Homeఅంతర్జాతీయంపునర్జన్మ అంటే ఇదేనా..?

పునర్జన్మ అంటే ఇదేనా..?

పునర్జన్మ అంటే మనకు తెలిసి చనిపోయి మరో చోట మరో శరీరంలో ప్రాణం పోసుకోవడం. అది పురాణాలలో చదువుకున్నాం. తప్ప శాస్త్రీయ ఆధారాలు లేవు. నమ్మేవారు నమ్ముతుంటారు. నమ్మని వారిని నమ్మించేందుకు ఆధారాలైతే లేవు. అయితే చనిపోయిన తరువాత మళ్ళీ అదే శరీరంలో జీవం పొందడం అన్నది చర్చనీయాంశంగా మారింది. అసలు ఆ ఆలోచన నిజంగా ఆచరణ సాధ్యమేనా? అంటే అవుననే అంటున్నారు కొందరు శాస్త్రవేత్తలు. దాదాపుగా అన్ని అంశాలపై పరిశోధన చేస్తున్న మానవుడు.. ఇప్పుడు పునర్జన్మ పై చేసే ప్రయత్నాలలో కూడా ఆశ్చర్యకరమైన ఫలితాలు ఇచ్చాయని అంటున్నారు.

ఒకవేళ ఇదే గనక సాధ్యమైతే.. భవిష్యత్తు మనం ఊహించని విధంగా ఉంటుందని అంటున్నారు నిపుణులు. అసలు ఆ విషయమేంటో ఇండెప్త్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..ఇటీవల పునర్జన్మ పై పరిశోధన చేసిన జర్మన్ వైద్య బృందం ఈ విషయంలో వినూత్నమైన ఫలితాలు వచ్చాయని తెలిపింది. దీనికోసం మృతదేహాలను అతి శీతలంగా ఉండే పరిస్థితుల్లో భద్రపరుస్తున్నట్టు చెబుతున్నారు. వాటికి ఎప్పటికైనా ప్రాణం పోస్తామని ధీమాగా ఉన్నారట. జర్మనీలో బెర్లిన్ కు చెందిన టుమారో బయోస్టాటిస్ స్టార్టప్ కూడా పనిచేస్తుంది.

వైద్య రంగంలో తగిన పురోగతి సాధించిన తర్వాత.. మరణానికి కారణాల ఆధారంగా చికిత్స చేసి చనిపోయి భధ్రపరిచిన స్థితిలో ఉన్న శరీరాలను తిరిగి మళ్ళీ జీవించేలా చేయాలనీ అన్నది ఆ సంస్థ ఉద్దేశ్యం. శవాలను, శవ భాగాలను చాలా కాలం పాటు చెడిపోకుండా ఉండడం వాటిని అత్యంత చల్లగా ఉండే ప్రదేశాల్లో భద్రపరచడం వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది. ఈ పద్దతిని “క్రయో ప్రిజర్వేషన్” అని పిలుస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి ప్రిజర్వేటివ్ సేవలు ప్రపంచంలో చాలా తక్కువ సంస్థలు అందిస్తున్నాయి. స్విట్జర్లాండ్ లోని రాప్జ్ పట్టణంలో “యూరోపియన్ బయోస్టాసిస్” సంస్థ ఈ దిశగా పరిశోధనలు చేయడానికి క్రయో ప్రిజర్వేషన్ సేవలు అందిస్తుంది.

ఈ మధ్య దీనికి శవాల తాకిడి విపరీతంగా పెరుగుతున్నట్టు సమాచారం. బిలియనియర్లు తమ శవాలను ఇలా దాచుకుంటున్నారని సమాచారం. క్రయో ప్రిజర్వేషన్ విధానంలో కణాలు, కణజాలంతో పాటు మెదడును కూడా చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేస్తారు. అవయవాలను మైనస్ 196 డిగ్రీ సెల్సియస్ వద్ద చల్లబరిచి ఉంచుతారు. ఆ తర్వాత లిక్విడ్ నైట్రోజెన్ ఉన్న ట్యాంకులో వాటిని భద్రపరుస్తారు. నిల్వ ఉంచే విషయంలో స్పష్టత ఉన్నప్పటికీ, తిరిగి ఆ శరీరాలకు ఎలా ప్రాణం పోస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు.

రేపటి రోజున అలా జీవింపజేసే టెక్నాలజీ వస్తుందన్న నమ్మకంతో ఇలా రిజర్వ్ చేస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. కేవలం ఆ నమ్మకం ఆధారంగా క్రయోప్రిజర్వేషన్ విధానానికి బిలియన్ల కొద్దీ నిధులు వచ్చి చేరుతున్నాయి. మనకు తెలిసి ఎవరైనా చనిపోయినా తర్వాత మళ్లీ బతికి రావడం వంటివి ఫాంటసీ చిత్రాలలోనే చూస్తుంటాం.. నిజ జీవితంలో అది అసాధ్యం… కానీ దానిని సాధ్యం చేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. దీని కోసం అమెరికాకు చెందిన అల్కోర్‌ లైఫ్‌ ఎక్స్‌టెన్షన్‌ ఫౌండేషన్‌ అనే సంస్థ క్రుషి చేస్తోంది. ఈ ఫౌండేషన్‌ను 1972లో లిండా, ఫ్రెడ్‌చాంబర్‌ లైన్‌ అనే వ్యక్తులు స్థాపించారు.

జీవితంలో రెండోసారి జీవించే అవకాశాన్ని ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఇక్కడ చనిపోయిన మనుషులు భవిష్యత్తులో ఎప్పటికైనా తిరిగి బతికివస్తారనే ఆశతో జాగ్రత్తగా వారి మృతదేహాలను కాపాడుతున్నారు. జర్మనీలో ఏర్పాటు చేసిన విధంగానే ఇక్కడ కూడా క్రయో ప్రెజర్వ్‌ అనే విధానం ద్వారా చనిపోయిన వారి శరీరాలను కాపాడుతున్నారు. లిక్విడ్‌ నైట్రోజన్‌తో నిండిన స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌ ట్యాంకులో మ్రుతుల శరీరాలను ఉంచుతున్నారు. అత్యంత శీతల ఉష్ణోగ్రత వద్ద దశాబ్దాల పాటు జాగ్రత్తగా భద్రపరిచేలా ఇక్కడి ఏర్పాట్లు ఉన్నాయి.

ఈ 21వ శతాబ్దంలో టెక్నాలజీలు రాకెట్ వేగంతో దూసుకు వస్తున్నాయి. ఈ క్రమంలో పునరుజ్జీవం కూడా వాటిల్లో ఒకటి అయి ఉండే అవకాశం లేకపోలేదని వారంటున్నారు. అత్యంత సంపద కలిగినవారు తమ శరీరాలను ఈ ఆశతోనే ప్రిజర్వ్ చేయించుకుంటున్నారు. వాళ్లు భవిష్యత్తులో ఏనాటికైనా మేల్కొనేలా సాంకేతిక వైద్యం అభివృద్ధి చెందుతుందనే ఆశ వారిని ఇలా చేయిస్తోంది. అయితే ఈ ఏర్పాట్ల కోసం ఒక్క మృతదేహానికి సుమారు కోటి రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుందట. కేవలం రోగి మెదడుని మాత్రం క్రయో ప్రిజర్వ్‌ చేయాలంటే దాదాపు 65 లక్షల రూపాయలు ఖర్చవుతుందని సంస్థ తెలిపింది.

తొలిసారిగా 2015లో బ్రెయిన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న థాయ్ అమ్మాయి మాథెరిన్ నవోరాట్‌పాంగ్ మృతదేహాన్ని భద్రపరిచారు. రెండేళ్ల వయస్సులో క్రయో ప్రెజర్వ్‌ చేసిన పిన్న వయస్కురాలు ఈమె కావడం విశేషం. ఈ అమ్మాయి తల్లిదండ్రులిద్దరూ వైద్యులు, ఆమెకు మెదడుకు సంబంధించిన ఎన్నో శస్త్ర చికిత్సలు చేశారు గానీ ప్రయోజనం లేకపోవడంతో యూఎస్‌లోని అల్కోర్‌ ఫౌండేషన్‌ని సంప్రదించి క్రయో ప్రిజర్వ్‌ చేశారు. అలా బిట్‌కాయిన్‌ మార్గదర్శకుడు హాల్‌ ఫిన్నీ, 2014లో మృతి చెందిన తర్వాత క్రయో ప్రిజర్వ్‌ చేశారు.

ప్రస్తుతానికి ఈ సంస్థలో సుమారు 199 మంది మనుషులు, దాదాపు 100 పెంపుడు జంతువులను క్రయో ప్రిజర్వ్‌ చేశారు.ఇప్పటివరకు 500 మంది వ్యక్తుల శరీరాలను క్రయో ప్రిజర్వ్‌ చేయడానికి ఈ సంస్థను సంప్రదించారని చెబుతున్నారు ఫౌండేషన్‌ అధికారులు. ఇది రోజురోజుకూ పెరుగుతోందని కూడా అంటున్నారు. తమను సంప్రదించేవారికి పెద్దగా ఆశలు పెట్టడం లేదని, ఇది కేవలం ఓ ఫాంటసీ మాత్రమేనని చెప్పినా జనం అందుకు సిధ్దపడుతుండటం విశేషం. బతుకు మీద తీపి చావని వాళ్లు ఈ విధమైన పునరుజ్జీవ ప్రక్రియకు ఎంతైనా ఖర్చు చేసేందుకు ముందుకు వస్తున్నారు.

ఒకసారి జీవం కోల్పోయి మెదడు పనిచేయడం ఆగిపోయి, రక్తచలనం నిలిచిపోతే ఆ మనిషి చనిపోయినట్టు నిర్ణయిస్తారు. సాధారణంగా ప్రాణం కోల్పోయిన తర్వాత తిరిగి రావడం అసాధ్యమన్న సంగతి అందరికీ తెలిసిందే..కానీ జెనెటిక్ సైంటిస్టులు మాత్రం మరో రకంగా ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయొచ్చని అంటున్నారు. ఈ క్రమంలోనే వారు మంచు యుగం నాటి భారీ ఏనుగుల్ని మళ్లీ సృష్టిస్తామని చెప్తున్నారు. మంచు యుగం కాలంలో లారీ కంటే పెద్ద సైజు ఉన్న ఏనుగులు జీవించేవి. యూరప్ ఉత్తర అమెరికా ఉత్తర ఆసియాలో ఇవి ఎక్కువగా ఉండేవి. వీటిని మమ్మోత్ లు అని పిలిచే వారు.

ఇప్పుడున్న ఏనుగులలా కాకుండా ఇవి మంచులోనూ జీవించే సామర్థ్యంతో ఉంటాయి. మంచులో ఉంటూ.. చలిని తట్టుకునేలా వీటికి వెంట్రుకలు ఉంటాయి. ఇవి చాలా ఆకర్షణీయంగా ఉండేవి. కాగా గతించిన ఆ ఏనుగులను హైబ్రిడ్ విధానంలో తిరిగి భూమిపై సృష్టించేందుకు ఓ భారీ సైంటిఫిక్ ప్రాజెక్టు కొనసాగుతోంది. త్వరలోనే సదరు అంతరించుకుపోయిన ఏనుగులను సృష్టిస్తామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 10వేల ఏళ్ల కిందటి ఈ ఏనుగులు పున: సృష్టించడం అంటే మాటలు కాదు.. అమెరికాకు చెందిన బయోసైన్స్ అండ్ జెనెటిక్స్ కంపెనీ కొలొస్సల్ ఈ ఏనుగుల్ని తిరిగి సృష్టించే ప్రాజెక్టు కోసం 110 కోట్ల రూ.ల నిధులు సేకరించి ముందుకు సాగుతోంది. హైబ్రిడ్ మమ్మత్ లకు పునరుజ్జీవం తెచ్చేందుకుగాను తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు.

పున:సృష్టి కోసం శాస్త్రవేత్తలు ఆల్రెడీ చనిపోయిన ఏనుగుల డీఎన్ఏను సేకరించారు. ఈ డీఎన్ఏలతో కృత్రిమ ఏనుగుల కణాలు ఫలదీకరణం చెందించి హైబ్రిడ్ అండాన్ని సృష్టించాలని ప్రయత్నం..ఆ అండంతో ఆనాడు అంతరించుకుపోయిన ఏనుగులను రూపొందిస్తామంటున్నారు. కృత్రిమ గర్భం దాల్చింపజేసి ఆనాటి ఏనుగులను సృష్టిస్తామంటున్నారు. దాదాపు పది వేల ఏళ్ల కిందటి ఏనుగుల డీఎన్ఏ ఇప్పటికీ మంచులో భద్రంగా ఉండటం వల్లే శాస్త్రవేత్తలు ఈ ప్రాజెక్టుకు పూనుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి వస్తే ఇలాగే మనుషులకు కూడా తిరిగి జీవం పోయడమనే సిధ్దాంతానికి ఈ విధానం చేయూతనివ్వనుంది. ఏమో గుర్రం ఎగరా వచ్చనే అంటున్నారు ఆశావహులు.

Must Read

spot_img