Homeతెలంగాణఈటలకు కమలంలో ఉక్కపోత మొదలైందా..రేవంత్ వ్యాఖ్యలు కాక రేపుతున్నాయా..?

ఈటలకు కమలంలో ఉక్కపోత మొదలైందా..రేవంత్ వ్యాఖ్యలు కాక రేపుతున్నాయా..?

బీఆర్ఎస్ నుంచి బలవంతంగా గెంటివేయబడి బీజేపీలో చేరి కేసీఆర్ కే సవాల్ చేసిన ఈటల రాజేందర్ కు కమలం పార్టీలోనూ ఉక్కపోతమొదలైనట్టే కనిపిస్తోంది. తాజాగా ఆయన మాటలు విన్నాక అందరికీ అదే అర్థమైంది. బీజేపీలో ఆధిపత్య పోరు కొనసాగుతోందని తెలుస్తోంది.బీజేపీలో చక్రం తిప్పుతారని భావించిన ఈటల రాజేందర్ కు ఇప్పుడు పార్టీలో ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకున్నట్టు సమాచారం. సీఎం అభ్యర్థిగా ప్రచారమైన ఈటల రాజేందర్ విషయంలో ఏం జరుగుతోందన్నదే అంతుబట్టడం లేదు.

ఈటల రాజేందర్ పార్టీ మారుతారని జరుగుతున్న ప్రచారం వెనుక కారణాలు ఏమిటీ? వంటి అంశాలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. కేసీఆర్ ను ఎదురించి బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన ఈటలను బీజేపీ కూడా మొదట్లో బాగానే ఆదరించింది. ఏకంగా చేరికల కమిటీ చైర్మన్ గా నియమించి బీఆర్ఎస్, కాంగ్రెస్ ల నుంచి నేతలను లాగేసే పనిని అప్పగించింది. కానీ ఆయన దూకుడుకు బీజేపీలోని కోవర్టులే అడ్డుతగిలారని, ముందే లీక్ చేశారని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. ఈటల రాజేందర్ తెలంగాణలో కేసీఆర్ ను ఎదుర్కొని నిలిచారు.

పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం ముఖ్యంగా పార్టీలోని అసంతృప్తులను బీజేపీ బాట పట్టించడంలో బాగానే కష్టపడుతున్నారు. అయితే ఈటలకు బీజేపీలో క్రేజ్ చూసి కొందరికి మింగుడు పడడం లేదని..అందుకే కేసీఆర్ కు సీక్రెట్స్ అన్నీ చేరవేస్తున్నారని ఈటల ఇటీవల అసహనం వెళ్లగక్కారు. బీజేపీలో కేసీఆర్ కోవర్టులున్నారని ఈటల ఆవేదన వైరల్ అయ్యింది. కేసీఆర్ ప్రతి పార్టీలో కోవర్టులను నియమించారని, బీజేపీలోనూ ఉన్నారని ఆరోపణలు చేశారు. అందుకే తమ పార్టీలో ఎవరూ చేరడం లేదన్నట్లు కామెంట్స్ చేశారు.

ఈ క్రమంలోనే తాను తన బాధ్యతను సరిగా నిర్వర్తించలేకపోతున్నానని మథనపడుతున్నట్లు సమాచారం. బీజేపీలో ఎవరు కోవర్టులు అన్నదే తెలియక అందరూ ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఈటల కామెంట్స్ తో కొందరు డిఫెన్స్ లో పడ్డట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే నాయకులు కూడా ఇంట్రెస్ట్ చూపడం లేదని తెలుస్తోంది. ఇప్పుడున్న బీజేపీకి ప్రజా బలం ఉన్నా.. నాయకుల బలం తక్కువే అని చెప్పవచ్చు. ఇతర పార్టీల నుంచి గెలుపు గుర్రాలను చేర్చుకోకపోతే ప్రజలు ఆదరించే అవకాశం లేదు. అందువల్ల ఈటలకు పెద్ద బాధ్యతను అప్పగించారు. అయితే ఇప్పటికీ ఒక్కరు కూడా చేరకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ఈటల రాజేందర్ విషయంలో బీజేపీలో ఏం జరుగుతుంది.. పార్టీలో ఆయనకెందుకీ ఉక్కపోత…

అయితే ఈ వ్యాఖ్యల తర్వాత ఈటల పార్టీ మారుతారని కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం మొదలైంది. అయితే తాను బీజేపీని వదిలేది లేదని ఈటల తేల్చిచెబుతున్నారు. దుష్ప్రచారం చేస్తున్నారని,తనపైకాంగ్రెస్ నేతలు సానుభూతి చూపించాల్సిన అవసరం లేదని అన్నారు. తాను పార్టీ మారననిస్పష్టం చేశారు. ఈటల చేరికతో బీజేపీ ఏమాత్రం లాభపడిందో తెలియదు కానీ, ఈటల మాటలతో మాత్రం ఇప్పుడా పార్టీ ఇరుకున పడుతోంది.ఈటలకు ఆ పార్టీలో ఎవరితోనూ సఖ్యత లేదు. తన చేరికకు పరోక్ష కారణం అయిన వివేక్ వెంకట స్వామితో గొడవలు, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడుబండి సంజయ్ తో ఆధిపత్యపోరు.. ఇలా ఉంది కమలంతో ఈటల సంసారం.

ఇవి చాలవన్నట్టుగా కోవర్టులు, ఇన్ ఫార్మర్లు అంటూ ఆయన పెట్టిన మంట ఇప్పుడు బీజేపీని ఇరుకునపడేసింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్, రాష్ట్ర పార్టీ చేరికల కమిటీ కన్వీనర్ కూడా. అలాంటిది ఆయనే స్వయంగా కోవర్టులంటూ ఆరోపణలు చేయడం విశేషం. అంతే కాదు, బీజేపీలో చేరబోయే ఇతర పార్టీల నేతల పేర్లు ముందుగానే లీక్ కావడంతో ఇటీవల కొందరు వెనకడుగేసిన పరిస్థితి కూడా ఉంది. చేరికల కమిటీ కన్వీనర్ అయిన ఈటలకు తెలియకుండా ఈ పేర్లు లీకవుతాయా..? మరి ఆయన ఆరోపణల్లో వాస్తవం ఎంత..? అసలీ లీకువీరులెవరు అనేది ఇప్పుడు బీజేపీలో చర్చనీయాంశమైంది.

ఏ రాజకీయ పార్టీలోనూ చేరికల కోసం ప్రత్యేకంగా కమిటీ లేదని, బీజేపీలో కమిటీ ఏర్పాటు చేసినా చేరబోయే నేతల పేర్లు ప్రాథమిక దశలోనే ఎలా లీక్‌ అవుతున్నాయని పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు లేని సమస్య ఇప్పుడే ఎందుకు..? ఇన్ఫార్మర్లు, కోవర్టులు అన్ని పార్టీల్లోనూ ఉంటారు. అయితే సమయానుకూలంగా స్పందిస్తుంటారు. కానీ ఇటీవల కాలంలోనే బీజేపీకి ఈ సమస్య ఎక్కువగా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ ని వెనక్కు నెట్టి బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయంగా ఎదుగుదామనుకుంటున్న వేళ, బీజేపీని ఇలాంటి వ్యవహారాలు చికాకు పెడుతున్నాయి.

దీంతో అధిష్టానం కూడా ఈ వ్యవహారంపై దృష్టిపెట్టింది. లీకువీరులెవరో తేల్చాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించింది. మునుగోడు ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ నుంచి కొంతమందికి గేలమేసింది బీజేపీ. కానీ అనూహ్యంగా చివరి నిముషంలో కొంతమంది బీజేపీ నేతలు బీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. డబ్బులు వెదజల్లినా మునుగోడులో బీజేపీ గెలవలేదు. కోవర్టులు, ఇన్ఫార్మర్ల వ్యాఖ్యలతో ఈటల తన అసంతృప్తిని బయటపెట్టారేమోననే వాదన కూడా వినపడుతోంది.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా.. ఈటల వంటి వారు బీజేపీలో ఇమడలేరని చెబుతున్నారు. దీంతో ఈటల వ్యవహారంపై మరింత కన్ఫ్యూజన్ మొదలైంది. ఇంతకీ ఈటల సమస్య ఏంటి..? బీజేపీలో ఆయనకు తగినంత గౌరవం దక్కలేదని ఫీలవుతున్నారా, లేక బండి పోస్ట్ కి ఎసరు పెట్టాలని చూస్తున్నారా..? ముందు ముందు తేలిపోతుంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తున్నాయి.

కేసీఆర్ ను గద్దె దించాలన్న లక్ష్యంతో బీజేపీలో చేరిన ఈటల నిరాశకు గురయ్యారని, ముఖ్యంగా బీజేపీలోనూ కోవర్టులున్నారనే విషయం అర్థమై ఆయన లక్ష్య సాధన కోసం ప్రత్యామ్నాయ మార్గం వెతుక్కోవలసినపరిస్థితి వచ్చిందని చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చల్లో ప్రముఖంగా చర్చకు వస్తున్నాయి. నిజానికి కేసీఆర్ కోవర్టులు అన్నిపార్టీల్లో ఉన్నారు. అన్ని పార్టీల కంటే కాంగ్రెస్ లో కొంచెం చాలా ఎక్కువగానే ఉన్నారు. ఆ విషయాన్నీ స్వయంగా రేవంత్ రెడ్డి లేదా అద్దంకి దయాకర్ వంటి అయన అనుచరులు బహిరంగంగా, పేర్లతో సహా బయట పెడుతూనే ఉన్నారు. నిజానికి, కోవర్టుల చర్చతోనే కాంగ్రెస్ పార్టీలో రచ్చ మొదలైంది. సీనియర్ జూనియర్ వివాదం పురుడు పోసుకుంది.

అధిష్టానం జోక్యం చేసుకున్నా చల్లారని స్థాయిలో కోవర్టు మంటలు గాంధీ భవన్ లో ఎగిసి పడుతున్నాయి. అయినా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చల్లో ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. ముఖ్యంగా బీజేపీలో నాయకులు, శ్రేణుల్లో అయితే ఈ చర్చ మరింత జోరుగా సాగుతోంది. రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా బీజేపీ చేరిన నాయకులకు, ముఖ్యంగా రాజకీయాల్లో అనేక ఎత్తుపల్లాలు చూసి వచ్చిన ఈటల రాజేందర్ వంటి సీనియర్ నాయకులకు ఆశించిన స్థానం, గౌరవం దక్కడం చాలా కష్టమే.

ఈటల గానీ, రేవంత్ రెడ్డి ప్రస్తావించిన మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, వివేక్ వెంకట స్వామి వంటి వారు బీజేపీలో ఉక్కపోతకు గురవుతున్నమాట వాస్తవం కావచ్చన్న వాదనలు వెల్లువెత్తుతున్నాయి. కానీ వారికి మరో ప్రత్యామ్నాయం కూడా లేదని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి పీసీసి అధ్యక్షుడు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది కానీ అదే రేవంత్ రెడ్డి కారణంగా కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో కూరుకుపోయింది. ఆ ఫ్రస్ట్రేషన్ లోనే ఆయన ఈటల మాటలకు వక్రభాష్యం చెపుతున్నారని అంటున్నారు.



Must Read

spot_img