మానవజాతి తేలికగా ఊపిరి పీల్చుకున ఓ వార్త ఇప్పుడు అంతర్జాలంలో చక్కర్లు కొడుతోంది. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న క్యాన్సర్ కు జపాన్ శాస్త్రవేత్తలు ఓ పరిష్కారాన్ని కనుగొన్నారు. వారి వైద్యవిధానంతో క్యాన్సర్ ఖేల్ ఖతం అని ప్రకటించారు. కొత్త సంవత్సరంలో ఇదో సంచలనాత్మక వార్తగా చూడవచ్చు. జపాన్ లోని టోక్యో కు చెందిన శాస్త్రవేత్తల బృందం.. కొత్త సంవత్సరానికి కొన్ని గంటల ముందే యావత్ ప్రపంచానికి ఈ శుభవార్తను అందించారు. క్యాన్సర్ కారక కణాలను అంతమొందించి, వ్యాధి నిరోధక శక్తిని పెంచే కృత్రిమ డీఎన్ఏను తాము కనుగొన్నట్లు ప్రకటించారు. ఇది సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, మెలనోమా క్యాన్సర్ కారక కణాలను నాశనం చేసినట్లు వెల్లడించారు.
ఇది 2022 సంవత్సరం మనకు ఇచ్చిన బహుమతిగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2023వ సంవత్సరం క్యాన్సర్ రోగులకు చాలా కీలక సంవత్సరంగా మారనుంది. అయితే అంతకు ముందు క్యాన్సర్ గురించిన కొన్ని వివరాలను చూద్దాం..నిజానికి క్యాన్సర్ మహా జిత్తులమారి..సాధారణంగా మానవ శరీరంలోకి ఏదైనా ఒక కొత్త కణం వస్తే వెంటనే శరీంలోని వ్యాధి నిరోధక శక్తిని అందించే కణాలు యాక్టివేట్ అవుతాయి. వెంటనే వాటిపై దాడి చేసి చంపేస్తాయి. అయితే క్యాన్సర్ కణాలు మాత్రం చాలా జిత్తుల మారిగా ఉంటాయి. అవి శరీరంలో కీలక ప్రదేశాలలో వ్యాధి నిరోదక కణాలకు దొరకని చోట్ల దాగి ఉంటాయి. అందుకే క్యాన్సర్ కణాలు, కణితులపై మానవ వ్యాధి నిరోధక వ్యవస్థ పనిచేయదు. అయితే జపాన్ కు చెందిన ఆంకాలజిస్ట్ ల బృందం క్యాన్సర్ కణాలను సహజంగా చంపేందుకు గానూ కృత్రిమ డీఎన్ఏను సృష్టించారు. హైర్ పిన్ ఆకారంలో ఒక జత డీఎన్ఏ అణువులను, ఓహెచ్పీలను సృష్టించి వాటిని క్యాన్సర్ కణాలపై ప్రయోగించారు. దీంతో అవి క్యాన్సర్ కణాలను వెతికి మరీ పట్టుకుని పూర్తిగా నశించిపోయేలా చేసాయి. అంతేకాక శరీరంలోని ఇతర ఏ భాగాలలోను క్యాన్సర్ కారక కణాలు వృద్ధి చెందకుండా నిరోదించేలా బలపడ్డాయి.
ఇది సంప్రదాయ వైద్య విధానాలు భిన్నమైనదే అయినా, క్యాన్సర్ చికిత్సలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఈ చికిత్స అందుబాటులోకి రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. క్యాన్సర్ అన్న పేరు వింటే చాలు గుండెళ్లో గుబులు రేగుతుంది. ప్రతీ ఒక్కరికీ ఏదో రకంగా వచ్చే అవకాశం ఉండే ఈ మహమ్మారి వ్యాధిని అచ్చతెలుగులో కర్కరోగం అని అంటారు. టెక్నికల్ గా ఈ వ్యాధి గురించి చెప్పాలంటే.. సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు ఒక క్రమ పద్ధతిలో నియంత్రించబడతాయి. కొన్ని సందర్భాలలో కణాల పెరుగుదలలో నియంత్రణ కోల్పోయినప్పుడు కణాలు చాలా వేగంగా అస్తవ్యస్తంగా విభజన చెందుతాయి. ఆపై అపరిమితంగా కణ సమూహాలను ఏర్పరుస్తాయి. ఈ కణసమూహాలనే ట్యూమర్లు లేదా ‘కంతులు అంటారు. అటువంటి కొన్ని ప్రమాదకరమైన వాటినే కేన్సర్ అని వ్యవహరిస్తారు.
ఈ రకమైన పెరుగుదలకు ఒక స్పష్టమైన పద్దతి కారణమంటూ ఉండదు. కేన్సర్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘ఆంకాలజీ’ అంటారు. క్యాన్సర్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వ్యాధి. క్యాన్సర్ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 41లక్షల 17వేల కోట్లు హరించుకుపోతున్నాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మూడింట రెండొంతుల క్యాన్సర్ మరణాలు పేద, మధ్యతరగతి దేశాల్లోనే సంభవిస్తున్నాయి. మానవ శరీరంలో ప్రవేశించి భౌతికంగా మానసికంగా ఆర్థికపరంగా గుల్లచేసి చివరికి ప్రాణం తీసేంత వరకూ శాంతించదు. దీనిని అదుపు చేయడానికి మందులు, అనేక వైద్య విధానాలు అందుబాటులో ఉన్నా అవి అందరిపై అన్ని వేళలా పనిచేయవు. అయితే ముందుగా గుర్తించి చికిత్స అందించడం ద్వారా నయం చేయొచ్చని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది. కానీ క్యాన్సర్ను గుర్తించేలోపుగానే ముంచుకు వస్తుందని చెబుతున్నారు నిపుణులు. అన్నింటి కన్నా ముందు క్యాన్సర్ ఓ భయంకరమైన మహమ్మారి. ఒక్కసారి ఈ వ్యాధి సోకింది మొదలు చికిత్స పూర్తయ్యే వరకు నరకయాతన అనుభవించాల్సి ఉంటుంది.
చికిత్స తర్వాత కూడా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చికిత్స తర్వాత కోలుకొని తిరిగి ఆరోగ్యంగా మారాలంటే ఎంత సమయం పడుతుందో కూడా ఎవరూ చెప్పలేరు. శాశ్వత పరిష్కారం మాత్రం ఇప్పటి వరకూ దొరకలేదు. ఒకసారి క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత సర్జన్, మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్, ఇతర వైద్య నిపుణులతో కూడిన మల్టీ డిసిప్లినరీ టీమ్ ద్వారా చికిత్స దొరుకుతుంది. క్యాన్సర్ రకం, దాని దశ, రోగి స్టేజ్‌ను బట్టి చికిత్స విధానాలు ఉన్నాయి. సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ వంటి చికిత్సా విధానాలతో క్యాన్సర్ కొంత అదుపులోకి వస్తోంది.
సర్జరీ అవసరం లేని చికిత్సతో పాటు.. ఒకవేళ సర్జరీ చేయాల్సి వచ్చినా.. ఎలాంటి నొప్పి, బాధ లేకుండా చేసే చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయి. గతంలో ఏదైనా అవయవానికి క్యాన్సర్ సోకితే ఆ పార్ట్ మొత్తం తీసేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు.. వ్యాధి సోకిన ప్రాంతాన్ని మాత్రమే తీసేసి.. మిగతా ప్రాంతానికి మళ్లీ సోకకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ చికిత్స అందిస్తున్నారు. ఒకప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ సోకితే రొమ్మును పూర్తిగా తొలగించేవారు. మారిన చికిత్స విధానాలతో ప్రస్తుతం రొమ్మును పూర్తిగా తొలగించకుండా కేవలం క్యాన్సర్ కణతులు ఉన్న ప్రాంతాన్నే సర్జరీ చేసి తీసేసి.. మళ్లీ క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఆపరేషన్లు చేస్తున్నారు. పొత్తి కడుపు క్యాన్సర్ కోసం ఇంకో చికిత్స విధానాన్ని కనుగొన్నారు.
రెండు దశల్లో చేసే హైపర్ థెర్మిక్ ఇంట్రా పెరిటోనియల్ కీమో థెరపీ సర్జరీ పొత్తి కడుపులోని క్యాన్సర్ ను సమూలంగా నిర్మూలిస్తోంది. క్యాన్సర్ కణాలను చంపడం, దాని ఎఫెక్ట్‌ని తగ్గించడంతో పాటు శరీరంపై విష పదార్థాలను తీసేసేందుకు కీమో థెరపీ చేస్తున్నారు. ఈ రకమైన చికిత్సా విధానాలు క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌లో పెను సంచలనం సృష్టించాయి. సాధారణంగా క్యాన్సర్ సోకినప్పుడు చాలా రకాల చికిత్స విధానాలు అవసరం అవుతాయి.
తక్కువ ఖర్చుతో కూడిన జీన్ సీక్వెన్సింగ్ ద్వారా అందించే చికిత్స మంచి ఫలితం ఇస్తున్నది. కొన్నాళ్లుగా రేడియేషన్ చికిత్స కూడా మంచి పురోగతి సాధిస్తున్నది. శరీరంలోని క్యాన్సర్ కణాలను టార్గెట్ చేసి రేడియేషన్ క్యాన్సర్ కణాలను సమూలంగా తుడిచి పెట్టేస్తోంది. క్యాన్సర్ సోకిన శరీరాన్ని బట్టి డాక్టర్లు ఈ రేడియేషన్ చికిత్స విధానాలను ఎంచుకుంటారు. కరోనా మహమ్మారి వచ్చి ప్రపంచవ్యాప్తంగా ఆంకాలజీ సేవలను దెబ్బతీసింది. దీంతో డాక్టర్లు కొత్త మార్గాలను అనుసరించడం ద్వారా పూర్తి సేఫ్టీగా ట్రీట్‌మెంట్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. టెలీ మెడిసిన్, కౌన్సెలింగ్, మందులను సూచించడం, రిమోట్ మానిటరింగ్ ద్వారా ట్రీట్‌మెంట్ చేసే మార్గాలను కనుగొన్నారు.
చికిత్స కోసం ప్రతిసారి హాస్పిటళ్లకు వచ్చే అవసరం లేకుండా ట్యాబ్లెట్స్ వేసుకోవడం ద్వారా రోగి సేఫ్టీగా ఉండే విధానాలను అనుసరిస్తున్నారు. కరోనా కాలంలోనూ చికిత్సా విధానంలో కొత్త ఆవిష్కరణలు పుట్టుకొచ్చాయి. అయితే ఇప్పుడు జపాన్ శాస్త్రవేత్తలు కొత్త తరహాగా చేసిన ప్రయోగం పేరు న్యూక్లియిక్ యాసిడ్ ట్రీట్మెంట్. క్యాన్సర్‌కు సంబంధించి చేసే ఈ న్యూక్లియిక్-యాసిడ్ ట్రీట్‌మెంట్‌లు సహజంగానే ప్రమాదకరమైనవి. ఎందుకంటే కృత్రిమంగా శరీరంలోకి పంపించే కణాలు క్యాన్సర్‌కు సంబంధించిన కణాలపై దాడి చేయడంతోపాటు రోగనిరోధక వ్యవస్థ కు సంబంధించిన ఆరోగ్యకరమైన కణాలపై కూడా దాడి చేస్తాయి. నిజానికి ఇది చాలా ప్రమాదకరం. అలా కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని దీనిని నిర్వహించాల్సి ఉంది.
ఈ సందర్భంగా ఆ పరిశోధకుల బృందంలో ఒకరైన గ్రాడ్యూయేట్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్, యూనివర్సిటీ ప్రొఫెసర్ అకిమిట్సు ఒకామోటో మాట్లాడుతూ తమ పరిశోధన డ్రగ్ డిస్కవరీ పరిశోధకులకు, క్యాన్సర్ రోగులకు కూడా మంచి శుభవార్తగా అభివర్ణించారు. ఇది క్యాన్సర్ కు డ్రగ్ డెవలమ్మెంట్ తో పాటు కొత్త చికిత్సా విధానాలను ప్రయత్నించేందుకు దోహదం చేస్తుందన్నారు. అన్నీ అనుకూలిస్తే ప్రపంచానికి ఇది నిజంగా ఓ శుభవార్తగానే ఉంటుంది.