Homeఅంతర్జాతీయంవర్క్ ఫ్రమ్ హోమ్‌ కల్చర్ ఇక ముగిసినట్టేనా..?

వర్క్ ఫ్రమ్ హోమ్‌ కల్చర్ ఇక ముగిసినట్టేనా..?

కరోనా పుణ్యమా అని ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది..అయితే..కరోనా తగ్గుముఖం పట్టడంతో కంపెనీలు ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు వచ్చి విధులు నిర్వహించాలని కోరుతున్నాయి. కానీ..మెజార్టీ ఉద్యోగులు మాత్రం ఆఫీసులకు వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదని పలు సర్వేలు చెబుతున్నాయి..ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలలో మినహా..మిగిలిన దేశాల్లో కరోనా తగ్గుముఖం పట్టింది.. సాధారణ పరిస్థితులు వచ్చాయి.. కొందరు ఉద్యోగులు ఆఫీసులకు వెళ్తుండగా..మరికొందరు మాత్రం ఇంకా వర్క్ ఫ్రమ్ లోనే విధులు నిర్వహిస్తున్నారు..దీంతో..వర్క్ ఫ్రమ్ హోమ్‌ కల్చర్ ఇక ముగిసినట్టేనా..? లేదా అనే చర్చ జరుగుతోంది..

కరోనా వ్యాప్తి సమయంలో చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ లో విధులు నిర్వహించారు.. అయితే.. కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ.. చాలా మంది ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కే ఆసక్తి చూపిస్తున్నారు. కొవిడ్‌ తగ్గిపోయి సాధారణ పరిస్థితులు వచ్చినప్పటికీ చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్‌ హోమ్‌కే మొగ్గు చూపుతున్నారు. కంపెనీలు కూడా ఎటూ తేల్చుకోలేక పోతున్నాయి. ఈ ఆప్షన్‌ ఉంచాలా తీసేయాలా అన్న సందిగ్ధంలో పడ్డాయి. అప్పటికీ కొన్ని సంస్థలు ఈ ఆప్షన్‌ను తొలగించాయి. మరి కొన్ని హైబ్రిడ్ మోడల్‌ను అనుసరిస్తున్నాయి. దీనిపై ఓ ఆసక్తికర సర్వే వెలుగులోకి వచ్చింది.

గాలప్ రీసెర్చ్ స్టడీ ప్రకారం…పాండెమిక్‌ తరవాత కేవలం 9% మంది మాత్రమే ఆఫీస్‌ లకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. 32% మంది వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కే ఓటు వేస్తున్నారు. 59% మంది హైబ్రిడ్‌ మోడల్‌కు ఓకే చెప్పారు. అయితే..హైబ్రిడ్ వర్క్‌ మోడల్‌లో ఎన్ని రోజులు ఆఫీస్‌కు రావాలన్న క్లారిటీ కొన్ని కంపెనీలు ఇవ్వడం లేదు. ఉద్యోగులే తమ వీలు ప్రకారం ఆఫీస్‌లకు వెళ్తున్నారు. అయితే…మేనేజర్‌లకు ఇప్పుడు కొత్త తలనొప్పి పట్టుకుంది. చాలా మంది ఎంప్లాయిస్ ఆఫీస్‌ కు వచ్చి పని చేసేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ప్రొడక్టివిటీ తగ్గిపోతుందని ఎంతగా చెబుతున్నా పట్టించుకోవడం లేదు. పైగా ఒత్తిడి చేస్తే కంపెనీ మారిపోతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే ప్రొడక్టివిటీ తగ్గుతుందన్న వాదనను కొట్టి పారేస్తున్నారు.

మైక్రోసాఫ్ట్ అధ్యయనం ప్రకారం..11 దేశాల్లోని 20 వేల మంది అభిప్రాయాలను తీసుకోగా…. 87% మంది వర్క్ ఫ్రమ్ హోమ్ తో ప్రొడక్టివిటీ పెరిగిందని తేల్చి చెప్పారు. 12% మంది టీమ్‌ లీడర్స్ కూడా దీన్ని అంగీకరిస్తున్నారు. అయితే అన్ని సందర్భాల్లో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ మేలు చేస్తుందని అనుకోలేమన్నది తాజా సర్వే వెల్లడించిన విషయం. ఉద్యోగులంతా కలిసి పని చేయాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు ఆఫీస్‌లకు రావాలనే అంటున్నారు కొందరు నిపుణులు. అంతే కాదు. ఎవరి ఇళ్లలో వాళ్లు పని చేసుకోవడం వల్ల కొత్త టార్గెట్‌లు పెట్టుకోడానికి వీలుండదని, అది వాళ్ల కెరీర్‌కు కూడా ఇబ్బంది కలిగిస్తుందని వివరిస్తున్నారు. ఇక్కడే మరో సమస్య కూడా ఉంది.

సిటీల్లో ట్రాఫిక్‌ను దాటుకుని ఆఫీస్‌లకు వెళ్లాల్సి వచ్చినప్పుడు చాలా మంది ఉద్యోగులు అసహనానికి గురవుతున్నారు. అందుకే వర్క్ ఫ్రమ్‌ హోమ్‌ ఆప్షన్‌నే ప్రిఫర్ చేస్తున్నారు. అందుకే ఫ్లెక్సిబుల్‌గా ఏ షిఫ్ట్‌లోనైనా పని చేసుకునే వీలు కల్పిస్తే బాగుటుందని సూచిస్తున్నారు టెక్ నిపుణులు. ఏదేమైనా ఒంటరిగా పని చేసుకోవాలా..? లేదంటే ఆఫీస్‌కు వెళ్లి అందరితో పాటు కలిసి పని చేయాలా అన్న నిర్ణయం వ్యక్తిగతం అని చెబుతున్నారు. ఐటీలో ఈ రెండు మూడేళ్లలో వచ్చిన మార్పులనూ ప్రస్తావించిన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి. ఆర్గనైజేషన్‌ కల్చర్‌ అనేది బలపడాలంటే ఉద్యోగులందరూ కలిసి మెలిసి పని చేయాలని సూచించారు. అందుకే తాను వర్క్ ఫ్రమ్‌ హోమ్ ఆప్షన్‌పై పెద్దగా ఆసక్తి చూపించలేదని స్పష్టం చేశారు. మూన్‌లైటింగ్ అనైతికమని ఒకేసారి రెండు కంపెనీల్లో పని చేయడం సరికాదని తేల్చి చెప్పారు.

  • కరోనా కారణంగా ఉద్యోగులు అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి అలవాటుపడ్డారు..

ఒక అధ్యయనం ప్ర‌కారం.. దాదాపు 71 శాతం మంది ఉద్యోగులు పదోన్నతి పొందిన తర్వాత ఎక్కడి నుండైనా పని చేయడానికి ఎంచుకుంటున్నారని తేలింది. అయినప్పటికీ, రిమోట్ పని ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసిందని నివేదికలో వెల్లడైంది.. ఇది మ‌హిళ‌ల్లో ఎక్కువ‌గా ఉంది. దాదాపు 70 శాతం మంది ఐటీ మహిళలు రిమోట్ పని నుండి ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొంటున్నారని తేలగా అయితే, పురుషుల్లో మాత్రం ఈ సంఖ్య చాలా త‌క్కువ‌గా ఉంది. 30 శాతం మంది పురుషులు మాత్రమే రిమోట్ వ‌ర్క్ లో ప్ర‌తికూల ప్ర‌భావాల‌ను ఎదుర్కొంటున్నార‌ని నివేదిక పేర్కొంది.

అలాగే, చాలా మంది ఉద్యోగులు సహోద్యోగులతో వ్యక్తిగత సంబంధాన్ని కోల్పోతున్నారు. అలాగే, అధిక ప‌నిగంట‌లు ప‌నిచేయాల్సి వ‌స్తున్న‌ద‌ని భావిస్తున్నారు. రిమోట్ పని ఉద్యోగుల‌ మానసిక ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసింద‌ని ఆ నివేదిక పేర్కొంది. 44 శాతం మంది పురుషులతో పోల్చితే దాదాపు 56 శాతం మంది మహిళా ప్రతివాదులు లింగ విభజనను మరింతగా చూపించారు. “ఆఫీస్ ఉద్యోగులు, ఐటీ నిపుణులు ఇద్దరికీ రిమోట్ పని అనుభవం లింగ రేఖలలో మారుతుందని అధ్య‌య‌నంలో వెల్లడైంది..ఉద్యోగులను ఆఫీసులకు తిరిగి రప్పించడం ఐటీ కంపెనీలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎంత బతిమాలినా ఆఫీసులకు వచ్చేందుకు వారు ససేమిరా అంటున్నారు.

ఇంటి వద్ద నుంచే పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రతి నలుగురులో ముగ్గురు భారతీయ ఐటీ ఉద్యోగులు వారంలో కనీసం ఒక్కరోజైనా ఆఫీసుకు రావడం లేదని సీఐఈఎల్‌ హెచ్‌ఆర్‌ నిర్వహించిన ఒక సర్వేలో తేలింది. ఒకవేళ గట్టిగా ఆదేశాలు ఇద్దామంటే ఎక్కడ ఉద్యోగం మానేస్తారేమోనని ఐ.టీ సంస్థలు ఆలోచన లో పడ్డట్టు తెలిపింది. భారత్‌లోని టాప్‌-10 సహా 40 ఐటీ కంపెనీలను సీఐఈఎల్‌ సర్వే చేసింది. వీటిల్లో మొత్తం 9 లక్షల వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో చాలామంది ఇంటి నుంచి లేదా నచ్చిన చోటు నుంచే పనిచేస్తుండటంతో..వర్క్‌ ఫ్రమ్‌ ఆఫీస్‌ పరివర్తన మరింత ఆలస్యం అవుతోంది.

ప్రస్తుతం సర్వే చేసిన కంపెనీల్లో 30 శాతం వర్క్ ఫ్రమ్‌ హోమ్‌ విధానంలో నడుస్తున్నాయి. మిగిలినవి కొంతవరకు ఆఫీసుల్లోనే నడుస్తున్నాయి. మరికొన్ని త్వరలో ఉద్యోగులను పిలిపిస్తున్నాయి. అయితే వారు మాత్రం ఆఫీసులకు వచ్చేందుకు ఇష్టపడటం లేదు. ‘టెక్నాలజీ కంపెనీల్లో ప్రతిభావంతులకు డిమాండ్‌ మరీ ఎక్కువగా ఉంది. పైగా రాజీనామా భయం వెంటాడుతోంది. ఫలితంగా ఉద్యోగులను ఆఫీసులకు రమ్మనేందుకు కంపెనీలు ఒత్తిడి చేయడం లేదు. నిదానంగా వారిలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.. దేశంలో దాదాపు 40 శాతం ఐటీ కంపెనీలు హైబ్రీడ్‌ పని విధానాన్నే అనుసరిస్తున్నాయి.

వారంలో కనీసం 1-3 రోజులైనా ఆఫీసుల్లో పనిచేసేందుకు ప్రోత్సహిస్తున్నాయి. అయితే 25 శాతం కన్నా తక్కువ మందే ఆఫీసులకు వస్తుండటాన్ని అవి గమనించాయి. 30 శాతంగా ఉన్న చిన్న కంపెనీలు మాత్రం వారంలో అన్ని రోజులూ ఆఫీసుకు రమ్మంటున్నాయి. తక్కువ వర్క్‌ఫోర్స్‌ ఉండటంతో ఎక్కువ సమన్వయం అవసరమని ఇలా చేస్తున్నాయి. విప్రో, టెక్‌ మహీంద్రా ఫ్లెక్సిబిలిటీ ఇస్తున్నాయి. ‘గడచిన మూడేళ్ల కాలంలో ఉద్యోగులకు ఆఫీసుకు రాకుండానే కెరీర్‌ కొనసాగించడం అలవాటైంది. ఇంటి నుంచి లేదా నచ్చిన చోట నుంచి పనిచేస్తున్నారు.

ఎప్పుడైతే ఐటీలో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం మొదలైందో.. అప్పటి నుంచి ఉద్యోగుల వైఖరిలో మార్పు మొదలైంది.. ప్రతిరోజు ఆఫీస్ కు వెళ్లి రావడం, ఇతరత్రా సమస్యలను ఎదుర్కోవడం కంటే..తమకు నచ్చిన ప్రదేశాల నుంచే ఆఫీస్ విధులను నిర్వహించేందుకు మెజార్టీ ఉద్యోగులు ఆసక్తి చూపిస్తున్నారు.. ఈ పరిస్థితులను కొద్దికొద్దిగా మార్చేందుకు కొన్ని కంపెనీలు వారంలో కనీసం మూడు రోజులైనా ఆఫీస్ లకు రావాలంటూ ఉద్యోగులకు ఆదేశాలు ఇచ్చినా.. కొందరు మాత్రం ఆసక్తి చూపించడం లేదని పలు సర్వేలలో తేలింది..ఐటీ సంస్థలు ఉద్యోగులను ఆకర్షించేందుకు ఏదైనా చేస్తే తప్పా..మళ్లీ పా పద్దతుల్లో ఆఫీసులలో సందడి కనిపించేలా లేదు..మరి..చూడాలి..ఉద్యోగులు అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ కు స్వస్తి పలికి.. ఆఫీసులకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తారో లేదో..

కరోనా కారణంగా ఉద్యోగులు అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి అలవాటుపడ్డారు.. కరోనా ప్రభావం తగ్గినప్పటికీ.. ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి స్వస్తి పలికి ఆఫీస్ లకు వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది.

Must Read

spot_img