౌంటర్లు వచ్చాయి. ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన కమిటీల్లో పేరు లేకపోవడంతో వెంకటరెడ్డి కంగుతిన్నట్లుగా సమాచారం. గతంలో అసంతృప్తి వెళ్లగక్కిన సమయంలో సముధాయించేందుకు టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్ పదవి ఇవ్వడంతో.. ఈసారి కూడా అలాంటి కీలకమైన పదవి లభిస్తుందని ఆశపడ్డారు.

కానీ అధిష్టానం తనను కనీసం పరిగణనలోకి తీసుకోకపోవడంతో మళ్లీ కవర్ చేసుకునే ప్రయత్నాల్లో పడ్డారని టాక్. రెండు రోజులకే నల్లగొండ వచ్చి తాను నల్లగొండ నుంచే పోటీ చేస్తానని..ఇక పై నల్లగొండపై ఫోకస్ చేస్తానని ప్రకటించారు. అయితే ఏ పార్టీ అంటే మాత్రం తన మెడలో కాంగ్రెస్ కండువా ఉందని చెప్పుకొచ్చారు. కేవలం నల్లగొండపై దృష్టి పెట్టిన కొంతమంది సొంత పార్టీ నేతలకు చెక్ పెట్టేందుకే ఆయన అలా మాట్లాడారని ప్రచారం జరిగింది ఇక తాజాగా దేశరాజదాని ఢిల్లిలో .. తాను రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఏఐసీసీ అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి మల్లిఖార్జున ఖర్గేను కలిసిన మరుసటి రోజే కోమటిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

తాజాగా ప్రకటించిన కమిటీ్లో తన పేరు ఎక్కడా లేకపోవడంపై గుర్రుగా ఉన్న కోమటిరెడ్డి.. ఆ విషయం ఎక్కడా బయటపడకుండా.. తాను తెలంగాణ కోసం మంత్రి పదవి వదులకున్నానని, తనకు పదవులు ముఖ్యం కాదంటూ… పాతమాట అందుకున్నారు. ఈ విషయంలోనే మల్లిఖార్జున ఖర్గేను కలిసిన సమయంలో చర్చించినట్లు సమాచారం. అయితే అన్నీ సర్థుకుంటాయని.ప్రస్తుతానికి టిపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డితో కలిసి సాగాలని.. ఏఐసిసి అధ్యక్షులు కాస్త గట్టిగానే చెప్పినట్లు సొంత పార్టీ నేతలే చెబుతున్నారు.కొంతమంది నేతలు పార్టీ వీడుతున్న అంశాలు చెప్పే సమయంలో ఖర్గే పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. ఖర్గే తో సమావేశం తర్వాత ప్రస్తుత పరిణామాలపై క్లారిటీ వచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉద్దేశ్యపూర్వకంగానే రిటైర్మెంట్ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

ఓ వైపు కాంగ్రెస్ నేతగా ఉంటూనే.. మరో వైపు బిజెపి వైపు నుంచి దారులు ఓపేన్ గా ఉంచుకునేలా గోడమీది పిల్లివాటాన్ని కోమటిరెడ్డి ప్రదర్శిస్తున్నారని సొంత పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. వచ్చే ఏడాది తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ లోపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కచ్చితంగా బిజెపి తీర్థం పుచ్చుకుంటారని చర్చ జరుగుతోంది.

గతంలోనూ పలుమార్లు పార్టీ మారుతారని ప్రచారం జరిగినా.. చివరకు అది ఉత్తుత్తదే అని తేలిపోయింది. కానీ ఇప్పటికే సోదరుడు బిజెపి తరుపున క్రీయాశీలకంగా ఉండడం.. ప్రధాని మోడీ నేరుగా వెంకటరెడ్డికి అపాయింట్ మెంట్ ఇస్తున్న తాజా పరిణామాల నేపథ్యంలో ఈ సారి పార్టీ మార్పు ఖాయంగా తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో అప్పటికే పరిణామాలు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంటే.. తాను ఇబ్బంది పడాల్సి వస్తుందని.. అందుకనే వ్యూహాత్మకంగా ఓ వైపు కాంగ్రెస్ లో కొనసాగుతూనే.. మరో వైపు బిజెపితో సఖ్యతతో వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తీరును గమనిస్తున్న రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని తనకు తానే సీటు ప్రకటించేసుకోవడం గమనార్హం. ఏ పార్టీ తరఫున పోటీ చేస్తాననేది ఎన్నిక
సమయంలో చెబుతానని ఆయన కించిత్ సస్పెన్స్ కూడా లేని డైలాగును వల్లించారు. అన్నదమ్ములు ఇద్దరూ బిజెపి తరఫున అసెంబ్లీ బరిలోనే
ఉండనున్నారని మోడీతో భేటీ ద్వారా తేలిపోయినట్లేనని టాక్ వెల్లువెత్తుతోంది. ఖర్గేను కలిసిన రోజుల వ్యవధిలోనే మోడీని కలవడం.. వచ్చే ఎన్నికల్లో నల్గొండనుంచి ఎమ్మెల్యేగానే బరిలో ఉంటానని ప్రకటించేయడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నుంచి నాయకులు వరుసగా వెళ్లిపోతున్న తరుణంలో పెద కోమటిరెడ్డి పోక కూడా ఖరారైనట్టేనని అటు సెగ్మెంట్లోనూ ఇటు జిల్లావ్యాప్తంగా టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం ఎంపీ పదవి ఉన్నది గనుక.. అనర్హత వేటు పడకుండా ఆయన జాగ్రత్త తీసుకుంటున్నారని విశ్లేషకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో కోమటిరెడ్డి గోపీ వాటం.. ఆయనకు ప్లస్ అవుతుందా.. నష్టం తెస్తోందా అన్న చర్చ పార్టీలో ముఖ్యంగా కేడర్ లో అంతర్గతంగా సాగుతోంది. అదేసమయంలో ఆయన పోటీపై చేసిన వ్యాఖ్యలపై అధిష్టానం ఏం చేయనుందన్న చర్చ కూడా వినిపిస్తోంది.

మరి కోమటిరెడ్డి .. వ్యూహంపైనే సర్వత్రా ఆసక్తి రేకెత్తుతోంది.

Must Read

spot_img