ఈ ఏడాది ఐటీ రంగంలో ఉద్యోగాల కోత .. అత్యధికంగా ఉందన్నది అందరికీ తెలిసిందే. అయితే అంతకు మించిన సంఖ్యలో ఫ్రెషర్లకు ఉద్యోగవకాశాలు లభించాయన్న వార్త .. ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కరోనా తర్వాత సీనియర్ల కన్నా ఫ్రెషర్లకే జాబ్స్ పెరిగాయని నాస్కామ్ నివేదిక వెల్లడించింది.
ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం దెబ్బకు ఐటీలో ఉద్యోగాలు గాల్లో దీపాలుగా మారాయి. అయితే అదే సమయంలో ఫ్రెషర్లకు మాత్రం ఉద్యోగాలు భారీగా వచ్చాయని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. మరి కోత వేళ కల్పన ఏవిధంగా సాధ్యమైందన్న చర్చ సర్వత్రా వెల్లువెత్తుతోంది.
నిజానికి ఈ ఏడాది ఉద్యోగులకు ఏమంత కలిసి రాలేదు. టెక్ కంపెనీ ఉద్యోగులందరూ భయంభయంగానే గడిపారు. ఉద్యోగాలు ఎప్పుడు ఊడిపోతాయో? ఎప్పుడు ఎలాంటి కబురు వినాల్సి వస్తుందోనన్న ఆందోళన మధ్య గడిపారు. భయపడినంతా జరిగింది. ట్విట్టర్‌తో మొదలైన ఉద్యోగాల కోత ఆ తర్వాత మరిన్ని సంస్థలకు పాకింది. అమెజాన్, యాపిల్, గూగుల్, అడోబ్, సేల్స్‌ఫోర్స్, లెనోవో, మెటా వంటి కంపెనీలన్నీ కలిసి వేలాదిమంది ఉద్యోగులను ఇంటికి పంపాయి. ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం వంటి పరిస్థితులు ఇందుకు కారణమని పేర్కొన్నాయి.
పరిస్థితులు ఇలా ఉంటే మరోవైపు మాత్రం ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 3.82 లక్షల మంది ఫ్రెషర్లకు దేశీయ టెక్ కంపెనీలు ఉద్యోగాలు కల్పించినట్టు నాస్కామ్ పేర్కొంది. అంతేకాదు, సమీప భవిష్యత్తులో 70 శాతానికిపైగా 1997-2012 మధ్య పుట్టిన విద్యార్థులు టెక్ కంపెనీల్లో సెటిలైపోతారని ఓ నివేదికలో తెలిపింది. నాస్కామ్ నివేదిక ప్రకారం.. టెక్ పరిశ్రమలో గత కొన్నేళ్లుగా ఫ్రెషర్స్ నియామకాలు పెరిగాయి.
ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం ఉద్యోగాల్లో జెన్ జడ్ ఉద్యోగుల వాటా 18-20 శాతానికి పెరగ్గా, మిలీనియల్స్ అంటే 1980-1990 మధ్య పుట్టిన వారి వాటా 68-70 శాతంగా ఉంది. నిజానికి యజమానులు కనుక తమకు సరైన ప్రాధాన్యం ఇస్తే చేరిన తొలి ఉద్యోగంలో రెండేళ్లకు పైగానే పనిచేసేందుకు 79 శాతం మంది జెన్ జడ్ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నట్టు నాస్కామ్ సర్వే పేర్కొంది. 2021లో మిలీనియల్స్, జెన్ జడ్ షేర్‌లో భారత్ వాటా 52 శాతం. ప్రపంచ సగటులో ఇది 47 శాతం కావడం గమనార్హం. ఇదే ధోరణి 2030 వరకు కొనసాగే అవకాశంఉందని నాస్కామ్ నివేదిక పేర్కొంది.
అప్పటికి ఇండియా జెన్ జడ్, మిలీనియల్ పాప్యులేషన్ 50 శాతంగా ఉంటుంది. ప్రపంచ సగటుతో 46తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఈ కొత్త తరాలు భారతదేశ భవిష్యత్ ను ప్రపంచంలోని ప్రతిభా కేంద్రంగా ఎలా రూపొందిస్తాయో చూడడం ఆసక్తికరంగా ఉంటుందని నాస్కామ్ వెల్లడించింది. ఇక బ్రాండ్ విలువ .. మిలీనియల్స్, జనరేషన్ జడ్రెం డింటిలో అగ్రస్థానంలో ఉండగా.. ఓ కంపెనీని ఎంచుకోవడంలో జన్ జడ్ పాప్యులేషన్ కల్చర్, ఎథిక్స్, లెర్నింగ్, గ్రోత్ వంటివాటిని ప్రామాణికంగా తీసుకుంటోంది. కార్యాలయాల్లో పనిచేసేందుకు జన్ జడ్ ఉద్యోగులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. 85 శాతం మంది పూర్తిగా ఆఫీసు, లేదంటే హైబ్రిడ్ విధానంలో పనిచేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. జన్ జడ్ ఉద్యోగులు సానుకూల పని, జీవన సమతౌల్యతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. విభిన్న పని వాతావరణాన్ని కోరుకుంటారని, ప్రధాన విలువలకు అనుగుణంగా ఉంటారని నివేదిక పేర్కొంది. ఇదిలా ఉంటే అప్పుడే డిగ్రీనో, పీజీ.. కంప్లీట్ చేసిన కుర్రాళ్ళయితే చురుగ్గా, మెరుగైన పనితీరు కనపరుస్తారు. దీంతోపాటు.. ఎక్కువ సమయం వర్క్ చేయడానికి ఇష్టపడతారు.
సీనియర్లతో పోలిస్తే జీతాలు తక్కువకే లభిస్తారని పలు కంపెనీలు ఫ్రెషర్లకే ఎక్కువ ఛాన్స్ ఇస్తున్నాయి. ఈ ఏడాది ద్వితీయార్ధంలో తాజా ఉత్తీర్ణులను నియమించుకునేందుకే దేశంలో 59 శాతానికి పైగా సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని టీమ్‌లీజ్ ఎడ్‌టెక్ నివేదిక వెల్లడించింది. తొలి అర్ధ భాగంతో పోలిస్తే
ఇది 12 శాతం అధికమని నివేదిక తెలిపింది. ఏడాది వ్యవధిలో చూస్తే ఇది 42% వృద్ధి చెందిందని వివరించింది. ప్రారంభ స్థాయి ఉద్యోగాలు, ఫ్రెషర్ల నియామకాలు దేశీయంగా మెరుగవుతున్నాయని కెరీర్ అవుట్‌లుక్ పేరుతో రూపొందించిన నివేదికలో పేర్కొంది.
ఫ్రెషర్లను ఎక్కువగా నియమించుకోవడం ద్వారా, మొత్తం ఉద్యోగుల్లో వారి వాటా పెంచుకోవాలనుకుంటున్నట్లు ఎక్కువ కంపెనీలు భావిస్తున్నాయి. కంపెనీలు, విద్యాసంస్థలు, పరిశ్రమ మధ్య ఒప్పందాలతో అప్రెంటిస్‌షిప్ ఎంబెడెడ్ డిగ్రీలు రూపొందించి, అభ్యర్థుల్లో నైపుణ్యాలు పెంచడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా 14 ప్రాంతాల్లోని 18 రంగాలకు చెందిన 865 కంపెనీల నిర్వాహకుల నుంచి అభిప్రాయాలు సేకరించి ఈ నివేదికను తయారు చేసినట్లు టీమ్‌లీజ్ ఎడ్‌టెక్ తెలిపింది. సమాచార-సాంకేతిక, ఇ-కామర్స్-టెక్నాలజీ అంకురాలు, టెలికమ్యూనికేషన్ల విభాగాల్లో వరుసగా 65%, 48%, 47% సంస్థలు ఫ్రెషర్లను నియమించుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఐటీ రంగమే 1 లక్ష మంది ఫ్రెషర్లను నియమించుకునే అవకాశం ఉంది. ఈ ఏడాది ఈ రంగంలో 101.8 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నట్లు కంపెనీలు తెలిపాయి.
2022-23లో ఐటీ ఎగుమతులు 8-10% పెరుగుతాయని అంచనా..!
మరోవైపు టెలికాం కంపెనీలు కూడా రూ.3,345 కోట్లు పెట్టుబడులతో దేశవ్యాప్తంగా డేటా సెంటర్లను నెలకొల్పనున్నాయని నివేదిక పేర్కొంది. నగరాల వారీగా పరిశీలిస్తే, బెంగళూరులో అత్యధికంగా 68% సంస్థలు తాజా ఉత్తీర్ణులకు అవకాశాలు కల్పిస్తున్నాయి. బెంగళూరు తర్వాత ముంబై 50%, దిల్లీ 45% ఉన్నాయి. 2022 జనవరి-జూన్ మధ్య చూస్తే బెంగళూరులో 59%, ముంబయిలో 43%, దిల్లీలో 39%, పుణేలో 36% సంస్థలు ఫ్రెషర్లను నియామకానికి ప్రాధాన్యత ఇచ్చాయి. ఇక దేశంలోని టాప్-4 ఐటీ కంపెనీలు అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్ సంస్థలు.. ఈ ఆర్థిక సంవత్సరంలో మరింత మంది కొత్త గ్రాడ్యుయేట్‌లను నియమించుకోనున్నట్లు ప్రకటించాయి.
ఈ కంపెనీలు సుమారు 1.6 లక్షల మందిని చేర్చుకోవాలని చూస్తున్నాయి. పరిశ్రమలో డిమాండ్ కారణంగా నాలుగు కంపెనీల ఉద్యోగ వలసల రేటు పెరిగింది. దీంతో నిపుణుల కొరత ఏర్పడింది. ఐటీ-సాఫ్ట్‌వేర్ రంగం సెప్టెంబర్ 2021లో నాలుగు శాతం నెలవారీ వృద్ధిని, సంవత్సరం ప్రాతిపదికన 138 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు నౌకరీ జాబ్‌స్పీక్ నివేదిక వెల్లడించింది. కంపెనీలు సంప్రదాయ సర్వర్ బేస్డ్ మోడల్స్ నుంచి క్లౌడ్ బేస్డ్ విధానంలోకి మారాయి. దీనివల్ల డేటా అనలిటిక్స్, వంటి క్లౌడ్ ఆధారిత నైపుణ్యాలకు డిమాండ్ ఏర్పడింది.
ఈ విభాగాల్లో నైపుణ్యాలు ఉన్నవారికి ఇప్పుడు మంచి అవకాశాలు దక్కుతున్నాయి. క్లౌడ్ టెక్నాలజీలతో పాటు డేటా అనలిటిక్స్ అవసరం పెరిగిందని, ఫలితంగా ఈ రంగాల్లోని నిపుణులకు డిమాండ్ పెరిగిందని అంచనాలు వినిపిస్తున్నాయ. 2025 నాటికి క్లౌడ్ ప్రొఫెషనల్స్ డిమాండ్ 2మిలియన్లకు చేరుకుంటుందని నాస్కామ్ నివేదిక పేర్కొంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ-కామర్స్ రంగాల్లో జోరుగా నియామకాలు జరుగుతున్నాయి. ఈ రంగాల వారు ఫ్రెషర్లను అధిక సంఖ్యలో హైర్ చేసుకుంటున్నారు. 2022 జులై-డిసెంబర్ పీరియడ్‌లో హైరింగ్ ఇంటెన్షన్స్ గతేడాదితో పోల్చితే 30 శాతం పెరిగాయి. ఇందులో ఎక్కువ శాతం ఫ్రెషర్స్‌ను నియమించుకుంటున్న మొదటి నాలుగు పరిశ్రమలుగా 34 శాతంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, 23 శాతంతో ఈ-కామర్స్
& టెక్నాలజీ స్టార్టప్‌లు, 22 శాతంతో టెలికమ్యూనికేషన్, 20 శాతంతో ఇంజనీరింగ్ పరిశ్రమలు ఉన్నాయి. ఇక మార్కెట్‌లో మార్కెటింగ్ స్పెషలిస్ట్, మాలిక్యులర్ బయాలజిస్ట్, బ్యాక్ ఎండ్ డెవలపర్ రోల్స్‌కు ఫుల్డి మాండ్ ఉంది.
దేశంలో ఐటీ రంగంలో ఉద్యోగాల కోతతో సర్వత్రా భయాందోళనలు నెలకొన్నాయి. అయితే ఇదే సమయంలో .. కొత్త ఉద్యోగాల సృష్టి సైతం అదేస్థాయిలో జరగడం .. ఆసక్తికరంగా మారింది.