కర్నాటక, మహారాష్ట్ర సరిహద్దు వివాదం ఎందుకు మళ్లీ తెరపైకి వచ్చింది..? దీనికి కారణమేంటి..? దీనిపై అక్కడి ప్రజలు ఏమని కోరుకుంటున్నారు..?
ఇరు రాష్ట్రాలు భాషా గ్రామాల కోసం .. తగవులు ఆడుకుంటుంటే, అక్కడి ప్రజలు మాత్రం .. మౌలిక సదుపాయాలు కావాలంటూ కోరుకుంటున్నారు. వీటిని కల్పిస్తే, సమస్యే ఉండదని విశ్లేషకులు సైతం నొక్కి వక్కాణిస్తున్నారు.
కర్నాటక-మహారాష్ట్ర మధ్య సుమారు ఆరు దశాబ్దాలుగా ఏళ్లుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. కర్నాటక శీతాకాలపు సమావేశాలు బెళగావిలో జరుగుతాయి. బసవరాజ్ బొమ్మై ప్రభుత్వపు చివరి శీతాకాల సమావేశాలు కావడంతో రెండు రాష్ట్రాల సరిహద్దు సమస్య మరోసారి వేడెక్కింది. బెళగావి తమ రాష్ట్రానికి చెందినదంటూ దశాబ్దాలుగా మహారాష్ట్రకు చెందిన అనేక రాజకీయ పార్టీలు, సంస్థలు వాదిస్తున్నాయి.
తాజాగా శివసేన, కాంగ్రెస్, ఎన్‌సీపీకి చెందిన 300మందికి పైగా నేతలు, కార్యకర్తలు సరిహద్దులు దాటి బెళగావిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వీరిని కర్నాటక ప్రభుత్వం అడ్డుకుంది. సరిహద్దులో ఘర్షణను నివారించడం కోసం మహారాష్ట్ర పోలీసులు కూడా వీరిలో కొందరిని అదుపులోకి తీసుకున్నారు. సరిహద్దు సమస్యపై పోరాటం చేస్తున్న మహారాష్ట్ర ఏకీకరణ్ సమితి ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించాలని ప్రయత్నించింది.
ఈ నేపథ్యంలోనే ఇరు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, మంత్రులు ట్విటర్ వేదికగా వాదోపవాదాలు చేసుకున్నారు. సరిహద్దు వివాదంపై కొందరు మహారాష్ట్ర మంత్రులు చేసిన ప్రకటనలను తోసిపుచ్చుతూ కర్నాటక అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. దీని ప్రకారం ఒకవేళ ఎవరైనా మహారాష్ట్ర మంత్రులు ఈ విషయంపై ఏదైనా ప్రకటన చేస్తే, వారిపై కర్నాటక ప్రభుత్వం న్యాయపరమైన చర్యలు తీసుకుంటుందని పేర్కొంది.
అయితే, కర్నాటక ప్రభుత్వ తీర్మానానికి పదిరెట్లు శక్తివంతమైన తీర్మానం తామూ చేయగలమని మహారాష్ట్ర మంత్రి శంభురాజ్ దేశాయ్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం తారాస్థాయికి చేరిన నేపథ్యంలో అసలు కర్నాటక-మహారాష్ట్ర మధ్య గొడవ ఎలా మొదలైంది, 60 ఏళ్లకు పైగా ఎందుకు పరిష్కారం దొరకడం లేదన్నదే కీలకంగా మారింది.
ఈ వివాదంలో ప్రజలేం కోరుకుంటున్నారు? అనేది చర్చనీయాంశంగా మారాయి. ఈ సరిహద్దు వివాదానికి బెళగావి, ఖానాపూర్, నిప్పాణి, నంద్‌ఘడ్, కర్వార్ ప్రాంతాలు కేంద్రబిందువు. ఈ ప్రాంతాల్లో 70 ఏళ్లకు పైగా మరాఠి, కన్నడ మాట్లాడే వాళ్లు నివసిస్తున్నారు. అయితే బెళగావితో పాటు మరాఠి మాట్లాడుతున్న 865 గ్రామాలు తమ రాష్ట్రానివేనని మహారాష్ట్ర వాదిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాంతాలు కర్నాటకలో భాగంగా ఉన్నాయి.
స్వాతంత్ర్యం తర్వాత 1948లో భారత్‌లో తొలి రాష్ట్రంగా మైసూరు ఏర్పడింది. నవంబర్ 1, 1973న మైసూరు రాష్ట్రం పేరుని కర్నాటకగా మార్చారు. అంతకు ముందు 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు మైసూరు రాష్ట్ర సరిహద్దులను పెంచేందుకు ప్రస్తుతం బెళగావితో పాటు మరాఠి మాట్లాడుతున్న కొన్ని ప్రాంతాలను కర్నాటకలో కలిపారు. అప్పటి నుంచి మహారాష్ట్రకు చెందిన కొందరు నేతలు మరాఠి మాట్లాడే ప్రజలున్న బెళగావి నగరాన్ని, ఖానాపూర్, నిప్పాణి, నంద్ ఘడ్, కార్వార్‌లను మహారాష్ట్రలోనే కలపాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అలా వివాదం మొదలైంది.
ఈ సరిహద్దు వివాదం తెరపైకి వచ్చినప్పుడు, కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మెహర్ చంద్ మహాజన్ నేతృత్వంలో 1966 అక్టోబర్‌లో ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. జమ్మూ, కశ్మీర్‌ను భారత్‌లో కలిపేందుకు మెహర్ చంద్ మహాజన్ కీలక పాత్ర పోషించారు. అయితే, కమిషన్ తన రిపోర్టును 1967లో సమర్పించినప్పుడు మహారాష్ట్ర దాన్ని చాలా వివక్షాపూరితమైనదని, అశాస్త్రీయమైనదని విమర్శిస్తూ తిరస్కరించింది.
అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని పరిశీలించిన తర్వాత, బెళగావిని మహారాష్ట్రలో కలపలేమని కమిషన్ అన్నది. పరిపాలనా సౌకర్యం కోసం బెళగావిని కర్నాటకలోనే కొనసాగించాలని మహాజన్ కమిషన్ సూచించింది.
మహాజన్ కమిషన్ రిపోర్టును పరిశీలిస్తే..247 గ్రామాలతో పాటు బెళగావిని తన వద్దనే ఉంచుకునేందుకు కర్నాటక అంగీకరించింది. అలాగే పొగాకు ఎక్కువగా పండే నిప్పాణి, అటవీ సంపద ఎక్కువగా ఉండే ఖానాపూర్‌ను వదులుకునేందుకు అంగీకరించింది. నిప్పాణి, ఖానాపూర్, నంద్‌ఘడ్ తో పాటు 262 గ్రామాలను మహారాష్ట్రలో కలుపుకోవాలని మహాజన్ కమిషన్ సూచించింది. అయితే, మహాజన్ కమిషన్ సూచనలను మహారాష్ట్ర ప్రభుత్వం తోసిపుచ్చింది.
బెళగావితో పాటు 865 గ్రామాలు తమ రాష్ట్రలో విలీనం చేయాల్సిందేనని మహారాష్ట్ర డిమాండ్ చేసిందని మహాజన్ కమిషన్ రిపోర్టును విశ్లేషించిన వారంతా చెబుతున్నారు. జస్టిస్ మహాజన్ అన్ని గ్రామాలకు, పట్టణ ప్రాంతాలకు వెళ్లారని, ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాల ప్రజలు ఏ భాష మాట్లాడుతున్నారో తెలుసుకున్నారని వెల్లడించారు.
ఈ సమస్యపై అప్పటి ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ప్రతేడాది ఈ వివాదం ఏదో ఒక సమయంలో తెరపైకి వస్తూనే ఉంది. రెండు రాష్ట్రాల మధ్య వాగ్వాదాలు జరుగుతూనే ఉన్నాయి. కర్నాటక రాష్ట్రం అవతరణ దినోత్సవం జరుపుకునే సమయంలో సరిహద్దు ప్రాంతంలో మరాఠీ నేతలు బ్లాక్ డే నిర్వహిస్తారు. మరాఠి మాట్లాడుతున్న ప్రాంతాలను మహారాష్ట్రలో కలుపాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర ఏకీకరణ్ సమితి ఏర్పాటైంది. ఈ కమిటీ ప్రతినిధులు, తరచూ ఈ సమస్యపై కర్నాటక అసెంబ్లీలో ప్రస్తావన వచ్చేలా చూస్తుంటారు.
ఈ ప్రాంతం నుంచి ఈ కమిటీకి చెందిన నేతలను ఎంఎల్‌ఏలుగా నిలబెట్టి కర్నాటక అసెంబ్లీకి పంపుతోంది. చాలాకాలంగా బెళగావి మున్సిపల్ కార్పోరేషన్ మరాఠి మాట్లాడే ప్రజల నియంత్రణలో ఉండేది. అయితే, రానురాను మహారాష్ట్ర ఏకీకరణ్ సమితికి పొలిటికల్ పవర్ తగ్గుతూ వచ్చింది.
మరోవైపు కర్నాటక అధికారులు ఇక్కడి ప్రజలను బలవంతంగా కన్నడ భాష మాట్లాడేలా చేస్తున్నారని మరాఠి నేతలు వాదిస్తున్నారు. బెళగావితో పాటు కార్వార్, బీదర్, నిప్పాణి వంటి ప్రాంతాల్లో మరాఠి మాట్లాడే ప్రజలు ఉన్నప్పటికీ, ప్రభుత్వ కార్యాలయాలయలో, స్థానిక సంస్థలలో కన్నడ భాషనే ఉపయోగిస్తున్నారు. మున్సిపాల్టీలో అధికారిగా పని చేయాలంటే తప్పనిసరిగా కన్నడం మాట్లాడాలి.
అయితే, యువత మాత్రం ఈ సమస్యను పెద్దగా పట్టించుకోవడం లేదు. మరాఠి మాట్లాడే ప్రాంతాల్లో మూడో, నాల్గో జనరేషన్ కూడా వచ్చింది. ఈ సరిహద్దు సమస్య తమకు ఏ విధంగానూ ఉపయోగపడదని వారంతా భావిస్తున్నారు. కొన్నిసార్లు బెళగావిలోని నాయకుల ప్రకటనలు వివాదం మళ్లీ తెరపైకి తెస్తున్నా బెళగావి చాలా ప్రశాంతమైన ప్రాంతమని నిపుణులు అంటున్నారు.
అయితే కర్నాటకలో ఉన్న మరాఠి మాట్లాడే 865 గ్రామాలను తమలో విలీనం చేయాలని కోరుతూ మహారాష్ట్ర ప్రభుత్వం 18 ఏళ్ల క్రితమే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికీ ఈ విషయం సుప్రీంకోర్టు విచారణలో ఉంది. ప్రస్తుతం మహారాష్ట్రలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం కూడా మహారాష్ట్ర ఆత్మ గౌరవానికి సంబంధించిన సమస్యగా దీన్ని పేర్కొన్నారు.
అయితే ఒకవైపు మహారాష్ట్ర, కర్నాటక సరిహద్దుల్లోని మరాఠి మాట్లాడుతున్న గ్రామాలను తమలో విలీనం చేయాలని మహారాష్ట్ర పట్టుబడుతుంటే..షోలాపూర్ జిల్లాలోని కొన్ని గ్రామాల ప్రజలు మాత్రం తమల్ని కర్నాటకలో విలీనం చేయాలని కోరుతున్నారు. కనీసం తమకు సరియైన రోడ్లు, ఆసుపత్రులు లేవని, తాము ఎందుకు మహారాష్ట్రలో నివసించాలని వారు ప్రశ్నించారు. సరియైన రోడ్లు లేకపోవడంతో, తమ పిల్లలు స్కూల్స్‌కి కూడా వెళ్లలేకపోతున్నారని షోలాపూర్‌కు చెందిన కొందరు మండిపడుతున్నారు.
కర్నాటక, మహారాష్ట్ర మధ్య వివాదం .. పరిష్కరించేదే అయినా .. నేతల తీరుతోనే వివాదాస్పదం అవుతోందని విశ్లేషకులు సైతం చెబుతున్నారు.