Homeతెలంగాణకన్నా లక్ష్మీనారాయణ నిర్ణయం..?

కన్నా లక్ష్మీనారాయణ నిర్ణయం..?

ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ అయ్యారు కన్నా లక్ష్మీనారాయణ. గత కొంతకాలంగా బిజెపిని వీడతారన్న ప్రచారాన్ని నిజం చేసారు. బిజెపిలో సీనియర్ నేతగా ఉన్న కన్నా ఎందుకు బిజెపికి గుడ్ బాయ్ చెప్పారు..? దాని వెనుక ఉన్న కారణాలేంటీ.? మరి ఇప్పుడు కన్నా దారెటూ..? ఆయన అనుచరగళం చర్చించుకుంటున్న అంశాలేంటీ అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కన్నా లక్ష్మీనారాయణ నిర్ణయం అత్యంత చర్చనీయాంశం అయ్యింది. కొంత కాలంగా కన్నా పార్టీ మారతరాని ప్రచారం జరిగినా.. ఆయన ఏ నిర్ణయం తీసుకోలేదు. కానీ తాజాగా కాషాయ పార్టీలో కల్లోలం సృష్టించారు. గతంలోనూ ఆయన బీజేపీలో ఉన్న సమయంలోనే సొంత పార్టీ నేతలపై ఘాటు విమర్శలు చేశారు. అప్పటి నుంచి ఆయన పార్టీ మారొచ్చు అనే ప్రచారం జరిగింది. కన్నా ఏపీ బీజేపీ చీఫ్‌గా ఉన్న సమయంలో.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 0.6 శాతం ఓట్లు వచ్చాయి. అప్పటి నుంచి ఆయన్ను పార్టీలోని ఓవర్గం టార్గెట్ చేసిందనే చర్చ జరిగింది.

అక్టోబర్ 2022లో పవన్ గురించి కన్నా కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్‌ను బీజేపీ సరిగా ఉపయోగించుకోలేదన్నారు. ఆయన ఆ వ్యాఖ్యలు చేసిన వెంటనే సునీల్ దియోధర్ స్పందించి ఖండించారు. కన్నా కామెంట్స్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. గతేడాది డిసెంబర్ 14న నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. కన్నా అసంతృప్తిగా ఉన్న సమయంలో మనోహర్ కలిశారు. దీంతో జనసేన పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ చేరలేదు.

అదే సమయంలో సోము వీర్రాజు పార్టీని ఏం చేయదలుచుకున్నారని ప్రశ్నించారు. అటు జీవీఎల్ నరసింహారావు శైలిపైనా కన్నా కినుకు వహించారు. కాపులతో జీవీఎల్ ఎందుకు సన్మానాలు చేయించుకుంటున్నారని ప్రశ్నించారు.

ఢిల్లీ, భీమవరంలో జరిగిన కార్యవర్గ సమావేశాలకు కూడా కన్నా రాలేదు. ఈ పరిణామాలతో కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరతారా లేక పవన్‌తో నడుస్తారా..? అనే చర్చ జరిగింది. విద్యార్థి దశ నుంచి కన్నా కాంగ్రెస్‌లోనే ఉన్నారు. అలాంటి నేత టీడీపీలో చేరతారా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. కన్నా మంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబును చూసి తీవ్ర ఆగ్రహంతో పళ్లు కొరికారు అని చాలామంది నేతలు చెబుతారు.

అలాంటి వ్యక్తి సైకిల్ ఎక్కుతారా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇటు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో కన్నా చేరే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు పవన్ బీజేపీతో పొత్తులో ఉన్నారు. కనుక టిడిపిలో కన్నా చేరనున్నట్టు తెలుస్తోంది. టిడిపి, జనసేన కలిసి పొత్తులో ఉంటే గెలుస్తామన్న హోప్ ఉండటంతో కన్నా ఈ నిర్ణయం తీసుకున్నరని టాక్. ఈ నేపథ్యంలో కన్నా ఏ సత్తెనపల్లి, పెదకూరపాడు నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

  • కన్నా రాజీనామాపై భిన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి..

మరోపక్న కన్నా రాజీనామా, విమర్శలపై బిజెపి నుండి జీవీఎల్ స్పందించారు. కన్నా రాజీనామా ఊహించిన పరిణామమే అని బిజెపి చెబుతోంది. కొన్నాళ్లుగా ఆయను ఇదే ప్లాన్‌లో ఉన్నారని ఇది బీజేపీలో టీ కప్పులో తుఫాన్ లాంటిదని బిజెపి నేతలు చెబుతున్నారు. వ్యక్తుల పరంగా పార్టీకి ఎలాంటి ఉపయోగం ఉండదు. సిద్ధాంతాలతో పార్టీకి లాభం జరుగుతుంది. ఒక్క నాయకుడు వెళ్లినా ఒక్క కార్యకర్త వెళ్లినా మేము అంతర్గతంగా చర్చించుకుంటాం.

ఇదే సమయంలో వ్యక్తులు ప్రధానం కాదు, సిద్ధాంతాలే ప్రధానం. కార్యకర్తలే ముఖ్యం. ఇతర పార్టీల నుంచి వచ్చినవారు కొంతమంది ఇక్కడ ఇమడలేకపోతారు. కానీ చాలా అరుదుగా కన్నాకి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారు. ఇది సాధారణంగా జరగదు. అయినా కన్నా ఏకపక్షంగా అనేక నిర్ణయాలు తీసుకున్నారు అని ఎంపీ జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. ఎన్నో ఏళ్లుగా కాపులకు అన్యాయం జరుగుతోంది. దీనిపై నేను పార్లమెంట్‌లో మాట్లాడాను. అందుకు కాపులు కొంతమంది సన్మానం చేశారు.

దానికి ఇంత రాద్ధాంతం ఎందుకు. కన్నా స్థాయికి ఇలాంటి మాటలు మాట్లాడటం ఏంటీ అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు.
వాస్తవానికి కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగారు. ఆయన చేసిన తప్పల్లా బీజేపీలో చేరడం. అదే వైసీపీలో చేరితే ఇవాళ నంబర్-2 స్థానంలో ఉండేవారని అనుచరులు చెబుతున్నారు. కానీ బీజేపీలో చేరి ఇవాళ ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కొందరు నేతలు కావాలని ఆయన్ను తక్కువచేసి మాట్లాడారని, కన్నా ఎప్పుడైనా బయటకు వెళ్లే వారని ప్రచారం చేశారు.

అలా ఎన్నో ఘటనలు కన్నాను ఇలా చేశాయని అనుచరులు చెబుతున్నారు. ప్రస్తుతం కన్నా టీడీపీలో, జనసేనలో చేరతారని ప్రచారం జరుగుతోంది. అదే టైంలో వైసీపీలో కూడా చేరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2019లో కనీస స్థాయిలో ఓట్లు రాలేదని కన్నా గురించి జాతీయ నాయకత్వానికి అసత్యాలు చెప్పారు. అప్పుడు పోటీ టీడీపీ-వైసీపీ మధ్య ఉంది. అంతేకాకుండా బీజేపీ ఎన్నో హామీలను ఇచ్చింది.

అవి అమలు చేయలేదు. దీంతో ప్రజలు ఓట్లు వేయలేదు. దానికి కన్నాను బాధ్యుడిని చేయడం ఎంతవరకు సమంజసమన్న చర్చ వినిపిస్తోంది. అంతేగాక ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజు సాధించిందేంటన్న ప్రశ్న సైతం సర్వత్రా వినిపిస్తుంది. అయితే కన్నా రాజీనామా ఊహించినా, ఎన్నికల ముందు వరకు బీజేపీలోనే కొనసాగుతారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ అందరికీ షాక్ ఇస్తూ కన్నా అకస్మాత్తుగా పార్టీకి రాజీనామా చేశారు.. అయితే బయట వారి సంగతి ఎలా ఉన్నా.. పార్టీ రాష్ట్ర నేతలు మాత్రం ముందే కాన్నా రాజీనామాను పసిగట్టునట్టు ఉన్నారు.

అందుకే కన్నా రాజీనామా చేసిన రోజునే కాపు నేతలతో సుదీర్ఘంగా సమావేశాలు నిర్వహించారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.. ఎందుకంటే కన్నాకు కాపు సామాజిక వర్గంలో మంచి పట్టు ఉంది.. ఆయనకు అనుచర బలం కూడా భారీగానే ఉంది. కేవలం గుంటూరు జిల్లానే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ సామాజిక వర్గంలో కన్నాకు ఓ ఇమేజ్ ఉంది. అయితే ఆయన పార్టీకి దూరం అయితే.. ఆ సామాజికి వర్గానికి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు.. కేడర్ కూడా దూరం అయ్యే ప్రమాదం ఉందని ముందే బీజేపీ అలర్ట్ అయ్యింది. అందుకే వెంటనే కౌంటర్ ప్లాన్ రెడీ చేసింది.

ఓవైపు కన్నా తన అనుచరులతో సమావేశం నిర్వహిస్తుంటే.. ఉదయం నుంచి ఎంపీ జీవీఎల్ తో కాపు నేతల వరుస భేటీలు నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వంగవీటి రంగా నినాదం ఎత్తుకుంది ఏపీ బీజేపీ.. ముఖ్యంగా కన్నా బలంగా భావించే కాపు నేతలను.. పార్టీ వీడకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నాలను ముందునుంచే మొదలెట్టారు. ఇందులో భాగంగా గత కొన్ని రోజుల నుంచి జీవీఎల్ కాపు నినాదం ఎత్తుకున్నారు.

మరోవైపు, జీవీఎల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు కాపు నేతలు.. జీవీఎల్ పార్లమెంటులో రంగా గురించి ప్రస్తావన తేవడం ఆనందంగా ఉందన్నారు వంగవీటి నరేంద్ర.. తాజాగా మరో డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. విజయవాడ విమానాశ్రయానికి రంగా పేరు పెట్టాలని కోరుతున్నారు. అలాగే జిల్లాకు కూడా రంగా పేరు పెట్టేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు మా ప్రయత్నం చేస్తామన్నారు. ఇదంతా .. కన్నాకు కాపు వర్గాన్ని దూరం చేయడానికే అన్నదే చర్చనీయాంశంగా మారింది. అయితే కన్నా పట్ల నెగటివ్ టాక్ తో పాటు కొందరు కావాలనే టార్గెట్ చేశారన్న వాదనలు హాట్ టాపిక్ గా మారాయి.

పార్టీ లోపల, బయట జరుగుతోన్న పరిణామాలతో కన్నా ఖిన్నులయ్యారని, అందుకే పార్టీకి రాజీనామా చేశారని అనుచరగణం చెబుతోంది. దీంతో కన్నా .. బీజేపీ అంతర్గత పోరును తెరపైకి తెచ్చినట్లైందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేగాక దీనిపై కన్నా ఏం చేస్తారన్నదీ హాట్ టాపిక్ గా మారింది.

మరి కన్నా ఎఫెక్ట్ .. బీజేపీపై ఎంతమేరకు ప్రభావం చూపుతుందన్నదే ఆసక్తికరంగా మారింది.

Must Read

spot_img