HomePoliticsఏపీలో మళ్లీ గెలుపుపై జగన్ ధీమా..!

ఏపీలో మళ్లీ గెలుపుపై జగన్ ధీమా..!

తన వ్యూహాలు, సంక్షేమ పథకాలకన్నా .. తనను గెలిపించేది వేరే ఉందని జగన్ ఎందుకు అనుకుంటున్నారు..? ఇంతకీ ఏమిటా ధీమా …?

ఏపీలో తొలిసారే భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్.. దాదాపు నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు. మరో ఏడాది గడిస్తే ఎన్నికలు ఖాయం. ఈ పరిస్దితుల్లో తాను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలనో, అభివృద్ధి కార్యక్రమాలనో లేక మూడు రాజధానులనో అజెండాగా మార్చుకుంటారని అంతా భావిస్తున్నారు. కానీ జగన్ మాత్రం వీటన్నింటి కంటే ముఖ్యమైన మరో అంశం ఎన్నికల్లో తనకు సునాయాసంగా విజయం కట్టబెడుతుందన్న అంచనాల్లో ఉన్నారు.

అదే ఇప్పుడు విపక్షాల్లోనూ గుబులు రేపుతోంది. ప్రస్తుతం ఏపీలో అత్యంత పటిష్టంగా కనిపిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి సారధిగా ఉన్న వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల్లోనూ ఇదే ఊపు కొనసాగించి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో రకరకాల వ్యూహాలకు పదునుపెడుతున్నారు.

గతంలో చేసిన పొరబాట్లను సరిదిద్దుకుంటూ, ఎక్కడా ప్రత్యర్దికి అవకాశం ఇవ్వకుండా మరోసారి ఎన్నికల్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని వ్యూహరచన చేస్తున్నారు. ఇందులో భాగంగా పలు కొత్త వ్యూహాలు తెరపైకి తెస్తున్నారు. అయితే ఇదంతా ఓ ఎత్తు మాత్రమే. వీటిన్నింటికీ మించి జగన్ ధీమా మరొకటి కనిపిస్తోంది.

అదే ఇప్పుడు ప్రత్యర్ధులకు టెన్షన్ పెడుతోంది. ఏపీలో వచ్చే ఎన్నికలు ఎలా జరగనున్నాయన్న దానిపై వైఎస్ జగన్ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ఏయే అంశాలు కీలక పాత్ర పోషిస్తాయనే దానిపై జగన్ ఫుల్ క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తోంది.

అందుకే పొత్తుల దగ్గరి నుంచి పథకాలు, రాజధానులు.. ఇలా ఏ అంశం చూసినా జగన్ వచ్చే ఎన్నికల నాటికి ఏం జరగనుందో స్పష్టంగా ఊహిస్తున్నట్లు అర్ధమవుతోంది. దీంతో వచ్చే ఎన్నికల విషయంలో పెద్దగా వ్యూహాలు అవసరం లేదనే భావన కూడా ఆయనలో కనిపిస్తోంది. అన్నింటికంటే ముఖ్యంగా పథకాలు, అభివృద్ధి, రాజధానులను మించి మరో కీలక అంశం ఈసారి కూడా తనను కచ్చితంగా గెలిపిస్తుందనే నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది.

2019 ఎన్నికల్లో టీడీపీపై ఘన విజయంతో వైసీపీ అధికారంలోకి రావడానికి దోహదం చేసిన అంశాల్లో అత్యంత కీలకమైనది జగన్ పై విశ్వసనీయత. జగన్ మాటిస్తే కచ్చితంగా నెరవేరుస్తారనే నమ్మకం. అదే నమ్మకం, విశ్వాసం చంద్రబాబుపై జనం కోల్పోవడంతోనే 2019 ఎన్నికల్లో వైసీపీకి ఇంత భారీ స్ధాయిలో ఘన విజయం కట్టబెట్టారనేది జగన్ నమ్మకం. దీంతో ఇప్పటికీ జగన్ అదే భావనలో కనిపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ చంద్రబాబును జనం నమ్మరనేది జగన్ విశ్వాసంగా కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు తనకు ప్లస్ గా మారనుందని, తనను గెలిపించే ఆయుధామని జగన్ బలంగా నమ్ముతున్నారని సమాచారం.

చంద్రబాబును జనం నమ్మితేనే కదా ఓట్లేసేది, ఆ నమ్మకాన్ని చంద్రబాబు ఎప్పుడో కోల్పోయారు. ఇప్పుడు కొత్తగా నమ్మకం కల్పించడానికి చంద్రబాబుకు అవకాశమే లేదన్న భావనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికీ ఎప్పుడు చూసినా తనపై, వైసీపీ ప్రభుత్వంపై విమర్శలకే పరిమితం అవుతున్న చంద్రబాబు…

తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పలేకపోతున్నట్లు జగన్

గ్రహిస్తున్నారు. అలాగే ఈ మధ్య కాలంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారుతున్నట్లు కనిపిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలోనూ జగన్ చాలా స్పష్టంగా ఉన్నారు. పవన్ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి పోటీ చేసినా, విడిగా పోటీ చేసినా చంద్రబాబుతో ఆయన బంధంపై జనం ఓ క్లారిటీతో ఉన్నట్లు జగన్ అంచనా వేస్తున్నారు. చంద్రబాబుతో కలిసి పోటీ చేస్తే ఆ ప్రభావం తనపైనా పడుతుందని, విడిగా పోటీ చేస్తే కనీస సీట్లకు పరిమితం అవుతారని జగన్ భావిస్తున్నారు. దీంతో వీరిద్దరి పొత్తుపైనా పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తనను కలిసిన నేతలతో జగన్ చెప్తున్నట్లు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ కు బీజేపీ అండ ఉన్నా ఆ ప్రభావం వచ్చే ఎన్నికలపై ఏమాత్రం ఉండదని జగన్ భావిస్తున్నారు. దీంతో ఏ విధంగా చూసినా పవన్ ప్రభావం అంతంతమాత్రమే తప్ప తనను గద్దెదించే స్దాయిలో ఉంటుందని జగన్ అనుకోవడం లేదని తెలుస్తోంది. అయితే .. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత పెరిగే ప్రభావం ఉందని, దీన్ని పట్టించుకోకపోతే, దెబ్బ తినక తప్పదని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు.

ఏపీలో సాధారణ ఎన్నికలకు మరో 16 నెలల సమయం మిగిలుంది. ప్రతిపక్షాలకంటే అధికార పార్టీనే ఎన్నికలకు సిద్ధంగా..దూకుడు ప్రదర్శిస్తోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ వై నాట్ 175 అంటూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఏపీలో ఎపుడు ఎన్నికలు జరిగినా తన విజయం మరోమారు ఖాయం అన్న ధీమాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నారు. నిజానికి అధికారంలో ఉన్న వారికి ఆ ధీమా ఉండాల్సిందే.

అయితే అది అతి ధీమాగా ఉందా లేక దాని వెనక లాజిక్ ఉందా అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజానికి జగన్ వచ్చే ఎన్నికల్లో అస్త్రాలుగా కొన్నిసిద్ధం చేసుకుని ఉంచుకునారు. అలాగే తన సంక్షేమ పాలనను కూడా జనాలకు చెప్పుకుని మరోసారి పవర్ పట్టాలనుకుంటున్నారు. ఇక అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానుల ఇష్యూ ఎటూ సిద్ధంగా ఉంది. వీటితో పాటు ఎన్నికల నాటికి అభివృద్ధి కార్యక్రమాలను పట్టాలెక్కించి కూడా జన విశ్వాసం పొందేలా జగన్ చూస్తున్నారు. అయితే వీటికి మించి జగన్ వద్ద మరో ఆయుధం ఉందిట.

అదే విపక్షాలను కలవరం పెడుతోంది. ఆ ఆయుధం ఏంటి అంటే చంద్రబాబు పవన్ ఇద్దరూ కలసినా విడివిడిగా పోటీ చేసినా తనకు ఏ మాత్రం పోటీ కారనే దృఢ విశ్వాసంతో జగన్ సాగుతున్నారు.

ఏపీలో చంద్రబాబు పాలనను జనాలు చూసేసిన సినిమాగా జగన్ లెక్క కడుతున్నారు.

చంద్రబాబు సీనియర్ మోస్ట్ లీడర్. ఆ సీనియారిటీయే వచ్చే ఎన్నికల్లో ఆయనకు మైనస్ అవుతుంది అని కూడా అంచనా వేసుకుంటున్నారు. ఇక చంద్రబాబు ఇప్పటికే ఊరూరా తిరిగి జగన్ని వైసీపీని దారుణంగా విమర్శిస్తున్నారు. తమ పార్టీకి అధికారం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. అయితే చంద్రబాబు కొత్త కాదు కాబట్టి జనాలు ఆయన ప్రకటలను ఏవీ విశ్వాసంలోకి తీసుకోరు అన్నదే జగన్ ధీమాగా ఉంది.

అదే టైం లో చంద్రబాబు హామీలు ఎన్ని అయినా ఇస్తారు కానీ అధికారంలోకి వచ్చాక వాటిని పక్కన పెడతారు అని పేరుంది. ఒక విధంగా బాబు విశ్వసనీయత జనాల్లో ప్రశ్నర్ధకం అని జగన్ గట్టిగా నమ్ముతున్నారు. చంద్రబాబు ఎన్ని టూర్లు వేసి ఎన్ని హామీలు ఇచ్చినా కూడా జనాలు ఆయన్ని ఏ మాత్రం నమ్మే పరిస్థితి లేనే లేదని అంటున్నారు. ఇక చంద్రబాబు తన టూర్లలో ఎంతసేపూ జగన్ని విమర్శించడం తప్ప తాను అధికారంలోకి వస్తే ఫలానా పని చేసి తీరుతామని చెప్పడంలేదు. అది కూడా జగన్ గమనిస్తున్నారు అని అంటున్నారు.

ఒకవేళ బాబు చెప్పినా దాని ఇంపాక్ట్ ఏమీ ఉండదనే జగన్ దగ్గర ఉన్న సమాచారం. మరో వైపు చూస్తే పవన్ కళ్యాణ్. ఆయన ఈ మధ్య ఏపీలో హడావుడి చేస్తున్నారు. జనసేన వచ్చే ఎన్నికల్లో క్రియాశీలమైన పాత్ర పోషిస్తుంది అని అంటున్నారు. అయితే పవన్ విషయంలో కూడా విశ్వసనీయత ఇబ్బంది పెడుతుంది అన్న లెక్కలు వైసీపీ వేస్తోందిట.

ఒకసారి టీడీపీతో జత కట్టి మరోసారి విడిపోయి మళ్ళీ టీడీపీతో జతకడితే అది కచ్చితంగా జనసేనకు కూడా ఇబ్బందిగా మారుతుంది అని అంటున్నారు. అలాగే ఈ రెండు పార్టీలు కూడా విడిగా పోటీ చేసినా కలసినా కూడా తన ప్రభుత్వాన్ని దించేటంత పరిస్థితి ఉండదని కూడా జగన్ నమ్ముతున్నారుట. ఎందుకంటే ఈ ఇద్దరి మైత్రిని జనాలు చూసేశారని పైగా జనసేన కూడా గెలవకపోయినా పవన్ రెండు ఎన్నికలను చూసారని దాంతో ఈ రెండు పార్టీల నుంచి కొత్తగా జనాలు ఏమీ ఆశించేది ఉండబోదని కూడా జగన్ బాగా నమ్ముతున్నారుట.

ఏది ఏమైనా కూడా ఏపీలో విశ్వసనీయతకు నమ్మకలేమికి మధ్య పోటీ ఉంటుందని అదే తనను మరోసారి సీఎం ని చేస్తుందని జగన్ భావిస్తున్నారుట. జగన్ అంచనాలు లాజిక్ గా చూస్తే కరెక్టే. అవి నిజమవుతాయా లేదా అన్నది మాత్రం 2024 ఎన్నికల ఫలితాలే చెప్పాలి. మరో వైపు చూస్తే ఏపీలో విపక్షాలకు ఏ చాన్స్ ఇవ్వకుండా జగన్ రాజకీయం ఉంది. అలాగే ఆయన విపక్షాలను లైట్ తీసుకుంటున్న వైనమే ఇపుడు చర్చనీయాంశంగా ఉంది.

మరి జగన్ .. ధీమా ఏమేరకు గెలిపిస్తుందన్నదే చర్చనీయాంశంగా మారింది.

Must Read

spot_img