- ఏపీలో కేసీఆర్ టార్గెట్ ను .. తెలంగాణలో ఆయనపైనే ప్రయోగించేందుకు జనసేనాని సిద్ధం అవుతున్నారా..?
- వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేస్తానని చెప్పడం వెనుక ..పవన్ వ్యూహం ఏమిటన్నదే ఆసక్తికరంగా మారింది.
కేంద్రంలో బీజేపీ టార్గెట్‌గా జాతీయ రాజకీయాలు ప్రారంభించిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చారు. ఇటీవలే ఖమ్మంలో ఆవిర్భావ సభ నిర్వహించారు. అయితే పార్టీ విస్తరణ పేరుతో వివిధ రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలతో కుదిరితే పొత్తు.. కాదంటే టార్గెట్ చేయాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో ఏపీలో అధికార వైసీపీపై దూకుడుగా పోరాడుతున్న జనసేనను కేసీఆర్ టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది.

బీఆర్‌ఎస్ పార్టీ ఏపీలో కాపు సామాజికవర్గాన్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. తోట చంద్రశేఖర్ చేరిక.. తెలంగాణ సీఎస్ ఎంపిక అన్నీ ఈ కోణంలోనే జరిగాయంటున్నారు. ఇది పవన్ కల్యాణ్‌ను బలహీనపర్చడానికేనన్న ప్రచారం జరుగుతోంది. కాపుల ఓట్లను చీల్చడం ద్వారా టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ పవన్ కు ప్రయోజనం లేకుండా చేయాలని, జగన్‌కు మేలు చేయాలన్నది కేసీఆర్ ఎత్తుగడ అని అంటున్నారు.
ఈ క్రమంలో జనసేనాని పవన్ కల్యాణ్ తెలంగాణలో అడుగు పెడుతున్నారు. తెలంగాణ అసెంబ్లీలో 10 మంది జనసేన ఎమ్మెల్యేలు ఉండాలని భావిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 30 నుంచి 35 అసెంబ్లీ స్థానాల్లో, 7 నుంచి 14 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. దీంతో తెలంగాణలో పోటీపై పవన్ క్లారిటీ ఇచ్చారు.
ఇదే సమయంలో కలిసివచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని ప్రకటించారు. ఆంధ్రాలో కేసీఆర్ ఎలా అయితే కాపులను టార్గెట్ చేశారో.. తెలంగాణలో అత్యధిక సామాజికవర్గం ఉన్న మున్నూరు కాపులను టార్గెట్ చేయాలని జనసేనాని భావిస్తున్నారు.
తెలంగాణలో మున్నూరు కాపు సామాజికవర్గం ఓట్లు ఎవరికి వస్తే గెలుపు వారి వెంట ఉంటుందని చెబుతుంటారు. అందుకే పవన్ ఇటీవలి కాలంలో మున్నూరు కాపులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏపీ కాపు నేతలను ఆకర్షించడం వెనుక కూడా తెలంగాణలో ఆ వర్గాన్ని ఆకట్టుకోవాలన్న వ్యూహం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
ఈ క్రమంలో ఏపీలో తనను బలహీనపర్చేందుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్‌ను తెలంగాణ కాపు సామాజికవర్గం ఓట్లను తమ పార్టీకి ఆకర్షించి.. కౌంటర్ ఇవ్వాలని జనసేనాని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో ఎవరినో దెబ్బ కొట్టడానికి.. తాను ప్రధాని కావాలన్న కల నెరవేర్చుకోవడానికి ఇతరులను ముంచాలని కేసీఆర్ చూస్తున్నారట.
- ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్‌ఎస్ పార్టీ విస్తరణపై దృష్టిపెట్టిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. అక్కడి కాపు నేతలను టార్గెట్ చేశారు..
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి మేలు చేయాలన్న లక్ష్యంతో అక్కడ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న.. ప్రజాదరణ చూరగొంటోన్న, వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పోరాడుతున్న జనసేనను బలహీనపర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్‌ఎస్ పార్టీ విస్తరణపై దృష్టిపెట్టిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. అక్కడి కాపు నేతలను టార్గెట్ చేశారు. కాపులు ఎవరికి మద్దతు ఇస్తే ఆ పార్టీ ఏపీలో అధికారంలోకి వస్తుంది.
2014 ఎన్నికల్లో కాపులు టీడీపీకి మద్దతు ఇచ్చారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి అండగా నిలిచారు. తాజాగా కాపులు అధికార పార్టీకి దూరమవుతున్నారు. క్రమంగా జనసేనకు మద్దతు తెలుపుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి రావడం ఖాయమన్న అభిప్రాయం ఏపీలో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో వైసీపీని మరోమారు అధికారంలోకి తీసుకొచ్చేందుకు.. జనసేనను దెబ్బ కొట్టేందుకు కేసీఆర్ కాపులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే కాపునేత తోట చంద్రశేఖర్‌తోపాటు పలువురు కాపు సామాజిక వర్గ నేతలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. తద్వారా తమ పార్టీ ఏపీలో కాపులకు ప్రాధాన్యం ఇస్తుందన్న సంకేతం ఇచ్చారు. దీంతో కేసీఆర్ వ్యూహానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతివ్యూహం రచిస్తున్నారు.
ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లుగా ఏపీలో ఎలాగైతే సామాజిక వర్గాల వారీగా జనసేనను దెబ్బతీయాలని చూస్తున్నారో .. అదే కుల రాజకీయం ద్వారా తెలంగాణలో కేసీఆర్‌కు ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని చూస్తున్నారు. తెలంగాణలో కూడా మున్నూరు కాపులు మద్దతు ఇచ్చిన పార్టీలే అధికారంలోకి వస్తాయన్న అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంతో కాపు సామాజిక వర్గానికి చెందిన జనసేనాని తెలంగాణలో కాపులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పటికే మెగా ఫ్యామిలీకి తెలంగాణ కాపుల్లో మంచి పట్టు ఉంది. వేములవాడలో కాపు సంఘ భవనం ప్రారంభోత్సవానికి మెగా కుటుంబం ఆర్థికసాయం కూడా చేసింది. అన్ని జిల్లాలో, అన్ని నియోజకవర్గాల్లో కాపులు ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేసేస్థాయిలో ఉన్నారు.
ఈ నేపథ్యంలో కేసీఆర్ వేసిన ఎత్తుగడతోనే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను చిత్తు చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణలో ఏడు నుంచి 14 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తాం. ఎవరైనా పొత్తుకు వస్తే సంతోషమే. ఎప్పుడు బీజేపీ నాకు దోస్తే” అని చెప్పారు.
- టీఆర్ఎస్ కాస్తా బీఆర్‌ఎస్‌గా మారడంతో తెలంగాణలో ఇతర పార్టీలు తమ యాక్టివిటీని పెంచుతున్నాయి..
ఇన్నాళ్లూ ఇక్కడ అంతగా యాక్టివ్‌గా లేని టీడీపీ.. ఇప్పుడు తన కార్యకలాపాల్లో జోరు పెంచింది. జనసేన పార్టీతో కలిసి రాష్ట్ర రాజకీయాల్లో ముందుకు వెళ్లాలని చూస్తున్నది. ఇప్పటికే చంద్రబాబు ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించి తెలంగాణలో తమ పార్టీకి ఇంకా పట్టు ఉందని చెప్పుకునే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వరకు ఆయన రోడ్ షో కూడా చేపట్టారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా పవన్ కల్యాణ్ ఇప్పటికే రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలకు కో ఆర్డినేటర్లను నియమించారు. రెండు పార్టీలు కలిసి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీకి రెడీ అవుతున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. వీరిద్దరి భేటీలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులతో పాటు తెలంగాణ రాజకీయాలపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లో రెండు పార్టీలకు మంచి ఆదరణ ఉంటుందని చంద్రబాబు, పవన్ అంచనాకు వచ్చినట్టు సమాచారం. టీడీపీకి ఉన్న కేడర్‌కు పవన్ కల్యాణ్ మేనియా కూడా తోడైతే తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీల శక్తిగా అవతరించవచ్చనే ఆలోచనలో ఇద్దరు నేతలు ఉన్నారు.
ఈ ఏడాదే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతుండటంతో అన్ని నియోజకవర్గాలపై వీళ్లు ఫోకస్ పెంచారు. కేసీఆర్ తమ పార్టీ పేరు బీఆర్‌ఎస్‌గా మార్చుకోవడంతో తెలంగాణవాదాన్ని, ఇక్కడ ఏపీ నేతలకు ఏం పని అని ఎదురు ప్రశ్నించే అవకాశాన్ని కోల్పోయారు. తెలంగాణ వాదాన్ని వదులుకున్న కేసీఆర్ ఏపీ రాజకీయాల్లోకి వస్తే అభ్యంతరం ఏముంటుందని మీడియా అడిగిన ప్రశ్నకు పవన్ కల్యాణ్ సమాధానమిచ్చారు.
కేసీఆర్ ఏపీ రాజకీయాల్లోకివ వచ్చినట్టే తాము తెలంగాణ పాలిటిక్స్‌లోకి ఎంటర్ కానున్నట్టు పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. 2014లో టీడీపీ నుంచి 15 మంది ఎమ్మెల్యేలుగా గెలిచినా.. చివరికి ఇద్దరే మిగిలారు. 2018 ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచినా ఆ తర్వాత ఆ ఇద్దరు గులాబీ గూటికి చేరారు. టీడీపీ ఇక ఏపీకే పరిమితం అనుకుంటున్న టైంలో కేసీఆర్ బీఆర్ఎస్కు పురుడుపోయడంతో టీడీపీకి రాష్ట్రంలో మళ్లీ అవకాశం దక్కినట్లయింది.
ఇలా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. అందుకే తెలంగాణలో సొంతంగా పోటీ చేయడం కన్నా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌తో జట్టుకడితే ఎక్కువ ప్రయోజనం ఉంటుందనే అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.
మరి పవన్ .. కేసీఆర్ కు ఏమేరకు చెక్ చెబుతారన్నదే ఆసక్తికరంగా మారింది..