Homeజాతీయంజమ్ముకశ్మీరులో బయటపడిన లిథియం నిక్షేపాలు..

జమ్ముకశ్మీరులో బయటపడిన లిథియం నిక్షేపాలు..

ఇప్పుడు దేశమంతా సంతోషంగా చెప్పుకుంటున్న మాట జమ్ముకశ్మీరులో బయటపడిన లిథియం నిక్షేపాలు.. జమ్మూ కాశ్మీర్ లోని రియాసి జిల్లాలో చాలా విలువైన లిథియం ఖనిజం భారీ నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. లక్షల కోట్ల విలువ చేసే లిథియం నిల్వలు భూగర్భంలో దాగి ఉన్నట్టు సదరు సంస్థ వెల్లడించింది. అయితే మన దేశంలో లిథియం నిక్షేషాల గురించిన ఆనవాళ్లు కొన్ని నెలల ముందే వార్తలు వచ్చాయి. అయితే అధికారికంగా గుర్తించడం మాత్రం ఇదే తొలిసారి. అది కూడా స్వల్ప మొత్తంలో కాదు. ఏకంగా 5.9 మిలియన్ టన్నుల మేర.

కర్బన ఉద్గారాలను తగ్గించుకోవడం కోసం ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రపంచ దేశాలు ముమ్మురం చేస్తున్న సమయంలో ఇవి బయటపడటం భారతదేశానికి గేమ్ చేంజర్ కానుంది. భవిశ్యత్తులో అంతా బ్యాటరీల మయం కానుంది. ప్రతీదీ బ్యాటరీలతోనే నడవనున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు, ఫోన్ల బ్యాటరీల తయారీలో లిథియంను ఉపయోగిస్తారు. జమ్మూ, శ్రీనగర్ మధ్యలోని రియాసీ జిల్లాలోని సలాల్-హైమానా ప్రాంతంలో ఈ ఖనిజ నిక్షేపాలను గుర్తించారు. ప్రపంచంలో లిథియం నిల్వలు ఎక్కువగా ఉన్న దేశం చిలీ.

ఆ దేశంలో 9.2 మిలియన్ టన్నుల లిథియం నిల్వలు ఉండగా.. ఆస్ట్రేలియాలో 5.5 మిలియన్ టన్నుల లిథియం నిల్వలు ఉన్నాయి. ఇప్పటి వరకూ ఆస్ట్రేలియా, చిలీ, చైనా దేశాలు పెద్ద మొత్తంలో లిథియాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. భారీ మొత్తంలో లిథియం నిక్షేపాలను గుర్తించడంతో భారతదేశ ముఖచిత్రం మారిపోయే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు. అయితే దాని కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. నిక్షేపాలు బయటపడటంతోనే సరిపోదు. అంతే వేగంగా వాటిని వెలికి తీయాలి. వెలికి తీసిన ముడి లిథియం ఖనిజాన్ని ప్రోసెస్ చేయాలి.. ఆపై వాటిని వినియోగదారుడికి చేర్చాలి..అప్పుడు దానికి బదులుగా వచ్చే సంపద ప్రభుత్వ ఖజానాకు చేరినప్పుడే మనకు అసలైన లాభం వచ్చినట్టు లెక్క.అయితే ప్రస్తుతానికి మాత్రం లిథియం ఖనిజానికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది.

లిథియం అరుదైన ఖనిజం కాబట్టి, ఖరీదైనది కాబట్టి దానికి బదులుగా బ్యాటరీలు తయారుచేసేందుకు మరో ప్రత్యమ్నాయం గురించి శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఈలోగా మరో చవకైన విధానం కనిపెడితే ఈ నిక్షేపాలు కొనేందుకు మార్కెట్ కరువవుతుంది. అందుకే మీనమేషాలు లెక్కించకుండా త్వరగా సదరు నిక్షేపాలను వెలికి తీయాల్సి ఉంటుంది. పరిశ్రమలు దానిని ఉపయోగించకుని బ్యాటరీలను తయారు చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఈ అద్రుష్టానికి సార్థకత ఏర్పడుతుంది. మనం ఏడో తరగతి నుంచే రసాయానశాస్త్రంలో కనిపించే ఆవర్తన పట్టికలో లిథియం గురించి చూసాం.. నిజానికి ఈ మూలకాన్ని 1817లో జోహాన్ అగస్ట్ అర్ఫెడ్‌సన్ గుర్తించారు.

గ్రీక్‌లోని లిథోస్ అనే పదం నుంచి లిథియం అనే పదం పుట్టింది. లిథోస్ అంటే రాయి అని అర్థం. తక్కువ సాంద్రతతో ఉండే ఈ ఖనిజం చాలా తక్కువ బరువుతో ఉంటుంది. మరో ఖనిజంతో కలిపినప్పుడు తీవ్రంగా చర్య జరుగుతుంది. అందుకే ఇది సహజంగా ఖనిజం రూపంలో లభ్యం కాదు. ఇది విషపూరితమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది. అన్ని ఖనిజాల్లోకెల్లా తేలికైన లిథియం సాంద్రత.. నీటి సాంద్రతలో సగం అని అంటున్నారు నిపుణులు. అయితే మిగతా ఖనిజాల మాదిరిగా లిథియం భూమ్మీద సహజంగా ఏర్పడదు.

ప్రకాశవంతమైన నక్షత్ర పేలుడు నుంచి ఈ అంతరిక్ష మూలకం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే దీనిని కాస్మోస్ మినరల్ అని కూడా అంటుంటారు. విశ్వాంతరాలలో బిగ్ బ్యాంగ్ కారణంగా విశ్వం ఆవిర్భవించిన తొలి నాళ్లలో జరిగిన బీభత్సంలో దీని ప్రస్తావన గురించి పరిశోధకులు చెబుతుంటారు. బిగ్ బ్యాంగ్ సమయంలో కొద్ది మొత్తంలో లిథియం ఏర్పడిందని నాసా నిధులు సమకూర్చిన ఓ అధ్యయనం గుర్తించింది. నక్షత్ర పేలుడుకు కారణమైన న్యూక్లియర్ రియాక్షన్లలో లిథియం తయారై.. గెలాక్సీ మొత్తం వ్యాపించిందని భావిస్తారు. అదే గ్యాలక్సీలో మన సౌరకుటుంబం ఉంది కాబట్టి మన గ్రహం ఏర్పడినపుడు ఆనాటి లిథియం నిల్వలు భూమిపై పరిమిత ప్రాంతలలో నిక్షిప్తం అయింది. అదే ఇప్పుడు బయటపడింది.

ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్నందున.. ప్రపంచ వ్యాప్తంగా లిథియంకు మంచి డిమాండ్ ఏర్పడుతోంది. ప్రతీ దేశం తమ వాహనాల ఇంధన వినియోగ పద్దతులను మర్చుకునే పనిలో ఉన్నాయి. పెట్రోల్ డీజెల్ తో నడిచే వాహనాలను తగ్గిస్తూ ఎలక్ట్రిక్ వాహనాలను పెంచుతున్నారు. అవి నడవాలంటే లిథియం ఐయాన్ బ్యాటరీలే శరణ్యం. వీటిని చార్జింగ్ చేసి మళ్లీ మళ్లీ ఉపయోగించే అవకాశం ఉండటంతో లిథియం అవసరం ఎక్కువైంది. ఇప్పటికే ప్రపంచంలో లిథియం నిల్వలు ఎక్కడున్నాయనే అన్వేషణ తీవ్రమవుతోంది. ప్రస్తుతం ఉన్న కర్బన ఉద్గారాల ప్రకారం చూస్తే.. ఈ ప్రపంచానికి 200 కోట్ల ఎలక్ట్రికల్ వాహనాలు అవసరం అని వరల్డ్ ఎకనమిక్ ఫోరం అంచనా వేసింది.

2025 నాటికి లిథియం కొరత ఏర్పడే అవకాశం ఉంది. 2030 నాటికి దేశంలోని కొత్త వాహనాల్లో 30 శాతం ఎలక్ట్రిక్ వాహనాలు ఉండాలని మన దేశం టార్గెట్‌గా పెట్టుకుంది. ప్రస్తుతం భారత్ విదేశాల నుంచి లిథియం దిగుమతి చేసుకుంటోంది. జమ్మూ కశ్మీర్లో భారీ స్థాయిలో లిథియం నిల్వలలను గుర్తించడంతో.. ఇక మీదట ఆ ఇబ్బందులు తప్పుతాయి. లిథియం ఖనిజాన్ని వెలికి తీయడానికి పెద్ద మొత్తంలో నీరు అవసరం. కానీ ప్రపంచవ్యాప్తంగా లిథియం నిల్వలు ఉన్న దేశాలు నీటి సమస్యను ఎదుర్కొంటున్నాయి.

భారత్‌లో, ముఖ్యంగా కశ్మీర్లో నీటి కొరత ఉండదు కాబట్టి.. లిథియం ఉత్పత్తిలో భారత్‌ మిగతా దేశాలకు ప్రత్యామ్నాయం కాగలదు. పైగా జమ్ముకశ్మీరు రాష్ట్రం ఇన్నాళ్లూ కేవలం ఉగ్రవాదానికి కేంద్రంగా ఉండిపోయింది. అభివ్రుద్దిలో మిగతా రాష్ట్రాలతో పోల్చిచూస్తే చాలా వెనుకబడిపోయింది. ఇప్పుడు బయటపడిన ఖనిజం అక్కడి వారిలో ఉపాదికి సంబంధించి ఆశలు రేపుతోంది. అయితే లిథియం నిల్వల గురించి ఒక్క జమ్ములోనే కాదు దేశంలోని మిగిలిన రాష్ట్రాలలోనూ కొన్ని చోట్ల కూడా నిక్షేపాలు ఉన్నాయని సమాచారం.

ఒక్క ఎలక్ట్రిక్ వాహనాలే కాకుండా వైద్య రంగంలోనూ, ప్రతీ పరికరంలోనూ లిథియం ఖనిజాన్ని ఉపయోగిస్తున్నారు. ఫోన్ బ్యాటరీలు, సోలార్ ప్యానెళ్లు ఇతర పునరుత్పాదక సాంకేతికతల్లోనూ లిథియాన్ని వాడుతున్నారు. గ్లాస్2లు, సిరామిక్స్‌ను దృఢంగా రూపొందించడానికి, ఉష్ణోగ్రత మార్పులకు తట్టుకోవడానికి వీలుగా లిథియాన్ని కలుపుతారు. వేడిని తట్టుకునే గ్రీజ్‌లు, లూబ్రికెంట్లలోనూ ఈ ఖనిజాన్ని ఉపయోగిస్తారు. విమాన పరికరాలను తక్కువ బరువుతో తయారు చేయడం కోసం అల్యూమినియం, రాగితో లిథియం మిశ్రమాన్ని కలిపి ఉపయోగిస్తారు.

అణ్వాయుధాల తయారీలోనూ లిథియం ఐసోటోప్‌లను ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఎలక్ట్రానిక్, కంప్యూటింగ్, డిజిటలైజేషన్ లో విప్లవాత్మక మార్పులువచ్చాయి. చాలా ఎలక్ట్రానిక్ వస్తువుల్లో లిథియం అయాన్ బ్యాటరీలను వాడుతున్నారు. ఇది ప్రపంచాన్ని క్లీన్ ఎనర్జీ వైపు నడిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న అన్ని బ్యాటరీల్లో లిథియం బ్యాటరీలు శక్తివంతమైనవి. ప్రస్తుతం మొబైళ్లలో, ఎలక్ట్రిక్ వాహానాల్లో లిథియం అయాన్ బ్యాటరీని విరివిగా వాడుతున్నాం. మీకు తెలుసా..మీరు 24 గంటలూ ఉపయోగించే మొబైల్ ఫోన్ బ్యాటరీలో 2 గ్రాముల లిథియం దాగి ఉంటుంది.

దాని వల్లే ఫోన్ పనిచేస్తోంది. లిథియం-అయాన్ బ్యాటరీపై చేసిన కృషికి స్టాన్లీ విట్టింగ్‌హామ్, జాన్ గూడెనఫ్ మరియు అకిరా యోషినోలకు 2019 సంవత్సరపు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. ప్రపంచానికి ప్రస్తుతం లిథియం చాలా అవసరం. ప్రస్తుతం 200 కోట్ల ఈవీలు అవసరం అవుతాయని అంచనా వేసింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. దీని ప్రకారం 2025 నాటికి లిథియం కొరత ఏర్పడవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో ఇండియాలో వెలుగులోకి వచ్చిన లిథియం నిల్వలు దేశానికి కొత్త ఆశల్ని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం దొరికిన నిల్వల్లో లిథియం ప్యూర్ ఫాంలో ఉంది. అత్యంత నాణ్యమైనదిగా ఉంది. ఈ ఖనిజం కోసం ఇతర దేశాలపై ఇండియా ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.

Must Read

spot_img