Homeజాతీయంకన్నడ నాట సలాం హారతి వివాదాస్పదంగా మారిందా..?

కన్నడ నాట సలాం హారతి వివాదాస్పదంగా మారిందా..?

కన్నడ నాట సలాం హారతి వివాదాస్పదంగా మారిందా..? అసలు సలాం హారతి అంటే ఏమిటి..? దీనిపై వెల్లువెత్తుతోన్న నిరసనలకు
కారణమేంటి..? లెట్స్ వాచ్..

టిప్పు సుల్తాన్ ప్రవేశ పెట్టిన సలాం హారతి.. ఇప్పుడు వివాదాస్పదం అవుతోందా..? దీనిపై హిందూత్వ సంస్థలు చెబుతున్నదేమిటి..? దీనిపై
కన్నడ సర్కార్ తీసుకున్న నిర్ణయమేమిటి..? లెట్స్ వాచ్..

కర్ణాటకలో మరొకసారి సలాం హారతి వివాదం వార్తల్లోకి వచ్చింది. ఆ రాష్ట్రంలోని కొన్ని దేవాలయాల్లో ఉన్న సలాం హారతి పద్ధతి పేరును కర్ణాటక
ప్రభుత్వం మారుస్తున్నట్లుగా ప్రకటించడమే దీనికి కారణం. మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్, అప్పట్లో తన రాజ్యంలోని కొన్ని ఆలయాల్లో సలాం
హారతి అనే సంప్రదాయాన్ని ప్రారంభించినట్లు చెబుతారు. ఇప్పుడు దీని పేరును హారతి నమస్కారమని మారుస్తున్నట్లు కర్ణాటక హిందూ
రెలిజియస్ ఇనిస్టిట్యూషన్స్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ పేర్కొంది. కర్ణాటకలోని కొన్ని దేవాలయాల్లో సలాం హారతి అనే పూజా సంప్రదాయం
ఉంది. మైసూరు రాజు టిప్పు సుల్తాన్ తన రాజ్యంలోని హిందూ దేవాలయాలను సందర్శించినప్పుడు ఈ పద్ధతి ప్రవేశపెట్టారని చెబుతుంటారు.
కొల్లూరు మూకాంబికా ఆలయానికి టిప్పు సుల్తాన్ వెళ్లినప్పుడు, అక్కడి అమ్మవారికి సలాం చేసి పూజలు చేశారనే కథలు ప్రచారంలో ఉన్నాయి.
అలా ఆయన సలాం చేశారు కాబట్టి ఆ పూజా పద్ధతికి సలాం ఆరతి అనే పేరు వచ్చినట్లు చెబుతారు. సలాం ఆరతిలో భాగంగా అమ్మవారి కీర్తనలు
పాడతారు.

ప్రత్యేక సంగీత వాద్యాలు వాయిస్తారు. మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ రాకముందు సాయంత్రం పూట జరిగే పూజా
సంప్రదాయాలను ప్రదోష పూజ అనేవారు. ఆ తరువాత వాటిని సలాం ఆరతి అని పిలిచేవారు. ఆ పూజలు సాయంత్రం జరుగుతాయి. వేదాల
ప్రకారం సూర్యాస్తమయానికి చాలా పవిత్రత ఉంది. ఈ సమయంలో శివుడు తాండవ నృత్యం చేస్తాడని భావిస్తారు. అయితే కొల్లూరు మూకాంబిక
దేవాలయానికి టిప్పు సుల్తాన్ వచ్చినట్లు తెలిపేందుకు సరైన ఆధారాలు లేవు అని కొందరు దేవాలయ అధికారులు చెప్పారు. కానీ టిప్పు సుల్తాన్
సందర్శనకు గుర్తుగా భావిస్తూనే సలాం హారతి సంప్రదాయాన్ని తరాలుగా కొనసాగిస్తూ వస్తున్నారు.

కర్ణాటకలోని అనేక దేవాలయాల్లో సలాం హారతి సంప్రదాయం ఉంది. కొంతకాలంగా సలాం హారతి సంప్రదాయం చుట్టూ కర్ణాటకలో వివాదం
నడుస్తోంది. ముస్లిం పాలకుడైన టిప్పు సుల్తాన్ పేరు మీద హిందూ దేవాలయాల్లో పూజలు ఎలా చేస్తారంటూ హిందూత్వ సంస్థలకు చెందిన కొందరు
నిరసన వ్యక్తం చేస్తున్నారు. టిప్పు సుల్తాన్ హిందూ వ్యతిరేకి. ఆయన అనేక హిందూ దేవాలయాలను కూలగొట్టాడు. కాబట్టి వెంటనే ఆ
సంప్రదాయాన్ని నిలిపివేయాలని కొంతకాలంగా వారు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కొల్లూరు దేవాలయంలో గతంలో మాదిరిగానే సాయంత్రం చేసే
పూజలను ప్రదోష పూజ అని పిలవాలంటూ విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది. సలాం హారతి అనేది బానిసత్వానికి చిహ్నంగా ఉందని అది
వాదిస్తోంది. అయితే కొల్లూరు మూకాంబికా దేవాలయం రికార్డుల్లో ఎక్కడా సలాం హారతి అనే పదం లేదు. ప్రతిరోజూ సాయంత్రం పూట 7.15 గంటల
నుంచి 8 గంటల మధ్య నిర్వహించే దాన్ని ప్రదోష పూజ పేరుతో పిలుస్తున్నారని, గుడి ముద్రించే బ్రోచర్లలోనూ దాన్ని ప్రదోష పూజగానే రాస్తున్నట్లు
ఆలయ అధికారులు చెబుతున్నారు.

అయితే కొందరు సలాం హారతి పేరు మార్చడాన్ని తప్పుపడుతున్నారు. హిందువులు, ముస్లింల మధ్య
సామరస్యతకు అది ప్రతీకగా ఉందని, కాబట్టి దాన్ని కొనసాగించాలని కోరుతున్నారు. ఇతర మతాల వారు కూడా హిందూ దేవాలయాలకు
వచ్చేవారని చెప్పడానికి ఇటువంటి పద్ధతులు చాలా మంచి ఉదాహరణలుగా ఉంటాయి. తన పాలనలోని హిందూ దేవాలయాలను టిప్పు సుల్తాన్
ఎలా చూశాడో ఇలాంటివి తెలుపుతాయి. పాలకులు మారినప్పుడల్లా దేవాలయాల్లో నియమాలు మారుతూ వచ్చాయి. కొన్ని అలాగే నేటికీ
కొనసాగుతున్నాయని చరిత్రకారులు చెబుతున్నారు.

సలాం హారతి పూజలు టిప్పు సుల్తాన్ పేరు మీద జరగడం లేదు. మూడో ఆంగ్లో-మైసూర్ యుద్ధం గెలిచినప్పుడు టిప్పు సుల్తాన్ మంగళూరు
ప్రాంతానికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన కొల్లూరు దేవాలయాన్ని సందర్శించారు. అప్పుడు అమ్మవారికి సలాం చేసి ఆయన గౌరవించారు. ఆ
దేవాలయానికి అనేక రకాలుగా సాయం కూడా చేశారు. నాటి నుంచి సలాం హారతి సంప్రదాయం కొనసాగుతోంది. అది ఒక పద్ధతి మాత్రమే. అదేమీ
టిప్పు సుల్తాన్ పేరు మీద జరగడం లేదు.

పేరు మార్చడం వల్ల ముస్లింలు మాత్రమే కాదు హిందువుల సెంటిమెంట్ కూడా దెబ్బతింటుంది. ఆ సంప్రదాయాన్ని అలాగే కొనసాగించాలని టిప్పు సుల్తాన్ వంశానికి చెందిన సాహెబ్‌జాదా మన్సూర్ అంటున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలతో కర్ణాటకలోని ఆలయాల్లో ఇకపై సలాం ఆరతి కనిపించదు. 300 ఏండ్ల క్రితం టిప్పు సుల్తాన్‌ పాలన ఆదేశాలను ప్రస్తుత బీజేపీ
ప్రభుత్వం మార్చివేసింది. ఈ ఆరతి పేరును సంధ్యా ఆరతిగా మారుస్తూ ప్రకటన జారీ చేసింది. హిందుత్వ సంస్థల నుంచి వచ్చిన డిమాండ్‌ మేరకు
ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టిప్పు సుల్తాన్‌ పేరిట సలాం ఆరతితో కూడిన ఆచారాలను రద్దు చేయాలని పలు హిందూత్వ సంస్థలు రాష్ట్ర
ప్రభుత్వాన్ని గత కొంతకాలంగా డిమాండ్‌ చేస్తున్నాయి. దాంతో హిందూ దేవాలయాలను పర్యవేక్షిస్తున్న రాష్ట్ర అథారిటీ ముజ్రాయ్ 6 నెలల క్రితం
ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. టిప్పు సుల్తాన్ హయాం నుంచి ప్రతి రోజు సాయంత్రం 7 గంటలకు సలాం ఆరతి నిర్వహిస్తున్నారు. కుక్కి
సుబ్రహ్మణ్య ఆలయం, పుత్తూరులోని శ్రీ మహాలింగేశ్వర ఆలయం, కొల్లూరులోని మూకాంబిక ఆలయంతోపాటు మరికొన్ని ప్రసిద్ధ దేవాలయాల్లో
కూడా సలాం ఆరతి జరుపుతున్నారు.

మండ్య జిల్లా యంత్రాంగం ఈ ప్రతిపాదనను హిందూ మత సంస్థలు, ధర్మాదాయ శాఖకు సమర్పించింది. ప్రస్తుతం మెల్కోట్‌లోని చలువ
నారాయణస్వామి ఆలయంలోనే ఈ ఆరతి పేరు మార్పు జరిగినట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ఆదేశాల కోసం
ఎదురుచూస్తున్నామని, అవి రాగానే రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో అమలు చేస్తామని ముజ్రాయ్‌ పేర్కొంది. దేవతిగె సలాం అని ప్రతిరోజూ
పూజారులు దేవాలయం ముందు రెండు దీపాలు వెలిగించి, మూడు సార్లు హారతిస్తారు.

ఈ సంప్రదాయం అప్పటి మైసూరు పాలకుడైన టిప్పు సుల్తాన్ కోసం, మైసూరు సుపరిపాలన కోసం ఏర్పాటు చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ సాంప్రదాయం కర్ణాటకలోని అతిపెద్ద దేవాలయాలైన పుత్తూరు, కోలూర్, మేల్కొటే దేవాలయాలతో పాటు ఇతర దేవాలయాల్లో కూడా ఉంది. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.
మేల్కొటే లోని చెలువ నారాయణ స్వామి దేవాలయం. సరిగ్గా దీపావళి రోజున మేల్కొటే గ్రామంలో టిప్పు సుల్తాన్ హిందువులను దారుణంగా
ఊచకోత కోయించాడు. ఈ దేవాలయంలో హిందువులందరూ ఎంతో భక్తి శ్రద్దలతో పూజలు జరుపుకుంటుంటే.. టిప్పు సుల్తాన్ తన సైన్యంతో దాడి
చేసి దాదాపు 800 మంది మండ్య కులస్థులను ఊచకోత కోయించాడు. కేవలం మతం మారనందుకే ఇంతటి దుర్మార్గమైన చర్యకు పాల్పడ్డాడు.
నాటి నుంచి నేటి వరకు ఆ విషాదానికి గుర్తుగా మేల్కొటేలో ఇప్పటికీ ఎవరూ దీపావళి జరుపుకోరు. టిప్పు సుల్తాన్ ఏ దేవాలయంలో అయితే
హిందువులను దారుణంగా ఊచకోత కోయించాడో.. ఆ దేవాలయంలో కూడా ఈ సలాం హారతి జరుగుతోంది. అయితే, కొన్ని దశాబ్దాలుగా
హిందువులు ఈ సలాం హారతిని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ వచ్చారు.

ఏదేమైనా కర్ణాటక ప్రభుత్వం సలాం హారతిని నిలిపివేయాలని నిర్ణయించుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా
భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదీ ఇవాల్టి ఫోకస్.. రేపటి ఫోకస్ లో మళ్లీ కలుద్దాం..

Must Read

spot_img