కేసీఆర్ బహిరంగ సభ .. ఇప్పుడు తెలంగాణవ్యాప్తంగానే కాక దేశవ్యాప్తంగానూ చర్చనీయాంశంగా మారిందా..? ఇంతకీ ఖమ్మంనే కేసీఆర్ ఎందుకు
టార్గెట్ చేసుకున్నారు..? ఖమ్మం సభ .. దేశ రాజకీయాల్లో కీలకంగా మారనుందా..?
భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ రాజకీయ జీవితంలో గర్జనలది కీలక పాత్ర. తెలంగాణ కోసం ఉద్యమించాలనుకున్నప్పుడు ఆయన మొదటి గర్జన పెట్టారు. తన పోరాటంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు అదే పద్దతిలో జాతీయ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి భారత సింహ గర్జనతో ఖమ్మం నుంచి ప్రారంభిస్తున్నారు. తెలంగాణ తరహాలో సక్సెస్ అవుతారో లేదో కాలం నిర్ణయిస్తుంది కానీ.. దేశాన్ని ఆకర్షించే బహిరంగసభలు నిర్వహించడంలో మాత్రం ఆయన ఎప్పుడూ ముందుంటారు. భారీ బహిరంగ సభలు నిర్వహించడంలో కేసీఆర్ ది అందే వేసిన చేయి.
తెలంగాణ ఉద్యమానికి ఊపు బహిరంగసభల ద్వారానే వచ్చింది. ఇదే స్ఫూర్తితో టీ-ఆర్‌ఎస్ పార్టీని బీఆర్‌ఎస్‌గా మార్చి జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు సిద్దమయ్యారు. 2001లో కరీంనగర్ సింహగర్జన మొదలు 2010 డిసెంబర్ 16న వరంగల్‌లో జరిగిన తెలంగాణ మహా గర్జన వరకు విజయవంతమైన అనేక బహిరంగ సభలు కేసీఆర్ ఉద్యమ స్పూర్తిని రెట్టింపు చేశాయి. టీఆర్‌ఎస్ పార్టీ బీఆర్‌ఎస్ పార్టీగా రూపాంతరం చెందాక ఖమ్మం గడ్డపై నిర్వహించే బహిరంగ సభను దేశం ఆకర్షించే విధంగా నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో ఒక ప్రాంతీయ పార్టీని నెలకొల్పిన కొద్ది రోజులకే 2001 ఏప్రిల్ 27న కరీంనగర్‌లో పార్టీ ఆవిర్భావ సభ, ఆ తర్వాత హన్మకొండలో నిర్వహించిన మరో బహిరంగ సభ ఉద్యమ వేడి పెంచింది. అలాగే 2003లో వరంగల్‌లో నిర్వహించిన తెలంగాణ జైత్రయాత్ర పేరుతో నిర్వహించిన భారీ బహిరంగసభ తెలంగాణ వాదాన్ని జాతీయ స్థాయిలో బలంగా వినిపించే ప్రయత్నం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్వహించిన భారీ బహిరంగసభ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పథకం చేపట్టేలా చేసిందని చెబుతారు. వరంగల్‌లో 2010 డిసెంబర్ 16న నిర్వహించిన తెలంగాణ మహాగర్జన బహిరంగసభ రికార్డు సృష్టించింది. కరీంనగర్‌లో నిర్వహించిన సింహ గర్జన బహిరంగసభ స్వరాష్ట్ర ఆకాంక్షను ఏ స్థాయిలో ప్రతిబింబించిందో.. అదే రీతిలో ఖమ్మంలో భారతగర్జన పేరుతో భారీ బహిరంగసభ నిర్వహించి కేసీఆర్ జాతీయ నాయకుడిగా చర్చల్లో ఉండాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే కేసీఆర్ .. ఖమ్మం బహిరంగ సభకు తెర తీశారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
నాడు తెలంగాణ వెనుకబాటుతనాన్ని ఎత్తిచూపి, ఇక్కడి ప్రజల అవసరాలు, సాధించాల్సిన లక్ష్యాలను వెల్లడిస్తూ ఉవ్వెత్తున ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టి విజయం సాధించారు. అదే పంథాతో నేడు దేశ ప్రజల అవసరాలు, సంపద సృష్టించే మార్గాలు, రైతు సంక్షేమంలో పాలకుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపి మరో ప్రజా ఉద్యమానికి బీజం వస్తామని బీఆర్ఎస్ నేతలంటున్నారు. విపక్షాల తరపున కేసీఆర్ ప్రధాని అభ్యర్థిగా ఖమ్మం సభ తర్వాత జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ పేరు ప్రముఖంగా వినిపిస్తుందని బీఆర్ఎస్ నేతలు నమ్మకంతో ఉన్నారు.
అయితే కేసీఆర్ కన్నా బలమైన ప్రాంతీయ పార్టీల నేతలైన కేజ్రీవాల్, మమతా బెనర్జీ, నితీష్ కుమార్ లాంటి వారు ఉండగా.. కేసీఆర్ ను ఎందుకు ప్రకటిస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. కానీ బీజేపీపై యుద్ధం చేయడంలో కేసీఆర్ అందరి కన్నా ముందు ఉన్నారని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. అయితే రాజకీయ పార్టీలన్నీ ఖమ్మం జిల్లాపై దృష్టి సారిస్తున్నాయి. మొన్న చంద్రబాబు నాయుడు ఖమ్మంలో సభ పెడితే, తాజాగా సీఎం కేసీఆర్ కూడా బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నారు. భవిష్యత్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఇతర పార్టీలు కూడా అక్కడ సభలు పెట్టే అవకాశం లేకపోలేదు. ఈ పార్టీలు ఖమ్మంలోనే సభలు ఎందుకు పెడుతున్నాయి? వాటి వ్యూహం ఏమిటి? అనే దానిపై సర్వత్రా చర్చ నడుస్తోంది.
ఖమ్మం అనేక రాష్ట్రాలు, ఇతర భాషలలకు దగ్గరగా ఉన్నందున భౌగోళిక రాజకీయాల ప్రభావం ఇక్కడ ఉంటుంది. పైగా ఖమ్మంలో అన్ని కులాలు, సామాజిక వర్గాలు సమానంగా ఉన్నాయి. ఇక్కడ ఏ వర్గం ఆధిపత్యం పెద్దగా లేదు. ఖమ్మం జిల్లాలో గత రెండు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గమనిస్తే.. రాజకీయంగా ఇక్కడ పార్టీలకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఖమ్మంలో ఏ పార్టీ, కులం ఆధిపత్యం లేకపోయినా.. కొన్ని సామాజిక వర్గాల ప్రభావం మాత్రం ఉంటుంది. కేసీఆర్‌కు ఖమ్మం పెద్ద సవాల్‌తో పాటు గొప్ప అవకాశం కూడా. ఖమ్మంలో కేసీఆర్ బాగా రాణించి, భారీ సభలు నిర్వహిస్తే, ఆ ప్రభావం ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌పైనా ఉంటుంది.
![](https://inewslive.net/wp-content/uploads/2023/01/14-1024x683.jpg)
ఖమ్మంలో బీఆర్ఎస్ ఎస్టాబ్లిష్మెంట్బాగుంటే.. ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాలపై ఉంటుంది. ఇదీగాక ఖమ్మం బీఆర్ఎస్లో వర్గపోరు ఉంది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఖమ్మంలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దీంతో బీఆర్ఎస్ గా మారిన కారు పార్టీ వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించాలని కేసీఆర్ వ్యూహాలు పన్నుతున్నారు.
2014, 2018 రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 ఎమ్మెల్యే స్థానాలకు గానూ గులాబీ పార్టీ ఒక్కో ఎమ్మెల్యే చొప్పున గెలుచుకుంది. గులాబీ పార్టీకి ఇది బలహీనమైన ప్రాంతం. ఎందుకంటే భౌగోళిక, సామాజిక వర్గ పరిస్థితులు ఖమ్మంపై ప్రభావం చూపుతాయి. ఖమ్మంపై ఆధిపత్యం సాధించడం కష్టమే. అందుకే గులాబీ బాస్ కేసీఆర్ ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ పెట్టి బలాన్ని చాటాలని చూస్తున్నారు.
2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత, తెలంగాణలో టీడీపీ కనుమరుగైంది. దానికి పూర్వ వైభవం తీసుకురావాలని భావిస్తున్న చంద్రబాబు పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించడంతోపాటు దానికి అంతకు ముందు కొంత పట్టు ఉన్న ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించారు. 2018లో ఖమ్మంలో10 స్థానాలకు టీడీపీ 2 స్థానాలను గెలుచుకుంది. 2018లో టీడీపీతో కూటమి కారణంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇక్కడ10 స్థానాలకు కాంగ్రెస్7 గెలుచుకుంది. అయితే దాదాపు ఎమ్మెల్యేలంతా టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించారు. టీఆర్ఎస్ గెలుచుకున్నది ఒక్క ఎమ్మెల్యే స్థానమే.
దీంతో ఖమ్మంలో పొలిటికల్ స్పేస్ ఉందని, ఇక్కడ ఎవరి ఆధిపత్యం లేదని తేలిపోయింది. దాన్ని పొందేందుకే కేసీఆర్ తాపత్రయ పడుతున్నారు. అంతేగాక వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పట్టు చూపించాలంటే, ఖమ్మం సభే కీలకమని విశ్లేషకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. దీనిలో భాగంగానే వివిధ రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం పలికారని టాక్ వినిపిస్తోంది. దీంతో కేసీఆర్ ఒక్క దెబ్బకు రెండు పిట్టలు తరహాలో ఖమ్మంలో పట్టుతో పాటు దేశ రాజకీయాల్లో పాగా వేయాలన్నది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో పాగాకు .. వ్యూహాలు పన్నుతోన్న కేసీఆర్ .. ఏపీ దిశగా వేగంగా అడుగులు వేస్తోన్న వేళ ఈ బహిరంగ సభ కీలకంగా మారింది. దేశ రాజకీయాల్లో కీ రోల్ కోసం పావులు కదుపుతోన్న కేసీఆర్ .. ఈ సభను సీరియస్ గా తీసుకున్నారని తెలుస్తోంది. అయితే ఇదెంతమేరకు ఆయనకు ఫ్లాట్ ఫాం కల్పిస్తుందన్న చర్చ సర్వత్రా వెల్లువెత్తుతోంది. ఓవైపు బీఆర్ఎస్ వర్గాలు .. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ చరిత్ర సృష్టిస్తారని, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇదెంతమేరకు సక్సెస్ అవుతుందన్నదే బీఆర్ఎస్ వర్గాల్లోనూ చర్చలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి.. కేసీఆర్ బహిరంగసభపైనే ఉందని .. సర్వత్రా టాక్ వెల్లువెత్తుతోంది.
మరి సభ ఏమేరకు కలిసివస్తుందన్నదే ఆసక్తికరంగా మారింది.