Homeజాతీయంపుతిన్ ను అనుసరిస్తున్న టర్కీ అధ్యక్షుడు కారణం ఇదేనా..!

పుతిన్ ను అనుసరిస్తున్న టర్కీ అధ్యక్షుడు కారణం ఇదేనా..!

నియంతలు ఎక్కడి నుంచో పుట్టుకురారు. వ్యవస్థలు వారిని ఆవిశ్కరిస్తాయి. ప్రజల అలసత్వం, పాలకులలో స్వార్థం నియంతలను తయారుచేస్తుంది. అంతేకాదు నియంతృత్వం బహురూపిగా ఉంటుంది. అది ఎప్పుడు ఏ రూపంలో ఉంటుందో, ఆద్యంతాలేమిటో ఎవరూ అంచనా కట్టలేరు. దాని ఉనికిని గుర్తించేలోపే అది అందరినీ ముంచేస్తుంది.

మూడు దశాబ్దాల క్రితం సోవియెట్‌ యూనియన్‌ పతనమైనప్పుడు కాలక్రమంలో ఆ శిథిలాల్లోంచి పుతిన్‌ పుట్టు కొస్తాడనీ, మున్ముందు ప్రపంచానికి కొరకరాని కొయ్యగా మారతాడనీ యూరప్‌ దేశాలు అనుకోలేదు. అసలు ఏమాత్రం తెలియని కిమ్ జాంగ్ ఉన్ నార్త్ కొరియాలో పుట్టుకొస్తాడని దేశాన్ని నిరంకుశంగా పాలిస్తాడని ఎవరూ అనుకోలేదు. గతించిన కాలంలో హిట్లర్, ఈడీ అమిన్, కల్నల్ గఢాఫీ, సద్దాం హుస్సెయిన్, సిరియా అధ్యక్షుడు భషర్ అల్ హసద్..బాటలో ఇప్పుడు పుతిన్ చైనాలో షీ జిన్ పింగ్, ఇప్పుడు మరో నియంత కూడా నేనున్నానని సైగలు చేస్తున్నాడు.

ఆయనెవరో కాదు..రిసెప్ తయీప్ ఎర్డొగన్. టర్కీ విషయంలోనూ ఇప్పుడదే జరుగుతోంది. గత కొన్నేళ్లుగా టర్కీ అధ్యక్షుడు రిసెప్‌ తయీప్‌ ఎర్డోగాన్‌ విపరీత పోకడలు పోవడం కనబడుతూనే ఉంది. టర్కీ ప్రస్తుతం నాటో కూటమిలో ఒక దేశమే అయినా యూరొపియన్‌ యూనియన్‌ పట్టనట్టు ఉంటోంది. ఇప్పుడు ఆయన అచ్చంగా పుతిన్‌ను అనుకరిస్తున్న వైనం కళ్లకు కట్టినట్టుగా కనబడుతోంది.

ఇస్తాంబుల్‌ మేయర్‌గా 2019లో ఎన్నికైన రిపబ్లికన్‌ పీపుల్స్‌ పార్టీ ‘సీహెచ్‌పీ’ నాయకుడు ఎక్రెమ్‌ ఇమామోలును ఎర్డోగాన్‌ ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఎన్నికల అధికారులను దూషించారన్న ఆరోపణతో ఇమామోలుకు గురువారం న్యాయస్థానం రెండేళ్ల ఏడునెలల జైలు శిక్ష విధించింది. వచ్చే ఏడాది జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో ఆయన తనకు బలమైన ప్రత్యర్థి అవుతారన్న భయంతోనే ఎర్డోగాన్‌ పావులు కదిపి ఈ శిక్ష పడేలా చేశారు.

దేశంలో ఎన్నికల ప్రక్రియను పర్య వేక్షిస్తున్న ఉన్నత స్థాయి ఎన్నికల బోర్డు అధికార పక్షం చెప్పినట్టల్లా తలూపడం రివాజైంది. ఇటీవల కింది కోర్టులు సైతం అధికార పక్షం అభీష్టానికి అనుకూలంగా తీర్పులివ్వటం మొదలుపెట్టాయి. ఇస్తాంబుల్‌ మేయర్‌ ఎన్నిక వ్యవహారం ఆసక్తికరమైనది. 2019 మార్చిలో ఆ పదవికి జరిగిన ఎన్నికల్లో ఇమామోలు స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. దీన్ని జీర్ణించుకోలేని ఎర్డోగాన్‌ ప్రభుత్వం ఆ ఎన్నిక రద్దయ్యేదాకా నిద్రపోలేదు.

చివరకు అదే ఏడాది జూన్‌లో మరోసారి ఎన్నికలు నిర్వహిం చారు. ఈసారి ఇమామోలు ఏకంగా 8 లక్షల ఓట్ల మెజారిటీతో అధికార పక్ష అభ్యర్థిని చిత్తుచేశారు. రాజకీయంగా తన ఎదుగుదలకు మూలకారణమైన చోట ఎన్ని ఎత్తులు వేసినా ప్రత్యర్థి మేయర్‌ కావటం ఆయనకు కంటగింపైంది. ఇస్తాంబుల్‌ నగరం దేశానికి ఆర్థికంగా ఆయువు పట్టు. స్థూల దేశీయోత్పత్తిలో దాని వాటా 40 శాతం.

అందుకే ఎర్డోగాన్‌ ప్రభుత్వం మేయర్‌ అధికారాలను కత్తి రించి, అడుగడుగునా ఇమామోలుకు అడ్డుపడటం మొదలెట్టింది. ఇది చాలదన్నట్టు అధికారులను దూషించారన్న అభియోగం నమోదైంది. 2019 మార్చి ఎన్నిక రద్దు చేసిన అధికారులు బుద్ధిహీను లని అప్పట్లో ఇమామోలు వ్యాఖ్యానించారు. విధి నిర్వహణలో ఉన్న అధికార గణాన్ని ఇలా అనటం నేరమన్నది సర్కారు అభియోగం.

తాజాగా ఈ కేసులో పడిన శిక్షను ఉన్నత న్యాయస్థానం ధ్రువీక రిస్తే అధ్యక్ష ఎన్నికలతో సహా ఏ ఎన్నికలోనూ ఇమామోలు అభ్యర్థిగా నిలబడలేరు. ఓటేసే హక్కు కూడా కోల్పోతారు. ఇప్పటికే సీహెచ్‌పీ పార్టీకి చెందిన మరో నేతకు ఇదే రకమైన శిక్షపడింది. టర్కీ జాతిపిత ముస్తఫా కెమెల్‌ అటాటుర్క్‌ నెలకొల్పిన సెక్యులర్‌ వ్యవస్థనూ, సంక్షేమ రాజ్య భావననూ 2003లో అధికారంలోకి రాగానే ఎర్డోగాన్‌ ధ్వంసం చేశారు.

నయా ఉదారవాద విధానాలను చకచకా అమలుచేశారు. ఆ విధానాల పర్యవసానంగా అంతవరకూ ఒడిదుడుకుల్లో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ బలపడిన మాట నిజమే. వృద్ధి రేటు 9 శాతం దాటింది. కానీ సంపదంతా గుప్పెడుమంది సంపన్నుల చేతుల్లో కేంద్రీకృతమైంది. అవినీతి ఆకాశాన్నంటింది. అటుపై 2008 ఆర్థిక మాంద్యం తీవ్రంగా దెబ్బతీసింది. వృద్ధిరేటు 3 శాతానికి దిగజారింది. ఆ తర్వాత ఇస్లామిక్‌ భావజాల పరి రక్షకుడిగా ఎర్డోగాన్‌ అవతారమెత్తారు.

ఒకపక్క ఈయూలో భాగస్వామిగా ఉంటూనే అందులోని భాగస్వామ్య దేశాల వల్ల ప్రమాదం ముంచుకొస్తున్నదని ఊదరగొట్టడం ఆయన ప్రత్యేకత. కుర్దులను దేశానికి శత్రువులుగా చిత్రీకరించి వారి ప్రాంతాలపై వైమానిక దాడులు చేయటం, పెను ముప్పును నివారించినట్టు స్వోత్కర్షలకు పోవటం అలవాటు.

ఇస్లామిక్‌ సిద్ధాంతాలు అవలంబిం చకపోతే దేశం నాశనమవుతుందని ఒకపక్క, ఐఎస్‌ ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచివుందని మరోపక్క ప్రచారం చేస్తూ 2015 నవంబర్‌ అధ్యక్ష ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. అటుపై సైనిక తిరుగుబాటు డ్రామాను నడిపి తన పాలనను మరింత సుస్థిరం చేసుకున్నారు. ఇలా ఎప్పటి కప్పుడు జనం భావోద్వేగాలు రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటూ వస్తున్న ఎర్డోగాన్‌ను 2019 ఇస్తాంబుల్‌ మేయర్‌ ఎన్నిక ఊహించని రీతిలో దెబ్బతీసింది. టర్కీలో దాదాపు అన్ని రంగాలూ ఇప్పటికే దెబ్బతిన్నాయి. నిర్మాణ రంగం తిరిగి లేవనంతగా కుదేలైంది.

అన్ని రకాల సరఫరాలూ కోలుకోలేనంతగా దెబ్బతిన్నాయి. ఆహారం, ఇంధనం ధరలు ఆకాశాన్నంటి ద్రవ్యోల్బణం 170 శాతం వరకూ పోయిందని ఆర్థికవేత్తల అంచనా. ఇలాంటి సమయంలో ఎర్డోగాన్‌ను ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న దురాక్రమణ యుద్ధం ఒకవిధంగా ఆదుకుంది. ఈయూకూ, పుతిన్‌కూ ఏర్పడ్డ విభేదాలను తెలివిగా సొమ్ము చేసుకుని లాభపడుతున్న ప్రపంచ నేతల్లో ఎర్డోగాన్‌ ఒకరు. ఎంతకాలం ఇలాంటి ఎత్తుగడలతో నెట్టుకొస్తారన్నది చూడాల్సి ఉంది. తనకు 2023 అధ్యక్ష ఎన్నికలే ఆఖరివని ఎర్డోగాన్‌ చెబుతున్నారు.

ఆయన ఈసారి గెలిస్తే భవిష్యత్తులో ఇక ఎన్నికలే ఉండవని విపక్షాలు భాష్యం చెబుతున్నాయి. పొరుగున పుతిన్‌ చేసిందేమిటో గమనిస్తే ఇలా అనటంలో వైపరీత్యమేమీ లేదు. మరో పుతిన్‌లా తయారై దేశంలో రాజకీయ ప్రత్యర్థులను సమాధి చేస్తున్న ఎర్డోగాన్‌ను నియంత్రించటంలో విఫలమైతే, చూసీచూడనట్టు వదిలేస్తే స్వీయ వినాశనం కొనితెచ్చుకున్నట్టేనని ఇప్పటికైనా ఈయూ గుర్తించటం మంచిదని అంటున్నారు విశ్లేషకులు.

టర్కీ అనే పేరు ఇక్కడ టర్కిష్ ప్రజలు నివసించిన కారణంగా వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నారు. 8వ శతాబ్దంలో మొదటిసారిగా మద్య ఆసియాలో కనిపించిన శిలాశాసనాలలో గోక్టర్క్స్ అనే పేరు ఆధారంగా టర్కీ అనేపేరు మొదటిసారిగా నమోదు అయిందని భావిస్తున్నారు. ఇప్పుడు టర్కీని తుర్కియో అని మార్చడం జరిగింది.

టర్కీ ఆర్థికరగంలో అదనంగా బ్యాంకింగ్, నిర్మాణరంగం, హోం అప్లయంసీస్, ఎలెక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, ఆయిల్ రిఫైనింగ్, పెట్రో కెమికల్ ప్రొడక్ట్స్, ఫుడ్, మైనింగ్, ఇరన్ అండ్ స్టీల్, మెషిన్ ఇండస్ట్రీ ప్రధానమైనవిగా ఉన్నాయి. 2010లో వ్యవసాయరంగం నుండి 9% జి.డి.పి లభించింది. ఇండస్ట్రియల్ రంగం నుండి 26% జి.డి.పి లభించగా సేవారంగం నుండి 65% లభించింది.అయినా వ్యవసాయరంగం 25% ఉపాధి సౌకర్యం కల్పిస్తుంది.

2012లో స్త్రీ ఉద్యోగుల శాతం 30% ఉంటుందని అంచనా. అత్యంత కీలకమైన ప్రాంతంలో ఉన్నందున అన్ని దేశాలకుకీలకంగా తుర్కియే ఎదిగిందనడంలో సందేహం లేదు. అయితే ఇప్పుడు మళ్లీ నియంత్రుత్వంలోకి వెళుతుండటం అక్కడి ప్రజలకు ఆందోళనకు దారితీస్తోంది.

Must Read

spot_img