తెలుగు సినీ ప్రపంచంలో .. కళా తపస్వి విశ్వనాథ్ .. ఓ చరిత్ర .. అంటే .. కాదనలేరు.. భావుకత, ఆర్థత, సామాజిక అంశాలే చిత్రాలుగా.. తెలుగు సినిమా ఆత్మ గౌరవాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన అత్యుత్తమ దార్శనికుడు, దర్శకుడు .. కె.విశ్వనాథ్ .. శాస్త్రీయ సంగీత గొప్పదనాన్నివివరిస్తూ, నిర్మించిన శంకరాభరణం చిత్రం రిలీజైన రోజే .. శివైక్యం చెందడం .. సినీ అభిమానులకు తీరని లోటు..శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, సిరిసిరిమువ్వ, శ్రుతిలయలు, శుభలేఖ, స్వయంకృషి .. ఈ పేర్లు వినగానే అందరికీ గుర్తుకొచ్చేది ఆ సినిమా నటీనటులు కాదు.. ఆ చిత్రాల్ని తీసిన దర్శకుడు విశ్వనాథ్.. అసలు తొలి మూడు సినిమాల పేర్లు చెబితేనే, ప్రతి ఒక్కరి మనస్సు ..అద్భుతమైన .. కళాత్మకతతో నిండిపోతుంది.. ఇంతటి గొప్ప సినిమాలు తీసిన దర్శకుడు కె.విశ్వనాథ్ .. మరణం.. తీరని వ్యధే..
తెలుగు సినిమా ఆత్మగౌరవాన్ని జాతీయ స్థాయిలో రెపరెప లాడించిన దిగ్గదర్శకుడు కళా తపస్వి కె.విశ్వనాథ్.. తెలుగు సినిమాకు సిరివెన్నెలలు కురిపించిన ఆపద్భాందవుడు. ఎన్నో చిత్రాల్లో భావుకత, ఆర్ధ్రత, కుటుంబ, సామాజిక అంశాలు సృజించడంలో విశ్వనాథ్ శైలే వేరు. కళాతపస్వి కె.విశ్వనాథ్ పేరు చెబితే శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, సిరిసిరిమువ్వ సినిమాలు గుర్తుకువస్తాయి. తెలుగు సినిమాల్లో సంగీతానికి పెద్ద పీటవేసి, శృతిలయలు నేర్పిన దర్శక యశస్వీ, కళా తపస్వి..
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పద్మశ్రీ కె.విశ్వనాథ్. అచ్చమైన తెలుగుదనానికి అందమైన చిరునామా కాశీనాథుని విశ్వనాథ్ సినిమా. అనేక కథాంశాలతో సినిమాలను తెరకెక్కించిన కళాతపస్వి ఆయన. హీరోని గుడ్డివానిగా, హీరోయిన్ మూగ అమ్మాయిగా సినిమా సిరివెన్నెల తీసి ఒప్పించి విజయం సాధించడం ఆయనకే చెల్లింది. వరకట్న సమస్యపై శుభలేఖ, కుల వ్యవస్థపై సప్తపది, గంగిరెద్దువాళ్ల జీవితాలపై సూత్రధారులు చిత్రాలను మలిచారు. ఇంకా సిరి సిరి మువ్వ, శ్రుతిలయలు,స్వాతికిరణం, స్వర్ణకమలం, శుభోదయం, శుభ సంకల్పం వంటి కళాత్మక సినిమాలు ఆయన ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం.
టాలీవుడ్ లెజండరీ డైరెక్టర్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్ ఇకలేరు.అనారోగ్య సమస్యలతో నిన్న ఆయన కన్నుమూశారు. విశ్వనాథ్ వయసు 92 ఏళ్లు. ఆయన గత కొంత కాలంగా వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. 1980, ఫిబ్రవరి 2వ తేదీన విడుదలైన శంకరాభరణం మూవీ ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమా విడుదలైన రోజే కళాతపస్వి శివైక్యం పొందారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. ఆయన మృతితో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

విశ్వనాథ్ స్వస్థలం గుంటూరు జిల్లాలోని రేపల్లె. ఆయన ఫిబ్రవరి 19, 1930లో జన్మించారు. ఆయన పూర్తి పేరు కాశీనాథుని విశ్వనాథ్. గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్, ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీలో బీఎస్సీ చేశారు. ఆయన తండ్రి కాశీనాథుని సుబ్రహ్మణ్యం మద్రాసులోని వాహిని స్టూడియోస్ లో పని చేసేవారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత విశ్వనాథ్ కూడా అందులో ఉద్యోగానికి వెళ్లారు. సినిమాల్లో విశ్వనాథ్ కెరీర్ సౌండ్ రికార్డిస్ట్ గా మొదలైంది. వాహిని స్టూడియోస్ లో ఆయన తొలి ఉద్యోగం అదే. ఆ తర్వాత దర్శకత్వం వైపు అడుగులు వేశారు. మన సినిమా పరిశ్రమ ఎప్పటికీ గర్వంగా చెప్పుకొనే సినిమాల్లో ఒకటైన ‘పాతాళ భైరవి’ చిత్రానికి ఆయన దర్శకత్వ శాఖలో పని చేశారు.
1957లో వచ్చిన తోడికోడళ్లు సినిమాకు సౌండ్ ఇంజనీర్ గా సినిమా కెరీర్ ప్రారంభించారు విశ్వనాథ్. ఆ చిత్ర సమయంలో ఆయన పనితనం గమనించిన దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు, విశ్వనాథ్‌కు సహాయ దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. ఆయన దగ్గరే ఇద్దరుమిత్రులు, చదువుకున్న అమ్మాయిలు, మూగమనసులు, డాక్టర్ చక్రవర్తి వంటి అక్కినేని సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేసారు విశ్వనాథ్ ఆత్మ గౌరవం సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు.
దానికి నంది పురస్కారాల్లో ఉత్తమ సినిమా విభాగంలో కాంస్య బహుమతి లభించింది. కథకు కూడా నంది పురస్కారం లభించింది. ఆ తర్వాత విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘చెల్లెలి కాపురం’, ‘శారదా’, ‘ఓ సీత కథ’, ‘జీవన జ్యోతి’ చిత్రాలు ఉత్తమ సినిమా విభాగంలో నందులు అందుకున్నాయి. నందులు అందుకున్న సినిమాలు ఇంకెన్నో ఉన్నాయి. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఆణిముత్యాల్లో ‘శంకరాభరణం’ ఒకటి.దానికి ఉత్తమ సినిమాగా నంది మాత్రమే కాదు… జాతీయ అవార్డు కూడా వచ్చింది.
బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ఫర్ ప్రోవైడింగ్ హోల్ సమ్ ఎంటర్టైన్మెంట్’ విభాగంలో నేషనల్ అవార్డు అందుకుంది. ‘సప్తపది’, ‘స్వాతిముత్యం’, ‘సూత్రధారులు’, ‘స్వరాభిషేకం’ సినిమాలకూ నేషనల్ అవార్డులు వచ్చాయి. ‘స్వాతి ముత్యం’ సినిమాను ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో 59వ ఆస్కార్ అవార్డులకు ఇండియా నుంచి అధికారికంగా పంపించారు. చిత్రసీమకు విశ్వనాథ్ చేసిన సేవలకు గాను ఆయన్ను భారత ప్రభుత్వం 1992లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. తెలుగుతో పాటు హిందీ సినిమాలకూ ఆయన దర్శకత్వం వహించారు.
‘శుభ సంకల్పం’ సినిమాతో నటుడిగా మారిన ఆయన, ఆ తర్వాత పలు చిత్రాల్లో పాత్రలకు ప్రాణం పోశారు. విశ్వనాథ్ అనేది తెలుగు చిత్రసీమలో ఒక పేరు కాదు, చరిత్ర. తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో విశ్వనాథ్ నటించారు. ఎనిమిది సార్లు ఆయన ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్నారు. ఆయన్ను 1994లో జీవిత సాఫల్య పురస్కారంతో ఫిల్మ్ ఫేర్ సత్కరించింది. తెలుగు చిత్రపరిశ్రమకు గొప్ప గౌరవాన్ని, గుర్తింపు తీసుకొచ్చిన విశ్వనాథ్ .. 50కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. భారతీయ సంస్కృతికి చిహ్నమైన శాస్త్రీయ కళలను కథలుగా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు.
టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటారు విశ్వనాథ్ గారు, ఆయన తీసిన హిట్ చిత్రాలను హిందీలో రీమేక్ చేసి విజయం సాధించారు. సిరిసిరిమువ్వను సర్గమ్ గా, శుభోదయం చిత్రాన్ని కామ్‌చోర్ గా, శంకరాభరణం సినిమాను సుర్ సంగమ్ గా తీసి హిట్టు కొట్టారు కేవీ.దర్శకుడిగానే కాదు.. నటుడిగానూ తెలుగు సినీ అభిమానులను అలరించారు. అనేక సినిమాల్లో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు.
శుభసంకల్పం, నరసింహనాయుడు, కలిసుందాం రా, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, ఠాగూర్, అతడు, ఆంధ్రుడు, మిస్టర్ పర్‌ఫెక్ట్ వంటి హిట్ సినిమాల్లో విశ్వనాథ్ నటించారు. తెలుగులో చివరగా హైపర్ సినిమాలో కనిపించారు విశ్వనాథ్. సినిమారంగంలో చేసిన కృషికి గాను… 2016 లో ఆయన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది. 1992 లో రఘుపతి వెంకయ్య పురస్కారంతో పాటు పద్మశ్రీ అవార్డును ఆయన అందుకున్నారు. అంతేకాక గల్ఫ్ ఆంధ్రా అవార్డు ఫర్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ ఇన్ సినిమా అవార్డును కూడా అందుకున్నారు.
ఇంకా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ను కూడా అందుకున్నారు విశ్వనాథ్. ఆయన జీవితంపై ప్రముఖ దర్శకుడు జనార్దన మహర్షి విశ్వదర్శనం సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆయన తీసిన సినిమాలు ఇప్పటి దర్శకులకు ఒక ఆదర్శంగా నిలిచాయి. తెలుగు సినిమా ఉన్నంత
కాలం కే. విశ్వనాథ్ సినిమాలు నిలిచే వుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. తన ప్రతి సినిమాను ఒక అద్భుత కళారూపంగా మలిచేవారు విశ్వనాథ్. అప్పటివరకున్న మూస పద్ధతికి బ్రేకేస్తూ, భిన్నంగా సినిమాలు తీస్తూ ప్రేక్షకుల హృదయాల్లో తనదైన ముద్ర వేసుకున్న గొప్ప దర్శకుడు విశ్వనాథ్. అందుకే, కాలాన్ని, మారుతున్న అభిరుచుల్ని తట్టుకుని ఇప్పటికీ గొప్ప సినిమాగా నిలిచిపోయింది శంకరాభరణం.
విశ్వనాథ్ సినిమాలన్నీ కథాకథనాలు సున్నితంగానే ఉంటాయి. కానీ, బలమైన అంశాలను తన సినిమాల్లో చర్చిస్తారు. సాంఘిక దురాచారాలను,పశుప్రవృత్తిని ఎండగడతారు. మన సంస్కృతి సంప్రదాయాలను గుర్తుచేస్తారు. మనలోని సున్నిత భావాలను మేల్కొలిపే ప్రయత్నం చేస్తారు.ఆకాంక్షలు, ఆశయాలు, విలువలను ముందు తరాలకు అందించే ప్రయత్నం చేయడంలో విశ్వనాథ్ ది అందె వేసిన చెయ్యి.
