HomePoliticsమాజీల మధ్య రాజీ కుదిరినట్లేనా.. ?

మాజీల మధ్య రాజీ కుదిరినట్లేనా.. ?

  • ఆ తాజా, మాజీల మధ్య రాజీ కుదిరినట్లేనా ?
  • ఇన్నాళ్లూ ఓ రేంజ్ లో సాగిన వారి పోరుకు ఇక చెక్ పడ్డట్లేనా ?
  • ఇద్దర్నీ కాంప్రమేజ్ చేయడానికి ఓ ఎమ్మెల్యే రాయబారానికి దిగారా ?
  • మరి ఎవరా నేతలు ?
  • ఎక్కడా ఈ గొడవలు ?

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. మళ్ళీ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం లోకి రావాలి. అన్ని నియోజకవర్గాల్లో గులాబీ జెండా రెపరెపలాడాలి. అందుకు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ మొదలెట్టాలి. ఎమ్మెల్యేలంతా ఎన్నికల దాకా నియోజకవర్గాల్లోనే పాగా వేయాలి.. ఇది గులాబీ బాస్ తన టీమ్ కు ఇంటర్నల్ గా పదే పదే జారీ చేస్తున్న ఆదేశాలు అన్నది అందరికీ తెలిసిందే.

ఇక బీఅర్ఎస్ సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ప్రత్యర్ధి పార్టీలను ఎదుర్కోవడం లాంటి ఎత్తులు పక్కన పెడితే, సొంత పార్టీ నేతలతో పోరును తట్టుకుని నిలబడడం ఇప్పుడు పవర్ లో ఉన్న ఎమ్మెల్యేలకు పెద్ద సవాల్ గా మారింది. దీంతో ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న సామెత మాదిరిగా తయారైంది ఎమ్మెల్యేల పరిస్థితి. ఇప్పటికే చేయి దాటిన అసమ్మతులను దారికి తేవడం వారికి తలకు మించిన భారంగా మారింది. దీంతో కొన్ని సెగ్మెంట్లలో పరిధి దాటిన ఆసమ్మతులను బుజ్జగించేందుకు ఏకంగా బాస్ స్వయంగా రంగంలోకి దిగారని సమాచారం.

అంతేగాక అసమ్మతులు సైడ్ ట్రాక్ లోకి వెళ్లకుండా కొంత మంది అగ్రనేతలను రాయబారులుగా పంపుతున్నారని టాక్. అందులో భాగంగానే అధికార పార్టీ నేతల పోరుకు కేరాఫ్ అడ్రస్ గా మారిన నకిరేకల్ సెగ్మెంట్ లో… ఓ ఎమ్మెల్యేను రాయబారిగా దింపినట్టు నల్గొండ జిల్లాలో తెగ చర్చ జరుగుతోంది. కాగా వారి మధ్య చర్చలు ఏ మేరకు ఫలించాయనేదానికన్నా .. ఈ మధ్యవర్తిత్వం .. టాపిక్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.

నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ నుంచి కారెక్కిన విషయం తెలిసిందే. ఇగ ఆయన ఎప్పుడైతే కారెక్కారో…అప్పుడు మొదలైంది కారుపార్టీలో అసలు పంచాయితీనట. మొదటి నుంచి పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశానికి, తాజా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ల మధ్య టగ్ ఆఫ్ వార్ షురూ అయింది.

వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు ఏ రేంజ్ లో సాగిందంటే, పచ్చి గడ్డి వేయకున్నా మండేంతగా, చలి కాలంలో కూడా 50 డిగ్రీల టెంపరేచర్ లో హాట్ హాట్ గా మారిపోయింది. దీంతో వీరిద్దరి పాలిటిక్స్ కు నకిరేకల్ లో బీఆర్ఎస్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. కేడర్ కూడా రెండు గ్రూపులై పోయింది. ఇంకేముంది.. వీలు దొరికితే చాలు .. ఇరు నేతల అనుచరులు కయ్యానికి కాలు దువ్వడం కామన్ గా మారిపోయింది.

వీరి రాజకీయాలు .. కేడర్ మాత్రమే కాదు .. స్థానికంగా కూడా చర్చనీయాంశంగా మారాయి. పార్టీ కార్యక్రమాల నుంచి ఏ అవకాశం దొరికినా, ఎవరికి వారే అన్నట్లుగా నిర్వహిస్తుండడంతో, అసమ్మతి భారీగా పెరిగిపోయింది.

  • ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే వీరేశంతో ప్రెసెంట్ ఎమ్మెల్యే లింగయ్యకు అస్సలు పొసగడం లేదు.

ఈ గొడవ చాలదన్నట్లుగా నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో కూడాలింగయ్యకు అస్సలు పడడం లేదు. భూపాల్ రెడ్డి టిడిపిలో ఉన్న హయాంలోనే లింగయ్యతో విభేదాలు ఉండేవని, ఆయన బీఆర్ఎస్ లో చేరినా పోరు కంటిన్యూ అవుతూనే ఉందని టాక్ వినిపిస్తోంది. కాగా భూపాల్ రెడ్డి సొంత సెగ్మెంట్ నకిరేకల్ నియోజకవర్గం కావడంతో, ఇప్పుడు లింగయ్యకు ఆయన తో రాజీ అనివార్యంగా మారిందట.

ఎందుకంటే భూపాల్ రెడ్డి సొంత మండలం చిట్యాల కాగా, ఆయనకు నార్కట్ పల్లి మండలాల్లో మంచి పట్టుంది. అందులోనూ భూపాల్ రెడ్డి, వీరేశం ల మధ్య మంచి రిలేషన్ షిప్ ఉంది. ఇప్పటికీ భూపాల్ రెడ్డి అనుచరవర్గమంతా వీరేశం కోసం పనిచేస్తోంది. ఈ పరిస్థితుల్లో వీరితో గ్యాప్ పెంచుకుంటే .. తన మనుగడకే ప్రమాదమని గ్రహించారో ఏమో గానీ ప్రస్తుతం భూపాల్ రెడ్డికి దగ్గరయ్యారు లింగయ్య.

ఈగోలు పక్కన బెట్టి భూపాల్ రెడ్డితో చేయి కలిపారు. ఇక సెగ్మెంట్లో అసమ్మతి నేతగా ఉన్న వేముల వీరేశంతోనూ దోస్తీ చేస్తే, వచ్చే ఎన్నికల్లో నకిరేకల్ లో గెలుపుకు తిరుగుండదని భావించిన చిరుమర్తి లింగయ్య .. వీరేశం తో రాజీకి రాయబారాలు పంపారని సమాచారం. ఇదిలా ఉంటే, మరోవైపు ప్రస్తుతం నకిరేకల్ టికెట్ తనదేనన్న ధీమాతో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఉన్నారు.

సిట్టింగ్ లకే సీట్లు అన్న కేసీఅర్ ప్రకటనతో ఎమ్మెల్యే చిరుమర్తి కూడా అదే ధీమాతో ఉన్నారు.దీంతో ఇరువర్గాల మధ్య టిక్కెట్ రేసు ఓ రేంజ్ లో ఉందన్నది అందరికీ తెలిసిందే. అయితే గులాబీ బాస్ సూచనల మేరకు సొంత పార్టీలో అసమ్మతికి బ్రేక్ వేయకుంటే, ఓటమి తప్పదని అటువంటి పరిస్థితి తలెత్తితే, ప్రత్యర్థులకు ఛాన్స్ ఇచ్చినట్లేనని హైకమాండ్ వార్నింగ్ లతో .. సర్దుబాటు, బుజ్జగింపులకు నేతలు దిగుతున్న విషయం తెలిసిందే.

దీంతో టికెట్ల మాట ఎలా ఉన్నా, ప్రత్యర్థులకు అస్త్రం కాకుండా కారులో పోరుకు చెక్ పెట్టాలనేది చిరుమర్తి లింగయ్య భావనగా తెలుస్తోంది. సెగ్మెంట్లో అసమ్మతిని కంట్రోల్ చేసుకోగలిగితేనే, టిక్కెట్ అన్నది అర్థం కావడంతో, ముందుగా సెగ్మెంట్ ను సెట్ చేసుకోవాల్సిన పరిస్థితి లింగయ్యకు అనివార్యంగా మారింది. దీంతో ఇప్పటికే ముందస్తు టాక్ వెల్లువెత్తుతున్న వేళ .. దిద్దుబాటు చర్యలకు దిగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ముందుగా కంచర్లతో దోస్తీ కుదుర్చుకున్న లింగయ్య .. ఇప్పుడు తన శత్రువైన వేముల దిశగా పావులు కదుపుతున్నారని తెలుస్తోంది.

  • నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి నివాసం లో భేటీ..

ఆ క్రమంలోనే వీరేశం మిత్రుడైన నల్గొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డితో రాయబారం పంపినట్టు సమాచారం. తాజాగా నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి నివాసం లో భేటీ అయ్యారు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. కాగా ఈ మధ్య భూపాల్ రెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. పరామర్శ పేరుతో లింగయ్య సుమారు రెండు గంటల పాటు భూపాల్ రెడ్డితో చర్చలు జరిపారట. అది పేరుకే పరామర్శ కార్యక్రమమని, తెర వెనక కథ వేరే అని టాక్ వెల్లువెత్తింది.

వీరేశం తో రాజీ కుదుర్చేందుకు ఇదే సరైన సమయంగా లింగయ్య భావిస్తున్నారట. ఆ క్రమంలోనే ఆ పనిని భూపాల్ రెడ్డికి అప్పజెప్పారని సమాచారం. దీనికి సానుకూలంగా స్పందించిన భూపాల్ రెడ్డి .. వీరేశంతో సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. అయితే అటు వీరేశం నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చిందనేదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఇక నల్గొండ జిల్లాలో మాత్రం తాజాగా సరికొత్త ప్రచారం జరుగుతోంది.

నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇద్దరూ కలిసి పోయారని, టికెట్ విషయంలోనూ ఇద్దరూ ఒక్కతాటిపైకి వచ్చారని ప్రచారం ఓ రేంజ్ లో నడుస్తోంది. కానీ తాజా, మాజీలు కానీ, వారి వారి అనుచరులు గానీ ఈ వార్తలను కొట్టి పారేస్తున్నారు. నేతలు కూడా రాజీ విషయంలో ఓపెన్ కాకపోవడంతో అసలేం జరుగుతుందోనన్న చర్చ సెగ్మెంట్ వ్యాప్తంగా వెల్లువెత్తుతోంది.

ఏదేమైనా .. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నల్గొండ జిల్లాలో వెరైటీ రాజకీయాలు షురూ అయినట్టే కనిపిస్తోంది. బద్ద శత్రువులు మిత్రులుగా మారుతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజా, మాజీలిద్దరూ ఒక్కటైతే, టిక్కెట్ రేస్ పరిస్థితి ఏమిటన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరిలో ఎవరికి టిక్కెట్ దక్కనుందన్నదే కాక .. ఒకరి గెలుపుకు మరొకరు సహకరిస్తారా అన్నదీ చర్చనీయాంశంగా మారింది.

దీనిపై నేతలిద్దరూ సైలెంట్ గా వ్యవహరిస్తుండడంతో, జిల్లావ్యాప్తంగానూ హాట్ హాట్ చర్చలు కాక రేపుతున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కేసీఆర్ హామీ
ఇచ్చినట్లు లింగయ్యకే దక్కితే, వేముల మద్ధతిస్తారా అన్నది రచ్చ చేస్తుంటే, ఒకవేళ వేములకు కేటాయిస్తే, లింగయ్య ఏం చేస్తారన్నదీ ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

మరి వీరిద్దరూ నిజంగా ఒక్కటైతే, టికెట్ కోసం ఎవరు త్యాగం చేస్తారన్నదే హాట్ టాపిక్ గా మారింది..

Must Read

spot_img