పొత్తుల చర్చల వేళ ఓ క్లారిటీ రానుందా..? ఇంతకీ పవన్ బందరులోనే నిర్వహించాలనుకోవడం వెనుక కారణమేంటి..?
జనసేన పార్టీ స్థాపించి పదేళ్లవుతున్న సందర్భంగా మచిలీపట్నంలో 14న ఆవిర్భావ సభను నిర్వహించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. అంతకు రెండు రోజుల ముందే పవన్కల్యాణ్ అమరావతి చేరుకుంటారు. పార్టీ నేతలతో విస్తృతంగా మంతనాలు జరుపుతారు. ఎన్నికల ఏడాదిలో నిర్వహించే ఆవిర్భావ సభ లో ప్రకటించాల్సిన నిర్ణయాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. రాజకీయంగా ఎలాంటి అడుగులు వేయాలన్నదానిపై పార్టీ నేతల అభిప్రాయాలను తెలుసుకుంటారు. ఏ నిర్ణయం తీసుకున్నది ప్లీనరీలో ప్రకటిస్తారా
లేదా అన్నది మాత్రం సస్పెన్స్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం జనసేన చుట్టూ తిరుగుతున్నాయి. డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆ పార్టీనేనని ఎక్కువ మంది విశ్లేషిస్తున్నారు. జనసేన ఆ పార్టీతో జత కడితే ఆ పార్టీకి ఎక్కువ అడ్వాంటేజ్ వస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ తీసుకునే నిర్ణయం కీలకం కానుంది. ఇప్పటికీ జనసేన పార్టీ అధికారికంగా బీజేపీతో పొత్తులో ఉంది. పవన్ కల్యాణ్ మాత్రమే కాదు.. బీజేపీ నేతలూ అదే చెబుతున్నారు.
కొండగట్టులో ఈ విషాయన్ని పవన్ ప్రకటించారు. ఏపీ బీజేపీ నేతలు ప్రతీ రోజూ ఈ విషయాన్ని చెబుతూంటారు. వచ్చే ఎన్నికల్లో తాము కలిసి పోటీ చేస్తామని, అధికారంలోకి రానున్నామని చెబుతున్నారు.
కానీ ఈ రెండు పార్టీలు అంటీ ముట్టనట్లుగా ఉంటున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేయడం లేదు. బీజేపీ అభ్యర్థులు రంగంలో ఉన్నారు. మద్దతు కోసం ఏ స్థాయిలోనూ జనసేనతో బీజేపీ సంప్రదింపులు జరపలేదు. దీంతో పొత్తు పై పై ప్రకటనలకే ఉందని.. వాస్తవంగా లేదన్న అంచనాలు వినపిస్తున్నాయి. గత ఆవిర్భావ సభ నుంచి పవన్ కల్యాణ్ ఓట్లు చీలనిచ్చేది లేదని ప్రతిజ్ఞ చేశారు. ఓట్లు చీలనివ్వమంటే.. చేయాల్సింది టీడీపీతో పొత్తే అని చెప్పడానికి
రాజకీయ పరిజ్ఞానం అవసరం లేదు. అయితే ఆ విషయాన్ని పవన్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. రాజకీయాల్లో పొత్తులు అనేది అంత తేలికగా పరిష్కారమయ్యే ప్రక్రియ కాదు. రాజకీయ పార్టీలు తామే కీలకం అనుకుంటే… తమ డిమాండ్లను నెరవేర్చుకోవడానికి పూర్తి స్థాయిలో బెట్టు చేస్తాయి. ఇప్పుడు జనసేనానికి ఆ చాన్స్ వచ్చిందని జనసైనికులు నమ్ముతున్నారు. జనసేన చీఫ్ ఏమనుకుంటున్నారో మా వ్యూహం మాకుందని చెబుతున్నారు. కానీ పొత్తులపై మాత్రం ఇంకా ఎలాంటి ప్రకటనలూ చేయడం లేదు.

మరో వైపు అధికార పార్టీ … ఒంటరిగా పోటీ చేయాలని జనసేన పార్టీకి సవాళ్లు చేస్తోంది. అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టలేరని ఎగతాళి చేస్తోంది. రాజకీయంగా ఇలా సవాళ్లు చేయడమే కాకుండా… తెర వెనుక నుంచి కూడా పవన్ కల్యాణ్ నిర్ణయాన్ని ప్రభావితం చేసేందుకు పదేపదే ప్రయత్నిస్తున్నారన్న ప్రచారమూ జరుగుతోంది. అయితే ఈ అంశంపై పవన్ కల్యాణ్ ఇంత వరకూ ఎప్పుడూ బయటపడలేదు. ప్లీనరీలో ఈ అంశంపై క్లారిటీ ఇస్తే జనసేన క్యాడర్‌కూ ఓ స్పష్టత వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. అందుకే.. ప్లీనరీలో రాజకీయ వ్యూహాలపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు. రాజకీయాల్లో మార్పు రావాలన్న నినాదంతో పవర్ స్టార్ పవన్కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి అప్పుడే పదేళ్లు అయిపోయింది. పదో ఆవిర్భావ దినోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. పవన్ కళ్యాణ్పై చీటికీ మాటికీ విమర్శలు చేసే మాజీ మంత్రి పేర్ని నాని నియోజక వర్గం అయిన మచిలీ పట్నంలోనే జనసేన ఆవిర్భావ ఉత్సవం నిర్వహించాలని నిర్ణయించారు. మార్చి 14న ఈ సభ కోసం 35 ఎకరాల స్థలాన్ని కూడా ఎంపిక చేశారు. ఆవిర్భావ దినోత్సవాన పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం నుండి తన వారాహి వాహనంపై మచిలీ పట్నం వరకు ర్యాలీగా వస్తారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యతను పార్టీ శ్రేణులకు అప్పగించారు. రాష్ట్రం నలుమూలల నుండి ఈ సభకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు తరలి రానున్నారు.
ఇక్కడే అసలు కీలకం దాగి ఉంది. అకస్మాత్తుగా బందరులోనే జనసేన ఆవిర్భావ సభ పెట్టాలని నిర్ణయించుకొన్నారు.
ఈ ఏడాదికి 10 ఏళ్లు పూర్తి అవుతోంది. ఈ సందర్భంగా ఆవిర్భావ సభకు ప్రాధాన్యం బాగా పెరిగింది. తూర్పు కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, పెడన వంటి నియోజక వర్గాల్లో కాపుల ఓటింగ్ కీలకం. అప్పట్లో ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఈ రెండు నియోజక వర్గాల్లోనూ దాదాపు 30 శాతం దాకా ఓట్లను ప్రజారాజ్యం దక్కించుకొంది. ఇంకా చెప్పాలంటే, తెలుగుదేశానికి, ప్రజారాజ్యం పార్టీకి 2 శాతంలోపే ఓట్ల తేడా ఉండటం గమనార్హం. మొన్నటికి మొన్న జనసేన పార్టీ 2019 ఎన్నికల్లోకి దిగినప్పుడు కూడా ఈ రెండు చోట్ల కూడా సుమారు 25 శాతం దాకా ఓట్లను రాబట్టుకొంది. దీంతో ఈ రెండు స్థానాలను గట్టిగా కష్టపడితే జనసేన గెలుచుకొంటుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలోనే అక్కడ జనసేన సభ పెట్టేందుకు రంగం సిద్ధం అయింది. ఈ సభలో పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పొత్తులకు సంబంధించి కీలక ప్రకటన చేస్తారని అంటున్నారు.
ఇటీవల శ్రీకాకుళం లో జరిగిన ఓ సభలో పొత్తుల విషయంలో పవన్ కళ్యాణ్ ఓ క్లారిటీ ఇచ్చారు. జనసేన ఆత్మగౌరవానికి భంగం కలిగేలా ఉండే వారితో పొత్తులు పెట్టుకునే ప్రసక్తే లేదని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఇది టిడిపి నాయకత్వానికి ఇవ్వాల్సిన సంకేతాన్నే ఇచ్చింది. పవన్ కళ్యాణ్ ఉద్దేశం కూడ అదే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పైకి పొత్తులు అంటూనే తమ పార్టీ నేతలతో తమ అనుకూల మీడియాతో జనసేన గాలి తీసేలా జనసేనాని ప్రతిష్ఠ మంటగలిపేలా విమర్శలు చేయిస్తూ ఉంటారని జనసేన భావిస్తోంది. ఇటీవల బాబు సన్నిహిత మీడియానే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వెయ్యి కోట్ల ప్యాకేజీ ఆఫర్ ఇచ్చారని కథనం ప్రచురించారు. అది జనసైనికులను తీవ్ర మనస్తాపానికి గురి చేసింది. పార్టీ నేతలయితే అగ్గిమీద గుగ్గిలమే అయ్యారు. జనసేనకు ప్యాకేజీ ఇచ్చినట్లు ఆ మీడియా అధినేతకు ఎవరు చెప్పారో బయట పెట్టాలని వారు డిమాండ్ చేశారు.
పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలని ఆయన సామాజిక వర్గానికి చెందిన వారే కాకుండా పవన్అ భిమానులంతా కోరుకుంటున్నారు. అందుకే పొత్తుల విషయంలో పవన్ కళ్యాణ్ ఈ సభలో పూర్తి క్లారిటీ ఇస్తారని భావిస్తున్నారు. పైగా పొత్తులకు వెళ్లినప్పటికీ కూడా ఈ రెండు సీట్లలోనూ జనసేన మాత్రమే పోటీ చేస్తుందని అంటున్నారు. అటువంటప్పుడు గెలుపుకి ఢోకా ఉండక పోవచ్చు. ఏపీలో జనసేన రోజు రోజుకు బలం పెంచుకుంటూ ముదుకుసాగుతోంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం జనసేన క్షేత్రస్థాయిలో విస్తరిస్తూ ప్రజలకు మరింత చేరువ అవుతోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభావం గట్టిగానే ఉండే అవకాశం ఉంది. ఇక అందుకు తగ్గట్టుగానే పవన్ కూడా వ్యూహరచన చేసుకుంటూ ముందుకుసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిలనివ్వమని చెబుతున్నా పవన్.. పొత్తులకు సిద్దమే అనే స్పష్టమైన సంకేతాలను ఇచ్చారు. అయితే ఏ పార్టీతో పొత్తు ఉండబోతుంది అనే దానిపై మాత్రం ఎటు తేల్చుకోలేకపోతున్నారు.
ప్రస్తుతం బీజేపీతో పొత్తు కొనసాగుతున్నా, బీజేపీ వల్ల జనసేనకు ఒరిగేదెమి లేదనేది జనసేన వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. ఇక టీడీపీతో పొత్తు పెట్టుకోవాలా ? లేదా అనే దానిపై కూడా పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దాంతో జనసేన ఏ చేయబోతోంది అనే క్యూరియాసిటీ అందరిలోనూ నెలకొంది. అయితే ప్రశ్నలన్నిటికి కూడా ఈ నెల 14న సమాధానం చెప్పేందుకు పవన్ సిద్దమైనట్లు తెలుస్తోంది.
మరి పవన్ 14న ఎలాంటి సంచలన నిర్ణయాలు ప్రకటిస్తారో చూడాలి.