Homeఅంతర్జాతీయంకిమ్ జోంగ్ వార్నింగ్.. ఎవరికి..?

కిమ్ జోంగ్ వార్నింగ్.. ఎవరికి..?

ప్రస్తుతం ఎటు చూసినా యుధ్దం వార్తలే వినిపిస్తున్నాయి.. అటు ఓ వైపు ఉక్రెయిన్ రష్యా యుధ్దం కొనసాగుతూనే ఉంది..ఇటు చైనా తైవాన్ పై ద్రుష్టిపెట్టిందన్న వార్తలు కూడా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ లోగా ఉత్తరకొరియా చిచ్చరపిడుగు కిమ్ జాంగ్ ఉన్ సైతం యుధ్దం ప్రస్తావన తెస్తూ సైనిక డ్రిల్ లో హాట్ కామెంట్స్ చేసారు. యుధ్దానికి సిధ్దం కావాలని సైనికులకు ఉద్భోదించారు..

యుద్ధానికి సిద్ధం కమ్మంటూ సైనిక డ్రిల్‌లో ఉత్తర కొరియా అధ్యక్షుడు నియంత కిమ్ జాంగ్ ఉన్ హాట్ కామెంట్స్ చేసారు. సైన్యాన్ని నిజమైన యుద్ధం కోసం విన్యాసాలు తీవ్రతరం చేయాలని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆదేశించినట్లు ఆ దేశ అధికారిక మీడియా కేసీఎన్ఏ వెల్లడించింది. తన రెండో కుమార్తెతో కలిసి సైనిక విభాగం ఫైర్ డ్రిల్ ను కిమ్ పర్యవేక్షించినట్లు తెలిపింది. సదరు కార్యక్రమం ఫోటోలను అధికారిక మీడియా విడుదల చేసింది.

ఫోటోల్లో కిమ్, ఆయన కుమార్తెల హడావిడి కనిపించింది. ఇద్దరు నల్లటి జాకెట్లు ధరించి, యూనిఫాంలో ఉన్న అధికారులతో కలిసి గురువారం ఫిరంగి దళం చేపట్టిన క్షిపణి ఫైరింగ్ ను వీక్షించారు. నిన్న ఒక బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని గుర్తించామని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. అదే ప్రదేశం నుంచి మరిన్ని ప్రయోగాలు జరిగే అవకాశలున్నట్లు తమ నిపుణులు విశ్లేషిస్తున్నారని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. హ్వాసాంగ్ యూనిట్ ఒకేసారి కనీసం ఆరు క్షిపణులను పరీక్షించిందనీ.. దాడుల కోసం ఈ మిషన్ శిక్షణ తీసుకుందని కేసీఎన్ఏ అధికారులు ఫోటోలను రిలీజ్ చేశారు.

కొరియా పశ్చిమ సముద్ర లక్షిత జలాల్లోకి హ్వాసాంగ్ విభాగం శక్తివంతమైన క్షిపణులను పరీక్షించినట్లు తెలిపింది. ఈ డ్రిల్ ను పరిశీలించిన ఉత్తర కొరియా అధినేత.. రెండు వ్యూహాత్మక మిషన్లు.. అంటే.. యుద్దాన్ని నిరోధించడం.. యుద్దంలో చొరవ తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని రెండు రకాలుగా సైనికులకు సూచించినట్లు సమాచారం. ఇటువంటి యూనిట్లు నిజమైన యుద్దం కోసం వివిధ పరిస్థితులలో విభిన్న రీతిలో వివిధ అనుకరణ డ్రిల్స్ ను స్థిరంగా తీవ్రతరం చేయాలి అని కిమ్ జోంగ్ ఉన్ తెలిపారు.

దక్షిణ కొరియా-ఆమెరికా ఈ ఐదేళ్లలోనే అతి పెద్ద సంయుక్త సైనిక విన్యాసాలను సోమావారం నుంచి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఉత్తర కొరియాలో ఆ దేశపు సైన్యం పెద్ద ఎత్తున డ్రిల్ జరిపింది. ఉభయ కొరియాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రస్తుతం తారాస్థాయికి చేరుకున్నాయి. ఉత్తర కొరియా మరింత రెచ్చగొట్టేలా అణ్వాయుధ, క్షిపణి పరీక్షలను నిర్వహిస్తోంది. దీనికి ప్రతిస్పందనగా దక్షిణ కొరియా.. అగ్రరాజ్యం ఆమెరికాతో భద్రతా సహకారాన్ని తీసుకుంటోంది. కాగా.. అగ్రరాజ్యం ఆమెరికాకు ఉత్తర కొరియా అధినేత సోదరి కిమ్ యో జోంగ్ రెండు రోజుల క్రితమే వార్నింగ్ ఇచ్చారు. ఆమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాపసాల పట్ల ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము పరీక్షించే క్షిపణులను కూల్చివేస్తే, అది ఉత్తర కొరియాపై యుద్ధం ప్రకటించినట్టుగానే భావిస్తామన్నారు.

ఉత్తర కొరియా అధినేత సోదరి కిమ్ యో జోంగ్ చేసిన ఘాటు వ్యాఖ్యలు ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెంచాయి. ఉత్తర కొరియా వ్యూహాత్మకంగా క్షిపణి పరీక్షలు చేపడుతుందని, అందుకు వ్యతిరేకంగా ఆమెరికా చేపట్టే ఎలాంటి సైనిక చర్య అయినా సరే.. అది యుద్ద ప్రకటనే అవుతుందని ఆమె తేల్చి చెప్పారు. ఆమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు కిమ్ యో జోంగ్. ఇది తమ ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను పెంచుతుందని ఉత్తర కొరియా వెల్లడించింది. ఉద్దేశపూర్వకంగానే తమను రెచ్చగొడుతున్నారని కిమ్ జోంగ్ సోదరి కిమ్ యో జోంగ్ ఆరోపించారు. ఆమెరికా B-52 బాంబర్ ను దక్షిణ కొరియా ఫైటర్ జెట్ లతో జాయింట్ డ్రిల్ కోసం మోహరించింది. ఈ నేపథ్యంలో కిమ్ కూడా దూకుడు పెంచారు. ఉత్తర కొరియా సైన్యాన్ని యుద్దానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.

ఒకవైపు ఉత్తర కొరియాలో ఆకలి కేకలు వినిపిస్తున్న వేళ.. ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె ‘జు-ఏ’ మాత్రం విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నట్లు దక్షిణ కొరియా మీడియా తెలిపింది. దేశంలోని చాలా మంది పౌరులు అతి తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. పాలక వర్గాల విలాసవంతమైన జీవనశైలి, సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాల మధ్య పూర్తి వ్యత్యాసాన్ని హైలైట్ చేసింది. ఈ నివేదికలు ఉన్నప్పటికీ, కిమ్ జోంగ్ ఉన్ తన దేశానికి చెందిన శక్తివంతమైన క్షిపణుల ఆయుధాగారాన్ని ప్రదర్శించడంపై దృష్టి సారించారు. ఇది తన ఆధిపత్యాన్ని కొనసాగించడానికి కీలకమైనదిగా భావిస్తున్నారు కిమ్. ఇది ఉత్తర కొరియా క్షిపణి కార్యక్రమాన్ని ప్రాంతీయ సుస్థిరతకు ముప్పుగా భావించే పొరుగు దేశాలు, అంతర్జాతీయ సమాజాన్ని ఆందోళనకు గురి చేసింది.


Must Read

spot_img