తెలుగు రాష్ట్రాల్లో కోతులకు, కుక్కలకు ఏమైంది? మనుషులపై దాడులకు పాల్పడుతూ..బీభత్సం సృష్టిస్తున్నాయి. జనాలు రోడ్డు మీదకు రావాలంటేనే జంకుతున్నారు. పట్టపగలు జనారణ్యంలో కుక్కలు, కోతుల గుంపు దాడిలో ఎంతో మంది గాయపడి ఆస్పత్రిపాలు కావడం నిత్యం జరుగుతోంది. ఇంత జరుగుతున్న పరిష్కార మార్గం మాత్రం దొరకడం లేదు. ముఖ్యంగా చిన్న పిల్లలను స్కూల్ కు పాంపాలంటే తల్లిధండ్రులకు దిన దిన గండంగా మారుతుంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం కాక ఇళ్లనుంచి బయటకు రావటానికి హడలిపోతున్నారు జనాలు. అసలు ఎందుకు కుక్కలు, కోతులు మనుషులపై దాడి చేస్తున్నాయి..? ఎందుకు ఆ సీజన్ లో మాత్రమే అవి దాడులకు పాల్పడుతున్నాయి..? దీనికి సంబంధించిన కారణాలు ఏమిటి..? ఈ పశ్నలు ఇప్పుడు అందరిలో తలెత్తుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ఇదే హాట్ టాఫిక్.
అయితే ఇలాంటి సంఘటనలు ఎక్కడో మారుమూల ప్రాంతంలో, నిర్జన ప్రదేశంలోనో, అడవి ప్రాంతానికి దగ్గరలోనో జరగడంలేదు. నిత్యం జనాలు రద్దీగా ఉండే రాష్ర్ట రాజధాని హైదరాబాద్ నడిబొడ్డులో జరుగుతున్నాయి. రాష్ర్టంలోని పలు జిల్లాలలో కుక్కలతో పాటు కోతుల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. గతంలో పిచ్చికుక్కల వలన జనాలు ఇబ్బందులు పడితే ప్రస్తుతం వీధి కుక్కల వలన ఇబ్బందులు పడుతున్నారు. భాగ్యనగరంలో అనేక ప్రాంతాల్లో కుక్కలు రెచ్చిపోయి ప్రజలపై పడి కరుస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.
పెరుగుతున్న కుక్కల, కోతుల సంతతి…!
తాజాగా వీధి కుక్కల బెడద నగరంలో అధికమైంది. కుక్కలు గుంపులు, గుంపులుగా స్వైరవిహారం చేస్తూ చిన్నా పెద్ద అని తేడా లేకుండా దాడి చేస్తున్నాయి. రోడ్లపై వీధి కుక్కలు తమ సంతతిని పెంచుకుంటూ పోతున్నా…సంబధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రోడ్లమీద ప్రయాణించాలంటేనే ప్రజలు భయాబ్రాంతులకు గురవుతున్నారు.
తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, వరంగల్ రంగారెడ్డి, కామారెడ్డి, కరీంనగర్, అదిలాబాద్ జిల్లాలలో కుక్కలు, కోతుల దాడిలో చాలా మంది గాయాల పాలవుతున్నారు. రెండు రాష్ట్రాలలో కుక్కల సంతతి తీవ్రంగా పెరిగింది. గతంలో అధికారులు కుక్కలు, కోతులను బంధించి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టడం లాంటివి చేసేవారు. ప్రస్తుతం ఆ తరహ చర్యలు కనిపించడం లేదు. కుక్కలను చంపకుండా వాటి సంతతిని పెరగకుండా చేసేందుకు తగు చర్యలు తీసుకోవాల్సి ఉండగా వాటిని సైతం ఎక్కడా అమలు చేసిన దాఖాలాలు లేవు.
చిన్నారులను వణికిస్తున్న వీధి కుక్కలు..
ఇటీవల తెలుగు రాష్ట్రాలలో కుక్కల బెడద ఎక్కువైంది. మొన్న అంబర్‌పేటలో, నిన్న చైతన్యపురిలో, నేడు కరీంనగర్‌లో వీధి కుక్కల దాడులతో చిన్నారులు వణికిపోతున్నారు. ఎప్పుడు ఏ వైపు నుంచి కుక్క దూసుకొస్తుందోనని జంకుతున్నారు. తెలంగాణలో వీధి కుక్కల స్వైర విహారం రోజురోజుకు పెరిగిపోతుంది. తాజాగా అంబర్‌పేటలో కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి బలైపోయాడు. ఆ వెంటనే చైతన్యపురిలో మరో నాలుగేళ్ల బాలుడిని కుక్కలు గాయపరిచాయి.
ఇప్పుడు కరీంనగర్‌లో హాస్టల్‌లోకి చొరబడి మరీ విద్యార్థిని కరిచాయి. రాష్ట్రంలో కుక్కకాటు కేసులు ఏడాది కాలంలోనే గణనీయంగా పెరిగాయి. నాలుగేళ్ల క్రితం భారీగా ఉన్న కేసులు.. మరుసటి రెండేళ్లు తగ్గగా.. తర్వాత నాలుగో ఏడాది మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 2021లో 124 కుక్క కాట్లు సంభవించగా, 2022లో నవంబర్ నాటికే ఏకంగా 281 మందిని కుక్కలు కరిచినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ నివేదిక వెల్లడించింది. అంటే అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఏకంగా మూడురెట్లకు పైగా కుక్కకాట్లు జరిగాయి. దేశంలో కుక్కకాట్లలో తెలంగాణ 8వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో 2019లో 1.67 లక్షల కాట్లు, 2020లో 66 వేల 782 కేసులు నమోదయ్యాయి.
జంతు సంరక్షణ సమితి ఏం చేస్తుంది..?
ఇంత జరుగుతున్న జంతు సంరక్షణ సమితి ఏం చేస్తుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరోపక్క సంరక్షణ సమితి అధికారులు మాత్రం వీధి కుక్కల నియంత్రణకు స్టెరిలైజేషన్ ఒక్కటే మార్గం ఉందని అంటున్నారు. అంటే కుక్కల పునరుత్పత్తి ప్రక్రియను నియంత్రించేలా శస్త్రచికిత్సలు చేయడం. మొత్తం కుక్కల్లో ఆడకుక్కలన్నింటికీ ఒకేసారి సంతాన నిరోధక శస్త్రచికిత్సలు జరిగితేనే కుక్కల సంతతి తగ్గుతుందని చెప్తున్నారు. ఏటా వేలాది కుక్కలకు శస్త్ర చికిత్సలు చేస్తున్నట్లు ఆయా కార్పొరేషన్ల వెటర్నరీ విభాగాల అధికారులు చెపుతున్నారు.
కానీ వీరు ఇంత చేస్తే…వాటి సంతతి ఎందుకు రెట్టింపు అవుతుందని పలువురు విమర్శిస్తున్నారు. ఈ అధికారులు చెప్తున్న మాటలన్నీ డొల్ల మాటలేనని కుక్కల సంఖ్య పెరిగిపోతున్న తీరు స్పష్టం చేస్తోందని అభిప్రాయ పడుతున్నారు. ఒక్క వరంగల్ కార్పొరేషన్‌లోనే సుమారు 60 వేలకు పైగా వీధికుక్కలు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. అంటే వీళ్ల పనితీరు ఎలా ఉందో అర్థమౌతుంది.
స్టెరిలైజేషన్ కు అడ్డు చెప్తున్నస్వచ్ఛంద సంస్థలు..
గతంలో కుక్కల సంతాన నియంత్రణ కోసం ఓ ప్రైవేటు ఎన్‌జీవోకు శస్త్ర చికిత్సల బాధ్యత అప్పగించారు. ఒక కుక్కకు స్టెరిలైజేషన్ చేస్తే కార్పొరేషన్ 750 రూపాయలు చెల్లిస్తోంది. ప్రతిరోజు 20 కుక్కల వరకు పట్టుకొని ఆపరేషన్లు చేస్తున్నట్లు ఎన్‌జీవో సంస్థ చెపుతున్నప్పటికీ, వేలల్లో ఉన్న కుక్కల సంతతి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రతిరోజు 20 నుంచి 30 కుక్క కాటు కేసులు ఎంజీఎం ఆసుపత్రికి వస్తున్నట్లు తెలుస్తోంది.
కరీంనగర్, రామగుండంలలో కార్పొరేషన్ అధికారులే కుక్కల నియంత్రణకు స్టెరిలైజేషన్ చేపట్టినా, అవి ఎంతోకాలం సాగలేదు. కరీంనగర్‌లో స్టెరిలైజేషన్ పేరుతో కుక్కలను చంపుతున్నట్లు ఓ స్వచ్చంద సంస్థ పేర్కొనడంతో ఆ కార్యక్రమాన్ని నిలిపివేశారు.
ఈ విదంగా రాష్ర్టంలో పలు స్వచ్చంద సంస్థలు అడ్డుతగలడంతో ఆ కార్యక్రమాన్ని నిలివివేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వీధికుక్కల సంతతిని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పురపాలక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. జీహెచ్‌ఎంసీ మినహా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రత్యేకంగా జంతు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది.
ఇందులో భాగంగా ఇప్పటివరకు 20 జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేసిన జంతు సంరక్షణ కేంద్రాల్లో 29 వేల 789 కుక్కలకు సంతతి నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించినట్లు తెలిపింది. నగరాలు, మునిసిపాలిటీలలో ప్రజలకు ఇబ్బందిగా మారిన కుక్కలతో పాటు కోతులను కూడా ఈ సంరక్షణ కేంద్రాలకు తరలించి స్టెరిలైజేషన్ చేస్తున్నట్లు తెలిపింది.
కోతులతోను తప్పని తిప్పలు…
తెలుగు రాష్ట్రాల్లో కుక్కల బెడడతోనే సతమతమౌతుంటే వీటికి తోడు కోతుల బెడద కూడా ఎక్కువగా ఉంది. అడివిని, చెట్లను వదిలి నివాసాలపై పడుతున్నాయి. ఆహారం కోసం మనుషులపై దాడి చేస్తున్నాయి. ఒకోసారి ఇండ్లలోకి చోరబడి కంటికి కనిపించినవారిపై కూడా దాడలు చేసి గాయపరుస్తున్నాయి.
ముఖ్యంగా చిన్నారులపై ఎక్కువగా దాడులు చేసి గాయపరిచిన సంఘటనలే ఎక్కువగా ఉన్నాయి. ఆంధ్రాలోని పశ్చిమగోదావరి జిల్లాలో కోతులు కనిపిస్తేనే ప్రజలు హడలిపోతున్నారు. కాలు బయటపెట్టాలంటే భయపడిపోతున్నారు. తలుపులు బిగించుకుని ఆఖరికి కిటికీల తలుపులు కూడా లాక్ చేసుకుని ఇంటికే పరిమితమవుతున్నారు.
ఏదైనా పని ఉండి బయటకు అడుగు పెడితే చాలు ఎక్కడినుంచి వస్తున్నాయో గానీ ఒక్కసారిగా మీద పడి దాడిచేస్తున్నాయి. ఇష్టానురీతిగా కొరికేసి గాయపరుస్తున్నాయి. తాజాగా తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలోని కురవి మండలం మోదుగుల గూడెం లో ఓ చిన్నారిపై కోతులు దాడి చేశాయి. పాపను వరండాలోని ఉయ్యాలలో పడుకోబెట్టి నీళ్ల కోసం తల్లి ఇంట్లోకి వెళ్ళింది.
ఈ తరుణంలోనే కోతులు ఒకసారిగా ఆ చిన్నారిపై దాడి చేశాయి. చిన్నారి కాలి బొటనవేలును కొరికాయి. పంటపొలాలను నాశనం చేయడమే కాకుండా ఇళ్లలోకి వచ్చి నానా బీబత్సం చేస్తున్నాయని , మనుషుల ఫై దాడి చేస్తున్నాయని స్థానిక ప్రజలు వాపోతున్నారు.
దాడుల వెనకున్నా రహస్యం ఇదేనా…?
సాదారణంగా వాతావరణంలో వచ్చే మార్పల కారణంగా మనం ఆహార పద్ధతుల్లో మార్పులు చేర్పులు చేసుకుంటుంటాం. ఎండాకాలం రాగానే ఫ్రై కూరలు తగ్గించి పులుసులు ఎక్కువగా చేసుకోవడం, కొన్ని రకాల కూరగాయలు ఎక్కువగా వాడడం, మామిడి కాయలు ఎక్కువగా ఉపయోగించడం వంటివి చేస్తుంటాం.
వీటితో పాటు పండ్లు ఎక్కువగా తింటూ, నీళ్లు ఎక్కువగా తాగుతూ బాడీ డీహైడ్రేషన్ బారిన పడకుండా చూసుకుంటాం. మనకు ఉన్నట్టుగానే జంతువుల శరీరంలో కూడా సీజన్ల మార్పులు వస్తుంటాయి. దీని ప్రకారమే జంతువులు కూడా డీహైడ్రేషన్ బారిన పడుతుంటాయి. సరిగా ఆహారం లేకపోవడం, శరీరానాకి కావాల్సినంత నీరు అందకపోవడం, వంటి కారణాల వలన అవి తరుచుగా మనుషులు, పెంపుడు జంతువులపై దాడులు చేస్తుంటాయని పశు వైధ్యులు చెప్తున్నారు. మనుషులకు ఉన్నట్టుగానే జంతువులకు కూడా వేడి, ఉక్కపోత ఉంటాయి.
వాతావరణంలో వచ్చే మార్పుల వలన మనకి ఎలాగైతే కోపం, చికాకు పెరుగుతుందో అదే శునకాలకు కూడా వర్తిస్తుంది. ఈ సీజన్‌లో ఆహారం, నీరు అందకపోతే డీహైడ్రేట్ కావడంతో కూడా అవి కరుస్తాయి. దీనికి మరో కోణం కూడా ఉంది. వేసవిలో ఆరుబయట నీడనిచ్చే చెట్లు, పార్కులు వంటి ప్రాంతాల్లో ఎక్కువగా జనం సేదతీరాలనుకుంటారు. అందువల్ల కూడా ఈ సీజన్‌లో కుక్క కాట్లు పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. మరోవైపు ఈ సీజన్లో వీధి కుక్కులు ఎక్కువుగా మాంసం దుకాణాల వద్ద ఉన్న వ్యర్థాలను, చనిపోయిన జంతు కలేబరాలను తినడం వలన ఆ ఆహారం సరిగా జీర్ణం కాకపోవడంతో కూడా జంతువుల మొదడు సరిగా పనిచేయదని, దాని వలన అవి మతితప్పి ప్రవర్తిస్థాయని వైధ్యులు అంటున్నారు.