- ఏపీలో బీఆర్ఎస్ కోసం కేసీఆర్ శరవేగంగా పావులు కదుపుతున్నారా..?
- అందుకోసం గంటా, జేడీ టార్గెట్ గా వ్యూహాలు పన్నుతున్నారా..?
- ఇంతకీ వీరిద్దరి రాక .. బీఆర్ఎస్ కు ఏవిధంగా ప్లస్ కానున్నారన్నదే చర్చనీయాంశంగా మారింది.
టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేసి దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఉవ్విళ్లూరుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణపై కేసీఆర్ దృష్టిపెట్టారు. ముఖ్యంగా ఏపీలో పార్టీని భారీ స్థాయిలో విస్తరించాలని కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు వంటివారిని పార్టీలో చేర్చుకున్నారు.
ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కీలకంగా ఉన్నకాపులపైనే కేసీఆర్ దృష్టి సారించారని సమాచారం. మరోవైపు జనసేనను దెబ్బకొట్టడానికి తన ఆప్త మిత్రుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ కు మేలు చేయడానికే కేసీఆర్ కాపు నేతలపై దృష్టి సారించారని అంటున్నారు. ఇప్పటికే కాపు సామాజికవర్గానికి చెందిన తోట చంద్రశేఖర్, తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు, అఖిల భారత కాపు సంఘాలకు సంబంధించి ఒకరిద్దరు నేతలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో మరింత మంది కాపు నేతలను పార్టీలో చేర్చుకోవాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో ఏపీలో అతిపెద్ద నగరమైన విశాఖపట్నం పైన కేసీఆర్ దృష్టి సారించినట్టు టాక్. రానున్న రోజుల్లో విశాఖలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలో కాపు సామాజికవర్గానికి చెందిన విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణలపై బీఆర్ఎస్ దృష్టి సారించిందని సమాచారం.
తాజాగా బీఆర్ఎస్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడైన కేపీ వివేకానంద గౌడ్ విశాఖపట్నంలో ప్రత్యక్షమయ్యారు. జేడీ లక్ష్మీనారాయణ గంటా శ్రీనివాసరావులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ సమావేశమయ్యారు. వారిని బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్టు ప్రచారం జరుగుతోంది. తమ పార్టీలోకి వస్తే తగు ప్రాధాన్యత కల్పిస్తామని పదవులు సైతం ఇస్తామని ఆఫర్ చేసినట్టు చెబుతున్నారు. మరోవైపు 2019 ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు టీడీపీ నుంచి విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
అలాగే జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీ తరఫున విశాఖపట్నం బరిలో నిలిచి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత ఆయన జనసేనకు దూరమయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా లేదా తనకు నచ్చిన పార్టీ నుంచి పోటీ చేస్తానని ఆయన చెబుతున్నారు. ఇక గంటా శ్రీనివాసరావు గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలుపొందాక ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంది లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తన పదవికి రాజీనామా చేశారు.
అయినా స్పీకర్ ఆమోదించలేదు. తర్వాత గంటా వైసీపీలో చేరతారని వార్తలు వచ్చాయి. అయితే అవంతి శ్రీనివాసరావు విజయసాయిరెడ్డిలాంటివారు ఆయన రాకను అడ్డుకున్నారని ప్రచారం జరిగింది. మళ్లీ ఇటీవల కాలంలో గంటా యాక్టివ్ అయ్యారు. నారా లోకేష్ తో భేటీ అయ్యారు. ఇన్నాళ్లు చురుకుగా లేకపోవడానికి కారణాలను ఆయనకు వివరించారు. మరోవైపు గంటా శ్రీనివాసరావు పొడ మొదటి నుంచి గిట్టని విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు.. గంటా శ్రీనివాసరావుపై విమర్శలు ఎక్కుపెట్టారు. మళ్లీ ఎన్నికలు దగ్గరకు వస్తుండటం టీడీపీ, జనసేన పొత్తు కుదురుతుందనే అంచనాలు ఉండటంతోనే గంటా మళ్లీ టీడీపీలో యాక్టివ్ అయ్యారని ఎద్దేవా చేశారు.
ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు జేడీ లక్ష్మీనారాయణలపై కేసీఆర్ దృష్టి సారించారు. ఇద్దరూ కాపు నేతలే కావడం తెలంగాణలో బీజేపీ కాపులకు పెద్దపీట వేస్తుండటంతో కేసీఆర్ సైతం ముల్లును ముల్లుతోనే కోయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్.. గంటా జేడీలను కలిశారని టాక్ నడుస్తోంది. మరోవైపు విశాఖలో జరిగిన పెళ్లి కోసమే వివేకానంద వచ్చారని.. అందులో భాగంగానే ఆయనను కలిశామని గంటా చెబుతున్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని అంటున్నారు. ఇదిలా ఉంటే, కేసీయార్ తెలంగాణా సీఎం కాకముందే అవిభాజ్య ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశంలో ఉన్నారు. కొంతకాలం మంత్రిగా కూడా పనిచేశారు.
తెలుగుదేశం నాయకులు అందరితో ప్రాంతాల తేడా లేకుండా ఆయనకు పరిచయాలు ఉన్నాయి. ఇక హైదరాబాద్ లోనే ఏపీ నాయకులు అంతా ఉంటారు. ఆ విధంగా కేసీయార్ తో సాన్నిహిత్యం ఉంది. దీన్ని ఉపయోగించుకునే ఏపీలో బలపడాలని కేసీఆర్ భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందుకే .. ఏపీ నేతలే టార్గెట్ గా కేసీఆర్ పావులు కదుపుతున్నారని సమాచారం. ఇప్పుడు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి, జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ ఎంట్రీ ఇచ్చారు. దాంతో ఆయన ఫుల్ ఫోకస్ ఏపీ మీద పెట్టేశారు. ప్రత్యేకించి ఆయన ఒక బలమైన సామాజికవర్గం, ఒక బలమైన ప్రాంతం మీద దృష్టి పెట్టారు.
ఏపీలో కాపులు సాలిడ్ గా ఉన్న్నారు. వారి ఓటు బ్యాంక్ తోనే ఎవరైనా ముఖ్యమంత్రి పీఠాలు ఎక్కేది. కానీ ఆ కాపులకు మాత్రం ఆ పీఠం అందని ద్రాక్షగా ఉంది. ఈ నేపధ్యంలో పవన్ జనసేన పెట్టి తన వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ సైతం కాపుల కోసం పావులు కదుపుతోంది. జనసేనలో ఉన్న బలమైన నాయకుల్లో కొందరిని కేసీయార్ తీసుకున్నారు. అయితే బిగ్ షాట్స్ మీద ఆయన గురి పెట్టారని అంటున్నారు.
- ప్రస్తుతం మహారాష్ట్ర నాందేడ్ సభ మీద చూపు సారించిన కేసీయార్ అది అయిన తరువాత విశాఖలోనే బీయారెస్ సభ పెట్టాలని చూస్తున్నారు..
దీనిలో భాగంగా విశాఖ వేదికగా రాజకీయాలు చేస్తున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు మాజీ జేడీ లక్ష్మీనారాయణ మీద గురి పెట్ట్టారని తెలుసోంది. వీరిద్దరినీ బీయారెస్ లోకి తీసుకురావాలని అప్పుడే ఏపీలో తమ పార్టీ వేళ్ళూనుకుంటుందని కేసీయార్ భావిస్తున్నారని అంటున్నారు. ఇక జేడీ లక్ష్మీనారాయణ 2019లో జనసేన తరఫున విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడారు. ఈసారి తప్పనిసరిగా విశాఖ నుంచి పోటీ చేసి గెలవాలని ఆయన చూస్తున్నారు.
పార్టీ కోసం వెతుకుతున్నారు. సరిగ్గా ఆ పాయింట్ దగ్గరే బీయారెస్ నేతలు పట్టుకున్నారు. ఈ మధ్యనే తలంగాణా మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఆయంతో ఫోన్లో మాట్లాడారు అని అంటున్నారు. తమ పార్టీలోకి చేరాలని బిగ్ ఇన్విటేషన్ ఇచ్చారని చెబుతున్నారు. అయితే తాను బీయారెస్ లో చేరేదాని మీద అయితే జేడీ ఎలాంటి హామీ అయితే ఇప్పటిదాకా ఇవ్వలేదు అని అంటున్నారు.
ఈ ఇద్దరు కీలక నేతలు వస్తే కనుక బీయారెస్ కి ఇక ఏపీలో తిరుగులేదని కూడా ఆయన అభిప్రాయపడుతున్నారని భోగట్టా. దీని కంటే ముందు ఏపీ బీయారెస్ ప్రెసిడెంట్ తోట చంద్రశేఖర్ హైదరాబాద్ లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి కన్నా లక్ష్మీనారాయణతో సహా గంటా జేడీలని పిలిచి ముచ్చట్లు పెట్టారు. మరి ఆయన కూడా బీయారెస్ లో చేరమనే ఆహ్వానించారని అంటున్నారు. దీంతో ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఏపీలో బీఆర్ఎస్ ప్రధాన పార్టీలకు షాక్ ఇచ్చేందుకు సిద్దం అవుతోంది. ఏపీలో కీలకంగా ఉన్న ఇతర ప్రముఖుల పైన ఇప్పుడు ఫోకస్ పెట్టింది.
అందుకు వ్యూహాత్మకంగా ఏపీ నేతలతో సత్సంబంధాలు ఉన్న నేతలను రంగంలోకి దించుతోంది. ఇప్పుడు ఈ కొత్త పరిణామం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారుతోంది. ప్రస్తుతం ఉన్న పార్టీలో మనస్పూర్తిగా కొనసాగలేని వారు.. రాజకీయంగా సరైన వేదిక కోసం నిరీక్షిస్తున్న వారిని ఎంచుకుంటోంది. ఏపీ బీఆర్ఎస్ లో సీబఐ మాజీ లక్ష్మీనారాయణ ఎంట్రీ మేలు చేస్తుందని బీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు. దీంతో..ఇప్పటికే బీఆర్ఎస్ నేతల నుంచి ఆహ్వానం అందినట్లుగా ప్రచారం లో ఉంది. అయితే, గంటా -మాజీ జేడీ విశాఖ కేంద్రంగా ఏ అడుగు వేసినా రాజకీయంగా చర్చకు కారణమవుతోంది. త్వరలోనే విశాఖ కేంద్రంగా బీఆర్ఎస్ బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది.
మరి ఈ ఇద్దరి నేతల రాజకీయ అడుగులు ఎటువైపు అన్నదే చర్చనీయాంశంగా మారింది..