ముందుగా ఎన్నికలు జరిగే మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాల్లో గెలిచేందుకు సమాయాత్తం అవుతోంది. స్థానికంగా వినిపిస్తోన్న సమస్యలపై స్పందిస్తూ, స్థానిక పార్టీలతో పొత్తులకు ప్రయత్నాలు చేస్తోంది. దీంతో చల్లగా ఉండే ఈ రాష్ట్రాల్లోనూ ఎన్నికల వేడి ఓ రేంజ్ లో సాగుతోంది.
- ఈశాన్య రాష్ట్రాల్లో పొత్తులతో అధికార పీఠం ఎక్కిన బీజేపీ .. ఈ దఫా ఎటువంటి వ్యూహాన్ని అనుసరించనుంది..?
- అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధి మంత్రాన్ని జపిస్తూ.. గెలుపుకు పావులు కదపనుందా..?
- ఈ నేపథ్యంలో అక్కడి పార్టీల దారెటు.. గతేడాది లాగానే పొత్తులు విరబూస్తాయా.. లేక ఎవరి దారి వారిదే అన్నట్లు .. పోటీ పడనున్నాయా..?
వచ్చే ఏడాది జరుగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఏడాది 9 రాష్ర్టాలలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి కీలకం కానున్నాయి. వీటిలో
నాలుగు ఈశాన్య రాష్ర్టాలే ఉండగా, నాగాల్యాండ్, త్రిపుర, మేఘాలయ రాష్ర్టాలకు వచ్చే నెల 16 నుంచి 27 వరకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ
ఎన్నికలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సెమీ ఫైనల్‌గా భావిస్తోంది.
కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావాలని ఆశపడుతున్న బీజేపీ ఈశాన్య రాష్ర్టాల ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మోదీ హయాంలోనే బీజేపీ ఈశాన్య భారతంలో మొదటిసారి పాగా వేసింది. తొలుత అరుణాచల్‌ప్రదేశ్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని గవర్నర్ సహాయంతో లొంగదీసుకోవడం ద్వారా ఈశాన్య రాష్ర్టాలలో కాలుమోపింది. ఇదే వ్యూహాన్ని ఇతర రాష్ర్టాలలో కూడా అమలు చేసింది.
ఎన్డీయేకు ప్రతిరూపమైన నార్త్ ఈస్ట్ డెమోక్రటిక్ అలయెన్స్ ఎన్‌ఈడీఏ ద్వారా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీలతో జతకట్టి ఒక్కొక్క రాష్ర్టాన్ని హస్తగతం చేసుకుంది. ఇప్పుడు మరోసారి అక్కడి మూడు రాష్ర్టాలకు అసెంబ్లీ ఎన్నికలు రావడంతో తన ఉనికిని సుస్థిరం చేసుకొనేందుకు వ్యూహం పన్నుతోంది.
కానీ ఈసారి అదంత సులభం కాకపోవచ్చని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. 60 మంది సభ్యులున్న మేఘాలయ అసెంబ్లీకి ఫిబ్రవరి 27న ఎన్నికలు జరుగనున్నాయి. గత ఎన్నికలలో హంగ్ అసెంబ్లీ ఏర్పడటంతో దొడ్డిదారిన బీజేపీ గవర్నర్ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ముకుల్ సంగ్మా నేతృత్వంలోని కాంగ్రెస్ 21 సీట్లు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది.
కానీ కేంద్రం డైరెక్షన్‌లో 19 సీట్లు గెలుచుకున్న నేషనలిస్ట్ పీపుల్స్ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ సమయం ఇచ్చారు. ఇతర చిన్నా చితక పార్టీలతో బేరసారాలు జరిపేందుకు సహకరించారు. దీంతో యూడీఎఫ్, పీడీపీ, హెచ్‌ఎస్డీపీ వంటి అన్ని ప్రాంతీయ పార్టీలతో కలిసి 31 మంది సభ్యుల మద్దతుతో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది.
![](https://inewslive.net/wp-content/uploads/2023/02/bjp-1-684x1024.jpg)
వాస్తవానికి ఇక్కడ కేవలం రెండు సీట్లు మాత్రమే బీజేపీ గెలిచినప్పటికీ క్రిస్టియన్ ఓటర్లు అధికంగా ఉన్న మేఘాలయలో దొడ్డిదారిన బీజేపీ అధికారాన్ని చేపట్టగలిగింది. కానీ రాబోయే ఎన్నికల్లో బీజేపీకి గడ్డు పరిస్థితి తప్పదని స్థానిక పరిణామాలు సూచిస్తున్నాయి.
సంకీర్ణ కూటమిలోని ఇతర పార్టీలతో బీజేపీకి సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎన్‌పీపీతో అసలు పొసగడం లేదు. బీజేపీ బలపడటం తమకు ప్రమాదకరమని ఎన్‌పీపీ నేతలు భావిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెర్నాడ్ ఆర్ మారాక్‌ను గత జూలైలో వ్యభిచార గృహాన్ని నడుపుతున్నారనే ఆరోపణపై అరెస్టు చేసారు. సీఎం కాన్రాడ్ సంగ్మాకు, మారాక్‌కు పడటం లేదన్నది బహిరంగ రహస్యమే.
ఈసారి కూడా రాష్ట్రంలోని అన్ని పార్టీలు విడివిడిగానే బరిలోకి దిగుతున్నాయి. దీంతో ఎన్నికలకు ముందు బీజేపీతో ఎవరూ జతకట్టే పరిస్థితులు కనిపించడం లేదు. ఇక త్రిపురలో గత ఎన్నికల్లో బీజేపీ 36 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది.
దేబ్‌బర్మ నేతృత్వంలోని ఐపీఎఫ్‌టీతో పొత్తు వల్లనే బీజేపీకి గెలుపు సాధ్యమైంది. అక్కడ 20 ఏండ్లపాటు ఏకధాటిగా సాగిన సీపీఎం పాలనపై వ్యతిరేకత, గిరిజనులకు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్న ఐపీఎఫ్‌టీతో పొత్తు బీజేపీకి కలిసొచ్చింది. అయితే గెలుపు తర్వాత ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను బీజేపీ అటకెక్కించింది.
దీంతో త్రిపుర రాజకుటుంబానికి చెందిన ప్రద్యోత్ దేబ్‌బర్మ.. టిప్రా మోతా పేరిట పార్టీ ఏర్పాటుచేసి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను నెత్తికెత్తుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం విషయంలో కేంద్రం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు బీజేపీ సాహసించకపోవడంతో ఒంటరిగానే బరిలోకి దిగుతున్నారు.
- ఈ పార్టీ ప్రభావం గిరిజనులు అత్యధికంగా ఉన్న 20 స్థానాలపై ఉండవచ్చని భావిస్తున్నారు..
సీఎం బిప్లబ్ కుమార్‌ను బీజేపీ గత మే నెలలో గద్దె దించి మాణిక్ సాహాను ఆ స్థానంలో కూర్చోబెట్టింది. కానీ అప్పటికే బీజేపీకి జరగాల్సిన నష్టం జరిగిపోయిందని పరిశీలకులు అంటున్నారు. మేఘాలయ మాదిరిగానే నాగాల్యాండ్‌లో కూడా ప్రభుత్వాన్ని బీజేపీ వెనుకనుంచి నడిపిస్తున్నది. ఈ సారి ఎలాగైనా గట్టెక్కేందుకు కొత్తగా ఏర్పడిన నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీపై ఆధారపడుతోంది.
గత ఎన్నికల సమయంలో నాగా పీపుల్స్ ఫ్రంట్ అగ్రనాయకత్వంపై అపనమ్మకంతో ఉన్న సీఎం నెఫియూ రియో బీజేపీ సహాయంతో ఎన్‌డీపీపీని ఏర్పాటుచేశారు. అంతకుముందు రియో ఎన్‌పీఎఫ్ తరఫున సీఎం కాగా, బీజేపీ దానికి మిత్రపక్షంగా ఉండేది. వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో బీజేపీ, ఎన్‌డీపీపీలు మరోసారి పొత్తుతో వస్తున్నాయి. మొత్తం 60 స్థానాలకు గాను ఎన్డీపీపీ 40 స్థానాల్లో, బీజేపీ 20 స్థానాల్లో పోటీ చేయనున్నాయి.
అయితే, రాష్ట్రంలో సీట్ల సర్దుబాటుపై రాష్ట్ర నేతలు నిరసన వ్యక్తం చేస్తూ 50-50 ప్రాతిపదికన పోటీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈశాన్య రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేక దృష్టిని సారించింది. ఈ రాష్ట్రాల్లో పట్టు పెంచుకోవాలని భావిస్తోంది. అభివృద్ధి మంత్రం ద్వారా రాజకీయంగా మరింత బలపడడానికి వ్యూహాలు రచిస్తోంది.
ఇందులో భాగంగానే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్‌రెడ్డితో సహా ఇతర బీజేపీ అగ్రనేతలు తరుచూ పర్యటిస్తున్నారు. ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు కేంద్రం పెద్దలు తెలుసుకొని సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తున్నారని, దాంతో తమ పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగిందని బీజేపీ నేతలు అన్నారు. కేంద్ర మంత్రిత్వ శాఖల ద్వారా అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు సరిపడా నిధులను కేంద్రం మంజూరు చేస్తోంది.
దీంతోపాటు క్షేత్రస్థాయిలో పనులను వేగవంతం చేసి, త్వరగా ఫలితాలు చూపించడానికి పర్యవేక్షణకు ప్రత్యేక యంత్రాంగాన్ని రూపొందించుకుంది.
త్రిపుర, మిజోరాం, నాగాలాండ్ రాష్ట్రాల్లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన మొదలుపెట్టింది. త్రిపురలో బీజేపీ అధికారంలో ఉండగా, నాగాలాండ్‌లో ఎన్డీఏ పక్షాలతో అధికారాన్ని పంచుకుంటోంది. ఈ రాష్ట్రాల్లో సుదీర్ఘకాలంగా శాంతి భద్రతల సమస్య ఉంది.
ఇక్కడ శాంతి స్థాపన, అభివృద్ధి ద్వారా ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలని ప్రధాని మోదీ భావిస్తున్నారు. నాగాలాండ్, మిజోరాం, మణిపూర్‌తోసహా ఇతర రాష్ట్రాల్లోని తిరుగుబాటు సంస్థలతో చర్చలు జరపడం ద్వారా ఉగ్రవాదాన్ని రూపుమాపాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉంది. కొన్ని సంస్థలతో ఇప్పటికే శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
చర్చలకు నిరాకరించిన తిరుగుబాటుదారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని సాయుధ బలగాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసిందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. అయితే త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలలో బీజేపీ విజయంపై పరిశీలకులే కాదు, బీజేపీ శ్రేణులు కూడా నమ్మకంగా చెప్పలేని పరిస్థితి ఉంది. ఈ మూడు రాష్ట్రాలలో త్రిపురలో ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉంది.
త్రిపురలో గత ఎన్నికల్లో మేజిక్ ఫిగర్‌ను సాధించి అధికారంలోకి వచ్చింది బీజేపీ. అంతకు ముందు త్రిపురలో బీజేపీకి ఉనికి కూడా నామమాత్రం
అన్నట్లుగా పరిస్థితి ఉంది. అలాంటి స్థితి నుంచి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఐదేళ్లు అధికారంలో ఉన్న తర్వాత ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. దీంతో బీజేపీకి ఈ దఫా గెలుపు నల్లేరు మీద నడక కాకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రచారాల నేపథ్యంలో కమలం ఈశాన్య రాష్ట్రాలపై పట్టు బిగించేందుకు సమాయాత్తం అవుతోంది.
ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ అభివృద్ధి మంత్రం ఏమేరకు కలిసి వస్తుందన్నదే ఆసక్తికరంగా మారింది. వచ్చే ఎన్నికల్లో ఈ రాష్ట్రాల్లో గెలుపుతో సార్వత్రికంలోపట్టు బిగించాలన్న కమల వ్యూహం ఎంతమేర సక్సెస్ అవుతుందన్నదే చర్చనీయాంశమవుతోంది.