ప్రస్తుతం ప్రపంచ రాజకీయాలను చూస్తే విచిత్రంగా ఉంటుంది. అధికారం అలవాటైన పాలకులు తమ పదవీ కాలం పూర్తయినా సీటు వదులుకోడానికి ఇష్టపడరు. వారు ఎంతటి వారైనా ఇదే మనస్తత్వంతో ఉంటారు. అది ఎంత అగ్రదేశమైనా ప్రజల తీర్పును మన్నించనట్టైతే అరాచకమే అవుతుంది. నియంత్రుత్వంగానే ఉంటుంది. చైనా ను తీసుకున్నా, రష్యాను తీసుకున్నా అక్కడ జరుగుతున్నది అదే. ప్రజలు పొమ్మని ఓటుతో ఓడించినా మరో రకంగా బ్యాక్ డోర్ ఎంట్రీ ఇచ్చే పాలకులు పెరుగుతున్నారు. వారి స్వార్థం కోసం తమ దేశాల రాజ్యాంగాన్నే మార్చుకునేందుకు వెనుకాడటం లేదు. ప్రస్తుతం చైనా అధ్యక్షుడు తనను సుప్రీం లీడర్ అని పిలిపించుకోవడానికే ఇష్టపడుతున్నారు.
పదవీ కాలాన్ని జీవితకాలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలా కొనసాగుతున్నారు. తమకు అనుకూలంగా లేని వారిని అణచివేస్తూ పదవులు అనుభవిస్తున్నారు. అలాంటి నేటి కాలంలో..బురదలో పుట్టిన పద్మంలా మెరిసారు న్యూజీలాండ్ ప్రధాని జసిండా అర్డెర్న్..తనది మొదటి నుంచీ అసాధారణ ఒరవడిగానే ఉంటుంది. కాదు పొమ్మని ప్రజలు తీర్పిచ్చినా అధికారం కోసం ఎంతకైనా తెగించే డోనాల్డ్ ట్రంప్, బోల్సెనారో వంటి వారిని చూసి విస్తుపోయిన ప్రపంచాన్ని న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెన్ తాజా నిర్ణయం ఆశ్చర్యపరిచింది.
పదవీకాలం ముగియడానికి పది నెలల ముందే తన ప్రధాని పదవి నుంచి తప్పుకొంటున్నట్టు ఆమె ప్రకటించటం ఆ దేశ ప్రజలకే కాదు… అంతర్జాతీయ సమాజానికి కూడా ఊహకందలేదు. రెండేళ్ల క్రితం అమెరికాలో ట్రంప్, మొన్నటికి మొన్న బ్రెజిల్‌లో బోల్సెనారో ఏం చేశారో అందరూ చూశారు. చైనాలో ఏం జరిగిందో, శ్రీలంకలో పదవిపోయిన ఉక్రోషంతో గొటబయ రాజపక్స, రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ ఎలా మసిబూసి మారెడుకాయను తయారుచేసారుచూసాం. జనం అధికారం ఇవ్వలేదని తెలిసి కూడా దాన్ని ప్రత్యర్థుల నుంచి బల ప్రయోగంతో కాజేయడానికి ప్రయత్నించారు.
కానీ న్యూజీలాండ్ మాజీ ప్రధాని జసిండా వీరికి పూర్తిగా భిన్నంగా ఉంటారు. సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించటం అసాధ్యమనుకున్న వెంటనే ఆమె రాజీనామా చేశారు. ఇప్పటికీ న్యూజీలాండ్ లో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ముందంజలో ఉన్న ఆమె.. ఇలా ఆలోచించటం ఊహాతీతం అనే చెప్పాలి.
పదవీకాలం ముగియడానికి ముందే తప్పుకోవటం న్యూజిలాండ్‌కు కొత్తగాదు. అక్కడ నిజాయితీకి పెద్ద పీట వేయడం అలవాటు. ఆమెకు ముందు పనిచేసిన నేషనల్ పార్టీ నేత జాన్ కీ కూడా 2017 వరకూ పదవీకాలం ఉన్నా ఏడాది ముందే వైదొలగి డిప్యూటీ ప్రధాని బిల్ ఇంగ్లిష్‌కు బాధ్యతలు అప్పజెప్పారు. అయితే సంక్లిష్ట సమస్యలు ఎదురైనప్పుడు ఆయన వ్యవహారశైలికీ, జసిండా తీరుకూ చాలా వ్యత్యాసముంది.
జాన్ కీ అప్పట్లో అన్నిట్లో వైఫల్యాలు చవిచూసారు. పార్టీలో ఒత్తిళ్లు పెరిగి తప్పనిసరై తప్పుకోవాల్సి వచ్చింది. కానీ జసిండా అలా కాదు. పార్టీలో ఆమె పట్ల సానుకూలత చెక్కుచెదరలేదు. సంక్షోభ సమయాల్లో ఆమె దృఢంగా ఉండటమే, సమస్యలను అధిగమించటమే అందుకు కారణం. కరోనా విజృంభి స్తున్నప్పుడు అన్ని దేశాలూ లాక్‌డౌన్‌తో సహా అనేక ఆంక్షలు విధించి పౌర జీవనాన్నిస్తంభింపజేస్తే..
ఆమె మాత్రం నిబ్బరంగా కోవిడ్ 19ని ఎదుర్కొన్నారు. పరిమిత ప్రాంతాల్లో మాత్రమే స్వల్ప స్థాయి ఆంక్షలు విధించారు. అలా జనాన్ని చాలా బాగా నడిపించారు. ఓ తల్లిలా దేశంలోని బాలల భవిశ్యత్తును ఆలోచిస్తారు. తన పాలన ఎలా ఉందో ఎప్పటికప్పుు జనం నుంచే తెలుసుకుంటారు. ప్రపంచంలో మరెక్కడా కానరాని పాలనను న్యూజీలాండ్ ప్రజలకు అందించారు జసిండా.. చైనానుంచి స్వదేశానికి పోయిన ఫిలిప్పీన్స్ పౌరుడొకరు 2020 ఫిబ్రవరి 2న కరోనా వైరస్ బారినపడి మరణించినట్టు వార్త రాగానే చైనానుంచి రాకపోకలు నిలిపేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. యూరప్ దేశాల్లో కరోనా మరణాలు నమోదు కావడం మొదలుకాగానే అక్కడి నుంచి కూడా విమానాలు నిలిపివేశారు.
ఈ ఆంక్షలపై ఇంటా, బయటా విమర్శలొస్తున్నా ఎన్నడూ లెక్క జేయలేదు. అయితే ఆమె తక్షణ స్పందనవల్ల ప్రపంచ దేశాల్లో వేలాదిమంది కరోనా బారినపడిన తరుణంలో న్యూజిలాండ్‌లో కేవలం రెండే కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత సైతం రెండంకెల సంఖ్యకు మించి కరోనా కేసులు వెలుగు చూడలేదు. పౌరుల సాధారణ జీవనానికి అంతరాయం కలగలేదు. ప్రజలను భయభ్రాంతులను చేయడంకాక వారు అప్రమత్తంగా ఉండేలా, ఆత్మవిశ్వాసంతో మెలిగేలా సూచనలు చేయడం వల్లే ఈ విజయం సాధ్యమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం జసిండాను ప్రశంసించింది. కరోనా సంబంధ కేసుల సమాచారాన్ని తొక్కిపట్టివుంచటం కాక పారదర్శకంగా వ్యవహరించటం వల్లే ఆ మహమ్మారిని సునాయాసంగా ఎదుర్కొనడానికి దోహదపడింది.
అయితే జసిండా పాలనపై ప్రజానీకంలో ఇటీవల కొంత అసంతృప్తి ఏర్పడిన మాట వాస్తవం. సర్వేల్లో విపక్ష నేషనల్ పార్టీ ముందంజలో ఉంది. అయితే ప్రధాని పదవికి అర్హులని భావిస్తున్న నేతల్లో ఇప్పటికీ ఆమే అందరికన్నా ముందున్నారు. కరోనా అనంతర పరిస్థితులు, ఉక్రెయిన్‌లో రష్యా దురాక్రమణ యుద్ధం న్యూజిలాండ్‌ను కూడా సంక్షోభంలోకి నెట్టాయి. ఉపాధి కల్పనలో పురోగతి లేదు. ద్రవ్యోల్బణం పెరిగింది. ఈ పరిణామాలన్నీ పౌరులకు ఆందోళన కలిగిస్తున్నాయి.
దీంతోపాటు 2019లో క్రైస్ట్ చర్చి నగరంలో రెండు మసీదుల్లోకి చొరబడి ఒక దుండగుడు 51 మందిని పొట్టనబెట్టుకున్న ఉదంతాన్ని జనం ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నారు. ప్రపంచంలో ఐస్‌లాండ్ తర్వాత అత్యంత శాంతియుత దేశంగా ఎప్పుడూ రెండో స్థానంలో ఉండే న్యూజిలాండ్‌కు ఈ ఉదంతాలు ఊహకందనివి. అయితే ఆ సమయంలో జసిండా వ్యవహరించిన తీరు ఆదర్శ ప్రాయమైనది. వెనువెంటనే దేశ ప్రజలనుద్దేశించి ఆమె చేసిన ప్రసంగం, బాధితులపట్ల ఆమె చూపిన దయార్ద్రత అందరినీ చలింపజేసింది.
ఆ తర్వాత మారణాయుధాల విషయంలో ఉదారంగా ఉండే దేశ చట్టాలను ఆమె సవరించారు. ఈ క్రమంలో పెద్దయెత్తున వ్యతిరేకత వచ్చినా లెక్కజేయలేదు. దృఢంగా వ్యవహరించటమంటే నిరంకుశంగా పాలించటం కాదని సమస్యలపై సకాలంలో స్పందించి, అవసరమైతే కఠినమైన నిర్ణయాలు తీసుకోవటమని తన ఆరేళ్ల పాలనలో జసిండా నిరూపించారు. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న లేబర్ పార్టీ సామ్యవాద విధానాలు ఆమెకు ప్రజాదరణ తెచ్చిపెట్టి ఉండొచ్చు. కానీ దేశం ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో ఒక మహిళగా మనసుపెట్టి ఆలోచించిన తీరు, తీసుకున్న సృజనాత్మక నిర్ణయాలు ఆమెను విలక్షణ నేతగా నిలిపాయి. ముఖ్యంగా నవజాత శిశువులున్న కుటుంబాలకు 2018లో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించటం, తాజాగా ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు ఆ కుటుంబాలకు నెలనెలా అదనపు ఆర్థిక సాయం అందించటం అందరినీ ఆకట్టుకుంది.
వేతనాల్లో లింగ వివక్షను నిషేధించి, సమాన పనికి సమాన వేతనం లభించేలా తీసుకొచ్చిన చట్టం కూడా ప్రశంసలు పొందింది. అధికారమపరమావధవుతున్న వర్తమానంలో జసిండా వంటì వారు చాలా అరుదు. వచ్చే అక్టోబర్ ఎన్నికల్లో విజేతలెవరో కచ్చితంగా ఎవరూ చెప్పలేకపోయినా ఆమెకు సాటిరాగల నేతలు పాలక, ప్రతిపక్షాల్లో ఎవరూ లేరన్నది వాస్తవం. ఎందుకంటే ఆమె నెలకొల్పిన పాలనా ప్రమాణాలు అటువంటివి.
మళ్లీ తాను చురుకైన రాజకీయాలలోకి జసిండా రాకపోవచ్చు..ఇకనైనా తన కుటుంబాన్ని తానే చూసుకుంటానని అంటున్నారు. ఇక్కడే ఓ ఉన్నత రాజకీయవేత్త ఆమెలో కనిపిస్తారు. తాను చేయలేని పనిని ఇంకొకరికి అప్పగించడం ఆమె ఉద్దేశం. తానిక పదవిని నిర్వహించే శక్తి లేకపోవడం వల్లే రాజీనామా చేస్తున్నానని స్పష్టంగా చెప్పారు. అది కూడా ప్రజలతో తన నిర్ణయాన్ని పంచుకున్నారు. అయితే ప్రజలు ఆమె విజ్నప్తికి సానుకూలంగా స్పంధించారు.