Homeతెలంగాణకేసీఆర్ మీద పోటీకి సై అంటోన్న ఈటల...

కేసీఆర్ మీద పోటీకి సై అంటోన్న ఈటల…

ఈటల రాజేందర్‌ను ఎలాగైనా ఓడించాలని కేసీఆర్ చేసిన ప్రయత్నాలు ఉపఎన్నికల్లో ఫలించలేదు. కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఈటలను ఓడించాలని లక్ష్యంగా బీఆర్ఎస్ పెట్టుకుంది. ఈసారి బాధ్యతలను కేటీఆర్ తీసుకున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన కేటీఆర్.. అభ్యర్థిగా పాడి కౌశిక్ రెడ్డిని పరోక్షంగా ప్రకటించారు. వచ్చే 8 నెలలు ప్రజల్లోనే ఉండాలని సూచించారు. బైపోల్‌లో ఈటలపై గెల్లు శ్రీనివాస్‌ యాదవ్ పోటీ చేశారు. ఆయన సమక్షంలోనే కౌశిక్‌రెడ్డి పేరును కేటీఆర్ ప్రకటించారు.

దీంతో వచ్చే ఎన్నికల్లో ఈటలను కౌశిక్ రెడ్డి ఢీ కొట్టనున్నట్లు తెలుస్తోంది. బహిరంగ సభతో బలం నిరూపించుకున్న కౌశిక్‌రెడ్డిని హుజురాబాద్ ప్రజలు కచ్చితంగా ఆశీర్వదిస్తారని మంత్రి కేటీఆర్ చెప్పారు. కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్‌కి కంచుకోట. ఎన్నికలు, ఉప ఎన్నికలు ఏదైనా ఇక్కడి ఓటర్లు బీఆర్ఎస్‌కే పట్టం‌ కట్టారు. అయితే నియోజకవర్గాన్ని బీఆర్ఎస్‌లో ఉండి కంచుకోటగా మార్చుకుంది ఈటల రాజేందర్.ఆయన బీజేపీలో చేరి.. ఆ పార్టీ తరపున పోటీ చేయడంతో బీఆర్ఎస్ కంచుకోట కాస్తా ఈటల రాజేందర్ కంచుకోటగా మారింది.ఎమ్మెల్యేగా గెలుపొంది నేరుగా ముఖ్యమంత్రికే సవాల్‌ విసురుతున్నారు.

దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈటలను ఓడించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగానే అభ్యర్థిని ప్రకటించినట్లుగా తెలుస్తోంది. హుజూరాబాద్‌లో ఇప్పటి వరకూ నియోజకవర్గంలో కుమ్ములాటలు ఉన్నాయి. మొత్తం మూడు వర్గాలు బీఆర్ఎస్ టిక్కెట్ కోసం పోటీ పడటం ప్రారంభించాయి. ఉప ఎన్నికలలో ఎవ్వరూ ఊహించని విధంగా బిసి కార్డు బాగా పని చేస్తుందని గెల్లు శ్రీనివాస్‌ని బరిలో దింపింది. ఈటెల రాజేందర్ కి ప్రధాన పోటీదారుడు అయిన కౌషిక్ రెడ్డిని కూడా కాంగ్రెస్ నుంచి చేర్చుకుని గులాబి కండువా కప్పి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు.

గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ని హుజురాబాద్ ఎమ్మెల్యేగా గెలిపిస్తే, ఎమ్మెల్యేగా గెల్లు శ్రీనివాస్, ఎమ్మెల్సీగా కౌషిక్ రెడ్డి ఇద్దరూ వన్ ప్లస్ వన్ ఆఫర్ తో నియోజకవర్గం అభివృద్ధి చేస్తారని ఉప ఎన్నికల సందర్భంగా టిఆర్ఎస్ అగ్ర నేతలు ప్రకటించారు. ఇక ఉప ఎన్నికల తర్వాత ఇక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నాయకులు బలప్రదర్శన చేస్తూ ఒకరంటే ఒకరు హైకమాండ్ దృష్టిలో పడేందుకు ప్రయత్నించారు. ఉప ఎన్నికలలో ఓడిపోయిన‌ గెల్లు శ్రీనివాస్ కు టిఆర్ఎస్ నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ పదవి ఇచ్చింది.

ఎమ్మెల్సీగా గెలుపొందిన కౌషిక్ రెడ్డిని నియోజకవర్గ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అధిష్టానం సూచించారు. ఉప ఎన్నికల తరువాత గెల్లు శ్రీనివాస్ పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటు వస్తుండగా రెండు నెలల నుండి హుజురాబాద్ టిఆర్ఎస్ పార్టీలో ఒక్కసారిగా కౌషిక్ రెడ్డి దూకుడు పెంచారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ, బల ప్రదర్శన చేసుకుంటూ వస్తున్నారు. కౌషిక్ రెడ్డి దూకుడు పెంచడంతో వచ్చే ఎన్నికల్లో కౌషిక్ రెడ్డే ఎమ్మెల్యేగా పోటి చేస్తారనే ప్రచారం చేస్తున్నారు. దీంతో గెల్లు శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించి తానే ఎమ్మెల్యేగా వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తానని ప్రకటించారు.

పాడి కౌషిక్ రెడ్డి సవాల్‌కి తనకి సంబంధం లేదని, నియోజకవర్గ ఇంచార్జ్ గా తనకి సంబంధం లేదని ప్రకటించారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. హుజురాబాద్‌లో టిఆర్ఎస్ పార్టీ రెండు వర్గాలుగా కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో ఎవ్వరితో ఉండాలో ఎలా వ్యవహరించాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు ద్వితీయ శ్రేణి నాయకులు. ఏ పరిస్థితి ఎలా ఉంటుందోనని, ఎందుకైనా మంచిదని ఇద్దరి కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. అయితే ఇప్పుడు గెల్లు శ్రీనివాస్ ను పక్కన పెట్టి.. కౌశిక్ రెడ్డికే కేటీఆర్ అభ్యర్థిత్వం ప్రకటించారు.

అయితే ఈటల మాత్రం తాను సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తానని ప్రకటించిన వేళ .. కేటీఆర్ ప్రకటన చర్చనీయాంశంగా మారుతోంది. ఇదిలా ఉంటే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగులందరికీ సీట్లు ఇస్తామని కేసీఆర్‌ మూడు నెలల క్రితమే ప్రకటించారు. ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని కూడా తెలిపారు. దీంతో టికెట్‌ ఆశిస్తున్నవారు కొంత పునరాలోచనలో పడ్డారు. కానీ ఎవరూ అసంతృప్తి వ్యక్తం చేయలేదు. ఎన్నికల సమయం నాటికి పరిస్థితి మారుతుందని ధీమాతో ఉన్నారు.

ఈ క్రమంలో కేసీఆర్‌ తనయుడు, తెలంగాణ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సొంతంగా అభ్యర్థులను ప్రకటించే పనిలో ఉన్నారు. కరీంనగర్‌ జిల్లా పర్యటనకు వచ్చిన కేటీఆర్‌ జమ్మికుంటలో నిర్వహించిన బహిరంగ సభలో హుజూరాబాద్‌ అభ్యర్థిగా పాడి కౌషిక్‌రెడ్డిని ప్రకటించారు. రాబోయే ఎనిమిది, తొమ్మిది నెలలు జనంలోనే ఉండాలని సూచించారు. కౌషిక్‌ సారథ్యంలోనే హుజూరాబాద్‌ ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. కేసీఆర్‌ ఆలోచనకు, ప్రకటనలకు విరుద్ధంగా కేటీఆర్‌ హుజూరాబాద్‌ అభ్యర్థిని ప్రకటించడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో కేసీఆర్, కేటీఆర్‌ మధ్య దూరం మరింత పెరిగిందన్న అభిప్రాయం గులాబీ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది.

హుజురాబాద్‌ నియోజకవర్గం లో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ నేతల మధ్య ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో టికెట్‌ కోసం హోరాహోరి పోరాటం జరుగుతుంది. ఉప ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన గెల్లు శ్రీనివాస్‌కు నియోజకవర్గ ఇన్‌చార్జిగా అవకాశం దక్కింది. తనకే టికెట్‌ వస్తుంది అనుకుంటున్న వేళ కేటీఆర్‌ ఊహించని షాక్‌ ఇచ్చారు. హుజురాబాద్‌ ఉప ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈటల రాజేందర్‌ను ఓడించాలని కేసీఆర్‌ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం ఈటల రాజేందర్‌ను ఓడించడం టార్గెట్‌గా పెట్టుకొని రంగంలోకి దిగారు మంత్రి కేటీఆర్‌.

మరోవైపు వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ మీద పోటీ చేసి గెలుస్తానని ఈటల ప్రకటించారు. ఈమేరకు గజ్వేల్‌లో కార్యక్రమాలు ప్రారంభించారు. ఈటల గజ్వేల్‌వైపు చూస్తుంటే కేటీఆర్‌ మాత్రం ఈటల రాజేందర్‌ను ఓడించడమే లక్ష్యంగా హుజూరాబాద్‌ అభ్యర్థిని ప్రకటించడం చర్చనీయాంశమైంది. అయితే.. గత ఉప ఎన్నికల్లో ఓటమికి గెల్లు కూడా కారణమన్న భావన టీఆర్ఎస్ అధినాయకత్వంలో ఉన్నట్లు చెబుతున్నారు. అతడి బలం సరిపోకపోవటమే కాదు.. తాము ఎంత బలాన్ని ఇచ్చినా.. దాన్నిఅందిపుచ్చుకునే విషయంలో గెల్లు వెనుకబడి ఉన్నారని.. ఇలాంటి వారిని తాము మోయలేమన్న విషయాన్ని తాజాగా స్పష్టం చేసిందని చెప్పాలి.

తాజాగా నిర్వహించిన బహిరంగ సభకు మంత్రి కేటీఆర్ వస్తున్నారని పేర్కొంటూ భారీ ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు కౌశిక్ రెడ్డి. అందులో గెల్లు ఫోటో మిస్ అవడం. కొన్నింటిలో చాలా చిన్నదిగా ఉండటం సైతం చర్చనీయాంశంగా మారింది. ఈ సభకు భారీ ఎత్తున ఫ్లెక్సీల్ని పెట్టిన కౌశిక్ రెడ్డి దాదాపు యాభై వేల మంది వరకు జనసమీకరణ చేసినట్లుగా చెబుతున్నారు. కౌశిక్ రెడ్డిలో కనిపించే ఈ దూసుకుపోయే తత్త్వం కేటీఆర్ ను ఆకర్షించిందని చెబుతున్నారు. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికల వేళ.. ఉద్యమ నాయకుడు అంటూ భుజాన ఎత్తుకున్న గెల్లులోని ఉద్యమకారుడు.. ఇప్పుడేమైనట్లు? కేటీఆర్ కు అవేమీ ఎందుకు కనిపించనట్లు? అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే హుజూరాబాద్ బీఆర్ఎస్‌లో వర్గ పోరుకు ఫుల్ స్టాప్ పడినట్లేనా అన్న చర్చ కూడా వెల్లువెత్తుతోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితిని అంచనా వేసిన బీఆర్ఎస్ అధిష్టానం.. ఈటలకు సరైన ప్రత్యర్థి కౌశిక్ రెడ్డే అని భావించినట్లు తెలుస్తోంది. ఇక సీఎం కేసీఆర్ మీద పోటీ చేసి గెలుస్తానని ఆయన కేసీఆర్ ను టార్గెట్ చేసే సవాల్ చేస్తున్న నేపథ్యంలో, వచ్చే ఎన్నికలలో ఎలాగైనా ఈటల రాజేందర్ ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకొని ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నారు మంత్రి కేటీఆర్.

Must Read

spot_img