Homeజాతీయంకరీంనగర్ కారు పార్టీలో ఏం జరుగుతోంది..?

కరీంనగర్ కారు పార్టీలో ఏం జరుగుతోంది..?

మొన్నటి వరకు ఉప్పు నిప్పులా ఉన్న కరీంనగర్ ఎమ్మెల్యే బీసీ శాఖ మంత్రి గంగుల కమలాకర్, మాజీ మేయర్ ప్రస్తుత పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్ కలిసి పోయారు. ఈ మధ్య జరిగిన జగిత్యాల జిల్లా బహిరంగ సభ తర్వాత రోజు రవీందర్ సింగ్ కూతురు వివాహానికి ప్రత్యేకంగా వచ్చారు సీఎం కేసీఆర్. అదే సమయంలో మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో కూడా ఆతిథ్యం స్వీకరించారు.

ఈ సమయంలోనే వీరిద్దరి మధ్య తిరిగి సత్సంబంధానికి సీఎం ప్రతిపాదించినట్లు తెలిసింది. అసలే రానున్న రోజుల్లో బిజెపి నుండి పోటీ ఎక్కువ అవుతున్న తరుణంలో విభేదాలు మంచివి కావని, పార్టీ నష్టపోయిన .. అధికారం చేజారిన .. పరిణామాలు అందరికీ ఇబ్బందికరంగా మారుతాయని సూచించినట్లు తెలిసింది.

ఇందులో భాగంగానే రవీందర్ సింగ్ కు కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టడమే కాకుండా తిరిగి వారిద్దరి మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలని కోరినట్లు తెలిసింది మొత్తానికి సర్దార్జీ మంత్రి జీ కలిసిపోయినట్లేనని ఇరు వర్గాల నేతలు ఆ పార్టీ కార్యకర్తలు సంబరపడుతున్నారు. కొంత కాలంగా రవీందర్ సింగ్ కు, మంత్రి గంగుల కమలాకర్‌కు మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. రవీందర్ సింగ్ ​గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి వ్యతిరేకంగా ఇండిపెండెంట్‌గా
పోటీ చేసి మంత్రికి వ్యతిరేకంగా పోరాటం చేశారు.

శాసన మండలిలో స్థానిక కోటా ఎన్నికల సమయంలో రవీందర్ సింగ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే కేసీఆర్ మాత్రం భానుప్రసాద్‌, ఎల్‌.రమణలకు అవకాశం ఇచ్చారు. దీంతో మనస్తాపం చెందిన ఆయన టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆ సమయంలో ఆయనపై కోడ్ ఉల్లంఘన కేసులో అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు 41(A) సీఆర్పీసీ నోటీసులు ఇచ్చి పంపించారు. ఇదంతా మంత్రి గంగుల కమలాకర్ చేయించారని సర్దార్ రవీందర్ సింగ్
ఆరోపించారు. కొద్ది రోజుల కిందట రవీందర్ సింగ్ ​అన్న కూతురు, కార్పొరేటర్ కమల్ జిత్ కౌర్ భర్త సోహన్ సింగ్ ఆడియో కలకలం రేపింది.

డివిజన్ లో అభివృద్ధి పనులను మంత్రి కావాలనే ఆపేస్తున్నారని సోహన్​ ఆరోపణలు చేశారు. దీంతో డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు ప్రెస్ మీట్ పెట్టి మాజీ మేయర్ సహా, కార్పొరేటర్ కమల్​జిత్​కౌర్, ఆమె భర్తను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఇప్పడు ఈ పరిస్థితులన్నీ సద్దుమణిగాయి.

ఈ నేపథ్యంలోనే సర్దార్ రవీందర్ సింగ్‌కు రాష్ట్ర స్థాయి పదవిని కేసీఆర్ ఇచ్చారు. ఆయనను బీఆర్ఎస్ తరపున జాతీయ రాజకీయాల్లో ఎక్కువగా వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో కరీంగనగర్ బాధ్యతలు గంగులకు.. జాతీయ స్థాయి పార్టీలో సర్దార్‌కు కీలక బాధ్యతలు అప్పగిస్తారని టాక్ వినిపిస్తోంది. కరీంనగర్ మేయర్‌గా పనిచేసిన రవీందర్ సింగ్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా ముద్రపడ్డారు.

అయితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ధిక్కార స్వరం వినిపించి టీఆర్ఎస్‌ రెబల్‌గా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓటమి పాలైనా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, రెండు దశాబ్దాలుగా ఆయనతో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని రవీందర్ సింగ్‌ను కేసీఆర్‌ మళ్లీ దగ్గరకు తీసుకున్నారు. ఆయనకు బీఆర్ఎస్ తరపున బీహార్ బాధ్యతలు ఇవ్వవొచ్చన్న ప్రచారం జరుగుతోంది.

మంత్రి గంగులతో పడక రాజీనామా వరకు వెళ్లిన మాజీ మేయర్ రవీందర్ సింగ్ కు జాక్ పాట్ కొట్టారు. ఆయన్ను రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌ గా
నియమించారు సీఎం కేసీఆర్. ఈ నియామకంపై భిన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. కేసీఆర్ గురి చూసి సింగ్ కు చెక్ పెట్టారని కొందరు అంటున్నారు. ఎందుకంటే.. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు సర్దార్‌ రవీందర్‌ సింగ్‌. ఉద్యమ సమయంలో కేసీఆర్‌ తో అత్యంత సన్నిహితంగా మెలిగారు. రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో కరీంనగర్‌ మేయర్‌ పదవిని చేపట్టి దక్షిణ భారతదేశంలో ఈ పదవిని చేపట్టిన ఏకైక సిక్కు నాయకుడిగా నిలిచారు.

స్థానిక సంస్థల ప్రతినిధిగా 20 ఏండ్ల అనుభవం కలిగిన రవీందర్‌ సింగ్‌కు కరీంనగర్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని కేసీఆర్‌ ప్రకటించారు. అయితే మంత్రి గంగుల కమలాకర్, రవీందర్‌ సింగ్‌ మద్య విభేదాలు నెలకొనడంతో పార్టీలో చీలిక మొదలైంది. మరోవైపు ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తూ సీఎంను కలిసేందుకు ప్రయత్నించినా సాధ్యపడకపోవడంతో రవీందర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆ సమయంలో టీఆర్ఎస్ కు రాజీనామా చేస్తూ కేసీఆర్ కు ఓ లేఖ కూడా రాశారు. ఆర్‌ఎస్‌లో చేరినప్పటి నుంచి అధిష్టానం ఏది చెబితే అదే చేశా…..
ఎమ్మెల్సీని చేస్తానని మాట ఇచ్చి తప్పారు. ఇలా చాలాసార్లు జరిగింది. కనీసం మిమ్మల్ని కలుద్దామని అనుకున్నా మీరు అపాయింట్‌ మెంట్‌ ఇవ్వడం లేదంటూ రాజీనామా పత్రంలో కేసీఆర్‌ ను తీవ్రంగా ప్రశ్నించారు రవీందర్ సింగ్. సీన్ కట్ చేస్తే.. తర్వాత మళ్లీ టీఆర్ఎస్ లోనే కొనసాగారు ఈయన. ఈ క్రమంలోనే.. రవీందర్ అసంతృప్తినిచల్లార్చేందుకు ఎట్టకేలకు పదవి కట్టబెట్టారు కేసీఆర్.

Must Read

spot_img