Homeఅంతర్జాతీయంఉక్రెయిన్ లో జో బైడెన్.. రష్యా మాస్టర్ ప్లాన్?

ఉక్రెయిన్ లో జో బైడెన్.. రష్యా మాస్టర్ ప్లాన్?

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు..ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో ఆకస్మికంగా పర్యటించారు. పోలాండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉన్న బైడెన్.. అంతకుముందే ఉక్రెయిన్ ​కు వెళ్లి అందరికీ షాకిచ్చాడు..

ఉక్రెయిన్ పై రష్యా యుద్దం ప్రారంభించి దాదాపుగా ఏడాది కావస్తోంది.. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆకస్మికంగా ఉక్రెయిన్ లో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.. పోలెండ్ పర్యటనను కాదని.. జో బైడెన్ ఉక్రెయిన్ లో పర్యటించడానికి ప్రధాన కారణం ఏంటి..?

రష్యా -ఉక్రెయిన్‌ మధ్య యుద్దం ప్రారంభమై దాదాపు ఏడాది కావస్తోంది. ఈ తరుణంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆకస్మికంగా ఉక్రెయిన్‌లో పర్యటించారు. కీవ్‌లో బైడెన్‌కు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఘనస్వాగతం పలికారు. బైడెన్‌ పర్యటన వేళ ఉక్రెయిన్‌ గగనతలంలో ఎమర్జెన్సీ సైరెన్లు మోగాయి. వైమానిక దాడి సైరెన్లు మోగడంతో అంతా అలర్టయ్యారు. ఎయిర్‌ సైరన్‌ మోగినప్పటికి కీవ్‌లో తన పర్యటనను బైడెన్‌ కొనసాగించారు. ఉక్రెయిన్‌-రష్యా యుద్దం తరువాత బైడెన్‌ కీవ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్‌ పర్యటర సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు బైడెన్‌. యుద్దం విషయంలో రష్యా అంచనాలు తప్పాయని అన్నారు. ఉక్రెయిన్‌ చాలా సులభంగా స్వాధీనం చేసుకుంటామని పుతిన్‌ భ్రమపడ్డారని, కాని అది నిజం కాలేదన్నారు.

ఉక్రెయిన్ – రష్యా యుద్ధం ఏడాదికి చేరుకోబోతున్న వేళ.. ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఉన్నట్టుండి.. కీవ్‌లో ప్రత్యక్షమై.. ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచారు. ఎలాంటి షెడ్యూల్‌ను ప్రకటించకుండా.. కీవ్‌లో ఆకస్మిక పర్యటన చేశారు. ఉక్రెయిన్‌కు అండగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు స్ట్రాంగ్‌ మెస్సేజ్‌ ఇచ్చినట్టయ్యింది. కీవ్‌లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోదిమిర్‌ జెలెన్‌స్కీని కలిశారు బైడెన్‌. ఉక్రెయిన్‌ ప్రజాస్వామ్యం, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు అమెరికా తిరుగులేని నిబద్ధతను కలిగి ఉందని బైడెన్‌ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌‌పై రష్యా క్రూరమైన దాడి ప్రారంభించి.. ఏడాది గడుస్తున్న తరుణంలో.. తాము కీవ్ ప్రజలకు అండగా ఉన్నామని నిరూపించేందుకే తాను వచ్చినట్టు బైడెన్‌ తేల్చి చెప్పారు. పశ్చిమ దేశాలపై పుతిన్‌ పైచేయి సాధించాలని భావించి.. బొక్క బోర్లా పడినట్టు అగ్రదేశాధినేత విమర్శించారు.

ఉక్రెయిన్‌ కు సైనిక, ఆర్థిక, మానవతా సాయాన్ని అందించేందుకు అట్లాంటిక్‌ నుంచి పసిఫిక్‌ దేశాల కూటమి సిద్ధంగా ఉందని.. తమ మద్దతు కొనసాగుతుందని బైడెన్‌ వెల్లడించారు. ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. తాజాగా మరో 30 కోట్ల డాలర్ల సాయం అందిస్తామన్నారు బైడెన్‌.

ఏడాదిగా కొనసాగుతున్న రష్యా దురాక్రమణ నేపథ్యంలో ఉక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా అధ్యక్షుడు బైడెన్… కీవ్‌కు రావడం సంతోషకరమైన విషయమన్నారు జెలెన్‌స్కీ.. బైడెన్‌కు ఘన స్వాగతం పలుకుతున్నట్టు తెలిపారు. బైడెన్‌ రాకతో.. ఉక్రెయిన్‌కు మరింత ఉత్సాహాన్ని నింపినట్టు అయ్యిందని జెలెన్‌స్కీ కొనియాడారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌.. పోలాండ్‌ రాజధాని వార్సా నుంచి మీదుగా కీవ్‌కు చేరుకున్నారు. 21న ఆయన పోలాండ్‌ అధ్యక్షుడు అండ్రేజ్‌ దుడాతో సమావేశం కానున్నట్టు వైట్‌హౌస్‌ వెల్లడించింది. బైడెన్ రాక సందర్భంగా కీవ్‌ నగరంలో భారీ భద్రత కల్పించారు. పెద్ద ఎత్తున సైరన్లు మోగాయి. గగన తల రక్షణ వ్యవస్థలను మోహరించారు. సైరన్లు వరుసబెట్టి మోగడంతో మొదట్లో రష్యా దాడులు చేస్తుందేమోనని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే బైడెన్‌ వచ్చిన విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఇరువురు నేతలు కలిసి.. కాసేపు ముచ్చటించారు.

ఏడాది కిందట పుతిన్‌ ఉక్రెయిన్‌పై దురాక్రమణ మొదలుపెట్టినప్పుడు.. ఉక్రెయిన్‌ బలహీనమైందని, పాశ్చాత్య దేశాలు భిన్నాభిప్రాయాలతో ఉన్నాయని భావించాడు. అతను మమ్మల్ని అధిగమించగలడని అనుకున్నాడు. కానీ అతను పెద్ద తప్పిదం చేశాడు. ఈ ఏడాది కాలంలో అట్లాంటిక్‌, ఫసిపిక్‌ పరిధిలో ఉన్న అన్ని దేశాలు ఉక్రెయిన్‌ పోరాటానికి కావాల్సిన అన్నిరకాల సాయాన్ని అందిస్తూ వస్తున్నాయి. అందుకు అమెరికా ఒక సంకీర్ణ కూటమి ఏర్పాటు చేసింది అని ట్వీట్‌ చేశారు.. అలాగే.. ఏడాది కాలం దగ్గర పడుతున్న తరుణంలో కీవ్‌లో పర్యటిస్తున్నట్లు.. ఉక్రెయిన్ ప్రజాస్వామ్యం, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత పట్ల అమెరికా తిరుగులేని నిబద్ధతను పునరుద్ఘాటించినట్లు బైడెన్‌ ట్వీట్లు చేశారు.

గతేడాది చివర్లో.. అమెరికాలో పర్యటించారు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ… అప్పట్లో బైడెన్‌ తో సమావేశమై.. అమెరికా ప్రతినిధుల సభలో జెలెన్‌స్కీ ప్రసంగించారు. గతేడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై ప్రత్యేక సైనిక చర్య చేపడుతున్నట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ ప్రకటించారు. అప్పట్లో బెలూరస్‌ నుంచి ఉత్తరాదిలో, లుహాన్‌స్క్‌, డొనేటెస్క్‌ నుంచి తూర్పున, క్రిమియా నుంచి దక్షిణాదిలో మూడు వైపుల నుంచి పుతిన్‌ బలగాలు ముట్టడించాయి. ఈ క్రమంలో పెద్ద ఎత్తున మాస్కో బలగాలు దాడి చేశాయి. కనిపించిన గ్రామం, పట్టణం, నగరం అన్న తేడా లేకుండా వరుసబెట్టి దాడులు చేసుకుంటూ
వెళ్లారు. దీంతో ఉక్రెయిన్‌లో ఎక్కడ చూసినా శిథిలాలే దర్శనమిస్తున్నాయి. ఆ తరువాత క్రమంగా ఖేర్సన్‌, లుహాన్‌స్క్‌, డొనెట్‌స్క్‌, జఫోరిజ్జియా ప్రాంతాలను రష్యా స్వాధీనం చేసుకుంది. అయితే కీవ్ బలగాలు ఇజుమి ప్రాంతం నుంచి ఎదురుదాడికి దిగాయి. నాటి నుంచి క్రమంగా రష్యా బలగాలు వెనక్కి తగ్గాయి. మొదట్లో స్వాధీనం చేసుకున్న ఖేర్సన్‌ నుంచి వీడాయి. ఆ తరువాత క్రిమియాతో పాటు ఆ ద్వీపానికి, రష్యాకు మధ్య ఉన్న కెర్చ్‌ బ్రిడ్జిపై దాడి జరిగింది. ఈ దాడులతో రష్యా రెచ్చిపోయింది. కామికాజ్‌ డ్రోన్లతో పెద్ద ఎత్తున డాడులు చేసింది.. విద్యుత్‌, నీటి సరఫరా వ్యవస్థలే లక్ష్యంగా మిస్సైళ్లతో విరుచుకుపడింది.
ప్రస్తుతం డొనెట్‌స్క్‌లోని బుఖ్ముత్‌ నగరంపై పట్టుకు ఇరు దేశాల సైన్యం భీకరంగా పోరాడుతున్నాయి.

ఉక్రెయిన్‌ పై యుద్ధానికి నిరసనగా.. పశ్చిమ దేశాలు రష్యాపై భారీగా ఆంక్షలను విధించాయి. తమకు నష్టమని తెలిసినా.. క్రెమ్లిన్‌కు అడ్డుకట్ట వేయలనే ఉద్దేశంతో.. రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న చమురును నిలిపేశాయి. దీంతో ప్రధానంగా యూరప్ దేశాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయి. అదే సమయంలో ఉక్రెయిన్‌ కు పెద్ద ఎత్తున ఆయుధాలను అందించాయి. ఈ క్రమంలో అత్యంత భీకరమైన యుద్ధ ట్యాంకులను ఉక్రెయిన్‌కు అందించాయి. జర్మనీకి చెందిన లియోపార్డ్‌-2, ఫ్రాన్స్‌కు చెందిన లెక్లార్క్‌, అమెరికాకు చెందిన అబ్రమ్‌ ఎం1, బ్రిటన్‌కు చెందిన ఛాలెంజర్‌ యుద్ధ ట్యాంకులను
అందించాయి. ఈ ట్యాంకులు గేమ్‌ చేంజర్‌గా మారుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆయా దేశాలు యుద్ధ ట్యాంకులను ఇవ్వడంపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. వాటికి తమ వద్ద విరుగుడు ఉందని తేల్చి చెప్పింది. ఆయుధాలను ఇవ్వడం ఆపకపోతే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పశ్చిమ దేశాలను క్రెమ్లిన్‌ హెచ్చరించింది..

మరోవైపు లాంగ్‌ రేంజ్‌ మిస్సైళ్లను సైతం ఇచ్చేందుకు పాశ్చాత్య దేశాలు సిద్ధమయ్యాయి. అవసరమైతే ఫైటర్‌ జెట్లను కూడా ఇస్తామని బ్రిటన్‌, ఫ్రాన్స్‌ ప్రకటించాయి. అయితే అమెరికా, జర్మనీ మాత్రం ఫైటర్‌ జెట్లను ఇవ్వలేమని తేల్చి చెప్పాయి. ఉక్రెయిన్‌- రష్యా యుద్ధం కారణంగా రెండు లక్షల మంది చొప్పున సైనికులు మరణించినట్టు తెలుస్తోంది. మరోవైపు రష్యాకు ఆయుధాల కొరత మొదలైందని అమెరికా, మిత్ర దేశాలు చెబుతున్నాయి. రష్యాకు ఆయుధాలను ఇస్తే.. ఆంక్షలు తప్పవంటూ ఇరాన్‌, చైనా దేశాలను అమెరికా హెచ్చరించింది. ఈ యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌ తీవ్రంగా ధ్వంసమైంది. రష్యాకు కేవలం సైనిక, ఆయుధ నష్టం మాత్రమే వాటిల్లింది. రష్యా దాడుల కారణంగా.. ఉక్రెయిన్‌కు చెందిన సుమారు 70 లక్షల మంది ప్రజలు దేశం విడిచి వెళ్లిపోయారు. మరో కోటి మందికి పైగా స్థానభ్రంశం చెందారు. రెండో ప్రంచ యుద్ధం తరువాత.. అత్యంత మానవ సంక్షోభం ఉక్రెయిన్‌లో నెలకొన్నట్టు అమెరికా మానవ హక్కుల విభాగం తెలిపింది.

ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్దం మొదలైన తర్వాత మొదటిసారి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీవ్ లో పర్యటించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోదిమిర్‌ జెలెన్‌స్కీని కలిసిన బైడెన్‌.. ఉక్రెయిన్ కు మరిన్ని ఆయుధాలు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు ప్రకటించడం.. పుతిన్‌కు స్ట్రాంగ్‌ మెస్సేజ్‌ ఇచ్చినట్టయ్యింది.

Must Read

spot_img