HomePoliticsకేసీఆర్ మాస్టర్ ప్లాన్..

కేసీఆర్ మాస్టర్ ప్లాన్..

కేసీఆర్ ఢిల్లీలో పెట్టాల్సిన బీఆర్ఎస్ సభను ఖమ్మంలో ఎందుకు పెడుతున్నారు…? అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే కేసీఆర్ ఖమ్మం నుంచే తెలుగు రాష్ట్రాల్ని, మరో 3 రాష్ట్రాలపైనా కన్నేశారని టాక్ వెల్లువెత్తుతోంది.

రెండు అడుగులు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతోంది బీఆర్ఎస్ పరిస్థితి. ముందుగా పార్టీ పేరు మార్పు కోసం చాలా కాలం వెయిట్ చేయాల్సి వచ్చింది. టీఆర్ఎస్.. బీఆర్ఎస్ గా మారిన వెంటనే ఢిల్లీ గల్లీలో గర్జిస్తామని గులాబీ నేతలు మీడియా ముందు తెగ ఊదరగొట్టారు. కానీ, ఇంతవరకు అది కార్యరూపం దాల్చలేదు.

అయితే.. దేశాన్ని ఏలుతున్న బీజేపీని గద్దె దించుతామని చెబుతూ.. ఇప్పుడు ఖమ్మం గుమ్మంలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత జనవరి 18న ఖమ్మం జిల్లా నూతన సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఈ సభకు ముగ్గురు ముఖ్యమంత్రుల్ని ఆహ్వానించారు.

వారిలో ఇద్దరు ఆప్ సీఎంలు కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌ ఉన్నారు. మరొకరు లెఫ్ట్ పార్టీ సీఎం విజయన్. ఇక యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ కు కూడా ఆహ్వానం పంపారు. ఈ సభ ద్వారా దేశ రైతాంగానికి, రాజకీయ పక్షాలకు స్పష్టమైన సందేశం ఇస్తామని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. జాతీయ పార్టీ సభను తెలంగాణలో పెట్టి.. ప్రచారం చేసుకుంటే ఎంతవరకు ఉపయోగం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణలో ఎంత భారీ సభ పెట్టినా ఇక్కడికే పరిమితం. ఇతర రాష్ట్రాల నేతలు వచ్చినా.. జాతీయ స్థాయిలో ప్రచారం జరగడం కష్టమేనంటున్నారు విశ్లేషకులు. అదే ఢిల్లీలోనే, యూపీలోనో భారీ సభ పెడితే అందరి కంట్లో పడే ఛాన్స్ ఉంటుందని సూచిస్తున్నారు. నిజానికి విశ్లేషకుల వాదనలో నిజం లేకపోలేదు. ఢిల్లీ గల్లీలో జరగాల్సిన సభను ఖమ్మంలో జరపడమే అనేక అనుమానాలకు తావిస్తోంది.

గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో మొత్తం 10 సీట్లు ఉంటే.. కేవలం ఒక్క ఖమ్మం అసెంబ్లీ మాత్రమే తక్కువ మెజారిటీతో టీఆర్ఎస్ గెలిచింది. మిగిలిన 9 చోట్ల ఓడిపోయింది. కాంగ్రెస్ 6, టీడీపీ 2, ఇండిపెండెంట్ ఒకటి గెలుచుకున్నారు. అయితే.. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో నలుగురు కాంగ్రెస్, ఇద్దరు టీడీపీ, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేని కేసీఆర్ లాగేసుకున్నారు. దీంతో బీఆర్ఎస్‌ కు 8, కాంగ్రెస్‌ కు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు.

అయితే.. వచ్చే ఎన్నికల్లో పదికి పది సీట్లు గెలవాలని గులాబీ నేతలు టార్గెట్ పెట్టుకున్నారు. కానీ, అది కుదిరే పని కాదనే చర్చ సాగుతోంది. అయితే కేసీఆర్ ఖమ్మం కేంద్రంగా బీఆర్ఎస్ ఆవిర్భావ సభను ఎందుకు నిర్వహిస్తున్నారు? ఖమ్మం సభ వెనుక అయిన మాస్టర్ ప్లాన్ ఏంటి? కెసిఆర్ లక్ష్యం ఏంటి? అన్నది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ కారణంగా మారింది.

ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు అంతగా పట్టు లేదు. ఇప్పుడు వామపక్షాలతో జట్టు కట్టినా.. అంతర్గత కుమ్ములాటలు నష్టాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ తో పార్టీలోకి వచ్చిన నేతలు, అంతకుముందు ఉన్న నాయకులకు పడడం లేదు. పైగా కొందరు నేతలు పదవులకు ఆశపడి భంగపడ్డారు. అలాంటి నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్త పరుస్తున్నారు.

కేసీఆర్ ఖమ్మంలో సభ నిర్వహిస్తున్న రోజే.. పొంగులేటి అమిత్ షాతో భేటీ కాబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనికితోడు ఇటీవలికాలంలో పొంగులేటి చేస్తున్న వరుస కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తన అనుచరులంతా పోటీ చేస్తారని, అలాగే తనకు పదవులు లేకున్నా ప్రజల ఆశీస్సులు ఉన్నాయని అన్నారు.

ఆయన బీజేపీలో చేరేందుకు సిద్ధం అయ్యారని అందులో భాగంగానే తన అనుచరులను సిద్ధం చేసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్యలు కూడా అనుమానంగా ఉన్నాయి. ఈయన చాలాకాలంగా అధిష్టానంతో అసంతృప్తితో ఉన్నారని సమాచారం. అదును చూసి జంప్ అవ్వాలని చూస్తున్నారనే ప్రచారం ఉంది. అంతేగాక ఈమధ్యే టీడీపీ, వైఎస్సార్టీపీ ఖమ్మం జిల్లాలో బహిరంగ సభలు నిర్వహించాయి.

ఆ రెండు పార్టీలకు బలమైన క్యాడర్ ఉంది. ఈ నేపథ్యంలో అన్నింటికీ చెక్ పెట్టేందుకు.. ఈసారి క్లీన్ స్వీప్ చేసేందుకే కేసీఆర్ ఖమ్మంపై ఫోకస్ పెట్టారని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ సీఎం, గులాబీ బాస్ కేసీఆర్ ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ను నిర్వహించడం ఆసక్తికర పరిణామం.

ఇక ఈ బహిరంగ సభకు ఏకంగా ఐదు లక్షల మందిని జనసమీకరణ చేయాలని ఆదేశించిన కేసీఆర్, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 3 లక్షల మందిని జన సేకరణ చేయాలని సూచనలు చేశారు. సరిహద్దు రాష్ట్రాల బోర్డర్ జిల్లాల నుండి కూడా జన సమీకరణకు ప్లాన్ చేశారు. ముఖ్యంగా ఏపీ, చత్తీస్ గడ్ లపైన కూడా కేసీఆర్ ఫోకస్ పెట్టారు.

అయితే కెసిఆర్ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ఖమ్మం జిల్లా నుండి మాత్రమే కాకుండా, ఏపీ సరిహద్దు ప్రాంతాల ప్రజలు, ఛత్తీస్ ఘడ్ సరిహద్దు ప్రాంతాల ప్రజలు కూడా ఆసక్తి చూపి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే కెసిఆర్ ఖమ్మంలో సభ పెట్టడం వ్యూహాత్మకమే అన్నది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఖమ్మం లో సభ పెట్టడం వల్ల తెలంగాణ ప్రజలను మాత్రమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వారిని కూడా ఆకట్టుకునే అవకాశం ఉంది.

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల వారే కాకుండా ఖమ్మంలోని ఏజెన్సీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న చత్తీస్గడ్ సరిహద్దు ప్రాంతాల ప్రజలను కూడా కెసిఆర్ తన సభ ద్వారా ఆకట్టుకోనున్నారు.

  • ఈ సభతో కెసిఆర్ మూడు రాష్ట్రాలను కవర్ చేయడానికి ప్లాన్ చేసినట్టు భావిస్తున్నారు..

అంతేకాదు ఈ సభ ద్వారా బిఆర్ఎస్ విధివిధానాలను దేశానికి చెప్పనున్న కేసీఆర్ మూడు రాష్ట్రాలను కవర్ చేయనున్నారు. ఇక మరో నాలుగు రాష్ట్రాల సీఎంలను, ఇద్దరు మాజీ సీఎం లను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి ఆయా రాష్ట్రాల దృష్టిని కూడా ఆకర్షించనున్నారు. ఇతర రాష్ట్రాల్లో సభ పెడితే కేసీఆర్ అనుకున్న పర్పస్ పూర్తి కాదు. అందుకే ఖమ్మం కేంద్రంగా అజెండా ప్రకటన చెయ్యనున్నారు.

విధి విధానాలను ప్రకటించి కార్య క్షేత్రంలోకి వెళ్లనున్నారు కేసీఆర్. ఖమ్మం సభను చాలామంది లోకల్ సభగా భావిస్తుంటే, ఖమ్మంలో సభ పెట్టడం వెనుక బోలెడన్ని కారణాలు, కెసిఆర్ మాస్టర్ మైండ్ వున్నాయని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆయా రాష్ట్రాలపై ఖమ్మం సభ ప్రభావం ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా గులాబీ బాస్ కెసిఆర్ వ్యూహాలు రచించడంలో, ఊహించని పనులు చేయడంలో దేవాంతకుడు.

అయితే.. గులాబీ అధినేత కేసీఆర్ వ్యూహాలు మామూలుగా ఉండవు. ఆయన ఏది చేసినా దాంట్లో పరమార్థం ఉంటుందన్నది అందరికీ తెలిసిన విషయమే. కాగా.. ఇప్పుడు బీఆర్ఎస్ ఆవిర్భావ పార్టీ ఖమ్మంలోనే పెట్టటంపై పెద్ద వ్యూహమే ఉందన్నది విశ్లేషకుల వాదన. ఖమ్మంలో ఇప్పటికే అధికార పార్టీలో అంతర్గత విభేదాలున్నాయి.. అటు కాంగ్రెస్‌కు, టీడీపీకి మంచి పట్టుంది. మరోవైపు.. ఖమ్మం జిల్లాలో ఏపీకి చెందిన ప్రజలు కూడా ఎక్కువ మందే ఉంటారు.

ఇలాంటి ఖమ్మంలో సభ నిర్వహించటం వల్ల.. ఇటు తెలంగాణ ప్రజలనే కాదు.. అటు ఏపీ జనాలను కూడా కవర్ చేయొచ్చన్నది గులాబీ బాస్ ప్లాన్. ఇలా.. టార్గెట్ 1, 2, 3, 4, 5 వ్యూహాన్ని కేసీఆర్ అమలు చేస్తున్నట్టు సమాచారం. ఒకే వేదికపైకి అటు 4 రాష్ట్రాల సీఎంలు, ఇద్దరు(2) మాజీ సీఎంలను వేదికపైకి తీసుకురావటమే కాకుండా.. ఇటు 3 రాష్ట్రాల ప్రజలను టార్గెట్ చేయటంతో పాటు.. 5 లక్షల మందితో సభను నిర్వహించేందుకు వ్యూహం పన్నినట్టు తెలుస్తోంది.

అలాగే.. రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు కూడా చెక్ పెట్టేలా గులాబీ బాస్ పెద్ద ప్లానే వేశాడని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. దీంతో అటు తెలుగు రాష్ట్రాలతో పాటు మరో 3 రాష్ట్రాల్లో చర్చకు ఛాన్స్ లభిస్తుందని, స్థానికంగా విపక్షాలకు చెక్ పెట్టే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

మరి.. కేసీఆర్ ఎత్తుగడ ఏమేరకు నెరవేరుతుందన్నదే ఆసక్తికరంగా మారింది.

Must Read

spot_img