Homeతెలంగాణరాజ్యాంగ ఉల్లంఘన... కేసీఆర్ పై తమిళిసై ఆగ్రహం !!

రాజ్యాంగ ఉల్లంఘన… కేసీఆర్ పై తమిళిసై ఆగ్రహం !!

జాతీయ రాజకీయాలంటూ.. పార్టీని దేశవ్యాప్తం చేయడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దృష్టిపెట్టారు. ఈ సమయంలో
యావత్‌ దేశం దృష్టిని తెలంగాణవైపు తిప్పుకునేలా గవర్నర్‌ తమిళిసై తనకు కలిసి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. రిపబ్లిక్‌ డే
వేడుకల నిర్వహణను రాజ్‌భవన్‌కు పరిమితం చేయడం, తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘనపై ఆమె తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను జాతీయ
మీడియాకు లాగారు. జాతీయ మీడియా సాక్షిగా తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, రాజ్యాంగ ఉలంఘన గురించి మాట్లాడారు. దీంతో తెలంగాణ
రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పాలనపై జాతీయస్థాయిలో చర్చ జరిగేలా తమిళిసై ప్రయత్నించారు.

తెలంగాణ రాజ్‌భవన్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో సీఎం కేసీఆర్‌ టార్గెట్‌గానే విరమ్శలు చేసిన గవర్నర్‌ తమిళిసై తాజాగా జాతీయ మీడియాలోనూ కేసీఆర్‌ లక్ష్యంగానే తెలంగాణ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తనను అవమానిస్తున్న తీరును ఎండగట్టారు. మూడేళ్లుగా తనతో అధికార పార్టీ ప్రతినిధలు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రాజ్యాంగాన్ని ఉల్లంఘించి గణతంత్ర వేడుకలను రాజ్‌భవన్‌కు చేసిందని పేర్కొన్నారు.

తాను పరేడ్‌ గ్రౌండ్‌లో వేడుకల్లో పాల్గొనకుండా ఉద్దేశపూర్వకంగా కోవిడ్‌ –19 ఆంక్షలను సాకుగా చూపిందని తెలిపారు. తనకు కాకపోయినా గవర్నర్‌ పదవికి కూడా తెలంగాణ ప్రభుత్వం గౌరవం ఇవ్వడం లేదని, ప్రొటోకాల్‌ పాటించడం లేదని వివరించారు. 5 లక్షల మందితో ఖమ్మంలో ప్రభుత్వం సభ నిర్వహించుకుంటే రాని కరోనా పరేడ్‌ గ్రౌండ్‌లో 5 వేల మందితో వస్తుందని పేర్కొనడంలో తెలంగాణ ప్రభుత్వం దురుద్దేశం,కావాలనే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిన తీరును అర్థం చేసుకోవాలన్నారు.

తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్‌ ఆమోదించిన బిల్లులను గవర్నర్‌ ఆమోదించకపోవడాన్ని డిబేట్‌లో బీఆర్ఎస్ నేతలు ప్రస్తావించారు. తమిళిసైపై ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు. దీనిపై గవర్నర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లులపై తరువాత మాట్లాడవచ్చు, మొదట ప్రొటోకాల్‌ గురించి మాట్లాడండని తమిళిసై కౌంటర్‌ ఇచ్చారు.

రాజ్యాంగ పదవిలో ఉన్న తనను బీజేపీ ఏజెంట్‌గా చిత్రీకరించేందుకు బీఆర్‌ఎస్‌ చేస్తున్న ప్రయత్నాన్ని కూడా ఆమె ఎండట్టారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రప్రభుత్వంపై కేంద్రానికి గవర్నర్‌ నివేదిక ఇవ్వడం ద్వారా జాతీయ ఇష్యూగా మారింది. ఇదే క్రమంలో గవర్నర్‌ జాతీయ మీడియా డిబేట్‌లో
పాల్గొని ఈ అంశంపై జాతీయస్థాయిలో చర్చ జరిగేలా చేశారు. దీంతో రిపబ్లిక్‌డే అంశంపై గవర్నర్‌ తమిళిసై కూల్‌ అయిపోయినట్లు కనిపిస్తున్నారు. కానీ, గవర్నర్‌పై బీఆర్‌ఎస్‌ నేతలు శాంతించడం లేదు.

తెలంగాణలో ఏడాదిన్నరగా గవర్నర్, గవర్నమెంట్‌ మధ్య సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం .. రిపబ్లిక్ డే వేదికగా ముదురు పాకాన పడినట్లు కనిపిస్తోంది. ఇన్నాళ్లూ ఎవరికి వారు విమర్శలు చేస్తూ వచ్చారు. కానీ గణతంత్ర వేడుకల సాక్షిగా గవర్నర్‌ తమిళిసై కేసీఆర్‌ టార్గెట్‌గా విమర్శలు చేశారు. ఈ క్రమంలో తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘనపై కేంద్రానికి నివేదిక పంపానని ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఎన్నికల బడ్జెట్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న వేళ.. గవర్నర్‌ తీరు కేసీఆర్‌కు కొరకరాని కొయ్యలా మారింది.

తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆమెను బీజేపీ ప్రతినిధిగా ముద్ర వేసింది తెలంగాణ ప్రభుత్వం. గవర్నర్‌ప్రమేయంలేకుండా తన పని తాను చేసుకుపోతుంది. కనీసం ప్రోటోకాల్‌ కూడా పాటించకుండా తనను ఇబ్బంది పెడుతున్నారని గవర్నర్‌ తమిళిసై ఇప్పటికే అనేకమార్లు మీడియా సాక్షిగా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గతంలోనూ తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితిని కేంద్రానికి నేరుగా వెళ్లి మరీ వివరించి వచ్చారు. తాజాగా రాజ్యాంగ ఉల్లంఘనపై నివేదిక ఇవ్వడం చర్చనీయాంశమైంది.

ఇక ప్రస్తుతం కూడా రిపబ్లిక్‌ డే వేడుకలు ప్రభుత్వం నిర్వహించకపోవడం, హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ పట్టించుకోకపోవడంతోపాటుగా, గవర్నర్‌ను టార్గెట్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉండడం వెరసి తెలంగాణలో ప్రగతిభవన్, రాజ్‌భవన్‌ గ్యాప్‌ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల ప్రసంగంలోనూ గవర్నర్‌ తమిళిసై తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను కొంతమందికి నచ్చకపోవచ్చు అంటూ పేర్కొన్న ఆమె తెలంగాణ ప్రజలు అంటే తనకు ఇష్టమని, వారి కోసం ఎంత కష్టమైనా భరిస్తానంటూ తేల్చి చెప్పారు. తెలంగాణలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని గవర్నర్‌ తమిళిసై అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందని గవర్నర్‌ తమిళిసై ప్రకటించారు.

కేసీఆర్‌ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి పేరుతో గణతంత్ర వేడుకలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని పేర్కొన్న ఆమె ఖమ్మం జిల్లాలో కేసీఆర్‌ ఐదు లక్షల మందితో సభ నిర్వహించారని గుర్తు చేశారు. ఇక ఈ విషయాలు అన్నింటిపై కేంద్రానికి తాను నివేదిక పంపించానని ప్రకటించారు. ఇప్పటికే అనేక పర్యాయాలు గవర్నర్‌ తమిళిసై కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఫిర్యాదులు చేశారు. ఇప్పుడు తాజాగా మరో మారు తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘన గురించి కేంద్రానికి నివేదిక పంపించాను అని చెప్పడం ఆసక్తికర చర్చకు కారణంగా మారింది.

మరి గవర్నర్‌ తమిళి సై పంపించిన నివేదికలను కేంద్రం సీరియస్‌ గా తీసుకుంటుందా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. తాజాగా రిపబ్లిక్‌ డే వేడుకల సాక్షిగా గవర్నర్‌ తమిళిసై వర్సెస్‌ సీఎం కేసీఆర్‌ మరోమారు రగడ కొనసాగుతుండడంతో ఈ వ్యవహారంలో ఏం జరగబోతుంది అన్న ఆసక్తి అటు రాజకీయ వర్గాల్లో, ఇటు ప్రజల్లో నెలకొంది. ఒకవేళ ఈ వ్యవహారంలో కేంద్రం సీరియస్‌ గా తీసుకుంటే పరిణామాలు చాలా ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది. తెలంగాణాలో రాష్ట్రపతి పాలనకు గవర్నర్‌ సిఫార్సు చేశారా? అన్న చర్చ కూడా జోరుగా సాగుతుంది.

ఏది ఏమైనా చిలికి చిలికి గాలివానగా మారుతున్న ఈ వివాదానికి కేంద్రం ఫుల్‌ స్టాప్‌ పెడుతుందా? లేకా ఇది ఇలాగే కొనసాగుతుందా? అన్నది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే, తెలంగాణ గవర్నర్ విషయంలో రాష్ట్రపతి కల్పించుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకొని రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ రాజకీయాలు మాట్లాడడం తగదన్నారు. రాజ్యాంగ స్పూర్తిని దెబ్బతీసేలా గవర్నర్ మాట్లాడారని విమర్శించారు.

గవర్నర్ వైఖరిపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్నారు. రాజ్యాంగం అమలును రాజకీయాలకు వాడుకోవడం తగదన్నారు. దీంతో తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్, కేసీఆర్ మధ్య అగాధం పెరుగుతూ వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తప్పుపడుతున్నారు. గవర్నర్ తీరుపై మంత్రులు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఈ రచ్చ ఇప్పట్లో ఆగేలా లేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా రాజ్యాంగ ఉల్లంఘనపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాననడంతో ఈ వివాదం మరింత వేడెక్కనుందన్న అంచనాలు సైతం వెల్లువెత్తుతున్నాయి.

Must Read

spot_img