Homeజాతీయంకర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు వివాదం

కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు వివాదం

ర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు వివాదం .. హింసాత్మకంగా మారుతోంది. దీంతో ఈ అంశంలో కేంద్రం జోక్యం చేసుకోవాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. తాజాగా లోక్ సభలోనూ సరిహద్దు రచ్చ ప్రకంపనలు సృష్టించింది.

బెళగావి.. నివురు గప్పిన నిప్పులా మారింది. సరిహద్దు వివాదంతో .. ఈ ప్రాంతం అట్టుడుకుతోంది. ఇరు రాష్ట్రాల్లోని నిరసనకారులు.. భౌతిక దాడులకు దిగుతుండడంతో ఆందోళనకరంగా మారింది.

కర్ణాటక, మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాద ప్రకంపనలు పార్లమెంట్‌ను తాకాయి.

కర్ణాటక, మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం ఇంకా సమసిపోలేదు. బెళగావిలో కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్రమంతటా కన్నడ సంఘాలు ఆందోళన చేశాయి. దీంతో బెళగావి నివురుగప్పిన నిప్పులా కొనసాగుతోంది. మరాఠాలు ఎప్పుడు రోడ్డెక్కుతారోనని పోలీసు బలగాలను సరిహద్దుతోపాటు బెళగావి నగరమంతటా మొహరించారు. మరోవైపు కర్ణాటక బస్సు సర్వీసులను మహారాష్ట్రలోకి ప్రవేశించకుండా నిషేధించారు. మహారాష్ట్ర బస్సులను కొన్నిరోజులపాటు రద్దు చేసినట్టు మహారాష్ట్ర స్టేట్‌ ఆర్టీసీ వైస్‌ ప్రెసిడెంట్‌, ఎండీ శేఖర్‌ చెన్నాప్రకటించారు.

కర్ణాటక రక్షణ వేదిక అధ్యక్షుడు నారాయణగౌడతోపాటు 400 మంది కార్యకర్తలను అరెస్టు చేయడంతో బెంగళూరు, మైసూరు,రామనగర, కోలారులలో ఆందోళనలు కొనసాగాయి. రాష్ట్రంలో సరిహద్దు అంశం తారస్థాయికి చేరినా ప్రభుత్వం చోద్యం చూస్తోందని జేడీఎస్‌ నేత కుమారస్వామి మండిపడ్డారు. రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం కుదరాలంటే కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు.

సరిహద్దుల్లో తరచూ వివాదాలు సరికాదన్నారు. ఆ ప్రాంతంలో నివసించేవారికి సమస్యలు తీవ్రమవుతాయన్నారు. కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. మరోవైపు బెళగావి సరిహద్దులో కన్నడిగుల ఆగ్రహం తీవ్రమవుతోందని ఇటువంటి పోరాటాలు సమన్వయానికి భంగం కలిగిస్తాయని వెంటనే శాంతిని కాపాడేదిశగా చొరవ చూపాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌షిండే కోరారు.

కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మైకు ఫోన్‌ చేసిన షిండే సరిహద్దుల్లోతీవ్ర పోరాటాలు ఇరువైపుల వారికి ఇబ్బందికరమన్నారు. ఉద్రిక్త పరిస్థితులకు అవకాశం ఇవ్వకుండా వెంటనే శాంతిభద్రతలు కాపాడాలని సూచించారు. అందుకు కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై కూడా అంగీకరించారు. ఇదే విషయమై సీఎం బొమ్మై ట్వీట్‌లో పేర్కొన్నారు.

మహారాష్ట్ర సీఎం షిండే ఫోన్‌ చేశారని రెండు రాష్ట్రాల మధ్య శాంతి భద్రతలు కాపాడే విషయంలో చర్చించుకున్నామని బొమ్మై అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం, సౌహార్ద్రత కాపాడుకునేలా వ్యవహరించాలని నిర్ణయించామన్నారు. సరిహద్దు విషయంలో ఎటువంటి మార్పు లేదన్నారు. న్యాయపోరాటాన్ని సుప్రీంకోర్టులో కొనసాగిస్తామని ట్వీట్‌ చేశారు. అంతకుముందు బెళగావిలో కరవే కార్యకర్తలు, మహారాష్ట్రకు చెందిన లారీలపై రాళ్లు రువ్వడంతోపాటు మసి పూసి ఆగ్ర హం వ్యక్తం చేశారు. పూణె నుంచి బెంగళూరుకు వస్తున్న లారీలపై దాడి చేసినట్టు తెలిసింది.

మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌ కల్గిన వాహనాలకు బెళగావిలో మసిపూశారు. కాగా చిక్కోడి ఉప విభాగంలోని అథణి, చిక్కోడి, నిప్పాణి, కాగవాడల నుంచి మహారాష్ట్ర వైపు వెళ్లే వాహనాలను రద్దు చేశారు. ఇదిలా ఉంటే, రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం లోక్‌సభలోనూ గందరగోళానికి దారితీసింది.

జీరో అవర్‌లో మహారాష్ట్రకు చెందిన ఎన్‌సీపీ ఎంపీ సుప్రియాసూలే ఈ అంశాన్ని ప్రస్తావించారు. కర్ణాటకలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన మరాఠీలపై దాడి చేశారని ఆరోపించారు. ఇదే సందర్భంలో మహారాష్ట్రకు చెందిన పలువురు ఎంపీలు ఆమెకు మద్దతుగా నిలవగా రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. శివసేన, ఎన్‌సీపీ సభ్యులు కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కర్ణాటక, మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాద ప్రకంపనలు పార్లమెంట్‌ను తాకాయి. మహారాష్ట్రను కర్ణాటకలోని బొమ్మై సర్కారు ముక్కలు చేయాలనుకుంటోందని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సులే లోక్‌సభలో ఆరోపించారు. మహారాష్ట్రకు వ్యతిరేకంగా బొమ్మై ప్రకటనలు చేస్తున్నారని ఆమె ఆరోపణలు చేశారు.

మహారాష్ట్ర లారీలపై కర్ణాటకలో రాళ్ల దాడి జరుగడంతో వందలాదిమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

మరోవైపు 50 ఏళ్లుగా నలుగుతున్న వివాదానికి తెరదించేందుకు కేంద్రం బెళగావిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం డిమాండ్ చేసింది. బెళగావిలో ఉండే మరాఠీ ప్రజలకు మద్దతుగా ఎన్సీపీతో కలిసి పోరాడతామని శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం ఎంపీ సంజయ్ రౌత్ ప్రకటించారు. పరిస్థితులు సద్దుమణగకపోతే ఎన్సీపీతో కలిసి తాము కూడా బెళగావికి ప్రతినిధి బృందాన్ని పంపుతామన్నారు.

రెండు రాష్ర్టాల మధ్య సరిహద్దు పరిస్థితి ఆందోళనకరంగా మారిందని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ పేర్కొన్నారు. మహారాష్ట్ర సహనానికి ఒక పరిమితి ఉంటుందని, 24 గంటల్లోగా వాహనాలపై దాడులు ఆగకుంటే జరిగే పరిణామాలకు కర్ణాటక ముఖ్యమంత్రి, కర్ణాటక ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని పవార్ తేల్చిచెప్పారు. ఇటు సరిహద్దు వివాదం విధ్వంసం రూపు తీసుకుంది. రెండు రాష్ర్టాల్లోనూ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.

మహారాష్ట్ర లారీలపై కర్ణాటకలో రాళ్ల దాడి జరుగడంతో వందలాదిమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే, కర్ణాటక బస్సులపై మహారాష్ట్రలో ఆందోళనకారులు నలుపు, ఆరెంజ్‌ రంగులు స్ర్పే చేశారు. గ్రాఫిటీ ఆర్ట్‌ ద్వారా జై మహారాష్ట్ర నినాదాలను కూడా కర్ణాటక బస్సులపై రాశారు. ఈ నేపథ్యంలో మంత్రుల నేతృత్వంలోని మహారాష్ట్ర హైపవర్‌ కమిటీ చేపట్టదలచిన బెళగావి పర్యటన వాయిదా పడింది. సరిహద్దులో అశాంతిని సృష్టించేందుకు వస్తున్న మహారాష్ట్ర మంత్రులను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుని తీరుతామని అంతకుముందు కరవే అధ్యక్షుడు టీఏ నారాయణగౌడ ప్రకటించారు. దారవాడ తదితర ప్రాంతాల నుంచి వందలాది వాహనాలలో కరవే కార్యకర్తలు బెళగావికి చేరుకున్నారు.

మరోవైపు పుణేలో కర్ణాటక ఆర్టీసీ బస్సులపై శివసేన కార్యకర్తలు నలుపు, ఆరెంజ్‌ రంగులను స్ర్పే చేశారు. కర్ణాటక వ్యాప్తంగా నిరసనలకు కరవే పిలుపునిచ్చింది. కాగా, తమ గ్రామాల్లో కనీస వసతులు కల్పిస్తారా? లేక తమ గ్రామాలను కర్ణాటకలో కలిపేసేందుకు అనుమతిస్తారా? అని మహారాష్ట్రలోని సోలాపూర్‌ జిల్లా అక్కల్‌కోట్‌ తహసిల్‌లోని 11 గ్రామాలు అల్టిమేటం జారీ చేశాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మైకి ఫోన్‌ చేసి మాట్లాడారు.

నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తాను కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడానని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. కారణం లేకుండానే మహారాష్ట్ర బస్సులపై దాడులు జరుగుతున్నాయని చెప్పానన్నారు. వెంటనే జోక్యం చేసుకుని కర్ణాటక ముఖ్యమంత్రితో మాట్లాడాలని సూచించానని చెప్పానన్నారు.

అయితే లోక్ సభలో ఈ రెండు రాష్ట్రాల సరిహద్దు వివాదాన్ని కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకుని పరిష్కరించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే కోరారు. అయితే సుప్రియా ఈ అంశాన్ని అవకాశవాదంగా లేవనెత్తారని బీజేపీ ఎంపీ శివకుమార్ ఉదాసి అన్నారు. ఈ వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని, అలాంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలా తలదూరుస్తుందని ప్రశ్నించారు.

ప్రతి అంశాన్ని రాజకీయం కోసం వాడుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. కర్ణాటకలోని మరాఠీ మాట్లాడే ప్రాంతాలు తమవేనని మహారాష్ట్ర ప్రభుత్వం, మహారాష్ట్రలోని కన్నడ మాట్లాడే ప్రాంతాలు తమవేనని కర్ణాటక ప్రభుత్వం.. ఇలా చాలా కాలంగా వాద ప్రతివాదాలు, విమర్శ ప్రతివిమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి.ఇరు రాష్ట్రాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

ఈ అంశం సుప్రీంకోర్టులో ఉన్నందున.. తీర్పు వెలువడేలోపు మధ్యేమార్గంగా కేంద్రం .. జోక్యం చేసుకోవాలన్న డిమాండ్ వెల్లువెత్తుతోంది.

Must Read

spot_img