ఏపీలో రాజకీయాలు ఉద్రిక్తంగా మారుతున్నాయా..? దీనికి బాబు బహిరంగసభలే టార్గెట్ గా మారుతున్నాయా..? అసలు ఇంతకీ ఏపీలో
తొక్కిసలాట .. రాజకీయాంశంగా మారిందా.?
ఇటీవల కందుకూరు ఘటనని మరవక ముందే మళ్ళీ గుంటూరులో తొక్కిసలాట జరగగా, ముగ్గురు మహిళలు మృతి చెందారు. కందుకూరులో
చంద్రబాబు రోడ్ షోకు వెళ్ళగా, అక్కడ భారీ స్థాయిలో జనం వచ్చి..ఊహించని విధంగా 8 మంది టీడీపీ కార్యకర్తలు చనిపోయిన విషయం తెలిసిందే.
పలువురు గాయపడ్డారు. వారికి చంద్రబాబు అండగా నిలబడ్డారు. భారీ ఎత్తున ఆర్ధిక సాయం అందించారు. ఇక ఆ ఘటన ఇప్పుడుప్పుడే మరుస్తున్నారనే అనుకునేలోపు గుంటూరులో మళ్ళీ తొక్కిసలాట జరిగింది. గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమం జరిగింది.
కానుకల పంపిణీకి శ్రీకారం చుట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించిన అనంతరం వెళ్లిపోయారు.ఆ తర్వాత సభా ప్రాంగణం బయట ఉన్న లారీల్లో ఉంచిన కానుకలను పంచుతుండగా.. ఒకేసారి అందరూ ఎగబడ్డారు. ఈ క్రమంలో తొక్కిసలాటకు గురై..ముగ్గురు మహిళలు మృతి చెందారు. వాస్తవానికి కొందరు సీనియర్ టీడీపీ నేతలు.. కానుకల పంపిణీని వార్డుల వారీగా పెట్టుకుందామని సూచించినా నిర్వాహకులు పట్టించుకోలేదని తెలిసింది. ఇదిలా ఉంటే ఈ దుర్ఘటనకు బాధ్యత తనదే అని ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాసరావు ప్రకటన చేశారు.
అలాగే ఒక్కో కుటుంబానికి 20 లక్షల సాయం కూడా ప్రకటించారు. అటు ముగ్గురు చనిపోయిన ఘటనపై చంద్రబాబు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. ఇక టీడీపీ నేతలు కూడా తమవంతు సాయం ప్రకటించారు. అయితే మొన్న కందుకూరులో, ఇప్పుడు గుంటూరులో ఈ ఘటన జరగడంపై తెలుగుదేశం పార్టీలో విషాదం నెలకొంది. కానీ ఇలా వరుసగా ఘటనలు జరగడంలో ఏదో కుట్ర ఉందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. ఇక యథావిధిగానే చంద్రబాబు ప్రచార పిచ్చి వల్ల మహిళలు చనిపోయారని మంత్రి విడదల రజిని అన్నారు. ప్రభుత్వం తరుపున చనిపోయిన వారికి 2 లక్షలు, గాయపడ్డ వారికి 50 వేలు సాయం ప్రకటించారు. మరి ఈ వరుస ఘటనల్లో ఏదైనా కుట్ర ఉందా? లేక ప్రచార పిచ్చి ఉందా? అనేది క్లారిటీ లేదు. దీంతో చంద్రబాబు సభల్లో అసలేం జరుగుతోంది.
జనం తొక్కిసలాట జరిగి చనిపోయేంత వెల్లువలా వస్తున్నారా ? తొక్కిసలాట జరిగేలా చేస్తున్నారా ? అసలేం జరుగుతోంది ? వరుసగా చంద్రబాబు సభల్లోనే ఎందుకు జరుగుతున్నాయి ?
చంద్రబాబు నలభై ఏళ్ల నుంచి ర్యాలీలు నిర్వహిస్తున్నారు. లక్షల మంది పాల్గొన్న సమవేశాలకు హాజరయ్యారు. కానీ ఎప్పుడూ ఇలాంటి ఘటనలు
జరగలేదు. కానీ ఇప్పుడు మాత్రం వరుసగా తొక్కిసలాటలు జరుగుతున్నాయి. ప్రాణ నష్టం జరుగుతోంది. అదీ వారం రోజుల్లో రెండో సారి. ఎందుకిలా జరుగుతోందని టీడీపీ నేతలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భద్రత తక్కువగా పెడతారని తెలిసి.. తెలుగుదేశం పార్టీ తరపున పెద్ద ఎత్తున
వాలంటీర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. నియంత్రించుకుంటున్నారు. అయినా గుంటూరు ఘటన జరిగింది. గుంటూరులో ఉయ్యూరు ట్రస్ట్ వాళ్లు
పేదలకు సంక్రాంతి కానుక పంపిణీ చేసే కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించి వెళ్లిన తర్వాత ఓ పక్కన తొక్కిసలాట జరిగింది.
దుస్తులు టోకెన్లు కూడా ఉన్న వారికి కూడా అందవనే పుకారు లేపడంతో ఈ తొక్కిసలాట జరిగింది. ఒకరు సంఘటనా స్థలంలో మరో ఇద్దరు ఆస్పత్రిలో చనిపోయారు. వెంటనే వైసీపీ సోషల్ మీడియా రంగంలోకి దిగింది. రెడీ చేసి పెట్టుకున్నట్లుగా ఏకీకృత దాడిని చంద్రబాబుపై చేసింది. నిజానికి అది
బహిరంగసభ కాదు. టీడీపీ ఏర్పాటు చేసింది కాదు. ప్రజలకు సాయం చేసేందుకు పెట్టిన సభ. అంత ప్లాన్డ్ గా తొక్కిసలాట వీడియోలు.. చంద్రబాబును తిట్టించే వీడియోలు తీసుకోడం ఎలా సాధ్యం ? జనవరి ఒకటో తేదీన .. ఆదీ ఆదివారం.. సాయంత్రం సోషల్ మీడియా ఉద్యోగులంతా చాలా బిజీ అయిపోయారు.
ఓ దుర్ఘటన జరగనుందని వారికి ముందుగానే తెలిసినట్లుగాప పకడ్బందీగా ట్రెండ్ చేయడానికి అవసరమైన హ్యాష్ ట్యాగ్‌లు… నారా హంతకుడు లాంటి టైటిల్స్ తో పోస్టర్లు వేసుకుని రంగంలోకి దిగారు. అనుమానం ఏమిటంటే .. అక్కడ తొక్కిసలాట జరుగుతుందని కొంత మందికి ముందే తెలిసినట్లుగా ఎవరికీ సాధ్యం కాని రీతిలో అక్కడే చంద్రబాబును బూతులు తిట్టేందుకు కొంత మందిని ఆరెంజ్ చేసి పెట్టుకుని తమ తిట్ల దండకాన్ని వినిపించారు. ఒకరిద్దరు మహిళలే అన్ని యూట్యూబ్ చానళ్లు.. మీడియాతో మాట్లాడటం పక్కా ప్రణాళిక అని అర్థం చేసుకోచ్చని టీడీపీ నేతలంటున్నారు.
దీంతో రాజకీయంగా దిగజారిపోతే కుట్రలు, కుతంత్రాలు ఎలా ఉంటాయో సినిమాల్లోనే చూస్తాం. కానీ విచిత్రంగా కొన్నాళ్లుగా అలాంటి సీన్లు ఏపీలో కనిపిస్తున్నాయని విశ్లేషకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారంటే, అతిశయోక్తి కాదు. ఇదిలా ఉంటే,రాజకీయ నాయకులు ప్రజల్లోకి వచ్చి రాజకీయ సభలు నిర్వహించడం అనేది ఎప్పటి నుంచో ఉన్న సంస్కృతే. వారు జనాల్లోకి వచ్చినప్పుడు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. రోడ్ షోలు, భారీ బహిరంగ సభలు నిర్వహిస్తుంటారు. ఇలాంటి సమయాల్లో తొక్కిసలాట జరిగి.. దురదృష్టవశాత్తు ఒకరిద్దరు మరణించే అవకాశం ఉంటుంది. అయితే బహిరంగ సభల్లో ఇది మామూలే కదా అని అనుకోవడానికి లేదని కొందరు అంటున్నారు.అసలు మనుషుల ప్రాణాలు పోయేలా సభలు పెట్టడం దేనికి అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రభుత్వాలు కూడా ప్రతిపక్ష నేతల సభలకు పర్మిషన్లు ఇవ్వడం, ప్రతిపక్ష పార్టీలు జనాల గురించి ఏ మాత్రం ఆలోచన లేకుండా సభలు నిర్వహించడం వంటివి అస్సలు మంచి పద్ధతి కాదని అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే సభలు పెట్టాల్సిన అవసరమే లేదని అంటున్నారు. ఒక సభ పెడితే.. ఆ సభకు వచ్చే జనం ఎంత? సభలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా ఆ సమస్యను పరిష్కరించాలి? తొక్కిసలాట జరగకుండా సభ నిర్వహించడం ఎలా? అన్న ఆలోచనలు లేకుండా సభలు నిర్వహించడం మంచిది కాదని అంటున్నారు.
ఇదే పెద్ద మనుషులు ఏదైనా దైవదర్శన సమయంలోనే తొక్కిసలాట జరిగితే..అదిగో మీ యంత్రాంగం సరిగా పట్టించుకోలేదని నానా రభస చేస్తారు. ఎక్కడో జరిగిన దానికి అంతలా స్పందించినప్పుడు.. సొంత సభ పెట్టినప్పుడు ఎంత లోతుగా ఆలోచించాలి? అని జనం ప్రశ్నిస్తున్నారు. జానాదరణ ఉన్నటువంటి వ్యక్తులు బహిరంగ ప్రదేశాల్లోకి వస్తే తొక్కిసలాట జరుగుతుంది.తమ వల్ల తొక్కిసలాట జరగకూడదని ఆగిపోయే వాళ్ళే అసలైన నాయకులు అన్న వాదన వినిపిస్తుంది. ఒకవేళ ప్రజలతో తమ అభిప్రాయాలు పంచుకోవాలి అనుకుంటే దానికి.. సోషల్ మీడియా, మీడియా ఛానళ్లు వంటి వేదికలు ఉన్నాయి కదా అని అంటున్నారు.
వాటి ద్వారా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పవచ్చునని నెటిజన్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇంకా సులువైన పద్ధతి కదా అన్నది ప్రజల వాదన. ఒక ప్రెస్ మీట్ పెట్టి.. జనాలకు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్తే.. వారికి చేరువవుతుంది కదా అని అంటున్నారు. ఈరోజుల్లో ఫోన్లు, టీవీలు లేని ఊర్లు ఉన్నాయా? అయినప్పటికీ జనాలతో ఇంటరాక్షన్ అవ్వాలంటే.. పార్టీ కార్యకర్తలని వాడుకుంటే సరిపోతుంది కదా అని అంటున్నారు. పార్టీ అధ్యక్షులు చెప్పిన మాటలను.. పార్టీ కార్యకర్తలు గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో తీసుకెళ్లే సత్తా కార్యకర్తలకు ఉంది. కానీ అలా చేయకుండా జనాదరణ కలిగిన పార్టీ అధ్యక్షులు ఇలా జనాల్లోకి రావడం, బహిరంగ సభలు నిర్వహించడం వల్ల జనాలు ప్రాణాలు కోల్పోతున్నారని
మండిపడుతున్నారు.
టెక్నమీటింగులు తప్ప.. జనాలకు ఏ ఉపయోగం లేదని అంటున్నారు. జనాలకు ఉపయోగం లేని పనులు ఎందుకు చేయడం అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిన్న కందుకూరులో 8 మంది మరణించారు.. నేడు గుంటూరులో ముగ్గురు మరణించారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అంటూ అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఇక గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అయితే చంద్రబాబు సభలకు డీజీపీ అనుమతులు ఇవ్వవద్దని డిమాండ్ చేశారు. బాబు ప్రచార పిచ్చి కారణంగానే గుంటూరు ఘటన జరిగిందని మాజీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు.